జనం మూగారు.
కొందరు 'పాపం' అని గూడా అన్లేదు.
కొందరు లోలోనే అనుకున్నారు- 'పాపం' అని..
కొందరికి అటు చూడ్డానికే తీరిక లేదు.
జనం విడిపోయారు.
కొద్ది క్షనాల్లోనే గుంపు చెల్లా చెదరపోయింది.
-రిక్షావాడు 'కోటీ'కి జేరింతరువాత వో లావుపాటి బుర్రమీసాల పోలీసు జఁవాను పొట్టమీద బెల్టు సవరించుకుంటూ-కుంటుతూ రోడ్డు దాటుతున్న ఆ నిర్భాగ్యుడి దగ్గరకు వచ్చి- జనాన్ని తనచుట్టూ జేర్చుకున్నందుకు కసిరికొట్టాడు!
జాలిగా అదృశ్యంవంకం, కుంటుతూ పొట్టపట్టుకు దేకుతున్న ఆ పిల్లవాడి వంకా చూస్తున్న త్యాగరాజు 'ఏదో చెప్పబోయాడు.
'మీ రెళ్ళిపోండి సాబ్!' విసురుగా అన్నాడు అతడు.
త్యాగరాజు కుతకుతలాడుతున్న శరీరంతో ఇవతలకు వచ్చేశాడు.
తనేం చేయగలడు?
నీరసంగా రోడ్లవెంటకాళ్ళీడ్చుకుంటూ ఇంటిముందు కొచ్చేశాడు.
-కళ్ళు మూసుకొని, సర్వం మరిచి నిద్రపోవాలి!
మురికి కాలువమీదగా వేసిన నాపరాతి మీదగా మెట్లెక్కాడు.
తలుపు తోద్దామని చేయి తలుపు మీద వేయబోయాడు.
లోపలినుండి ఓ అపరిచిత స్త్రీ కంఠం వినబడింది:
'అధిగాదే శకుంతలా! మీ మొగ మహారాజు మీకోటలో పాగా వేసినట్లున్నాడు....ఇంకా ఎన్నాళ్లుంటాడేఁవే?'
ఆ ప్రశ్నకు రాబోయే సమాధానంమీద ఆశక్తి త్యాగరాజును తలుపును నెట్టనీయలేదు.
శకుంతల నవ్వింది.
'నా అందం చెరగనంత వరకూ!'
'అదేఁవిటి?'
'మరి!-ఎందుకున్నాడంటావ్ ఆయన గారు మాయింట్లో ... మామీద ప్రేమ తోనూ గాదు, జాలితోనూగాదు-నన్నూ, నా అందాన్ని చూచి! తెలుసా ... ఇక పోడు గూడా;..ఎప్పుడో నేను లేనప్పుడు మా అమ్మకు ఇంత మందేసి....ఆమె ద్వారానే ఈ అందాన్ని తన స్వంహం చేసుకుంటాడు గూడా!' హృదయ పూర్వకంగా కాక పోయినా-తెలియని తేలికదనాన్ని గుండెల నిండా నింపుకొని-అనాలోచితంగా అనేసింది.
శకుంతల నవ్వింది ఫక్కున మళ్ళీ.
'మగవాడినైజం తల్లీ అది!'
త్యాగరాజు నరాలు ఫట్ మన్నయి!
'శకుంతలా!'
-భయంకరమైన మ్రోతతో తలుపులు తెరుచుకున్నాయి.
శకుంతల ఆ మ్రోతకు భయంతో బిగుసుకు పోయింది- త్యాగరాజునీ, త్యాగరాజుని క్క బొడుచుకున్న జుట్టునీ, ముందుకు పొడుచుకువచ్చి అగ్ని గోళల్లా మండుతున్న త్యాగరాజు కళ్ళనీ, వణికిపోతూ నిప్పులశగలో తేలిపోతూన్న త్యాగరాజు శరీరాన్ని చూచి-భయంతో బిగుసుకుపోయింది!
శకుంతల పెదాలు అల్లల్లాడినయి వళ్ళంతా చెమటలు పట్టసాగింది.
'మీరు....మీరు!' నోరు పెగలకుండా పిడచగట్టుకు పోయింది.
త్యాగరాజు మరోమాట మాట్లాడలేదు.
పెద్ద పెద్ద అంగలు లోపలికి వేసి వంకెన వున్న మాసిన రెండు ప్యాంట్లు, చొక్కాలు, లుంగీని బెడ్డింగ్ మీద పడవేశాడు. అలమర్లో పెట్టుకున్న స్వంత పుస్తకాలను తీసుకొని పెట్టిమూత తీసి దాంట్లో పడవేశాడు. దాంట్లోంచే తాళంతీసి దానికి వేశాడు.
