Previous Page Next Page 
మేఘమాల పేజి 10


    'ప్రస్థుతం ఆవిడ వున్న హోటల్లోనే నేనూ వున్నాను!'
    'మరి రాణి? .... ఆవిడను ఎక్కడ వదిలావ్?'
    త్యాగరాజు బిగుసుకు పోయాడు.
    సమాధానం రాకపోవటంతో రెట్టించాడు చంద్రం.
    'రాణిని నేనెక్కడ వదల్లేదు.....అదే నన్ను వదిలి వెళ్ళిపోయింది!'
    'అదేఁవిటి?' చంద్రం ఆశ్చర్యంతో కొద్దిగా ముందుకు లేవబోయాడు.
    అతడి గుండెలమీద వున్న త్యాగరాజు చేయి అతడిని కదలనీయలేదు.
    'యక్స్యూజ్ మీ ... ఒక్కక్షణం!' ఓ మృదువైన కంఠం అకస్మాత్తుగా వినబడింది, నర్స్ వాళ్ళ సమాధానం కోసరం ఆగకుండానే. చంద్రం తెరిచిన నోటితో ధర్మామీటర్ పెట్టి పక్కగా రెండు నిముషాలు నిలబడింది.
    త్యాగరాజు పరిశీలనగా ఆ హాలంతా చూచాడు.
    వీళ్ళంతా క్యాన్సర్ పేషెంట్లేనా? -ఆశ్చర్యంగా అందరివంకా గుడ్లప్పగించి చూడసాగాడు.
    సత్యవతి స్టూలుమీద కూర్చొని భర్త ముఖంలోకి తఃదేకంగా చూస్తోంది.
    అపటికీ నడినెత్తి కొచ్చిన సూర్యుడు హైద్రాబాద్ కు అలవాటుపడ్డ చల్లదనాన్ని మ్రింగివేశాడు.....వరండాలో పాలరాతి గచ్చుమీద పడుతున్న ఎండ లోపలికి వెలుగు కిరణాలను విరజిమ్ముతోంది.
    సిస్టర్ ధర్మామీటర్ తీసుకువెళ్ళి పోయింది.
    'ఇంతకీ రాణి ఏఁవైంది?' చంద్రం ఆత్రంగా అడిగాడు.
    త్యాగరాజు ఉలిక్కిపడ్డాడు.
    'టెంపరేచర్ ఎంత వున్నది?'
    'ఏఁవో అడగ లేదు!'
    'అదేం?'
    'తెలుసుకొని ఏం లాభం?'
    త్యాగరాజు వింతగా చంద్రం మొఖం లోకి చూడసాగాడు.
    అతడి భావన ఏవిఁటో అర్ధం కాలేదు.
    'రాణి సంగతి చెప్పనే లేదు!' చంద్రం వదలలేదు.
    'ఎవరితోనో వెళ్ళిపోయి పెళ్ళి చేసుకున్నది!'
    చంద్రం నిట్టూర్పు విడిచాడు.
    'గమ్మత్తే ఁవిటంటే - నేను ఆ పరిసరాలను మర్చిపోదామని, ఆ బాధను దిగమ్రింగుకుందామని వో విధంగా ఈఊరు పారిపోయి వచ్చాను.....అలా వచ్చినా, అవన్నీ గూడా నాతోనే వచ్చినయ్ అన్నట్లుగా ఇక్కడా అలాంటి పరిస్థితులే ఏర్పడి నయి-అంతే గాదు, రాణి ఈ ఊళ్ళోనే వున్నది!'
    'నిజం!..... మరి చూచి వచ్చావా?'
    'ఆఁ.....చూడవల్సి వచ్చింది!'
    'ఏఁవన్నది?'
    'ఏఁవంటుంది?- చివాట్లు పెట్టివచ్చాను!'
    'దేనికి?'
    'లేకపోతే - అభినందించి రమ్మంటావా?' నుదురు ముడివేశాడు విచిత్రంగా.
    'దానివలన లాభం?'
    'నేను లాభనష్టాల బేరీజు వేయలేను!'
    'సరే పోనీయ్...అలా ఆలోచించలేదన్నావ్...కాని, అలా చివాట్లు పెట్టిన తరువాత నీవు పొందిందేఁవిటి?'
