Previous Page Next Page 
స్వాతి జల్లు పేజి 9

 

    చికాకును మరిచి పోవటానికి ఏదో నవల చేతిలోకి తీసికొంది. అంతలోనే వీధిలో కారు హరన్ వినిపించింది. అది మనోరంజని కారు . మనసులోనే పళ్ళు నూరుకొని, చేతిలోని నవల విసుగ్గా గిరవాటు పెట్టింది.
    క్రొత్తగా కొన్న చీర నలిగిపోకుండా జాగ్రత్తగా వచ్చింది మనోరంజని.
    అరుంధతి ప్రక్కనే కూర్చొని "ఏం చేస్తున్నావు? షాపింగ్ కెళ్దాం వస్తావా?' అంది.
    "రాను! నాకు పనుంది."
    "పో! నీకు పనా? వెంకట లక్ష్మీ ఉందిగా! సంసారం తప్ప అన్ని పనులూ చేస్తుంది. ఇంక ఆ బాధ్యత కూడా నీ నుండి తొలగిస్తుందిలే! అప్పుడు నువ్వు మరింత హాయిగా ఉండచ్చు."
    అరుంధతి తల రెండు చేతులతో గట్టిగా పట్టుకొంది. మనోరంజని మృదువుగా ఆమె చేతులను తొలగిస్తూ "క్షమించు అరుంధతీ! నిన్ను కష్ట పెట్టాలని కాదు, ఏమో, నాకలా అనిపించింది. అయినా, మీ అయన పనులన్నీ నువ్వు చేయక ఆవిడ చేయ్యమేమిటి? మావారి కయితే, అయన పనులన్నీ , నేను చేస్తే తప్ప పనికి రాదు. నేను వద్దించక పొతే, అసలు భోజనమే చెయ్యరు. కావాలంటే కూడా నాకు తీరిక దొరకదు!' అంది.
    మరొకప్పుడయితే , సభ్యత కోపమయినా అరుంధతి కొంచెం అనునయంగా మాట్లాడి ఉండేది. కానీ, ఇవాళ ఆమెకు చాలా విసుగ్గా ఉంది. నోరు విప్పితే, ఎలాటి కటు వాక్యాలు వస్తాయోనని సమాధాన మీయకుండా వూరుకుంది.
    మనోరంజని క్షణ కాల మాగి "నీకు నిజంగానే , ఒంట్లో బాగులేనట్లు గా ఉంది. పోనీ సాయంత్రము వెళ్దాం?" అంది.
    "సాయంత్రం అసలు రాలేను. డాక్టర్ శ్రీధర్ మమ్మల్ని టీకి పిలిచారు."
    "డాక్టర్ శ్రీధర్ గారా?"
    "ఆశ్చర్యపోతూ అడిగింది మనోరంజని.
    ఆమె అనవసరపు ఆశ్చర్యానికి చిరాకు పడుతూ అరుంధతి 'అవునూ!' అంది.
    "అరుంధతీ! నేను చెప్తున్నాను విను. ఆయనతో పరిచయం పెంచుకోవటం మంచిది కాదు."
    "ఏం?"
    "అయన ప్రవర్తన బొత్తిగా మంచిది కాదు. నలుగురూ , ఆయనను గురించి రకరకాలుగా చెప్పుకుంటారు. కొన్నాళ్ళు ఎవతెనో , దొంగనూ, చెడిన దాన్నీ చేరదీసాడుట! పెళ్ళి కూడా చేసి కొన్నాడుట! కానీ, అది కాస్త మరొకడితో లేచి పోయిందిట! ఆయనతో పరిచయం మంచిది కాదు బాబూ!"
    అరుంధతి మనసు భగ్గున మండింది. ఇక సహించలేక పోయింది. కొంత కటువు గానే సమాధాన మిచ్చింది.
    "ఏమో, మీ ద్వారానే కదా, మా కాయనతో పరిచయమయిందీ?"
    మనోరంజనీ ముఖం మీద చన్నీళ్ళు జల్లినట్లయింది. వెంటనే, కోపం కూడా వచ్చింది.
    "ఏదో సాధారణ పరిచయస్తుడు. మావారి స్నేహితుడు. నలుగురితో పాటు పార్టీకి పిలిచాము. అంతే కాని, టీలకు వెళ్లేంత చనువు అట్లాంటి వాళ్ళతో నేను ఒక్కనాటికీ కలిగించుకొను."
    అరుంధతి కీ ఏదో కసిగా ఉంది.
    "నేను కలిగించుకొంటాను."
    మనోరంజని బిత్తర పోయింది. కొంచెం సేపు కూర్చొని అరుంధతి ఇంకేమీ మాట్లాడక పోయేసరికి వస్తానని వెళ్ళిపోయింది.
