Next Page 
అరుణోదయం పేజి 1


                               అరుణోదయం
                                          ---పి.యస్.నారాయణ

                                   

    అరుంధతి పుట్టగానే 'నీకు పెళ్ళాం పుట్టిందిరా' అన్నప్పుడే ఆ మూడుముళ్ళూ వేయించి వున్నట్లయితే ఈనాడు ఎవరికీ-ముఖ్యంగా రాజశేఖరానికి-ఇంత ఆత్మక్షోభ వుండేదేకాదు!

                                 *    *    *    

    సరిగ్గా పందొమ్మిది సంవత్సరాల తరువాత-
    ఓ వానరోజు సాయంత్రం ఆరుగంటల సమయంలో-
    ఇంటి మొత్తంమీద రాజశేఖరం అరుంధతీ-ఒంటరిగా వున్నప్పుడు-
    "బావా! నీ ఉద్దేశ్యం నాకేమీ అర్ధం కావటంలేదు! ఈ అరుంధతే నీకు భార్యగా కావాలనుకుంటే నేను అభ్యంతరం చెప్పేదేమీ లేదు..... అలాగే కానీయ్! నా శవానికి మూడు ముళ్ళూ వేయ్...నీకోరిక తీర్చుకో. అరుంధతి నీ పెళ్ళామని నలుగురికీ చెప్పుకో!..కాని, అది నా గొంతులో ప్రాణముండగా జరిగే పని మాత్రం కాదని గుర్తుంచుకో!....ఎందుకు బావా లేనిపోని ఆశలు పెట్టుకుంటావ్?....ఎమ్మే చదివావ్...కావాల్సిన దానికన్నా ఎక్కువే లోకజ్ఞానం పొంది వుంటావ్! కాని ఇష్టంలేని ఆడదాన్ని ఎన్నాళ్ళు భార్యగా ఉంచుకోగలుగుతావ్?... నీ జీవితాన్ని నరకం చేసుకోవటమే గాకుండా మరొకరి జీవితాన్ని గూడా ఎందుకు నాశనం చేస్తావ్?
    ఒక్కక్షణం ప్రశాంతత ఆవరించింది.
    "...నీ కంటే నాకు జాలి వున్నది...నీ మీద నాకు అభిమానమున్నది... కాని నిన్ను భర్తగా ఊహించుకునే విశాలహృదయం మాత్రం నాకు లేదు బావా!....నీవే మనుకున్నాసరే!.... అంతేకాదు...నీకు చివరి సారిగా చెపుతున్నాను... అరుంధతి నీ భార్యగా జీవితం గడుపుతుందని.."
    "అరూ!..." పెద్దగా అరిచాడు రాజశేఖరం. "నా ముందు నుంచి వెళ్ళిపో అరుంధతీ!... వెళ్ళిపో!"    
    అలా అరవనయితే అరిచాడుగాని, అతడి మాట మీద అతడే నిలబడలేకపోయాడు. అర్దరాత్రి పన్నెండుగంటలప్పుడు - ప్రశాంతతో పరిసరాలు ఉండచుట్టుకు పడుకున్నప్పుడు - నిశ్శబ్ధంగా అడుగులో అడుగు వేసుకుంటూ, ఆ గృహం నుండి బయట పడ్డాడు. నల్లటి దుప్పటి లాంటి చీకటిలో కలిసిపోయాడు.
    అతడు ఎంత చిన్నగా నడవటానికి ప్రయత్నిస్తేనేం? ఎండకాలు స్థానంలో వున్న కర్రకాలు గుండెలవిసేలా శబ్దం చేయనే చేసింది!

                                 *    *    *

    రెండు సంవత్సరాల తరువాత ఓ నాడు -
    పేపర్లో పడిన ఫోటో చూసి ఆశ్చర్యపోయాడు రాజశేఖరం. దాని క్రింద వ్రాసి వున్న మాటలు అతనిని మరింత విభ్రాంతి పరిచినయ్ - "బావా! నన్ను క్షమించి ఎక్కడున్నా సరే ఒక్కసారి ఇంటికి రావూ? - అరుంధతి."
    కొన్ని క్షణాల వరకు ఆలోచనారహితుడయి-అరుంధతి పేరు క్రింద వున్న గుంటూరు చిరునామా చూస్తూ వుండిపోయాడు!
    అరుంధతి గుంటూరులో ఎందుకున్నది?
    అత్తగారి గృహమా?
    ఏమో..?
    ఏమైనా-!
    అతడి వింత ప్రవర్తనకు ఆశ్చర్యపోతున్నారు ఎదురుగా, కూర్చున్న టి.ఏ. స్టూడెంట్స్!
    అందులో ఒకతనిని పిలిచి, పోస్టాఫీసుకు వెళ్ళి టెలిగ్రాం ఇవ్వమంటూ ఈ విధంగా వ్రాసి ఇచ్చాడు - "స్టార్టింగ్ ఫ్రమ్ హైద్రాబాద్- టు నైట్ -ఎక్స్ ప్రెస్- రాజశేఖరం."

                                 *    *    *

    ఆకాశాన్ని దట్టంగా మబ్బులు అలుముకున్నాయి. సన్నని తుంపర ఉదయం నుండీ విడవకుండా పడుతుంది.
    ఆ రెండోవతరగతి రైలుపెట్టెలో, ఖాళీగా వున్న ఓ సీటు మీద జారిగిల బడి. ఆనుకొని కూర్చొని వున్నాడు రాజశేఖరం చెక్క కొలును సీటు మీదకు జేర్చి రెండవ కాలును క్రిందకు బారవిడిచి!
    అలా కూర్చుంటే ఏదో తృప్తి!
    ఆ పెట్టెలో, అతడుగాక మరో కుటుంబం వున్నది. ఉద్యోగ రీత్యా మార్పు వచ్చిందేమో, ఆ పెట్టెలో సగమంతా వాళ్ళ సామానుతో నిండిపోయి వుంది! ఇద్దరు పెద్ధవాళ్ళు.... నలుగురు పిల్లలు!
    రాజశేఖరం కళ్ళు మూసుకున్నా కళ్ళముందు ఆ కుటంబమే మెదలసాగింది.
    ఆయనకూ తన కున్నంత వయస్సే వున్నది-
    -కాని, భార్య, నలుగురు పిల్లలు, ఇంత సామాను!
    తనకో?-ఈ కర్రకాలు తప్ప ఈ ప్రపంచంలో మరేవీ లేదనిపించింది!
    ఒకనాడు తన సర్వస్వం అనుకున్న అరుంధతిని గూడా- ఒకవిధంగా-ఈ కర్ర కాలే తనకు దూరం చేసింది!
    అవును! ఎలాంటి తను ఎలా అయ్యాడు?
    గార్డు విజిల్ వూదాడు. ప్రయాణికుల్ని చిన్నగా ఒక వూపు వూపి రైలు ముందుకు కదిలింది.
    -రాజశేఖరం మనస్సే కదిలిపోయింది. అతడి ఆలోచనలు పరుగెత్త సాగినయ్.......
    ఒకనాడు-తను, అమ్మా, నాన్నా, గుర్రబ్బండిదిగి గడపలో కాలు పెట్టగానే అత్తయ్య తన బుగ్గ పట్టుకొని, "నీకు పెళ్ళాం పుట్టిందిరా!" అన్నది.
    దూరంగా నిలబడి వున్న మామయ్య ఫక్కున నవ్వాడు.
    తరువాత కొద్దిక్షణాలలోనే, తను సన్నగా, ఒక్కిగా, ఉయ్యాలలో కళ్ళు సగం మూసుకొని పడుకొని వున్న పసిపాపను చూచాడు. ఆక్షణంలోనే తొలిసారిగా ఆ పాప తన జీవితంలో ప్రవేశించింది. ఆ మరునాడే ఆ పాపకు 'అరుంధతి' అని పేరు పెట్టారు!
    అరుంధతి!-ఎంత చక్కని పేరు?
    పేరేగాదు!-అరుంధతి మాత్రం?
    -అనుకోని పరిస్థితులలో, మామయ్య గారి గృహంలో సభ్యుడయ్యాడు తను. పదో సంవత్సరంలో తల్లిని తండ్రిని పోగొట్టుకొని, ఆ గృహంలో ప్రవేశించిన తనకు, రెండు సంవత్సరాల క్రితం ఆ వాన రోజు అర్ధరాత్రి వరకు- ఆ గృహంలోనే అరుంధతి కళ్ళ ఎదుట కాలం గడిపాడు- అరుంధతితోగూడిన తీయటి కలల్లో కరిగిపోతూ!
    -కాని, తన కలలల్నీ, కల్లలేనని తరువాత తరువాత తెలిసి వచ్చింది!
    మామయ్య ఎంతగా పట్టుబడితేనేం అత్తయ్య ఎంతగా బ్రతిమలాడితేనేం?- అరుంధతి మనస్సు తనని భర్తగా అంగీకరించటానికి ఎదురు తిరిగింది!
    ఆ  గృహంలో, అరుంధతి మూలకంగా, తను పరాయివాడయిపోయాడు.
    అంతేకాదు-
    దానికి తోడు కారు ప్రమాదంలో-అందు నా అజాగ్రత్తతతో అరుంధతి కారు నడిపిన తరువాత-ఎంత జాగ్రత్త పడితేనేం-తన ఎడంకాలు స్థానంలో కొయ్యకాలు స్థిర నివాస మేర్పరచుకున్నది!
    దాంతోనే-తనను, అల్లుడిగా స్వీకరించేందుకు-వాళ్ళ సహకారాన్ని గూడా పోగొట్టుకున్నాడు!
    -ఇంకా తననక్కడ స్థానమేది?
    -అందుకే ఆరాత్రి!...
    సన్నని తుంపర, మరింత బలాన్ని పుంజుకొని జల్లుగా మారింది. రెండు చేతుల్నీబలంగా ఉపయోగించి కిటికీకి అడ్డంగా అద్దాన్ని పైకి లాగాడు.
    అద్దంలోకి కన్నార్పకుండా చూస్తుంటే రెండు సంవత్సరాల క్రితం తను చూచిన అరుంధతి కనబడుతుంది-ఆమె తనను తిరస్కరించటానికి తనలోని బీదరికమే కారణమని తనకు తెలుసు. ఆపైన పులి మీద పుట్రలా కొయ్యకాలు!
    నిజమే!-
    లక్షాధికారి అయిన తన మామయ్య కూతురు-అద్దాల భరిణ-తనలో ఏం చూసి భర్తగా ఎన్నుకుంటుంది?
    కాని పిచ్చి ఆశతో, పిచ్చి వూహలతో ఆ గృహంలో కాలం గడిపాడు!- ఫలితమనుభవించాడు!
    అరుంధతి లోకసహజంగానే ప్రవర్తించింది! కాదని తనెలా అనగలడు?    
    కాని, ఈనాడు?
    ఏమో?-తనను ఎందుకు అరుంధతి అంతగా చూడాలని కోరుకుంటున్నదో?....విచిత్ర గానేవున్నది!
    తను క్షమించవల్సిన అవసరం అరుంధతికి ఎందుకు కలిగింది?
    -అవి రెండూ, తనకు అర్ధంగాని ప్రశ్నలయి, రెండు నిప్పుకణాల్లా రైలు వెంట తనని అనుసరిస్తూ పరుగెడుతున్నయి!
    తన కుంటికాలును, తన బీదరికాన్నిచూచి పరిహసించేందుకా? తను ప్రస్తుతం ఎలాంటి స్థితిలో వున్నదీ చూచి ఈర్ష్య చెందమని హేళన చేయటానికా?
    "ఏమో?"
    ఇవన్నీ తనకు, అరుంధతిని చూచేటంత వరకు అర్ధంగాని ప్రశ్నలే!
    గుంటూరులో రైలు ఆగినప్పుడు, దడ దడ లాడే గుండెతో కాలుక్రింద పెట్టాడు సంచీని చేత్తో పట్టుకొని!
    చిన్నగా ఒక్కొక్క అడుగే ముందుకు వేయసాగాడు.
    అలా నాలుగు అడుగులు ముందుకు వేశాడో లేదో, ఒకవ్యక్తి వచ్చి రాజశేఖరం చేతిలోని సంచీ అందుకుంటూ, నన్ను అరుంధతమ్మగారు పంపారు బాబూ!" అన్నాడు.
    వయస్సు ముదిరి నల్లబడ్డ ముఖాన్ని అప్పుడే బుజాన వున్న మాసిన తువ్వాలు ముక్కపెట్టి తడుచుకున్నట్లున్నది. మనిషిని అంతకు క్రితం ఎక్కడా చూచినట్లు గుర్తుకు రావటంలేదు.
    మౌనంగా అనుసరించాడు రాజశేఖరం.
    తన కంటే పదడుగులు ముందు వేసిన అతడు ఒక గుర్రబ్బండి దగ్గిర నిలబడి సంచీని లోపల పెట్టాడు.
    రాజశేఖరం వెనగ్గా వెళ్ళి చిన్నగా అతడు దగ్గరగా వచ్చి, "పట్టుకోమంటారా?" అడిగాడు.


Next Page 

WRITERS
PUBLICATIONS