4
ఒక్క రోజు పరిచయం లోనే, శ్రీధర్ ప్రకాశరావును బాగా ఆకర్షించగలిగాడని , ప్రకాశరావు మాటల ధోరణి ని బట్టి అర్ధమయింది అరుంధతికి. మరునాడు ప్రకాశరావు కోర్టు కెడుతూ "సాయంత్రము శ్రీధర్ ఇంటికి వెళ్దాము. తయారుగా ఉండు." అని చెప్పి వెళ్ళిపోయాడు. అరుంధతి చాలా సంతోషించింది. సాయంత్రం అరుంధతి తయారయి సిద్దంగా ఉన్న సమయానికి , టెలిఫోన్ మ్రోగింది.
"సారీ ఆరూ! నా ఫ్రెండ్స్ అందరూ సినిమాకు పోతున్నారు. వాళ్ళ బలవంతం మీద నేనూ వేడ్తున్నాను. శ్రీధర్ యింటికి మరొకసారి వెళ్దాం! పోనీ, నువ్వెళ్ళు -- కారు పంపడానికి వీలుకాదు. రిక్షాలో వెళ్ళు. వచ్చేటప్పుడు నేను తీసి కోస్తాను."
ఫోనులో పలికింది ప్రకాశరావు కంఠం. అరుంధతి హతాశురాలయింది. ముందర వెళ్ళటం మానేద్దామనుకోంది. కానీ, మనసంతా , ఆ లైబ్రరీ లోనే ఉంది. మెరుపులా ఒక ఆలోచన తోచింది. వెంకటలక్ష్మీని తోడూ తీసికొని వెడితే?..... వెంటనే వెంకటలక్ష్మీని పిలిచింది.
"వెంకటలక్ష్మీ! అయ్యగారు సినిమాకు వెళ్తానని టెలిఫోన్ చేసారు...."
"........."
"ఇవాళ అసలు డాక్టరు గారింటికి వెళ్దామనుకోన్నాము. తను రావటం లేదు. ఒక్కదాన్నీ వెళ్ళటానికి కొంచెం మొహమాటంగా ఉంది. 'నువ్వు కూడా రాకూడదూ?" వెంకటలక్ష్మీ కంగారు పడిపోయింది.
"నేనా? నాకా పుస్తకాల సంగతేం తేలుస్తుందమ్మా!"
"తెలియక్కర్లేదు! వూరికే నాకు తోడూ రా!"
"నే నేక్కడికీ వెళ్ళనమ్మా! నాకు చాలా భయంగా ఉంటుంది."
"వెళ్ళవులే! నేను రమ్మంటున్నాను. రాకూడదు?"
వెంకటలక్ష్మీ దీనంగా చూసింది. అరుంధతి విసుగ్గా లేచిపోయింది. ఈ వెంకట లక్ష్మీ తన కెప్పుడూ అర్ధం కాదు. ఆటంకాలు ఎక్కువైన కొద్ది వెళ్ళాలనే కోరిక మరింత యింది అరుంధతికి. చివరకు రిక్షా చేసికొని బయలుదేరింది.
అరుంధతిని చిరునవ్వుతో ఆహ్వానిస్తూ శ్రీధర్, "ప్రకాశరావు గారు రాలేదేం?" అన్నాడు.
"సినిమా కెళ్ళారు. నన్ను వచ్చేటప్పుడు తీసికేల్తా నన్నారు."
"అరె! అయితే, ఇవాళ నాకు పేకాట లేదన్న మాట!"
"మీకు పేకాట లో ఆసక్తి అధికమనుకొంటానే?"
శ్రీధర్ ఎదుటి వాళ్ళను మంత్రముగ్ధులను చేసే తన చిరునవ్వు ప్రదర్శించాడు.