    ప్రకాశరావు డాక్టర్ శ్రీధర్ టీకి పిలిచిన మాట మరిచి పోలేదు. అరుంధతి ని కూడా తీసికొని, సరిగ్గా ఆరు గంటలకే శ్రీధర్ ఇంటికి చేరుకొన్నాడు. వారికోసమే ఎదురు చూస్తున్న శ్రీధర్ సాదరంగా వారి నాహ్వానించాడు. ఆ ఇల్లు అరుంధతి కెంతో నచ్చింది. ఇల్లు చెప్పుకోదగినంత పెద్దది కాదు. కానీ, పొందికగా కట్టింది. ఇంటి చుట్టూ ఆవరణ విశాలమైంది. ఆ అవరణ లో రకరకాల పూల మొక్కలను ఎంతో తీరువగా పెంచారు. వాటిని చూస్తూనే ,అరుంధతి శరీరం పులకరించింది. కృష్ణ శాస్త్రి గారి 'ఆకులో ఆకునై" గేయం అప్రయత్నంగా జ్ఞప్తి కొచ్చింది. పూల మొక్కలను పరవశించి చూస్తున్న అరుంధతిని గమనిస్తూ "మీరు వెళ్ళేటప్పుడు మీకు కావలసిన పూలు కోసు కేళ్ళం'డి ." అన్నాడు శ్రీధర్.
    అరుంధతి సిగ్గుపడింది.
    "పూలకోసం కాదు. తోట అందంగా ఉందని చూస్తున్నాను. చాలా బాగా తయారు చేశారు."
    "థాంక్స్!"
    డ్రాయింగ్ రూమ్ లో అందరూ కూర్చున్న తరువాత , నౌకరు మూడు పళ్ళేల నిండా , ఫలహరాలూ, మరొక పళ్ళెం లో బిస్కెట్లూ, అరటి పళ్ళూ తెచ్చి బల్ల మీద పెట్టాడు.
    "తీసికోండి." అన్నాడు శ్రీధర్.
    "లైబ్రరీ ఉందన్నారు." కుతూహలంగా అడిగింది అరుంధతి.
    "జిమ్ తీసికొందామన్నారు." కోపం నటిస్తూ అన్నాడు ప్రకాశరావు.
    శ్రీధర్ నవ్వేశాడు.
    "అరుంధతి గారి కంపెనీ లో మనం టీ తప్ప మరొకటి తీసుకోలేం! ముందర టీ తీసికోన్నాక, ఈవిడను నా లైబ్రరీ లో వదిలి పెడతాను. అప్పుడు మనం ఇష్టం వచ్చినట్లు చేసికోవచ్చు."
    ఈ సూచన అరుంధతీ ప్రకాశరావులిద్దరకూ నచ్చింది.
    శ్రీధర్ లైబ్రరీ ని చూసి అరుంధతి నిర్ఘాంతపోయింది. ఒక డాక్టర్ ఇంట్లో ఇటువంటి లైబ్రరీ ని ఆమె ఎన్నడూ వూహించలేదు. తెలుగులో, ఇంగ్లీషు లో , అరవం లో, మలయాళం లో , లెక్కలేనన్ని పుస్తకాలున్నాయి. విశాలమైన ఆ గది ఏ భాషకా భాష తెగలుగా, విభజించబడింది. ఆంధ్ర భాషా గ్రందాల వంక మొదట చూసింది అరుంధతి.  పురాణాలూ, ప్రబంధాలూ, నాటకాలూ, వ్యాసాలూ విమర్శలూ, రాజశేఖర చరిత్ర మొదలుకొని, ఈనాటి వరకూ వస్తున్న నవాలలు, వేటి కవి ఏర్పాటుగా ఉన్నాయి. చివరకు కొన్ని తాళపత్ర గ్రంధాలు కూడా సేకరించబడ్డాయి. ఇక ఆంగ్ల భాషలో ఉన్న గ్రంధాలు చూసేసరికి కళ్ళు తిరిగాయి. ఇది ఉంది, అది లేదని లేకుండా ప్రసిద్ద రచయితలందరి రాచనలూ ఉన్నాయి. ఆపుస్తక మహాసముద్రం లో హాయిగా ఈదులాడుకొమ్మని ప్రకాశరావు, శ్రీధర్ వెళ్ళిపోయారు.
    రాత్రి తొమ్మిది గంటలకు , ప్రకాశరావు, శ్రీధర్ తిరిగి లైబ్రరీ కి వచ్చేసరికి, వారి రాక కూడా గమనించనంతగా ఆ పుస్తకాలలో మునిగి పోయింది అరుంధతి.
    "ఇక వెళ్దామా ఆరూ! పొద్దు బోయింది" అన్నాడు ప్రకాశరావు. అరుంధతి అయిష్టంగా చూసింది.
    ప్రకాశరావు చిరునవ్వుతో "నీ పిచ్చి నాకు తెలుసులే! రేపు మళ్ళీ వద్దాం! పద!" అన్నాడు .
    అరుంధతి లేచింది.
    "ఇందులో మీకు కావలసిన పుస్తకాలేమైనా ఉంటె, తీసుకెళ్ళండి" అన్నాడు శ్రీధర్.
    అరుంధతి ముఖం వికసించింది.
    "నేనే అడగాలనుకొన్నాను. కానీ, మొహమాట పడి అడగలేక పోయాను."
    "మీరు మొహమాట పడ్తున్నారని నాకు తెలుసు! కనుకనే, నేనే తీసికెళ్ళమంటున్నాను."
    అరుంధతి చిరునవ్వు నవ్వింది. ప్రకాశరావు శ్రీధర్ తో కరచాలనం చేసి సెలవు తీసికొన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS