అపరిష్కృతం
చెరుకూరి కమలా మణి

"ఏమిటిరా నాయనా? పెండ్లి కొడుకు ముఖం మరీ అంత దుమదుమ లాడుతున్న దేమిటిరా?" అంత పెళ్ళి సందట్లోనూ కొడుకును బావిగట్టు దగ్గర పట్టుకుని పాపమ్మగారు అడిగారు.
"బి.ఏ వెలగ బెడుతున్నాడుగా! ఆ టేక్కయి ఉంటుందిలే. అయినా కుర్ర కుంక - వాడి దేమిటి? వాళ్ళ నాయన మంచివాడు లాగా కనబడుతున్నాడు. నేనిస్తానన్న కట్నానికి కొండమీది కోతి దిగి రాదటే! డబ్బు చూపిస్తే పెండ్లి కొడుకేమిటి , వాడి తాత కూడా దిగి వచ్చి పెండ్లి పీటల మీద కూర్చోడూ! అవన్నీ తరవాత మాట్లాడు కొందాము గాని , ఈ తతంగమంతా సవ్యంగా ముగిసేదాకా నోరు సంభాళించుకొని మసలుకో. నీ కోడలితో ఏమన్నా నోరు జారేవు సుమా! అదేమన్నా నోరు జారబోయినా, కాస్త హెచ్చరిస్తూ ఉండు. ఎవరన్నా ఇటు వేపు వస్తారేమో , పద, పద!" శేష ఫణి శాస్త్రి గారు పంచె సవరించుకుంటూ హడావిడిగా లోపలికి వెళ్ళిపోయారు.
"నాయనమ్మా! బెల్లమో, ఉప్పో, ఏదో కావాలట. "బొడ్లో తాళాలు పెట్టుకొని తిరిగితే వంటేల్లా అవుతుందీ?' అని హెడ్ కుక్కుగారు గావుకేకలు వేస్తున్నారు. ఊ! పరుగెట్టు!" అని నవ్వుతూనే పాపమ్మ గారిని హెచ్చరించి, ఎంత హడావిడిగా వచ్చాడో అంత హడావిడి గానూ పరుగెత్తి పోయాడు, పెళ్ళి కూతురు అన్న అయిన బాలేందుశేఖర శాస్త్రి.
సరిగ్గా పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాలకు మంగళసూత్ర ధారణ జరిగింది.
నల్లగా, పొట్టిగా ఉన్న శరీరం, తెల్లని పట్టు చీరలో మరింత నల్లగా కనిపించుతున్నది. మధ్య పాపిడి తీసి జడ వేసి, వెర్రిగా పూలు పెట్టారు. పొగకు కళ్ళ కాటుక చెరిగి కంటి చుట్టూ అలుముకుంది. మొత్తం మీద పిచ్చి పిచ్చిగా కనిపిస్తున్నది. పదకొండు సంవత్సరాలు నిండిన పెళ్ళి కూతురు సన్నమ్మ.
పందొమ్మిదేళ్ళ మత్నాయౌవనం తో, ప్రణయ చాంచల్యం, 'మినీ మోర్టన్' మొదలయిన తెలుగు నవలలూ, 'గాన్ విత్ ది విండ్' ' జేన్ ఐర్' మొదలయిన ఇంగ్లీష్ నవలలూ క్షుణ్ణంగా జీర్ణించుకొన్న విజ్ఞానం తో తన వధువు ను గూర్చి ఏవేవో తియ్యగా ఊహించుకొంటున్నాడు వరుడు.
మిసమిసలాడే పసిడి శరీరం, కలలు కనే కళ్ళు, నొక్కు నొక్కుల జుట్టు , నవ్వే పెదవులు -- ఒక్కక్షణం కళ్ళు మూసుకొన్న వరుడు నారాయణ శాస్త్రి కళ్ళలో అతని ఊహ సుందరి రూపం ప్రత్యక్ష మయింది.
కళ్ళు తెరిచి చూచేసరికి ఎదురుగా నల్లగా, కాటుక పిట్టలాగా పెళ్ళి కూతురు సన్నమ్మ కనబడింది.
వరుడి ముఖం మరీ దుమదుమ లాడసాగింది.
మరుక్షణమే వికసించింది. పెదవుల మీద హసరేఖ తొంగి చూసింది. కన్నులు ఎంతో ఆసక్తి తో ఒక వస్తువు మీద నిలిచి పోయాయి. ఆ కన్నుల్లో కాంక్ష స్పష్టంగా కనిపించుతున్నది.
ఆ వస్తువు వెండి పళ్ళెం. అది శేష ఫణి శాస్త్రి గారి చేతిలో ఉంది. దానిలో మిలమిల మెరిసిపోతూ తెల్లని రూపాయలు, చుట్టూ కళాత్మకంగా పేర్చబడిన నోట్ల కట్టలూ ఉన్నాయి. సిరులకు నిలయమైన లక్ష్మీదేవికి సమర్పించే పీఠం లాగా ఉంది ఆ పళ్ళెం!
"కట్నం ఇరవై అయిదు వేలు!" పెళ్ళి పందిట్లో కూర్చున్న జనం, ఇంతకుముందే కట్నం సంగతి తెలిసినా, మళ్ళీ ఓ మారు విడ్డూరంగా చెప్పుకొన్నారు.
"పిల్ల అదృష్ట వంతురాలమ్మా! అత్తా, అడపుడుచు, మరిదీ-- ఎవ్వరూ లేరట. ఇంకేం కావాలి? మహారాణి లాగా రాజ్య మేలచ్చు!" పందిట్లోని ఆడంగులంతా గుసగుసగా చెప్పుకొన్నారు.
శేష ఫణి శాస్త్రి గారు గర్వంగా పెళ్ళి కొడుకు వంకా, పెళ్ళి కొడుకు తండ్రి వెంకటరామశాస్త్రి గారి వంకా చూసి, పళ్లాన్ని అల్లుడికి అందిచ్చి, కుడిచేతి ఉంగరపు వేలుతో మిసాలను సన్నగా దువ్వుకున్నాడు. అది అసంకల్పిత చర్య. తానేదో ఘనకార్యం చేశానన్న ఊహ ఆయనకు వచ్చినప్పుడంతా .అలాగే మీసాలు దువ్వుకుంటారు.
"భద్రంరా, నాయనా! పళ్లెం ఇట్లా తే. లెక్క పెడతాను" అంటూనే, కొడుకు చేతిలోని పళ్లాన్ని లాగుకొని విడిదికి వెళ్ళిపోయాడు వెంకట రామశాస్త్రి. డబ్బు భద్రం చేసి మళ్ళీ తిరిగి వచ్చాడు.
పెళ్ళి కొడుకు ముఖం మళ్ళీ దుమదుమ లాడసాగింది.
* * * *
అప్పగింతలప్పుడు, పెళ్ళి కూతురు తల్లి కృష్ణ వేణమ్మ గారి కంట కారిన నీరు కారినట్లు గానే ఉండి పోయింది.
ఆవిడ మనస్సులో ఎక్కడో అజ్ఞాత శంక బయలుదేరింది. కూతురి కాపురం ఈ దుమదుమ లాడే కుర్రాడితో ఎట్లా సాగుతుందో? ' అత్త పోరూ, ఆడపడుచు పోరూ లేని మాట నిజమే! మామగారు కూడా మంచివాడు లాగే కనపడుతున్నాడు. కాని, ఎలుకోనేది కట్టుకొన్న వాడేగా? కోరినంత కట్నం ఇచ్చినా ఇంకా దుమధుమ లాడుతున్నాడే!
పెళ్ళి కొడుక్కు ఈ పెండ్లి పెద్దగా ఇష్టం లేదనీ, కట్నం కోసం తండ్రి మెడలు వంచితే బలవంతాన ఒప్పుకొన్నాడనీ, కట్నం డబ్బుతో విదేశాలు వెళ్ళి చదువుకొని, తిరిగి వచ్చి కలెక్టర్ అవుతాడనీ, తన కూతురు కలెక్టర్ పెళ్ళాం అవుతుందనీ , దాని అదృష్టం చెప్పాతరం కాదనీ, అదనీ, ఇదనీ భర్త అత్తగారితో చెబుతూ ఉంటే కృష్ణ వేణమ్మ విన్నది.
"భార్య నన్న పేరే గాని, అయన ఏ జన్మనా నాతొ ఏం చెప్పరు! అంతా కన్నతల్లి సలహాలే. నేనూ ఓ మనిషిననీ, పిల్ల దానికి తల్లిననీ, నేనూ వీళ్ళ బాగే కోరుతాననీ తెలియదా!' కృష్ణ వేణమ్మ ఎప్పుడూ తనలో తాను అనుకొంటుంది. పైకి మాత్రం పోక్కదు.
కూతురి చేయి పాలలో ముంచి మామగారి చేతుల్లో పెట్టినప్పుడు , ఏడుస్తూ -- "పెండ్లి కాకముందే మా బిడ్డ. పెళ్ళి అయిన తరువాత ఇది మీ బిడ్డే! నా తల్లిని కంటికి రెప్పలాగా పెంచుకున్నాము. ఇక దానికీ తల్లీ, తండ్రి సమస్తమూ మీరే! కడుపులో పెట్టుకొని కాపాడండి నా తల్లిని!" అంటూ వలవలా ఏడ్చింది కృష్ణ వేణమ్మ.
"ఛీ! వెర్రిదానా! శుభమా అని పెండ్లి జరిగితే ఏడుపెందుకే! దాని కెమే! రాజా బతుకు!" అంటూ భార్యను ఊరడించి , "మరేం అనుకోకండి, బావగారూ! పిల్లాడి తరువాత ఇద్దరు పిల్లలు పుట్టి, పోయి, ఇదొక్కటే మిగిలింది. బతికితే చాలన్నట్లుగా పిల్లకు సన్నమ్మ అని మొరటు పేరు పెట్టుకున్నాము. నాకూ, మా అమ్మకూ ఆడపిల్ల లంటే అపేక్ష. ఇంక తల్లి సంగతి చెప్పేదేముంది! దాని ప్రాణాలన్నీ మా సన్నమ్మ లో ఉన్నాయి. పెంచి పెద్ద చేసి మీ కప్పజెప్పుతున్నాము. ఎట్లా చూసుకుంటారో మరి!" భార్యకు ధైర్యం చెప్పిన శేషఫణి శాస్త్రి గారి గొంతు బొంగురు పోయింది.
"నాయనా! నోట్లో నాలిక లేని పిల్ల. తూరుపేదో, పడమరేదో తెలియని పసి పిల్ల! నీ కప్పజేప్పాము. అది నీ పెళ్ళాం. నీ పెళ్ళాం అనేగాక, మా ఇంట్లో అబ్బురంగా పెరిగిన పిల్ల అని గుర్తించుకో, నాయనా!' అన్నారు కన్నీరు తుడుచుకుంటూ పాపమ్మ గారు.
అన్నింటికీ వెంకటరామ శాస్త్రి గారు సమాధానం చెప్పారే గాని , బెల్లం కొట్టిన రాయల్లే ఏ ఒక్క దానికీ జవాబివ్వలేదు పెండ్లి కొడుకు.
పెండ్లి కొడుకు మొండి వైఖరి చూస్తె, బాలేందుశేఖర శాస్త్రి ఈడ్చి లెంపకాయ కొడదామన్నంత కోపం వచ్చింది. మర్యాద కాదని నిగ్రహించు కొన్నాడు.
అంతా దిగులుగా కన్నీరు కారుస్తుంటే , పెళ్ళి కూతురు సన్నమ్మ కూడా బిక్కమొహం వేసుకొని ఏడవటం మొదలు పెట్టింది.
* * * *
పెళ్ళయి నాలుగు నెలలు గడిచాయి. శేష ఫణి శాస్త్రి గారు అల్లుడికి ఎన్ని జాబులు వ్రాసినా, జవాబు లేదు. మామగారు మాత్రం చాలా ఆప్యాయంగా కోడలి క్షేమ సమాచారాలు అడుగుతూ జాబులు వ్రాస్తూ ఉండేవారు.
బాలేందుశేఖర శాస్త్రీ ఎస్.ఎస్.ఎల్. సి. లో స్కూలు కంతా ప్రధముడి గా పాసయ్యాడు. సన్నమ్మ కూడా సెకండ్ ఫారం మంచి మార్కులతో పాసయింది.
కాలేజీ చదువుకు కొడుకుని ఎక్కడికి పంపాలి? అనీ, పెళ్ళయిన కూతురును చదివించాలా , వద్దా? అనీ మీ మాంస లో పడ్డారు శేష ఫణి శాస్త్రి గారు.
ఇంట్లో చిన్న సైజు సమావేశం లాంటిది జరిగింది.
"పెళ్ళయిన దానికి చదువు లెందుకురా? వెధవ చదువులు! పెద్ద మనిషి కాగానే ఎటూ అత్తారింటికి పంపుతామాయె!" అన్నారు పాపమ్మ గారు, ముసుగు సవరించుకుంటూ.
"పెళ్ళయినప్పుడు చూసిందే, దీని మొగుడిని తరవాత మన గడప తొక్కలేదు. ఎన్ని జాబులు వ్రాసినా జావాబే లేదాయే! అసలు పిల్లకు మొగుడి తో కాపురం చేసే యోగ ముందంటారా?" స్వగతం లాగా అన్నది కృష్ణ వేణమ్మ.
"శుభం పలకరా అంటే పెళ్ళి కూతురు ముండ ఎక్కడుందీ అన్నాట్ట, వెనకటికి నీ బోటి వాడెవడో! పిచ్చి పీనుగా! పాపకెమే! వెయ్యేళ్ళ కు సుమంగళిగా , సలక్షణం గా కాపరం చేసుకొంటుంది." అన్నారు శేష ఫణి శాస్త్రిగారు కాస్త కోపంగా, కాస్త అనునయంగా.
ఇంట్లో అంతా సన్నమ్మ ను పాప అనే పిలుస్తారు.
ముఖం చిన్నబుచ్చుకుని మళ్ళీ ఏం మాట్లాడలేదు కృష్ణ వేణమ్మ.
"నా మాట కూడా కాస్త , వినండి, నాన్నా! నేనూ బావ చదివే కాలేజీ లో చేరుతాను. బావ ఎట్లాగూ బి.ఎ సీనియర్ చదవాలిగా? నేను బావ దగ్గర మెసలుతూ , అయన ఉద్దేశ్యమేమిటో గ్రహించి మీకు వ్రాస్తాను. అసలు మనింటికి ఎందుకు రావటం లేదో, జాబు లెందుకు వ్రాయటం లేదో కనుక్కొంటాను. బావ మనస్సు తెలిసేదాకా పాప చదువు మానిపించకండి. ఇంట్లో ఊరికే కూర్చుంటే దానికి మాత్రం కాలక్షేపమెట్లా అవుతుందీ? పైగా పాప మంచి తెలివి గల పిల్లని మాస్టర్లంతా మెచ్చుకొంటున్నారు. చదవనియ్యండి, నాన్నా! చదువు చదివించాలంటే కష్టం గాని, మానిపించడం ఎంత పెద్ద పనిటా?' అన్నాడు బాలేందు శేఖర శాస్త్రి.
"పసిగుడ్డు! వాడి మాటలకేం లేరా? పెళ్ళయ్యాక మన పిల్ల గాదు. మన ఇష్టాయిష్టాలు చెల్లుతాయా? వాళ్ళ మామగారికి వ్రాసి , అయన సలహా ప్రకారం చెయ్యి!" అన్నాడు పాపమ్మ గారు.
ఈ సలహా శేషఫణి శాస్త్రి గారికి బాగా నచ్చింది.
బాలేందు శేఖర శాస్త్రి కి కోపం వచ్చింది నాయనమ్మ మాటలకు.
"ముసిలాళ్ళ మాటలకు అర్ధం లేదు, పర్ధం లేదు. అమ్మ చెప్పినట్లు రేపు దాని కాపురం సవ్యంగా లేకపోతె ఈ చదువే దానికి దారి చూపిస్తుంది . కీడెంచి మేలెంచమని మీరే చెపుతారుగా! ఇంతోటి చక్కదనాల మొగుడూ రేపు దాన్ని ఒల్లక పొతే అది ఏం చేస్తుందటా?' అన్నాడు చిరు కోపంతో.
"నట్టింట్లో అశుభం పలకకురా! దాని గీత ఎట్లా ఉంటె అట్లా జరుగుతుందిరా అబ్బీ! కానీయ్, అంతగా దాన్ని మొగుడు వదిలేస్తే, నా నాలుగు ఎకరాల చెక్కా దాని పేరిట పెట్టి కళ్ళు మూస్తాను-- సరేనా! అయినా, తల్లీ తండ్రీ , చెట్టంత అన్నా ఉంటె, దానికి లోటేమిటిరా?" అన్నారు పాపమ్మ గారు.
"ఏ మాట వచ్చినా , "నా నాలుగెకరాల చెక్క' అని అంటావెందుకూ, నాయనమ్మా? నీ చెక్క ఉన్నందు వల్లనే భూమి మీద ప్రాణి కోటి అంతా సురక్షితంగా ఉంటున్నది అన్నంత ధీమాగా అంటావు! అసలు ఆ చెక్క నా పేరా పెడతానన్నావుగా! ఇంతట్లోకే ప్లేటు ఫిరాయిస్తా వెందుకూ?' అని నవ్వుతూ అడిగాడు బాలేందు శేఖర శాస్త్రి.
పాపమ్మగారు నవ్వుతూ , "ఒరే అబ్బీ! నా నోట్లో ఎవడు తులసి తీర్ధం పోస్తే, వాడి కిస్తారా ఆ భూమిని " అన్నారు.
"ఆ కాస్త పనికి ఎప్పటి దాకా ఎందుకే! ఆ తులసి తీర్ధమేదో ఇప్పుడే నీ నోట్లో పోస్తా. నా పేరిట రాసెయ్యి, ఆ భూమిని!" అన్నాడు ముద్దుల మనవడు.
అంతా పకపకా నవ్వడంతో , ఆ వ్యవహారం అప్పటికి ముగిసింది.
* * * *
సన్నమ్మ మామగారికి జాబు వ్రాయడం , అయన కోడలిని తప్పకుండా చదివించమని జాబు వ్రాయడం, సన్నమ్మ ఎనిమిదవ తరగతి లో , బాలేందు శేఖర శాస్త్రి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం లో చేరడం జరిగాయి.
అదే కాలేజీ లో సన్నమ్మ భర్త నారాయణ శాస్త్రి చదువుతున్నాడు.
కాలేజీ లో చేరిన తరువాత , బాలేందు శేఖర శాస్త్రి పేరు "శేఖర్ గా మారిపోయింది. స్నేహితులూ, లెక్చరర్లు అంతా శేఖర్ అనే పిలవడం మొదలు పెట్టారు.
బాలేందు శేఖర శాస్త్రి కి కూడా హనుమంతుడి తోక లాగా ఉన్న తన పేరు కంటే శేఖర్ అన్న పదమే చాలా నచ్చింది.
కాలేజీ లో ఎవ్వరికీ శేఖర్ నారాయణశాస్త్రి బావ మరిది అన్న సంగతి తెలియదు.