"మీ కిదివరలో చెప్పాను. ఎవరి కంపెనీలో ఉంటె, వారి అలవాట్లే, నావని -- నేనే అలవాటు కూ బానిసను కాను. నాదైన వ్యక్తిత్వం నాకుంది. సాధ్యమయినంత వరకూ నా చుట్టూ ప్రక్కల వారి సంతోషానికి నేను అడ్డు తగులకుండా ఉండటానికి ప్రయత్నిస్తాను. ప్రకాశరావు గారితో పేకాడతాను-- మీతో పుస్తకాల గురించి మాట్లాడతాను-- మనోరంజని గారితో లోకాభిరామాయణం మాట్లాడతాను."
"మనోరంజనితో మీకు మంచి పరిచయముందా?"
"మీకు లేదా?"
"అరుంధతి తడబడింది.
"అంటే, నాతొ ఉన్న పరిచయమూ, మీతో ఉన్న పరిచయమూ ఒకటేనా?"
"మొగవాడిని కనుక కొంచెం వేరుగా ఉండొచ్చు. ఆవిడ పుణ్యమా అని, నా కాసక్తి ఉన్నా, లేకపోయినా, ఎక్కడెక్కడ ఎవరెవరు పెళ్ళిళ్ళు చేసికొన్నారో, ఎవరెవరి కెంత ఆస్థి వుందో , ఎవరు భర్తల నోదిలేసారో , ఎవరు భార్యల వొదిలేసారో ఎవరి మంచివాళ్ళో. ఎవరు చెడ్డ వాళ్ళో....."
"ఆ సంగతి మాత్రం ఆవిడకు బాగా తెలుసు!' మధ్యలో అందుకొని అంది అరుంధతి.
శ్రీధర్ నవ్వి "ఏం? అలా మధ్యలో చటుక్కున అందుకొన్నారు? నాకు మిమ్మల్ని గురించి చెప్పినట్లే, మీకూ నన్ను గురించి చెప్పిందా?" అన్నాడు.
అరుంధతి ఆశ్చర్యంగా చూసింది.
"నన్ను గురించా? నన్ను గురించి చెప్పటాని కేముందీ?"
శ్రీధర్ కొంటెగా నవ్వాడు.
"అయితే , నన్ను గురించే నన్నమాట, చెప్పటాని కున్నది?"
అరుంధతి తల వంచుకొని నవ్వుకొంది.
"నన్ను గురించి ఏం చెప్పింది?"
కుతూహలంగా అడిగింది.
"నన్ను గురించి ఏం చెప్పిందని నే నడిగానా? మీరెందు కడగటం?"
"చెప్పండి! ఒకవేళ అబద్దాలయితే?"
"అయితే?...."
"మీరవి నమ్ముతారేమో?"
"నమ్మచ్చు! కానీ, నేను మీకు కేవలం పరాయి వాడిని. నేను మిమ్మల్ని గురించి ఏమనుకొంటే మాత్రం, మీకేం నష్టం?"
"మీరు డాక్టరా? లాయరా?"
"లాయరు మీ భర్త."
"పాపం , అయన నన్నేన్నడూ ఇలా యేడిపించలేదు."
"పాపం!"
"ఏమిటీ?' కోపంగా అంది.
శ్రీధర్ నవ్వేసి, "మీరు మా యింటి ముందు భాగం చూసారు. వెనుక భాగం చూద్దురు గాని రండి." అంటూ మాట మార్చేసాడు.
దొడ్లో అక్కడక్కడ పళ్ళ చెట్లున్నాయి. మధ్యన డాక్టర్ స్విమ్మింగ్ ఫూల్ తయారు చేయించుకొన్నాడు. పంపు ద్వారా దాని నిండా నీళ్ళు పట్టటానికి, మళ్ళీ నీళ్ళన్నీ తొలగించేసి శుభ్రం చేయటానికి ఏర్పాట్లున్నాయి. గట్టు చుట్టూ, అందమైన క్రోటన్స్ మొక్కలు కుండీలలో ఉన్నాయి. విజయనగర రాజుల కాలంలో, రసికలు ఇండ్ల లో క్రీడా శైలమూ, ఉద్యానవనము వగైరా లుండేవిట! ఆ యుగంలోకి పోతున్నట్లనిపించింది అరుంధతికి- ప్రక్కన శ్రీధర్ ఉన్నాడని కూడా గమనించకుండా , చకచక మెట్లు దిగి , చల్లగా యుగాలలాగా ఉన్న ఆ నీటిని చేత్తో చిందర వందర చేసి ఆ నీటి జల్లు మీద పడటం వల్ల అక్కడి పిల్లి కూన బెదరి పరుగెడుతూ ఉంటె, కిలకిల నవ్వింది.
