ఎక్కడ?
తికమకపడ్డాడు... ఉఁహూఁ... ఎంత ఆలోచించినా గుర్తుకు రావటం లేదు...
ఎక్కడ చూచాడు?
ఆమె వరండాలో చివరివరకూ నడిచి మలుపు తిరిగి, మెట్లు దిగబోతుంది.
త్యాగరాజు ఆమె నడిచినవైపే వడి వడిగా నడుస్తున్నాడు.
తనకు బాగా గుర్తు....కాని ఎక్కడ చూచాడో గుర్తుకు రావడం లేదు...
ఆమె ఎక్కడికి వెళ్తుంది?
పలకరిస్తేనో?
మొఖాన్ని బోలిన మొఖాలు వుండవచ్చు!- అపార్ధం చేసుకుంటే.....నలుగుర్లో రోడ్డుమీద ఎంత అవమానం?
ఆమె ముందు గేటు దాటింది.
అతడు ఆమె వెనుకనే గేటు దాటాడు.
ఆమె ఖాళీ రిక్షాను పిలిచి కూర్చున్నది.
అతడూ మరో రిక్షాను పిలిచి కూర్చొని, 'ముందు రిక్షా వెనకాలే పోనీయ్!' అన్నాడు.
అతడి ఆలోచనలు తెగటం లేదు.
ఎక్కడో చూచినట్లున్న మొఖం!
చటుక్కున గుర్తుకు వచ్చింది.
అవును!-సందేహం లేదు!
ఆమె చంద్రం భార్య'
-పేరు సత్యవతి!
చంద్రం తన ఆత్మీయుడు. ఇంటి పక్క ఇళ్ళల్లో తామిద్దరూ వుండేవారు. ఇద్దరూ కలసి ఒక్క స్కూల్లో చదువు కున్నారు. ఇద్దరూ ఒక కంచంలోనే భోంచేయక పోయినా, రోజూ రాత్రిపూట పది గంటలదాకా చదువుకొని, వరండాలో ఒకే చాపమీద పడుకునేవారు!
అంతదాకా ఎందుకు-ఇద్దరిదీ ఒకే ప్రాణం!
చదువుకున్నంతకాలం ఎక్కడా తను లేకుండా చంద్రం కనబదేవాడు గాదు -చంద్రం లేకుండా తనూ కనబడేవాడు గాదు!
ఉద్యోగాల్లో జేరినప్పుడే విడిపోవటం జరిగింది.
తను ఉద్యోగంలో జేరిన కొత్తల్లోనే విజయవాడలో చంద్రం వివాహం జరిగింది!
కాని ఏం లాభం?
-పెద్ద వాళ్ళ నడుమ ఎక్కడో పేచీ!
వివాహమంటపంలో ఏడుపులూ, పెడబొబ్బలూ!
తిట్టుకోవటాలు-కొట్టుకోవటాలు!
అంత అసహ్యకరంగా మారిన పెళ్ళిని తను జీవితంలో ఎన్నడూ చూడలేదు!
'నాకు సిగ్గుగా వున్నదిరా త్యాగీ!'
వాకిటికి దూరంగావున్న అశోకవృక్షాని అటుపక్కగా తల వంచుకుని నిలబడి అన్నాడు.
తను వాడి భుజంమీద అనునయంగా చేయివేశాడు.
అతడి కంటివెంట నీరు కారుతున్నదని తనకు తెలుసు!
'ఛా! ఈ శుభ సమయంలో కంట తడి పెట్టగూడదు!- మనుష్యులు ఎంత మూర్కులో ఇప్పుడే నా కర్ధమయింది!' అన్నాడు తను.
'నా గురించి బాధపడటం లేదు ... నా పరువు గురించి బాధపడటం లేదు.....లేత హృదయం, సుకుమారి-సత్యవతి ఈ గొడవకు భయంతో ఏ అఘాయిత్యమూ చేయదుగదా?'
మరుక్షణంలోనే రాణిని పిలిచి చెప్పవలసినవి చెప్పి సత్యవతిదగ్గరకు పంపాడు తను.
తరువాత అప్ప్డుడప్పుడూ - అప్పుడప్పుడేం ఖర్మ-వారం వారం ఉత్తరాలు వచ్చేవి-
ఆ ఉత్తరాల్లో పెద్దలు ఎంత రాక్షసులో వాడు రాశాడు.
చంద్రం తండ్రి అన్నాడట: 'మా అబ్బాయికి పెళ్ళే కాలేదని అనుకుంటాం!' అని.
