Previous Page Next Page 
పారిజాతం పేజి 8


    సత్యవతి- 'ఏమిటో ననుకొన్నాను, పారిజాతం! గొప్ప సైఖాలజీ ప్రొఫెసర్ వయిపోతున్నావు!" అని నివ్వెరపోయింది.
    "అంత పెద్ద లెక్చరిస్తే చివరకు ఇంత చిన్న బిరుదా నా కిచ్చేది? ప్చ్! లోకంలో న్యాయ మెక్కడుంది?" అని నిట్టూర్చింది పారిజాతం.        
    సత్య నవ్వుతూ, "ఈ మొద్దుబుర్రకు ఇంతకంటే మంచి బిరుదు తోచటంలేదు మరి!" అని అంది.
    వెంటనే పారిజాతం ముందు నడుస్తున్న భద్రీ ప్రసాద్ వైపు సైగచేసి, "పోనీ, తగిన బిరుదు కోసం ఆ 'యావుదుకప్ప' గారిని అడుగిడుస్తామా?" అని అంది.
    పకపక నవ్వింది సత్య. ఆ నవ్వు విని ముందు పోయే వారంతా వెనక్కి తిరిగి చూశారు. హెడ్ మిస్ట్రెస్- "ఏమిటమ్మా, వెనకబడ్డారు? మమ్ముల గురించేనా నవ్వుకొంటున్నారు" అని తమాషాగా అంటున్నట్లు కన్ను గీటారు.
    "ఎవరూ దారి తప్పకుండా వెనక నుంచి కాపలా కాస్తున్నాము. దారి తప్పితే వాళ్ళను మళ్ళీ మందలోకి తోలాలిగా!" అని చిన్నగా సత్యకు మాత్రమే వినపడే టట్లు అని, "ఏం లేదు, మేడమ్! ఈ శిథిల వైభవాన్ని గమనించుతుంటే అడుగు ముందుకు సాగటం లేదు! గుండె బరువెక్కిపోతున్నది!" అని గట్టిగా అంది.
    నవ్వాపుకోవటం కష్టమైంది సత్యకు.
    సాయంత్రం ఆరు గంటలయేసరికి హంపీ శిథిలాలు చూడటం అయిపోయింది. అంతా ఉసురుసురంటూ భద్రీ ప్రసాద్ గారి ఇల్లు చేరారు.
    సతీదేవి దగ్గరలో ఉన్న పెద్ద హోటల్ నుంచి అందరికీ టిఫిన్లు తెప్పించి సిద్ధంగా ఉంచింది. ఆకలిమీద ఉన్నారేమో పిల్లలు ఆవురావురుమని టిఫిన్ తీసుకొని కాఫీ తాగారు.
    హెడ్ మిస్ట్రెస్, మిగతా టీచర్లు కూడా సతీదేవితో కబుర్లు చెబుతూ టిఫిన్, కాఫీ తీసుకోవటం మొదలు పెట్టారు.    
    సత్యవతి, పారిజాతం మాత్రం స్నానం చేసి వస్తామని పైకి వెళ్ళిపోయారు. కాస్సేపట్లో ఇద్దరూ తలారా స్నానం చేసి, శుభ్రమైన దుస్తులతో కిందికి దిగి వచ్చి టిఫిన్ తీసుకొంటూ సతీదేవితో కబుర్లు చెబుతున్న తోటి ఉపాధ్యాయినులతో కలిశారు.
    ఇంతలో భద్రీ ప్రసాద్ - "అమ్మన్నులకు భోజనం హోటల్లో అరేంజి చేసిడిస్తిని. పెద్దవాండ్లు మాత్రం మాతో భోజనం చేసిడవాల" అని నవ్వుతూ అని, "ఇదో, సతీ! తొమ్మిదయ్యేవరకు భోజనం పూర్తయిడవాలి. ఇంక పన్నెండు గంటలదాంక అమ్మన్నులతో పాటలు, డాన్సులు చేసి..." అని అంటూండగానే ఒక కొంటె కోణంగి "యిడవాల" అని అంది. పిల్ల లంతా గొల్లుమని నవ్వారు. సతీదేవికూడా పిల్లల అల్లరికి సంతోషంతో చిరునవ్వు నవ్వింది. కాని హెడ్ మిస్ట్రెస్ మాత్రం కోపంతో "మానర్స్ తెలియదు మీకు! పెద్దవాళ్ళని ఎగతాళి చెయ్యచ్చా? అసలు టీచర్లకు తెలిస్తే కదా? వాళ్ళే వెనకజేరి పకపకలూ వికవికలూ! ఇక పిల్లల కేం నేర్పిస్తారు?" అంటూ ఒక వ్యాఖ్యను చూపుతో జోడించి విసిరింది.
    అంతలోనే భద్రీ ప్రసాద్ "అయ్యయ్యో! అమ్మన్నులు అల్లరి చెయ్యకపోతే పెద్దవాండ్లు మీరు చేస్తురా? కోప్పడకూడదు వాండ్లను!" అంటూ సర్ది, "ఇంక మొగం కడుక్కొని రండి. హోటల్లో దించిడుస్తాను" అని హెచ్చరించాడు.
    సతీదేవి సత్యవతితో, "ఏమమ్మా! మీ రింకా వదిన గారిని చూడలేదుకదా! ఆమె ఇందాక ఫోన్ చేశారు. రామనాథంగారూ, ఆమే తొమ్మిది గంటల లోపుగా ఇక్కడికి వస్తామన్నారు. భోజనానికి మిమ్మల్ని అక్కడికే రమ్మన్నారుకాని నేను అడ్డుకొట్టాను. 'అంతా సరదాగా భోజనం ఇక్కడే చేద్దాం రమ్మ'న్నాను. కాని అక్కడే భోజనం చేసి వస్తామన్నారు. వాళ్ళు వచ్చే లోపల మనం భోజనాలు కానిచ్చి సిద్ధంగా ఉంటే సరి" అని అంది.
    పిల్లలు లేవడంతో పెద్దలుకూడా లేచి పైకి వెళ్ళారు.
    
                            *    *    *

    త్రయోదశి వెన్నెలలో భద్రీ ప్రసాద్ గారి తోట లోని పూలు మెరిసిపోతున్నాయి. వాటి సువాసనలతో తోటంతా ఘుమఘుమలాడుతున్నది. వెన్నెల తళతళ లాడే మల్లె ఆమల మీద పడి ప్రతిఫలించినప్పుడు ఆ మెరుపు మల్లెలు పూచినట్లుగా ఉంది. పారిజాతం వాటిని వెన్నెల పూ లంటుంది. తోటలో వికసించిన పూలతోబాటు, రంగురంగుల పరికిణీలతో పిల్లలుకూడా పువ్వుల్లాగే కలకల్లాడుతూ, పకపకలాడుతూ కూర్చున్నారు.
    భద్రీ ప్రసాద్, సతీదేవి, రామనాథం, లలిత కాక, అందంగా, హుందాగా ఉన్న మరో యువకుడూ, టీచర్లూ సుఖాసీనులయ్యారు. ఆ యువకుడు భద్రీ ప్రసాద్ గారి ఏకైన పుత్రుడు, కృష్ణ మోహన్ అని వారి కంతా ఇంతకుముందే తెలిసింది.'
    అంతమంది ఆడపిల్లల్లో చెక్కు చెదరక హాయిగా కూర్చున్నాడు కృష్ణమోహన్. సతీదేవిలాగే నవ్వే కండ్లు స్వచ్చమైన, నిర్మల మయిన చూపులు. చక్కని సంస్కారం గల యువకుడని చూడగానే తెలుస్తున్నది.
    కాని, రామనాథం చూపుల్లో కాముకత ఉట్టి పడుతున్నది. ఇంతమంది ఆడవాళ్ళు ఈవేళ అతనికి కనబడడం పండగలాగా ఉంది! ఎర్రగా ఉన్న అతని కళ్ళలో ఆకలి, తృష్ణ స్పష్టమవుతున్నవి. అతని చూపులు అందరిమీదా తిరిగినా, ఎక్కువ కాలం పారిజాతం మీద నిలుస్తున్నవి. పారిజాతం ఇది గమనించకపోలేదు. అంతేకాదు, అతని కళ్ళలోని ఎరుపుకు కారణం 'మద్యం' అనికూడా ఊహించింది.
    లలిత పరీక్షగా పారిజాతంవంకా, కృష్ణమోహన్ వంకా మార్చి మార్చి చూసి, "ఏమండీ! మీరు ఏమీ అనుకోకపోతే ఒక మాట చెబుతాను. మీరూ, కృష్ణా అన్నాచెల్లెళ్ళ లాగే కనపడుతున్నారు. మీ ఇద్దరికీ చాలా పోలికలు ఉన్నాయి. మీ ఇద్దరిలో సతీదేవిగారి పోలికలు కొట్టవచ్చినట్లు కనిపిస్తున్నాయి" అని పారిజాతంతో అంది.
    వెన్నెలలో సతీదేవి ముఖం పాలిపోయిన సంగతి ఎవరూ గమనించలేదు.
    అన్నాచెల్లెళ్ళన్న మాటకు పారిజాతం ముఖం సంతోషంతో వికసించింది. హాయిగా నవ్వుతూ, "నా కో చెల్లెలుందండీ సంగీత అని! అదిగో, ఆ పిల్లే! అయితే, అన్నకానీ, తమ్ముడుకానీ చిక్కితే, అంతకంటే అదృష్టమేముంటుంది?" అంటూ కృష్ణమోహన్ వైపు తిరిగి, "ఏమండీ! మీ వయసెంత?" అని అడిగింది.
    కృష్ణమోహన్ కూడా స్వచ్చంగా నవ్వుతూ, "ఇరవై ఆరు ఏళ్లండీ నాకు" అని అన్నాడు.
    "అయితే, మీరు నాకు తమ్ముడవుతారన్న మాట. నాకు ముఫ్ఫై ఏళ్ళు నిండుతున్నవి. కాబట్టి, మనం వదినగారు చెప్పినట్లు అన్నాచెల్లెళ్ళం కాము, అక్కా తమ్ములం!" అని నవ్వింది. వదినగారంటే లలిత అన్న మాట. తనను వదినగా రన్నందుకు లలితకూడా సంతోషపడింది.
    సత్యకూడా ఆ నవ్వులో పాలు పంచుకొంటూ, "ఎగతాళి కాదు, పారిజాతం! ఏమిటో ననుకొన్నాను! నిజంగా మీ ఇద్దరికీ చాలా పోలికలు ఉన్నాయి. ప్రపంచంలో ఎన్నో విచిత్రాలు సుమా!" అని అంది.
    "అమ్మయ్య! నువ్వుకూడా సర్టిఫికేట్ ఇచ్చావు కదా! ఇక తిరుగు లేదు. ఏమండీ, తమ్ముడుగారూ! ఈ అక్కగారు మీ పక్కన ఉన్న కుర్చీలోకి విచ్చేస్తారు. చూసేవాళ్ళకి మీ వైపూ, నా వైపూ చూడలేక మెడ ఇరుకు పట్టవచ్చు! అలాంటి కష్టం కలగకుండా, పరోపకారార్ధంగా మీ పక్కకి వస్తున్నాను" అంటూ అతని పక్కన ఉన్న ఖాళీ కుర్చీలో కూర్చున్నది. పిన్నా, పెద్దా అంతా నవ్వారు.