పైనే నిల్చొని కుతూహలంతో ఆమెను గమనిస్తున్న శ్రీధర్ కూడా హాయిగా నవ్వాడు.
అరుంధతి సిగ్గుపడింది. నీళ్ళ లోంచి చేతులు పైకి తీసి "మీకు ఈత వచ్చా?' అంది-
"వచ్చు!నడి సముద్రంలో నైన ఈదగలను."
"మీ కన్నింట్లోను ప్రవేశముంది."
"ఈత రావటం ఒక గొప్ప? మీకు రాదా?"
"రాదు! కానీ, నేర్చుకోవాలని ఉంటుంది."
శ్రీధర్ పెదవులు కదిలాయి. కానీ, మాటలు పైకి రాలేదు.
ఏదో అనబోయి ఆగిపోయింది అరుంధతి.
"మీరు ఒక ఆదివారం సావకాశంగా రండి!" అన్నాడు శ్రీధర్.
అరుంధతి సమాధానం చెప్పలేదు.
ప్రతి క్షణమూ, ఆమె మనసెంత ఉల్లాసంగా ఉరకలు వేస్తుందో, హృదయమంత గడగడ లాడుతూ వణికిపోతుంది.
"మాట్లాడరేం? ఇవాళ మీరు వస్తారని ఆశ, రారేమోనని దిగులు, కాదు, వస్తారని ధైర్యమూ, నా మనసు చాలా తమాషా గా ఉంది."
"ఇది వినటం, నాకు తమాషాగా ఉంది. నేను రావటం, రాకపోవటం గురించి మీకు ఆలోచనేందుకు?"
"మీరు రావాలని కోరుకుంటున్నాను కనుక!"
"ఎందుకూ?"
"సుచరిత వెళ్ళిపోయినప్పటి నుండీ, నేను దుర్భర మయిన ఒంటరి తనాన్ని అనుభవిస్తున్నాను. సుందర్రావుగారింట్లో మిమ్మల్ని కలుసుకొన్నప్పటి నుంచీ, మీరు నాకు స్నేహితులు కాగలరని ఆశపడ్డాను."
అరుంధతికి నిజంగా కోపమొచ్చింది.
"సుచరిత ఎవరు? మీకు స్నేహితురాలిని కాగలిగే లక్షణాలు నాలో ఏం చూసారు?"
"సుచరితను గురించి మరొకసారి చెబుతాను. కానీ, నేను స్నేహితురాలనగానే, మీరెందు కంత కోపం తెచ్చుకొన్నారు? చాలా మంది స్త్రీ పురుషుల మధ్య 'స్నేహమ' నే పదాన్ని కొంత విపరీతార్ధం తో వాడటం, నాకూ తెలుసు! కానీ, నేనీ మాటను నిఘంటువులోని అర్ధంలోనే వాడాను."
అంత త్వరగా కోపగించుకొన్నందుకు అరుంధతి నొచ్చుకొని, నవ్వుతూ "సరే! నేను మీ స్నేహితురాలిని కాగలిగే భాగ్యాన్ని ఎందుకు ప్రసాదించినట్లు?" అంది.
"మీరానాడు పదిమంది మధ్య నిలబడి "నా కధ తిరిగొచ్చింది' అని నిస్సంకోచంగా చెప్పగలిగి నందుకు...."