బెడ్డింగ్ చుట్టి బెల్టులు బిగించాడు దాన్ని తీసుకువచ్చి పెట్టిమీద పెట్టాడు.
ఎటూ చూడకుండా బిగుసుకుపోయి ఓ నిముషం వాకిటతలుపు దగ్గిర నిల్చొని అటే వెళుతున్న ఖాళీరిక్షాను పిలిచాడు.
దాంట్లో రిక్షావాడు పెట్టా బెడ్డింగ్ పెట్టగా, ఒక్కసారి కనురెప్పపాటు, శిలా విగ్రహంలా నిలబడివున్న శకుంతల మొఖంలోకి తీక్షణంగాచూచి బయటకు వచ్చేశాడు.
కాలువమీద వేసిన నాపరాయి పెద్ద మ్రోత అయ్యేట్లు కదిలేలా దాటాడు.
విసురుగా రిక్షా ఎక్కి కూర్చొని. 'ఏదైనా హోటల్ కి పోనీయ్!' అన్నాడు.
5
రెండురోజులు ఆ హోటల్ గదినే సర్వ ప్రపంచంలా ఊహించుకుంటూ తలుపు తీయకుండా గడిపేశాడు త్యాగరాజు.
అప్పటికి అతడిలోని కోపమనే వేడి కొద్దిగా తగ్గింది.
ఇక వీలయినంత త్వరలో ఏదో ఉద్యోగంలాంటిది చూసుకొని, జేరిపోయి కాలక్షేపం చేయటం మంచిదనిపించింది.
అసలు ఈ ఊరు వదిలిపెట్టి ఎందుకు పోగూడదు అనే ఆలోచనా రాకపోలేదు.....కాని, ఎన్ని ఊళ్ళని తిరుగుతాడు-అలా వెళ్ళిన ఊళ్ళలో మాత్రం ఉన్నది ఇలాంటి మనుష్యులుకాదా?-
ఉఁహూఁ... ఇక్కడే వుండాలి!
ఎక్కడికీ వెళ్ళగూడదు!
ఉద్యోగం దొరికేటంతవరకూ, వళ్ళు విరుచుకు పడుకున్నట్లున్న హైద్రాబాద్ నగర మారుమూలలన్నీ తిరుగుతూ కాలక్షేపం చేయాలనిపించింది.
కాలింగ్ బెల్ నొక్కాడు.
రెండు నిముషాల్లో హోటల్ బాయ్ ఎదురుగ్గా నిలబడ్డాడు.
'ఏంకావాలి సార్?'
'ఇవాళ్టి పేపర్ కావాలి.....ఇడ్లీ వేడిగా ఉంటే ఒక ప్లేటు ఇడ్లీ కావాలి.....వో కప్పు కాఫీ కావాలి.....ఇక్కడెక్కడన్నా దొరికితే రెండు ఇన్లాండులెటర్లు కావాలి!'
ఇవాళ ఆరునూరయినాసరే రాజేశ్వరికి ఉత్తరం వ్రాయాలి!
'సరేసార్! పేపరుకి, కవర్లకీ డబ్బు లివ్వండి.....అయితే కవరుకి రెండుపైసలు ఎక్కువ ఇచ్చుకోవాలి సార్!
డబ్బులిచ్చాడు త్యాగరాజు.
అతడు గడపదాటి వెళ్ళబోతుండగా, 'ఇంతకీ నీపేరేమిటన్నావోయ్!' అన్నాడు పెద్దగా.
అతడు వెనక్కుతిరిగి, 'స్వామి సార్!' అని ఆగకుండానే వెళ్ళిపోయాడు.
అతడికి ఒక కన్నే వున్నది. ఒకకన్ను పువ్వేసి పోయింది. అయితేనేం మొఖం లోని కళ యిట్టే, ఎవర్నయినా సరే ఆకర్షించేస్తుంది.
సహజంగా త్యాగరాజునూ అతడు ఆకర్షించాడు.
త్యాగరాజు అతడినిచూచి జాలిపడ్డాడు-అతడికన్ను పువ్వు వేయకుండా వుంటే...?
తెలుగు స్వచ్చంగా మాట్లాడుతున్నాడు -'మనవైపునుంచే వచ్చి ఇక్కడ స్థిరపడిపోయి వుంటాడు!' అనుకున్నాడు.
తరువాత ఐదు నిముషాల్లోనే పొగలు కక్కుతున్న ఇడ్లీ మంచినీళ్ళు టేబుల్ మీద పెట్టి వెళ్ళబోతూ, 'పేపరుతో బాటు కాఫీ తెస్తాను సార్!' అని వెళ్ళిపోయాడు.
ఈసారి కాఫీ, పేపరు, ఇన్ ల్యాండ్ లెటర్లూ తెచ్చి అక్కడపెట్టి దూరంగా నిలబడ్డాడు.
త్యాగరాజు కాఫీ రెండు గుటకలు మింగింతరువాత, 'సార్!' అన్నాడు.
'ఏఁవిటి?' అన్నాడు త్యాగరాజు విచిత్రంగా అతడి మొఖంలోకి చూస్తూ.
'ఏఁవీ లేదుసార్!' సిగ్గుపడుతున్నట్లుగా తల వంచుకున్నాడు. మనస్సులోది చెప్పటానికి వస్తాయిస్తున్నాడు.
'చెప్పవోయ్! ఏం కావాలి?' ఒక్క క్షణమాగి, 'డబ్బులేఁవైనా కావాలా?' అని అడగబోయాడు.
'మీదగ్గర పుస్తకాలేఁనైనా వున్నాయా సార్!'
ఆశ్చర్యంగా అతడి మొఖంలోకి చూచాడు.
'ఏం పుస్తకాలు!'
'తెలుగునేవైనా సరేసార్!'
'ఎందుకు?' నుదురు చిట్లించాడు.
'చదివిస్తాను సార్!.... జాగ్రత్తగా నలగకుండా తెచ్చిస్తానుసార్!....'
కొద్ది సెకనులు త్యాగరాజు నిశ్శబ్దంగా వుండిపోయాడు.
ఉత్సుకతతో, 'ఎలాంటి పుస్తకాలు కావాలి నీకు?' అడిగాడు.
'ఏఁవైనా సరే సార్.....మంచివి నవలలు కాని, కధల పుస్తకాలుకాని!'
'నీవు ఎంతవరకూ చదువుకున్నావ్?....
అతడి మొఖం దీనంగా మారిపోయింది -ఏం చదివిందీ చెప్పటానికి సిగ్గుపడ్డాడు.
'ఏదో సార్....కొద్దిగా చదువుకున్నాను....వచ్చే సంవత్సరమైనా మెట్రిక్ కు చదవాలని ఆశగా వున్నది .... తప్పకుండా చదువుతాను గూడా!'
ఆ కంఠం ఎంతో దీనంగా వున్నది.
అతడి మాటలు వింటూనే చలించిపోయాడు త్యాగరాజు - అతని దీక్షను, అతడిలోని పట్టుదల విశ్వాసాలను గూడా లోలోనే మెచ్చుకున్నాడు.
అందుకే, 'సరేలే ... అలాగే ఈసారెప్పుడయినా తెస్తే ఇస్తాలే!' అన్నాడు. 'ఇప్పుడేం లేవు నాదగ్గర!'
అతడు వెళ్ళిపోయాడు.
రాజేశ్వరికి ఉత్తరం వ్రాయాలి.
కవరు తీసుకున్నాడు. కలం తీసుకున్నాడు. 'రాజేశ్వరీ!' అని మొదలు పెట్టాడు.
తరువాత కలం కదలలేదు.
అరగంటకు ఏదో ఆలోచన వచ్చి రాయబోతే తెరిచి వుంచిన పెన్ను పాళీమీద ఇంకు ఎండిపోయింది.
విదిలించాడు.
తిరిగి రాయబోయాడు.
'ఉఁహూఁ.....ఇప్పుడు కాదు! రెండు రోజులయింది బయిటకు వెళ్ళి.....స్నానం చేసి అలా వెళ్ళివచ్చి భోంచేసి కూర్చుని రాయాలి!'
వెంటనే లేచాడు. బాత్ రూంలో స్నానం చేసి గుడ్డలు మార్చుకున్నాడు.
టైంచూస్తే తొమ్మిది గంటలు దాటింది.
బయిటకువచ్చి రూంకు తాళంవేశాడు.
అదే సమయంలో పక్క గదిలో నుండి వో స్త్రీ బయిటకు వచ్చింది - చేతిలో క్యారేజీతో రెండు ఫ్లాస్కోలతో!- ఆమె వాటిని క్రిందపెట్టింది. తలుపుకు తాళం వేసింది.
త్యాగరాజు ఆమెను కన్నార్పకుండా కొన్ని క్షణాలు అలాగే చూస్తూ వుండిపోయాడు.
ఆమెను ఎక్కడో చూచినట్లుగా, ఆమె ఎవరో తెలిసిన మనిషిలా ఫీలయ్యాడు.