    కృష్ణ మోహన్ సరదాగా నవ్వుతూ, "స్వాగతం, అక్కగారూ! ఈ వేళ నేను లేచిన వేళ చాలా మంచిది! అనుకోకుండా, అయాచితంగా ఒక అక్క లభించింది! ఇక ఈ తమ్ముడిని మరిచిపోకూడదు! వీడు చాలా అల్లరివాడు. బాగా కొట్లాడుతాడు. అహహఁ! మీరు మరిచిపోతేనే సుమండి!" అని అన్నాడు.
    సత్య చిన్నగా నవ్వింది. పిల్లలూ, మిగతావారూ పెద్దగా చప్పట్లు కొడుతూ నవ్వారు. సతీదేవి పెదవులు చిరునవ్వుతో ఉన్నాయిగాని, ఆమె కళ్ళలో నీరు తళతళలాడింది!
    రామనాథం సిగరెట్ పీలుస్తూ, "నీవు చాలా అదృష్టవంతుడవోయ్, కృష్ణా! అతి సులభంగా ఒక అందమైన అక్కను సంపాదించినావు. అభినందనలు!" అని ఓరగంట పారిజాతం వైపు చూస్తూ అన్నాడు.
    కొంతమంది చూడగానే ఇతరులను ఆకర్షిస్తారు. దానికి వారి రూపం కారణం కావచ్చు. కొంతమంది రూపవతులైనా, మొదట అంతగా ఇతరులను ఆకర్షించరు. చూడగా, చూడగా ఇంత చక్కనివాళ్ళను మొదట ఎందుకు గమనించలేదా అని ఆశ్చర్యపోతాము. ఈ రెండవ తెగకు చెందుతారు సత్యవతి, పారిజాతం.    
    రామనాథం చూపులు పారిజాతం మీద వాలినట్లు గ్రహించటాని కెంతో సేపు పట్టలేదు లలితకు. 'ఛీ! బుద్దిలేని మగపురుగులు! ఎన్నేళ్ళొస్తే ఏమిటి?' అని మనసులో విసుగుకొని చిరాకు పడింది.
    ఇంతలో హెడ్ మిస్ట్రెస్ - "నన్ను మీ రంతా క్షమించాలి. నేను అసలే వట్టి మనిషిని కాను. ఈ వేళ తిరగడంతో నా తల తిరుగుతున్నది. నేను రెస్ట్ తీసుకొంటాను. ఏ మనుకోకండి! మీ రంతా సరదాగా కూర్చుని ఉంటే, నాకూ కూర్చోవాలని ఉందిగాని, ఏం చెయ్యను?" అంటూ లేచింది. ఆమె వెంట హడావిడిగా అనంతలక్ష్మి లేచి, "ఉండండి, మేడమ్! మీ రొక్కరే ఎందుకు? నేనూ వస్తా" నని అంది. హెడ్ మిస్ట్రెస్ -"నీ వెందుకమ్మా! సరదాగా కూర్చోండి" అని అంటున్నా వినకుండా, "కాస్సేపుండి వస్తాలెండి" అంటూ ఆమె వెంట వెళ్ళింది.
    "వట్టి మనిషిని కాను" అన్నమాటకు పారిజాతానికి నవ్వు వచ్చి సత్యవైపు చూసింది. సత్యకూడా నవ్వు దాచుకొనలేక అవస్థ పడుతున్నది.
    ఈ గొడవలో రామనాథం సిగరెట్ తాగుతూ మేడ వెనక జాజిపందిరి కింద ఉన్న రాతి బెంచీ మీద కూర్చున్న సంగతి ఎవరూ గమనించ లేదు. మేడ వెనకకు పోవటం మాత్రమే గమనించింది లలిత. 'హమ్మయ్య!' అని నిట్టూర్పు విడిచింది. రామనాథం అక్కడ లేకపోవడంతో లలితకు మనసు తేలికయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS