"ఎక్కడికి, పారిజాతం అట్లా పరిగెత్తుకొని పోతావు? రా, మా దగ్గరికి రా!" అని చేతులు చాచుతూ తానూ ముందుకు పరుగెత్తబోయింది. "ఆగు, సత్యా, ఆగు! నన్ను వదిలి నీ వెక్కడికి పోతావు?" అంటూ కృష్ణ తన చేయి గట్టిగా పట్టుకొన్నాడు. ఒళ్ళంతా ఝల్లుమన్నది. చేయి విడిపించుకొనటానికి చేతిని లాగుకొనబోయింది. కాని, ఆ గట్టి పట్టునుండి విడిపించుకో లేక "అబ్బా!" అంది గట్టిగా.
"అబ్బా!" అంటూ కళ్ళు తెరిచింది సత్య. తెలతెల వారుతున్నది. పక్కనే పారిజాతం హాయిగా నిద్ర పోతున్నది. ఇంకా ఎవ్వరూ నిద్ర లేవలేదు.
"ఏమిటీ వింత కల!' అని ఆలోచించుకొంటూ లేచి, నిశ్సబ్దంగా ముఖం పడుగుకొని కిందికి దిగి వచ్చింది సత్య.
సతీదేవి అప్పటికే స్నానం చేసి, పూజకై విచ్చిన పూలను కోసుకొంటూ తోటలో ఉన్నది. సత్యను చూడగానే- "ఏమమ్మా, త్వరగా నిద్ర లేచావు!ముఖం కడుగుకొన్నావా? రా, అమ్మా! కాఫీ తీసుకొంధువు" అని సత్యతో దేవుడి మందిరంలోకి ప్రవేశించింది.
పూజాపీఠంలో శ్రీ వేంకటేశ్వరుని పెద్ద పటం అమర్చబడి ఉంది. వెంకటేశ్వరుని శ్రీరూపం రాళ్ళతో పొదగబడి, పూజాపీఠంలో అమర్చి ఉన్న బల్బు కాంతిలో ధగధగలాడుతున్నది! సత్య మనసు అమృతంతో నిండినట్లయింది! చేతులు జోడించి అప్రయత్నంగా-"కౌసల్యా సుప్రజా రామా, పూర్వాసంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నర శార్దూలమ్, కర్తవ్యం దైవ మాహ్నికమ్!" అని పఠించింది. ఆ ప్రభాతసమయంలో మనోహరమైన పూజామందిరంలో సత్యవతి కంఠంనుండి వెలువడిన "సుప్రభాతం" విని సతీదేవి కన్నులు చెమర్చినవి.
"స్నానం చేసి నేనుకూడా పూలు శ్రీ వేంకటేశ్వరుడి మీద వేయనా?" అని అమాయికంగా అడిగింది సత్య. "భగవంతుని పూజకు నా అనుమతెందుకు, తల్లీ! ఈ గదిలోని దేవుడిని పూజించటానికి నీ కంటే అర్హులెవరమ్మా? అంటూ సతీదేవి సత్యను తన గది లోనికి తీసుకొనిపోయి, కూర్చొనమని చెప్పి కాఫీ తీసుకురావడానికి వెళ్ళింది.
కాఫీ తీసుకొని ఆమె తిరిగి వచ్చేటప్పటికి సత్య ఒక ఫోటో దగ్గర నిలబడి ఉంది. ఆమె ముఖంలో కలవరం స్పష్టంగా కనిపించుతున్నది.
ఆ ఫోటో ఒక చిన్నపాపది. బోర్ల పడుకొని, బోసి నవ్వులు ఒలకబోస్తున్నది.
సతీదేవి రాగానే సత్య- "ఇదేమి వింతండీ! ఇది మా పారిజాతం ఫోటో. పారిజాతం ఇంట్లో కూడా ఇదే ఫోటో ఉంది. ఆమె ఫోటో మీ దగ్గర ఎందుకుందీ?" అని ప్రశ్నించింది.
సతీదేవి నిశ్చేష్ట అయింది. కన్నులలో నీరు ధారాపాతంగా ప్రవహించుతున్నది. సత్య కేమీ అర్ధం కావటం లేదు. ఈమె ఎవరు? ఈమెలో పారిజాతం పోలిక లెందు కున్నవి? అసలు పారిజాతం ఫోటో ఇక్కడెందుకుంది? వివరాలడిగితే ఈమె ఇట్లా దుఃఖిస్తుంది ఎందుకు? ఈ ప్రశ్నలకు జవాబులు చిక్కడం లేదు సత్యకు.
రెండు నిమిషాలయిన తరవాత, "ఏమనుకోకమ్మా! నిగ్రహించుకోలేకపోయాను. ఆ ఫోటో మా నాన్నగారి స్నేహితుని మనుమరాలిది. మా నాన్నగారి ఇంట్లో ఉంటే, ముద్దుగా ఉన్నదని తెచ్చుకొన్నాను. కాఫీ తీసుకో, అమ్మా!" అంటూ గబగబా వెళ్ళిపోయింది.
ఒక క్షణం ఏమీ తోచక అక్కడే నిలబడి, కాఫీ కప్పుతోకూడా మేడపైకి పోయింది.
అప్పుడే కళ్ళు విప్పిన పారిజాతానికి, ఎదురుగా కాఫీ కప్పుతో సత్య కనపడేసరికి నవ్వుతూ-"పొద్దున్నే కాఫీ కప్పుతో ఎదురొచ్చావు! మంచి జరిగినా, చెడు జరిగినా నీ శకునమే సుమా!"అని అంది.
సత్య- "దొరసానిగారికి బెడ్ కాఫీ తెస్తే, 'శకునం' అంటూ మాట్లాడుతావేమిటి?" అని అంది. కల సంగతి చెప్పాలనుకుంది కాని, సిగ్గుపడింది.
"బెడ్ కాఫీ మీ సీమదొర, దొరసానులు ఉరఫ్ అన్నా వదినెల కిస్తే లాభం కాని, ఈ పాచిపళ్ళ దాసరి కిస్తే ఏం లాభం! నువ్వే మింగు. నేను పళ్ళు దోముకొని వస్తాను. ఇంతలో నీకేదైనా మేలుకొలుపు పాట వస్తే పాడి, ఈ పటాలాన్ని మేలుకొలుపు" అని బ్రష్, పేస్ట్ తీసుకొని బాత్ రూమ్ లోకి పోయింది.
వీళ్ళ ఇద్దరి మాటల సవ్వడికి మిగతావారు బద్ధకంగా కళ్ళు విప్పి చూచారు. సత్య "ఇక లేవండమ్మా! ఊరంతా చూసి, తిరిగి మన ఊరికి పోవద్దూ మనం? షాపింగ్ అని కూడా సరదా పడుతున్నారుగా! త్వరగా లేవండి, టైమ్ చాలదు మనకు" అని పిల్లలను హెచ్చరించింది.
హెడ్ మిస్ట్రెస్ తో సహా అంతా లేచి, బద్ధకంగా ఆవులిస్తూ, టవల్స్ భుజాన వేసుకొని బాత్ రూమ్ వైపు బయలుదేరారు.
మేడపైన అంతా నిద్రలేచిన చప్పుడు విని. హోటల్ నుండి తెప్పించిన టిఫిన్, కాఫీలను నౌకరుతో పైకి పంపింది సతీదేవి.
పిల్లలు పైనా, హెడ్ మిస్ట్రెస్, మిగతా టీచర్లు కిందా కాఫీ టిఫిన్లు తీసుకొన్నారు. సతీదేవి మాత్రం కనుపించలేదు. హెడ్ మిస్ట్రెస్ భద్రీ ప్రసాద్ ను "ఏమండీ, మీ మిసెస్ గారు ఈ వేళ ఎక్కడ కనిపించలేదే!" అని అడిగింది.
"అమ్మకీ వేళ ఏమీ బాగాలేదు. ఆమెకు తరుచు రక్తపు పోటు వస్తుంది. ఎన్ని మందులు వాడినా తగ్గటం లేదు. ఇప్పుడే అట్లా కండ్లు మూసుకొని పడుకొన్నది. మీరు ఏమీ అనుకోకండి!" అన్నాడు కృష్ణ.
సత్యవతి మనస్సులో మళ్ళీ సందేహం మొదలయింది.
భద్రీ ప్రసాద్ "ఈ వేళ మీకు పట్నం చూపించటానికి కృష్ణ వచ్చిడుస్తాడు. నేను డాక్టర్ ని పిల్చిడవాలి. సతి దగ్గర ఎవురుండాల మరి?" అన్నాడు క్షమాపణ కోరే ధోరణలో.
వెంటనే పారిజాతం- "ఏం ఫరవాలేదు. బాబాయిగారూ! కృష్ణ చూపిస్తాడు లెండి. పిన్నిగారి ఆరోగ్యం ముఖ్యం" అంటూ, "మరి మనం త్వరగా రెడీ అవుదాము. మళ్ళీ రాత్రి ఎనిమిదింటి కంతా ఈ ఊరు విడవాలి" అని టీచర్లతో అంది.
అంతా తయారుకావటానికి పైకి పోయారు.
పారిజాతం మాత్రం అక్కడే ఉండి, సత్యతో "సత్యా! లోపలికి పోయి సతీదేవిగారిని పలకరించి వద్దాము, రా!" అంటూ, "కృష్ణా! అమ్మగారి గది చూపించు" అని కృష్ణను అడిగింది. "ఇటు రండక్కా!" అంటూ కృష్ణ లోపలికి దారి తీశాడు. వాళ్ళ నెలా వారించాలో తెలియక భద్రీ ప్రసాద్ తెల్లముఖం వేశాడు.
ఏడ్చిన దానికి గుర్తుగా సతీదేవి కండ్లు బాగా ఉబ్బి ఉన్నాయి. కృష్ణ, పారిజాతం, సత్యవతి-ముగ్గురూ లోపలికి ప్రవేశించిన చప్పుడు విని కళ్ళు తెరిచింది. చూపు పారిజాతం పై పడిన వెంటనే లేచి కూర్చుని, "రా, అమ్మా, రా! ఇట్లా కూర్చో!" అని చేయి పట్టుకొని తన సరసన కూర్చోపెట్టింది. ఎంతో ప్రేమతో పారిజాతం శరీరాన్ని నిమిరింది. సత్యకానీ, కృష్ణకానీ ఆమె దృష్టికి ఆనడం లేదు! పారిజాతం వీపు నిమురుతూ, ఎంతో తృప్తితో కండ్లు మూసు కొంది. మూసిన కండ్ల నుండి నీరు జలజల రాలుతున్నది!
పారిజాతం ఆశ్చర్యపడింది. ఎందుకీమె తనను చూసి అట్లా దుఃఖిస్తున్నది? కృష్ణ కసలు ఏమీ బోధపడలేదు. ఈ అపరిచిత మీద తన తల్లి కెందుకింత ప్రేమ? సత్య స్థితీ ఇంచుమించు అంతే! పోతే, వీరందరికీ తెలియని సంగతి ఒకటి సత్యకు తెలుసు-ఇంతకు ముందు ఈ గదిలో పారిజాతం చిన్ననాటి ఫోటో ఉండేదనీ. ఇప్పుడా స్థలం ఖాళీగా ఉన్నదనీ!
అయితే, అసలే మితభాషిణి అయిన సత్య ఆ విషయం గురించి ప్రస్తావించలేదు.
"ఎలా ఉందండీ మీకు? ఆరోగ్యం సరిగా లేదని బాబాయిగారు చెప్పారు" అంటూ పారిజాతం లేచి, "మే మిక వెడతామమ్మా! పిల్లలతో కలిసి ఊరు చూడడానికి వెళ్ళాలి" అని అంది. సతీదేవి ఏదో దుఃఖంతో సతమతమౌతున్నదని సులభంగా గ్రహించగలరు ఎవరైనా! ఆమె ఏకాంతంగా విడవడమే మంచిది.
సత్యకూడా పారిజాతాన్ని అనుసరించింది.
వాళ్ళిద్దరూ వెళ్ళిపోయిన తరవాత కృష్ణ తల్లి దగ్గరకు వచ్చి, చేతిని పట్టుకొని చూశాడు. కొద్దిగా వెచ్చగా ఉంది. "ఏమిటమ్మా ఇది? ఎందుకేడుస్తున్నావు? నాతో చెప్పమ్మా!" అని బతిమలాడుతున్న ధోరణిలో అన్నాడు. సతీదేవి కళ్ళు తుడుచుకొని. "ఏం లేదు, నాన్నా! మరేం భయం లేదు నాకు! నీవు త్వరగా తయారయి అక్కా వాళ్ళకు ఊరు చూపించు" అని అంది. 'అక్క' ని అన్నప్పుడామె గొంతు నెవరో పట్టినట్లయింది.
అంతా సిద్ధమయ్యే టప్పటికి దాదాపు తొమ్మిదిన్నర గంట లయింది. అంతా చక్కెర ఫాక్టరీ చూడ్డానికిపోయారు. పిల్ల లెంతో ఆసక్తితో చూశారు. పారిజాతం తనకు తెలిసినంత వరకు చక్కర ఎట్లా తయారవుతుందో చెప్పింది.