ఈ వార్త గాలిలో ప్రయాణం చేసి సత్యవతి తండ్రి తలలో దూరితే ఆయన, 'జరిగిందాన్ని కాదని ఎలా అంటాం...నేను మాత్రం మా అల్లుడు చచ్చాడనే చెప్పుకుంటాను!' అని అన్నాడట.
'హరిహరీ! వాళ్ళు మనుష్యులేనా?-వాళ్ళా మనుష్యులు?'
చంద్రం అలా రాస్తే, వాళ్ళ జీవితాలు గుర్తుకు వచ్చి తనకు ఏడుపు వచ్చింది.
తరువాత రెండు నెలలకు గాబాలు వో ఉత్తరం వ్రాశాడు: అరేయ్ త్యాగీ! ఈ చంద్రం తన పెళ్ళాన్ని-వాళ్ళ వాళ్ళ పెద్దల్ని గంగలో వదిలి-లేపుకెళ్ళాడోయ్!' అంటూ.
తను అభినందిస్తూ వెంటనే ఉత్తరం వ్రాశాడు.
నిజంగా చంద్రాన్ని మెచ్చుకోవాలి!
పెద్దవాళ్ళలాగానే తనూ ఆ అమ్మాయి జీవితంలో నిప్పులుపోసి, తన జీవితంలోనూ నిప్పులు పోసుకోకుండా-ఎంతో ఉన్నత మైన పని చేశాడు!
తన స్నేహితుడిగా అతడు చేసిన పనికి -మూర్కులయిన పెద్దలకు బుద్ది వచ్చేలా అతడు చేసిన పనికి-తను గర్వపడ్డాడు-అలాంటి స్నేహితుడున్నందుకు తన మేను పులకరించింది!
'దిగండి సాబ్!'
ఉలిక్కిపడ్డాడు త్యాగరాజు.
అప్పటికే ముందు ఆగివున్న రిక్షా లోంచి సత్యవతి దిగి రిక్షావాడికి డబ్బు లిచ్చేసి-పెద్ద గేటులోంచి లోపలికి వెళుతోంది.
త్యాగరాజు త్వరత్వరగా జేబులోని చిల్లరడబ్బులు రిక్షావాడి చేతిలో పడేసి ఆమె ననుసరించాడు- రెండు క్షణాల్లోనే ఆమెను కలుసుకున్నాడు గూడా.
'ఏఁవండీ! సత్యవతి గారు గదూ మీరు!' తన ఆలోచనలకు పాలుపోసుకుంటూ అన్నాడు.
ఆమె ఆగిపోయి క్షణం విచిత్రంగా అతడి మొఖంలోకి చూచింది.
'నన్ను గుర్తుపట్టలేదా?' నవ్వాడు త్యాగరాజు.
త్యాగరాజుకు వాళ్ళను కలవటం చాలా సంతోషంగా ఉన్నది,
'ఓహ్ ... మీరు త్యాగరాజుగారు!' ఆమె సంతోషంగా అన్నది.
'అవునండీ!' అతడు హృదయం నిండుగా నవ్వాడు. 'ఇదేఁవిటి ఇక్కడున్నారు మీరు?...సాగర్ లో వుండటం లేదా ఇప్పుడు?ఎప్పుడొచ్చా రిక్కడికి?....చంద్రం ఏడి?.....ఎక్కడికి వెళుతున్నారు మీరు?' ఉత్సాహంతో ప్రశ్నల పరం పరని గుప్పించాడు.
అతడి ప్రశ్నలు వింటూనే ఆమె ముఖం నల్లబడిపోయింది. దిగులు తో కుంచించుకు పోయింది. కళ్ళను నీటిపొరలు క్రమ్మివేసినయ్.
'మీకు నేనువ్రాసిన ఉత్తరం అందలేదా?' శూన్యంలోకి చూస్తున్నట్లుగా చూస్తూ తడబడుతూ అడిగింది.
'లేదే!' అన్నాడు ఆదుర్దాగా త్యాగరాజు.
'మరి...'
'నేను చాలారోజులయింది ఈ ఊరు వచ్చి...అనుకోకుండా మిమ్మల్ని ఇందాక హోటల్లో చూచాను.....అవునా, కాదా అని సంశయిస్తూ అనుసరించి వచ్చాను!....' అన్నాడు ఆదుర్దా వ్యక్తపరుస్తూ, 'ఇంతకీ ఏఁవైంది?'
'అయితే మీకు ఆ విషయం తెలియదా?'
'ఏఁవిటది?' ఏదో భయంకరమైన విష్యం బ్రద్దలవ్వ బోతున్నట్లనిపించింది త్యాగరాజుకు ఆమెమొఖం చూస్తుంటే.
-గుండెల్ని బిగపట్టుకొని ముందుకు వంగాడు ఆమె సమాధానం కోసరం.
'ఆయన హాస్పిటల్లో వున్నారు!'
చటుక్కున తలెత్తాడు త్యాగరాజు.
-తన ముందున్న పెద్ద భవనం, దానిమీద రాసివున్న పేరు చూచేటప్పటికి అతడి నవనాడులూ కృంగిపోయినయి.
భగవాన్!
గుండె భయంతో మెలికలు తిరిగి పోయింది.
నూతిలోనుండి మాట్లాడుతున్నట్లుగా. 'చంద్రానికి క్యాన్సర్ గాదుగదా?' తడబడుతూ అన్నాడు త్వర త్వరగా-అలా కాగూడదు భగవంతుడా అని ప్రార్దిస్తూ.
ఓ అందమైన గాజుపలక వికృతంగా పగిలి ముక్కలు ముక్కలయి మొఖమంతా పడింది...
'అవును!'
తరువాత లోపలవున్న చంద్రంవద్దకు నడవటానికి త్యాగరాజుకు కొన్ని గంటలే పట్టినట్లనిపించింది.
నరాలు జివ్వున లాగుతున్నయి.
'చంద్రానికి ఎలాంటి దుస్థితి?'
-పాలరాతి గచ్చుమీద అతి చిన్నగా అడుగులు వేస్తూ, 'ఎన్నాళ్ళయింది మొదలయి!' అడిగాడు పక్కగా తలవంచుకు నడుస్తున్న సత్యవతిని.
'మొదలయి ఎన్నాళ్ళయిందో తెలియదు ... కాని, డాక్టర్లు ఆ వ్యాధికి నిర్ణయించి ఓ నెలయింది!'
'ఈ ఊరెప్పుడు వచ్చారు?'
'వెంటనే!'
త్యాగరాజు హృదయం చంద్రాన్ని ఎప్పుడు చూద్దామా అని తహతహలాడుతోంది.
'ఈ ఊరు బయల్దేరుతూనే మీరు ఉత్తరం వ్రాసి పోస్టు చేశాను!'
త్యాగరాజు మాట్లాడలేదు.
'చంద్రం!.....' సర్వం మరచి గొణుక్కుంటున్నాడు. 'చంద్రా!'
తలవంచుకు నడుస్తున్న త్యాగరాజుకు నున్నటి పాలరాతి గచ్చులో మెలికలు తిరిగిపోతున్న తన పాప వికృతంగా కనబడింది.
తలెత్తాడు.
అప్పటికే సత్యవతి ఎదురుగ్గా వున్న వో బెడ్ దగ్గర నిలబడి వున్నది.
కొద్దిగా వంగి, 'మీ మిత్రులు త్యాగరాజుగారు వచ్చారు!' చెబుతుంది.
ఆమె వంగివుండటంలో త్యాగరాజుకు చంద్రం మొఖం కనపడలేదు.
ఆమె చెప్పటం పూర్తయినట్లుగా నిలబడింది.
అప్పుడే చంద్రాన్ని చూచాడు.
చూస్తూనే ఉలిక్కిపడ్డాడు.
చంద్రమేనా అతడు?
అతడు చంద్రంలా లేడు - మృత్యువుతో పోరాడుతూ, బంధాలు తెంపుకొని, విజయం సాధిస్తూ, వెళ్ళిపోతున్న ప్రాణాల్ని, ఎక్కడో లోతుకుపోయి దాక్కున్నట్లున్న చిన్న గోలీల్లాంటి కళ్ళలో, లేనిశక్తితో బంధించి, మిణుకు మిణుకు మంటున్న చివరి ఆశతో, గుంటలు పడి వికృతాకారాన్ని కలిగిస్తూన్న చెంపలతో-వో అస్థిపంజరంలా వున్న-ఆ మానవాకారాన్ని చూస్తూ అలాగే శిలావిగ్రహంలా నిలబడిపోయాడు త్యాగరాజు.
అతడి పెదాలు వణుకుతున్నాయి. అతడి కళ్ళను నీటిపొరలు కమ్ముతున్నయి.
అతడు ఆ మనుష్యాకారాన్ని - తన ఆత్మీయున్ని-తన మరో ప్రాణాన్ని చూచి చలించిపోయాడు.
'ఏరా త్యాగీ? ఏడుస్తున్నావా?' లోతైన నూతిలోనుండి వెలువడిన మాటలు అవి.
ఆ మాటలు వింటూనే త్యాగరాజు దుఃఖానికి అవధులే లేకపోయినయి.
'అరెరే.....త్యాగీ! అదేఁవిటి?'
సత్యవతికి దుఃఖం పొర్లుకొచ్చింది.
ఆ బెడ్ మీదవున్న చంద్రం గుండెల మీద చేయివేసి ధారాపాతంగా కన్నీరు కారుస్తూ కూర్చున్నది.
'త్యాగీ!......ఇలారా......రారా నాన్నా!.....సత్యా! కాస్త నీవు వరండాలోకి పో...వీడు మరీ నీకంటేగూడా కనాకష్టమయిపోతున్నాడే!' అన్నాడు పేలవపు నవ్వుతో. 'ఇదేఁవిటోయ్ భగవాన్లూ! ఇది చాలా బాగుంది....మీరంతా నన్ను ఓదార్చవలసింది బోయి..... నేనే మిమ్మల్ని వోదార్చవల్సిన స్థితి వచ్చింది.....ఇదేం బాగాలేదోయ్.....!'
త్యాగరాజు గుండె నిబ్బరం చేసుకున్నాడు.
-ఎదురుగా సత్యవతి వున్న విషయం గుర్తుకు వచ్చి కావాలని గుండె నిబ్బరం చేసుకున్నాడు.
తనే అలా అయిపోతే ఆమె ఇంకెంతగా బెంబేలు పడిపోతుంది?
సత్యవతి లేచి వెళ్ళి పక్కనే వున్న మరో స్టూలుమీద కూర్చున్నది.
త్యాగరాజు ఆమె కాళీ చేసిన స్థలంలో కూర్చొని ఒక చేత్తో చంద్రం చేతి ఎముకలను గట్టిగా పట్టుకొని, మరో చేత్తో సరిగ్గా సత్యవతి ఎక్కడ గుండెలమీద చేయి వేసిందో అక్కడే వేశాడు!
అతడు ఎంతగా ఆపుకుందామనుకున్నా దుఃఖం ఆగటం లేదు.
మొఖం పక్కకు తిప్పుకున్నాడు.
'అదుగో మళ్ళీనా?' చంద్రం రెట్టించాడు.
'ఉఁహుఁ...' తల అడ్డంగా తిప్పుతూ వో అబద్దమాడాడు.
'మరీ ఇలా అయిపోయినావేం చంద్రా?'
'ఎలా అయిపోయాను?' పేలవంగా నవాడు.
'చంద్రా! అలా నవ్వబోకురా!....నాకు తెలుసు అది నన్ను మభ్యపెట్టే నవ్వని...నిజం మాట్లాడు....ఒద్దు నాతో ఆటలాడబోకు!'
చంద్రం తల పక్కకు తిప్పి, 'సత్యా! ఫ్లాస్కోలో కాఫీ వున్నయ్యా? నా సంగతి ఎలా వున్నా ముందు వీడికి కాసినివ్వు...అవి త్రాగింతరువాతే మాట్లాడతాను...లేకపోతే వీడు ముందు మూర్చపోయేలా వున్నాడు!....' అన్నాడు చిన్నగా నవ్వి.
సత్యవతి లేచి ఒక గ్లాసులో తన కోసరం తెచ్చుకున్న కాఫీ కాసినిపోసి, రెండో గ్లాసులో కాసిని పాలు పోసింది.
త్యాగరాజు గ్లాసందుకొని కాఫీ త్రాగాడు.
అతడు ఖాళీగ్లాసు స్టూలుమీద పెడుతుండగా, చంద్రం నవ్వుతూ, 'నాకు మరొకరి సహాయం లేందే పాలు లోపలికి పోదోయ్....నీ స్థానం మా శ్రీమతి గారికిచ్చి వో.....!' అంటూ సగంలో ఆగిపోయాడు.
'అక్కరలేదు.....నేనైనా చేయగలను ఆ పని!' అంటూనే కొద్దిగా చంద్రాన్ని వెనుకవైపుకు పైకి సర్ది, దిండ్లు ఆసరాగాపెట్టి చిన్నగా పాలుపట్టసాగాడు.
ఆ ఇచ్చిన కాసినిపాలు త్రాగటానికే వో పది నిముషాలు పట్టింది.
'థాంక్స్!'
త్యాగరాజు మౌనంగా కూర్చున్నాడు.
'ఇంతకీ క్యాన్సర్ ఎక్కడ?'
'కడుపులో!'
తిరిగి నోటివెంట మాట పెగల్లేదు.
'చెప్పు!'
'ఏం చెప్పను?'
'ఎప్పుడొచ్చావ్ ఈ ఊరు?'
'చాలా రోజులయింది!'
'అయితే సత్యవతి వ్రాసిన ఉత్తరానికి సమాధానం కాదన్నమాట నీ రాక?'
'లేదు!'
'అయితే నేనిక్కడున్నానని నీకెవరు చెప్పారు?'
