శ్రీధర్ నవ్వాడు. సాధారణంగా అతడెప్పుడూ నవ్వుతూనే మాట్లాడుతాడు. అతడంత అందమైన వాడు కాడు. అతని చిరునవ్వులో ఎదుటి వ్యక్తుల్ని ఆకట్టుకోగలిగే ఏదో ఆకర్షణ ఉంది. బహుశ అందుకు కారణం అతని వ్యక్తిత్వం కావచ్చు.
"తీరుబడి దానంతట అది ఉండదు-- మనం సృష్టించుకొంటె, ఏర్పడుతుంది. ఏపనీ లేకుండానే, తీరిక లేనివాళ్ళూ , అనేక కార్యభారాల మధ్య కూడా. తీరికను చూడగల వాళ్ళు ఉండటానికిదే కారణం. అదీకాక, ప్రతీది మన ఆసక్తి మీద ఆధారపడి ఉంటుంది."
"అయితే మీకు సాహిత్య రంగంలో ఆసక్తి అధికమన్నమాట!"
"అంతపెద్ద మాటలు వాడేయ్యకండి, మరి! 'సాహిత్యమ' న్నపదానికి అర్ధం చాలా విశాలమైంది. సాహిత్యంలో ఆసక్తి ఉందని కోయ్యలేను కాని, సాధ్యమైనంత వరకూ , ఏదో చదువుతూనే ఉంటాను. ఇంగ్లీషు, హిందీ, తెలుగు.....'
"హిందీ కూడా వచ్చా?"
"కొంచెం! ఏదో, నవలలు చదివి అర్ధం చేసుకోగలిగేపాటి వచ్చు."
"అది కొంచేమా?"
సమాధానంగా శ్రీధర్ నవ్వి వూరుకున్నాడు.
"ఇంకా, ఏమైనా భాషలు కూడా వచ్చా?"
"ఇంకా ఫ్రెంచ్ వచ్చు. కానీ, ఫ్రెంచ్ భాషలో నేనేమీ చదువ లేదు. అన్నీ ఇంగ్లీష్ అనువాదాలే చదివాను. తమిళం లో వ్యవహారజ్ఞాన ముంది -- కానీ, అది బాగా నేర్చుకోవాలను కొంటున్నాను."
"ఎందుకూ ?"
"తమిళం లో మంచి గ్రంధా లున్నాయి. వాటి అనువాదాలు కాక మూలాన్ని చదవాలని ఉంది."
అరుంధతి విస్తుపోయి చూసింది.
"మీరంత తెల్లబోతే , నేను సిగ్గుపడవలసి వస్తుంది. ఇందులో నా ఘనతేమీ లేదు. మా తాతయ్య గారిది, ఒక పెద్ద లైబ్రరీ ఉంది. దానికి నేను వారసుణ్ణి. అందులో అన్ని భాషల్లోని ఉత్తమ గ్రంధాలూ ఉన్నాయి. కనీసం , నా లైబ్రరీలో పుస్తకాలన్నా , నేను చదువుకోవద్డా?"
అరుంధతి కళ్ళు వెలిగాయి.
"మీఇంట్లో , అంత పెద్ద లైబ్రరీ ఉందా?" ఆమె ఉత్సాహాన్ని గమనిస్తూ శ్రీధర్ "ఆ! కాస్త మంచిదే ఉంది. ఒకసారి ఎప్పుడన్నా , వీలైనప్పుడు రండి. చూద్దురు గాని...." అన్నాడు.
అరుంధతి కనురెప్పలు వాల్చుకోంది.
"ప్రకాశరావు గారిని అడుగుతాను." వెంటనే అన్నాడు శ్రీధర్.
అతని సభ్యతను లోలోపల మెచ్చుకోంది అరుంధతి.
అప్రయత్నం గా అరుంధతి, శ్రీధర్ ఇద్దరూ ఒకేమారు ప్రకాశరావు కోసం చూసారు. అప్పటికి. ప్రకాశరావు ఒక ఆంగ్లో ఇండియన్ యువతితో నాట్యం చేస్తున్నారు. కళ్ళు బాగా ఎర్రబడ్డాయి. మనిషి కొంచెం తూలుతున్నాడు. కానీ, ప్రయత్నం మీద స్థిరంగానే నిలబడుతున్నాడు.
"ఈ పార్టీ హడావుడి లో , ఆయనతో స్థిమితంగా మాట్లాడటం కుదరదేమో? మీ కభ్యంతరం లేకపోతె మీ ఎడ్రస్ వ్రాసి ఇవ్వండి. ఒకసారి, తీరికగా మీయింటికి వస్తాను."
శ్రీధర్ తన కోటు జేబులోంచి ఒక డైరీ, పెన్ తీసి, డైరీ తనే తెరిచి పెట్టాడు. అతడు తెరిచినది సరిగ్గా ఆనాటి తేదీ గల పేజీ!
అరుంధతీ పెన్ తీసికొని తమ చిరునామా పూర్తిగా వ్రాసింది. శ్రీధర్ దాని నందుకొని లేచాడు.
"నన్ను క్షమించండి! నాకు కొంచెం పనుంది వెళ్తాను."
అరుంధతి కేలానో అనిపించింది. అతని మీద అభిమానం ఎంతమాత్రమూ కాదు. ఆ పార్టీలో తానిక ఒంటరి దవుతుంది. ప్రకాశరావు ఇప్పట్లో రాడని రూడిగా తెలుసు! అయినా, కాసేపు కూర్చోండని మాత్రం అనలేక పోయింది. లేచి "మంచిది" అని నమస్కరించింది. శ్రీధర్, మనోరంజని సుందర్రావుల దగ్గిర సెలవు తీసికోవటానికి బయలు దేరాడు. అతని నడకలో ఠీవిని మనసులోనే మెచ్చుకోంది అరుంధతి.
అర్ధరాత్రి ఒంటిగంట వరకూ ఆ పార్టీ సాగుతూనే ఉంది. మధ్యలో వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు. వచ్చేవాళ్ళు వస్తున్నారు. కానీ, ప్రకాశరావు మాత్రం చివరి వరకూ కదలలేదు.
ఏదేదో అసంబద్దంగా మాట్లాడుతూ , ఇంటికి చేరిన ప్రకాశరావు హాల్లోకి రాగానే, సోఫాలో కూలబడ్డాడు.
"మంచం మీద పడుకోండి!" అంది అరుంధతి. కానీ, ప్రకాశరావు "నా కిక్కడే బాగుంది." అన్నాడు.
బహురంగంగా నాగరికత పేరుతొ చెలామణి అవుతున్న, ఆ విలయ తాండవాన్ని తల్చుకొని జుగుప్స తో వణికి పోతున్న అరుంధతి మరేమీ మాట్లాడకుండా తన ప్రక్క మీదకు వెళ్ళిపోయింది.
ముందు లేచిన ఆరుంధతి , సోఫాలో పడుకొన్న ప్రకాశరావు తలక్రింద దిండ్ల నూ, అతనికి కప్పి ఉన్న రగ్గును చూసి ఒక్క క్షణం ఆశ్చర్య పోయింది. తరువాత ఆపని తనే చేయనందుకు సిగ్గుపడింది. ఒకరాత్రి వేళ పాపం, చలికి ప్రకాశరావే తెచ్చుకుని ఉండచ్చు.
వెంకటలక్ష్మీ ఫలహారం తయారు చేసేసింది.
కాఫీ కూడా అయిపొయింది. అయినా, అరుంధతి, ప్రకాశరావు లేచేవరకూ ఆగింది. ప్రకాశరావు చాలా ఆలస్యంగా లేచాడు. తనకోసం కాఫీ త్రాగకుండా ఎదురు చూస్తున్న భార్యను చూసి అతడు చాలా సంత్రుప్టు డయ్యాడు.
డైనింగ్ టేబిల్ మీద వెంకట లక్ష్మీ పెట్టిన కాఫీ కప్పును తానె అరుంధతి కి కందించాడు.
"ఆరూ డార్లింగ్! నిన్న చాలా సంతోషంగా గడిపాం కదూ! నేను కొంచెం ఎక్కువ త్రాగినందుకు నీకు కోప మోచ్చినట్లుంది. నేను త్రాగుబోతును కాదని నీకూ తెలుసు! ఏదో ఒక్కసారి! అదీ మన డబ్బుతో కాదుగా!...."
ప్రకాశరావు నవ్వాడు-
అంతకు కొద్ది క్షణాల క్రితం ప్రకాశరావు మీద ఏర్పడిన జాలి కరిగిపోకుండా నిలుపుకునే ప్రయత్నంలో అరుంధతి సమాధానం చెప్పలేదు. ప్రకాశరావు అరుంధతి ప్రక్కన సోఫాలో కూర్చొని ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసాడు.
"హనీ! నాకోసం, కాఫీ తాగకుండా, ఎందు కున్నావో చెప్పు- తాగేయ్యకపోయావా?"
"అవును. పొరపాటు చేసాను." మనసులో అనుకొంది. అరుంధతి.
"స్వీట్! రాత్రి బయటే పడుకొన్నాను. పాపం, నువ్వు తల క్రింద తలగడలు పెట్టి రగ్గు కప్పావు కదూ!"
అరుంధతి తెల్లబోయింది.
"దొంగా! నాకు తెలియదనుకొన్నావా? రాత్రి చలికి వణుకుతున్నాను. లేవాలను కొన్నాను. కానీ, లేవలేక పోయాను. సరిగ్గా ఎలా కనిపెట్టావో అప్పుడే, నువ్వొచ్చి నాకు రగ్గు కప్పావు. నా తల క్రింద తలగడలు సర్ధావు. నా అరూకు తప్ప నా మీద అంత ప్రేమ ఎవరి కుంటుంది? నా థాంక్స్ ఎలా చెప్పుకోనో చెప్పు."
"అది చేసింది నేను కాదు. అనాలనుకున్న అరుంధతి పెదవులు కదలలేదు.
"ఇలారా చెప్పుతాను." అంటూ ప్రకాశరావు అరుంధతి పెదవులను గట్టిగా ముద్దు పెట్టుకొన్నాడు. ఆమెను తన చేతులతో చుట్టేసి ఒళ్ళోకి లాక్కొని ముఖం మీద ముఖం పెట్టి గుసగుసగా 'ఆనందంగా లేదూ?" అన్నాడు.
అరుంధతి రెండు కళ్ళూ గట్టిగా మూసుకోంది.
"పరమానందంగా ఉంది."
ప్రకాశరావు నవ్వి అరుంధతిని మరొక్క సారి ముద్దు పెట్టుకొని వదిలేసి, కోర్టు కాలస్యమవుతుందని స్నానాని కెళ్ళిపోయాడు.
అరుంధతి వెంటనే, పడకగదిలోకి వెళ్ళి చూసింది. ప్రకాశరావు పక్క మీది తలగడదిండ్లు, రగ్గు చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయి. అదీ గాక ప్రకాశరావు పక్క మీద ఉన్న రగ్గు నల్లది. ఉదయం ప్రకాశరావు కప్పుకొన్న రగ్గు బూడిద రంగు మీద ఎర్ర చారలది. మాములుగా అయితే, ఇట్లాంటి విషయాలన్నీ అరుంధతి, ఆలోచించక పోను-- కానీ, ఉదయం లేవగానే, అతనికి రగ్గు కప్పి ఉండటాన్ని , కొంత పశ్చాత్తాపంతో, గమనించించటం వలన ఆమెకు బాగా గుర్తుంది. ఇంట్లో ఉన్నది తనూ, ప్రకాశరావూ, వెంకట లక్ష్మీ మాత్రమే! మనోరంజని మాటలు నిజమేనా?
అరుంధతి వంటింట్లోకి నడిచింది.
"ఏం చేస్తున్నావు వెంకట లక్ష్మీ?"
"ఫలహారం తయారు చేస్తున్నానమ్మా!"
"ప్రొద్దున్న చేసావు కదూ!"
"అది మీరు తీసికొంటా రనుకొని చేసాను. ఇప్పుడు దొరగారికి చేస్తున్నాను."
"ఇన్ని సార్లెందుకూ?"
"చల్లారి పొదా , అమ్మా?!"
ఆ శ్రద్దకు నిర్ఘాంత పోయింది అరుంధతి.
"రాత్రి పాపం , అయ్యగారికి , ఎవరో రగ్గు కప్పారు. అంత చలిలో , అంత రాత్రి వేళ, అంత శ్రద్ధ ఎవరికా? అని ఆశ్చర్యం కలిగింది."
వెంకట లక్ష్మీ సమాధానం చెప్పలేదు. దీక్షగా ఆమెనే గమనిస్తున్న అరుంధతి కి ఇడ్లీ పాత్ర స్టౌ మీద పెడుతున్న ఆమె చేతి వేళ్ళు వణకటం స్పష్టంగా కనుపించింది. అరుంధతి కి తల దిమ్మెక్కినట్లనిపించింది. అక్కడ నిలబడలేక హాల్లోకి వచ్చింది. చూపులలో కాని, చేష్టలలో కాని, ఏ కోశానా వెకిలితనం లేని వ్యక్తిని, ఒక యంత్రం లాగ గృహకృత్యాలన్నింటినీ, సమర్ధతతో నిర్వహించే, ఆ సేవాపరాయణురాలిని, మూర్తీభవించే, నిరాడంబరమైన, ఆ నిరీహురాలిని ఎలా అనుమానించటం? కానీ...."
టెలిఫోను మ్రోగింది.
అరుంధతి రిసీవ్ చేసుకొంది.
"హలో!"
"హలో! నేను డాక్టర్ శ్రీధర్ ని. ఎవరు మాట్లాడుతున్నారు?"
"అరుంధతిని."
"ఓ! నమస్కారం ప్రకాశరావు గారున్నారా?"
"ఉన్నారు. స్నానం చేస్తున్నారు."
"ఆయనను పిలవనక్కర్లేదు. ఎంతవరకూ ఇంట్లో ఉంటారూ?"
"పది గంటల వరకూ!"
'సరే! తొమ్మిదిన్నరకు నేను వస్తున్నానని చెప్పండి!"
"అలాగే!"
"నమస్తే!"
శ్రీధర్ ఫోను పెట్టేసిన చప్పుడు వినిపించి అరుంధతి కూడా పెట్టేసింది.
ప్రకాశరావు స్నానం ముగించి రాగానే ఫోన్ కాల్ గురించి చెప్పింది. ప్రకాశరావు పెద్ద ఆసక్తి చూపలేదు. కొంచెం విసుక్కున్నాడు కూడా!
సరిగ్గా తొమ్మిదిన్నరకు డాక్టర్ శ్రీధర్ వచ్చాడు.
"నిన్ననే మీరు కాక్ టెయిల్ తీసి కొన్నారు. రోజూ అట్లాంటివి తీసికొంటే ఆరోగ్యం దెబ్బ తింటుంది. ఇవాళ కొంచెం 'బీర్' కానీ, 'జిన్' కానీ తీసుకొని "పెకాడుకొందాం! సాయంత్రం ఆరు గంటలకు మా ఇంటికి రండి! మిమ్మల్ని పిలవటానికే వచ్చాను నేను!"
ఈ మాటలతో ప్రకాశరావు విసుగు ఎగిరి పోయింది. సంతోషంగా అంగీకరించాడు. ఒక్క అయిదు నిముషాలు మాత్రమే కూర్చొని వెంకట లక్ష్మీ అందించిన కాఫీ, మర్యాద కోసం తీసికొని శ్రీధర్ వెళ్ళిపోయాడు-- ప్రకాశరావు కూడా కోర్టు కెళ్ళి పోయాడు.
అరుంధతి మనసంతా గందరగోళంగా ఉంది - డాక్టర్ శ్రీధర్ ప్రకాశరావుతో మాట్లాడుతూ "బీర్' జిన్' ప్రసక్తి తేవటం, కొంచెం ఆశ్చర్యాన్ని , మరి కొంచెం కోపాన్నీ కలిగించినా, వెంటనే అర్ధం చేసికొంది. 'గడుసు వాడు" అనుకొంది.