"బాగుంది! తిరిగోచ్చేసే కధలు వ్రాయగలిగిన ఘనురాల నయినందుకా?"
"కాదు! నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోగలిగే ఘనుల లయినందుకు! అదీగాక మీ చూపులు ఏదో పోగొట్టుకోన్నట్లు, దేనినో వెతుక్కొంటూన్నట్లూ ఉన్నాయి. ఒక్క క్షణం మనోరంజని మాటలు నిజమా అనిపించింది . కాని...."
"మనోరంజని ఏం చెప్పింది?"
శ్రీధర్ నవ్వాడు.
"విని ఏం చేస్తారూ? మనోరంజని దగ్గిర కెళ్ళి 'ఇలా చెప్పావా?" అని దెబ్బ లాడతారు. ఆవిడ నే చెప్పలే దంటుంది. మీ ఆడవాళ్ళకీ రకమయిన గొడవలంటే సరదా! కానీ, నాకు తలనొప్పి!"
అరుంధతి కోపం నటించింది.
అర్ధం చేసికొన్న శ్రీధర్ నవ్వుతూ "చెప్పనా?" అన్నాడు.
"వద్దు!"
"మీరా స్థితికి వచ్చేసారు కనుక చెబుతాను. మీరావిడ భర్తను ప్రేమించారుట! కానీ, ప్రేమ అనేది ఎవరి మీద ఎప్పుడు ఎలా కలిగుతుందో ఎవరూ చెప్పలేరు కదా! మరి సుందర్రావు ఆవిడను ప్రేమించాడు. మీరు బెంగతో కుళ్ళి పోయారు. విధి లేక ప్రకాశరావుగారిని చేసుకున్నారు. మీ ప్రణయ జీవితం తన మూలంగా భగ్న మయినందుకు మనోరంజని కి తీరని ఆవేదన! కానీ, ఆవిడ మాత్రం ఏం చెయ్యగలదు? సుందర్రావు తనను ప్రేమిస్తే ఆ తప్పు ఆవిడదా? మీ దీన చరిత్ర తెలిసి, ఆవిడకు మీరంటే, బోలెడు జాలి."
అరుంధతి పకపక నవ్వింది. మళ్ళీ. మళ్ళీ నవ్వింది. ఆగిఆగి నవ్వింది. తమాయించుకోవడానికి పావుగంట పట్టింది.
"మీరేమో లేనివాళ్ళతో తిరుగుతారట! మీ పరిచయం ఎంతమాత్రమూ మంచిది కాదుట! తనయితే ఇట్లాంటి వాటి కెప్పుడూ దూరంగానే ఉంటుందట! ఎవరో, దొంగదాన్నీ, చెడిపోయిన దాన్ని పెళ్ళి కూడా చేసుకున్నారట. అదేమో లేచి పోయిందిట!"

చిరునవ్వు తప్ప పెద్దగా నవ్వని శ్రీధర్ "హ హ్హ హ్హ" అని నవ్వాడు.
"కానీ, పాపం , మనోరంజని లేనివి పుట్టించదు. ఉన్నవాటికి రంగేసి ఘోగ్గా తయారు చెస్తుందంతే!"
'అవును-- కానీ, ఆ రంగు వేయటం లో ఒక్కొక్క సారి ఆకారమే మారిపోతుంది."
గోడ గడియారం టంగ్ టంగ్ మని పదకొండు కొట్టింది. అరుంధతి కంగారు పడిపోయింది.
"సినిమా, తొమ్మిదిన్నర , మహా అయితే, పదవుతుంది . పదకొండయింది . కానీ , ఈయన రాలేదు." ఆందోళనగా అంది.
"కంగారు పడకండి. నేను మిమ్మల్ని దింపుతాను'."
శ్రీధర్ తన కారులో అరుంధతిని ఇంటి దగ్గర దింపాడు. వెంకట లక్ష్మీ తలుపు తీసింది."
"అయ్యగారు రాలేదా?" ఆదుర్దాగా అడిగింది అరుంధతి.