    'ఏదో పొందుదామని అలా చేయలేదు!'
    'మరెందుకు చివాట్లు పెట్టి వచ్చినట్లు!'
    తికమకపడ్డాడు త్యాగరాజు.
    చంద్రం మాట మారుస్తూ, 'మా త్యాగి భోజనం మాటేవిటోయ్ సత్యా!' అన్నాడు.
    'ఏం చేద్దామంటారు?' అన్నది సత్యవతి.
    'నేను ఇక్కడే దగ్గరిలో ఏదైనా హోటల్ వుంటే భోజనంచేసి వస్తాను.... మరి సత్యవతి?' అన్నాడు ఆమె ముఖం లోకి ప్రశ్నార్ధకంగా చూస్తూ.
    'ఆవిడకే ఈ క్యారియర్!.... నేనేం తింటాను.....కాస్త మజ్జిగ కలిపిన అన్నం జావలాగా త్రాగుతాను!'
    జాలిగా స్నేహితుడి మొఖంలోకి చూస్తూ వుండిపోయాడు త్యాగరాజు.
    'మరి వెళ్లిరా.....టైం ఒంటిగంట అవ్వబోతున్నది గూడా.....దేనికి ఆలస్యం?'
    త్యాగరాజు బయటకు వచ్చేశాడు.
    ఆ హాస్పిటల్ వరండాలో నడుస్తుంటే గుండెలు భయంతో కొట్టుకుంటున్నాయి.
    'చంద్రం తిరిగి ఇంటికి వస్తాడా?'
    అన్నం సహించలేదు.
    అసలే అది చిన్న హోటలు-అంతా నానా గలీజుగా వున్నది. 'ఎందుకు వచ్చావా అక్కడికి' అని చీధరించుకున్నాడు. కప్పుతో ఇచ్చిన పెరుగును నాలుగు మెతుకుల్లో కుమ్మరించుకొని తినటం అయిందనిపించి బయటకు వచ్చేశాడు.
    తిరిగి హాస్పిటల్ కు వచ్చేటప్పటికి రెండు గంటలయింది.
    అప్పటికి సత్యవతి భోజనం చేసింది.
    చంద్రం మంచంమీద కూర్చొని యాపిల్ చిన్న చిన్న ముక్కలుగా కోసి చంద్రం నోటికి అందిస్తోంది.
    త్యాగరాజు రాకను చూచి లేవబోతున్న సత్యవతిని వారిస్తూ స్టూలును మంచం దగ్గరికి లాక్కుని కూర్చున్నాడు.
    'చెప్పరా త్యాగీ!....మనం కలసి చాలా రోజులయింది గదా.....ఈమధ్య విషయాలన్నీ చెప్పాలి!'
    'నా మనస్సంతా చెదిరిపోయిందిరా చంద్రా! పూర్వంలాగా నీ ఎదురుగ్గా కూర్చొని మాట్లాడలేక పోతున్నానురా!'
    'మొదలెట్టావ్ సొద.....అరేయ్! మీరంతా ఎందుకూ పనికిరారోయ్ భగవాన్లూ! ఇంత చిన్న విషయాన్నే అంత సీరియస్ గా తీసుకొని మనుష్యులు గుల్లయి పోతారేం?'
    'ఇది చాలా చిన్న విషయమా?' కొద్దిగా కోపం తెచ్చుకొని అన్నాడు త్యాగరాజు.
    చంద్రం మాట మారుస్తున్నట్లుగా, 'అరేయ్! త్యాగీ!.....ఈ రోజున -నాకు జబ్బు వచ్చిన తరువాత మొదటిసారిగా-సత్య రెండుమెతుకుల అన్నం తృప్తిగా తిన్నదిరా!' అన్నాడు భార్య కళ్ళల్లోకి ప్రేమగా, మృదువుగా, జాలిగా చూస్తూ.
    త్యాగరాజు మాట్లాడలేదు.
    'నీవు వచ్చావుగదా ఇక! కొండంత ధైర్యం......నాకు జబ్బే తగ్గినంత సంతోషంగా వున్నదిరా దానికి!'
    'ఎంత మందిమి వుండి ఏం చేయగలంరా?'
    'అలా అనబోకు!' అని మరుక్షణం లోనే భార్యమొఖంలోకి చూస్తూ ఆశ్చర్యంగానూ, ఆతృతతోనూ, 'అరె అదేఁవిటోయ్! .... ఎందుకా కన్నీరు? ఇంకా మనక భయం దేనికోయ్ పిచ్చిదానా... దేఁవుడిలా త్యాగి వచ్చాడు...మనకు మంచి రోజులు వచ్చినయ్యన్నమాట....వెయ్యి మంది మనుష్యుల పెట్టు వాడు!' అన్నాడు.
    ఆమె వెన్నుమీద చిన్నగా రాయసాగాడు చంద్రం.
    హైద్రాబాద్ నగరాన్ని చీకటి చుట్టివేసింది.
    లైట్లు వెలిగినయి.
    సత్యవతి చంద్రానికి ఇవ్వవల్సిన ఆహారాన్ని ఇచ్చింది.
    మెడవరకూ దుప్పటి కప్పింది.
    'మరి ఇక వెళ్ళిరానా?' కంటివెంట నీరు గిర్రున తిరిగింది.
    'రేపు నువ్వొచ్చేటప్పటికి నవ్వుతూ నీకోసరం ఎదురుచూస్తూ వుంటాను!' చిరునవ్వును పెదాలమీద అంటించుకొని కొద్దిగా చేయెత్తాడు.
    సత్యవతి చేతిలోకి క్యారియర్, రెండు ఫ్లాస్కోలనూ తీసుకున్నది.
    'రాత్రిపూట నీకేఁవైనా కావాల్సి వుంటే?' త్యాగరాజు అడిగాడు.
    'సిస్టర్సు వున్నారుగాని నా కోసరం దిగులు పడబోకండోయ్ భగవాన్లూ!'
    'గుడ్ నైట్ చంద్రం!'
    'గుడ్ నైట్ త్యాగీ!'
    ఇక ఒక్కక్షణం గూడా స్నేహితుడి మొఖంలోకి చూడలేక పోయాడు.
    గిరుక్కున తిరిగి అప్పటికే రెండడుగులు ముందుకు వేసిన సత్యవతిని అనుసరించాడు.
    కొయ్యలా బిగుసుకుపోయి సత్యవతి వెనుక హాస్పిటల్ మెట్లు దిగాడు.
    సత్యవతే రిక్షాలు పిలిచింది.
    ఇద్దరూ చెరొకటి ఎక్కారు.
    పదినిముషాల్లోనే రిక్షాలు హోటల్ ముందు ఆగినయ్.
    త్యాగరాజు రెండు రిక్షాలకూ డబ్బు లిచ్చాడు.
    ముందు త్యాగరాజు నడుస్తుండగా, వెనుక సత్యవతి క్యారియరూ, రెండు ఫ్లాస్కోలు పట్టుకొని నడుస్తోంది. ఇద్దరూ హోటల్ మెట్లెక్కారు. తమ గదులకు వెళ్ళేందుకుగాను వరండా మలుపు తిరిగారు.
    తన గది ముందు భాగంలోకి చూస్తూనే త్యాగరాజు ఉలిక్కిపడ్డాడు.
    కాళ్ళు వాటంతటవే ఆగిపోయినయి.
    అక్కడ కుర్చీలు వేసుకొని-రాజేశ్వరి, శకుంతల రాణి-కూర్చొని వున్నారు!

                                      6

    త్యాగరాజు బిగుసుకుపోయి నిలబడ్డాడు.
    రాజేశ్వరి!
    రాజేశ్వరి ఇక్కడికెలా వచ్చింది?
    'అదేఁవిటి.....అలా చూస్తూ బొమ్మలా నిల్చుండి పోయారు?.....నేను రాజేశ్వరిని!' అన్నది నవ్వుతూ.
    'అవును-!' కళ్ళు రెపరెపలాడించి, ముందుకు త్వరత్వరగా అడుగులు వేస్తూ, 'ఎప్పుడొచ్చావ్ ఇక్కడికి?' అన్నాడు.
    -ఒకవిధంగా అంతర్గతంలో ఆవిడ రాక అతడికి ఈ సమయంలో లీలగా ఉపశాంతే కలిగిస్తోంది.
    కాని-రాజేశ్వరి వెనుకగా నిలబడి వున్న రాణి, శకుంతలలు అతడికి చికాకు కలిగిస్తున్నారు!
    'నేను ఈ ఊరు ఉదయాన వచ్చాను .....ఇక మేం ముగ్గురం ఇక్కడకు వచ్చేటప్పటికి మధ్యాహ్నం మూడుగంటలయింది ... అప్పటిబట్టి మీకోసరం కళ్ళల్లో వత్తులు వేసుకొని ఎదురుచూస్తున్నాం!'
    రాణి సత్యవతిని చూస్తూనే చిరునవ్వుతో, 'సత్యవతీ!' అంటూ ఆమె పక్కకు వచ్చి చేయి పట్టుకున్నది.
    రాణి, శకుంతలా అక్కడ తనగదికి రావటం అతడికేమాత్రం ఇష్టంలేదు!
    కాని, అంత నిర్మొహమాటంగా వాళ్ళిద్దరినీ వెళ్ళి పొమ్మని ఎలా చెప్పగలడు?
    అందునా రాజేశ్వరీ, సత్యవతుల ముందు!
    తన గది తలుపు తాళం తీశాడు.
    సత్యవతీ తన గదితలుపు తెరిచింది ఇంతలోనే.
    రాణి సత్యవతి ననుసరించి లోపలికి వెళ్ళిపోయింది.
    రాజేశ్వరీ, శకుంతలా త్యాగరాజు గదిలోకి వచ్చారు.
    రాజేశ్వరి లోపలికి వస్తూనే. 'ముందు సబ్బు టవల్ ఇలా పడేయండి .... తలంతా నాజూగా వున్నది....వల్లి మొఖం కడుక్కొని వస్తాను .... ఈలోగా స్ట్రాంగ్ కాఫీ తెప్పించండి!' అన్నది.
    త్యాగరాజు టవల్, సోపూ యిచ్చి బెల్ నొక్కాడు.
    రాజేశ్వరి బాత్ రూంలోకి వెళ్ళింది.
    శకుంతల పక్కగా టేబుల్ మీద వో చేయి ఆనించి తలవంచుకొని నిలబడి వున్నది. కాలిబొటనవేలుతో నేలకు రాస్తున్నది.
    'ఏం శకుంతలా! కులాసానా?' అన్నాడు-సాధ్యమయినంత వరకూ పాత సంగతులన్నీ మర్చిపోయిన వాడిలా కంఠం మార్చి!
    చటుక్కున శకుంతల తలెత్తింది.
    'నన్ను క్షమించగలరా?' అన్నది.
    ఆమె కంఠానికి ఆశ్చర్యపోయాడు త్యాగరాజు.
    శకుంతలేనా అలా అన్నది?
    ఆమె కంఠమేగాదు, కంటి వెంట గూడా నీరు ఉబికి వస్తున్నదేఁవోనని పించింది!    
    విచలితుడయ్యాడు త్యాగరాజు.
    నిబ్బరించుకుంటూ, 'దానివలన లాభం ఏఁవైనా వుంటుందను కుంటున్నావా?' అడిగాడు. గొంతు గంభీరంగా వున్నది.
    'లాభం లేకపోవచ్చు...కాని మనస్సుకు శాంతి లభిస్తుందేఁవోనని!' ఆశగా అన్నది.
    'నీవేం నీ కిష్టంలేని మాటలనలేదే! నీలోని భావాలనే వ్యక్తం చేశావ్.....దానికి మనశ్శాంతి ఎందుకు పోగొట్టుకోవాలి?'
    శకుంతలకు సమాధానం దొరకలేదు.
    'నా తృప్తికొరకా?' అన్నాడు హేలగా.
    'కాదు!.....కాదు....' వడి వడిగా తల అడ్డంగా తిప్పింది. 'అందుకు కానే కాదు...' ఒక్కక్షణం తటపటాయించి,
    'నేనలాంటి దాన్ని కాదని మీకు తెలుసుగదా!'


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS