'అలాగే ప్రసాద్...!"
నన్ను వారి కౌగిలి లో చేర్చుకొని ఆనంద భాష్పాలు రాల్చారు. ఆ సందర్భంలో తప్ప అంతసేపు ఎప్పుడూ వారితో మాట్లాడి ఎరుగను. ఈ విషయం జరిగి నెల రోజులు కాలేదు. నాకోసం ఎందుకు కబురు చేశారా అని ఆలోచిస్తూ అడుగులో అడుగు వేస్తూ మెల్లగా వారి గదికి వెళ్లాను. నన్ను చూసిన వారు చదువుతున్న పుస్తకాన్ని మూసి ప్రక్కన బల్ల పై ఉంచుతూ 'రా బాబూ! ఇలా వచ్చి కూర్చో ' అని కుర్చీ చూపించారు.
నేను కూర్చున్న తర్వాత ' బాబూ! జీవితంలో నా సమస్యలు ఒకటొకటి తీరిపోతున్నాయి.... తీర్చుకోవలసిన వయసు నాది. నర్శింగ్ హోం బాధ్యత నిశ్చింతగా నీపై వేశాను. అంతకుమించిన బాధ్యత తీర్చుకోవలసి ఉంది. రేఖ! తల్లిలేని పిల్ల తల్లీ...తండ్రి నేనుగా పెంచాను. ఈ సంవత్సరమే హౌసు సర్జన్ పూర్తీ చేసిన విషయం నీకు తెలుసు. రేఖకు ఆ మూడు ముళ్ళూ పడవేస్తే నా బాధ్యత తీరినట్లే! ఏం చేయాలో తోచడం లేదు. నిన్ను నా కుటుంబ వ్యక్తిగా భావించి ఈ విషయాలు నీతో చెబుతున్నాను రేఖకు ఈ రోజు ఒక మంచి సంబంధం వచ్చింది. కుర్రవాడు తెలివైన వాడు -- బాగా ఆస్తి పాస్తులున్నాయి. నీలాగే డాక్టరు . ఎమ్ డి. పూర్తీ చేశాడు. అందగాడు, అమ్మాయికి ఆ మూడు ముళ్ళూ వేయించి నిశ్చింతగా ఉంటాను. విశ్రాంతి గా కూడా ఉంటుంది. ఈ విషయంలో నీ అభిప్రాయమేమిటి? ఇంకా ఈ సంగతి అమ్మాయికీ తెలియదు.'
నా గుండెల్లో రైళ్ళు పరిగెత్తాయి.... కళ్ళు భైర్లు కమ్మాయి... రేఖాదేవిని విడిచి జీవించగలనా....? ఎలా జీవించగలను....?
"..............."
'ప్రసాద్! ఏమిటలా అయిపోతున్నావు ఒంట్లో కులాసాగా లేదా......?
'అబ్బే! ఏం లేదండీ.... ఎందుకో కళ్ళు తిరుగుతున్నాయి.'
నా కంగారు పైకి కనిపించనీయకుండా సమాధానం చెప్పాను--
'అవుతే-- వెళ్లి విశ్రాంతి తీసుకోబాబూ....!"
నాగదికి ఎలా చేరానో నాకే అర్ధం కాలేదు. ప్రపంచమంతా శూన్యంగా తోచింది. నా కాళ్ల కింది నేల గిర్రున తిరుగుతున్నట్లు తోచసాగింది. ఆ తర్వాత క్రమంగా మనసు కుదుట పడింది. ఒకటి రెండు రోజులు అన్నం సహించలేదు నాకు. ఈ విషయం సీతమ్మ కు చెప్పక తప్పలేదు. ఎంతో బలవంతం చేసి నానుండి తెలుసుకుంది.
'అదా బాబూ...! అయినా నీవు అందని పండ్లను ఆశిస్తున్నావేమో....'
'లేదమ్మా! అటువంటిదేమీ లేదు. రేఖాదేవి నన్ను మనస్పూర్తిగా నన్ను ప్రేమిస్తూ ఉంది. ఒకసారి ఈ విషయం నాతొ స్పష్టంగా చెప్పింది కూడా నా పరిస్థితి అయోమయంగా ఉంది. ఆమెను చూడకుండా ఒక్క క్షణం గడపలేక పోతున్నాను. మాయిద్దరి మనసులూ ఏకమైనప్పటికీ యింతకాలం బాబుగారి నిర్ణయం కోసరం ఎదురు చూశాము. నాకై నేను ఈ విషయం వారి వద్ద ప్రస్తావించడం బాగుండదు తారతమ్యాలు ఊహించుకొని వారు బాధపడటం జరుగుతుందేమో? ;'ఇంతకాలం నా యింట్లో ఉండి చదువు కొని ఈ పరిస్థితికి దిగజారాడు.' అని వారు అనుకొనేందుకు ఆస్కారము ఉండకూడదు మొన్న అమ్మాయి గారి వివాహ విషయం నాతొ సంప్రతించారు బాబుగారు. కాబోయే అల్లుడు గారు కూడా మా మాదిరి గానే డాక్టరు. బాగా ఆస్తి పాస్తులున్నవాడట! అంతవరకూ తెలిసేసరికి నాకు కంగారు కలిగింది. నాలో మార్పు గుర్తించి ఆరోగ్యం బాగాలేదని ఊహించి విశ్రాంతి తీసుకోవలసిందని చెప్పారు. జరిగిన విషయం యిది ఈ విషయం నాలోనే ఉండిపోవాలని ఊహించుకున్నాను. కాని తల్లి లాంటి నీకు చెప్పక తప్పలేదు. ఈ విషయం రేఖాదేవికి యింక తెలిసిందో, తెలియలేదో....? రేఖాదేవి....'
నా వాక్యం పూర్తీ కాకుండానే 'నాకంతా తెలిసిందయ్యా! అమ్మాయిగారికి కూడా ఈ విషయం తెలిసింది. అప్పటి నుండి ఆమె పరిస్థితి కూడా యిలాగే ఉంది. చిన్నప్పటి నుండి గారాబంగా పెంచారు. అమ్మాయి గారి మాటను బాబుగారు, బాబుగారి మాటను అమ్మాయి గారు యింతవరకు కాదనడం నే చూడలేదు. ఇప్పటి ఈ పరిస్థితి విచిత్రంగా ఉంది. బాబుగారు అమ్మాయి గారి మనసు గ్రహించినట్లు లేరు. వారు చెప్పుకు పోవడమే గాని అమ్మాయి గారిని మాట్లాడ నివ్వలేదు. ఆ సంబంధం వారికి అంతగా నచ్చి ఉండవచ్చు. అమ్మాయి గారు కూడా తోచక తికమక పడుతున్నారు. ఈ విషయంలోనీవు మాత్రం త్వరపడవద్దు. మాట పడవలసి వస్తుంది. మనసు కుదుట పరుచుకొని ఏం జరుగుతుందో గమనించు వోపికతో! అమ్మాయి గారు పూర్తిగా సందిగ్ధావస్థ లో పడిపోయారు. ధైర్యం చేసి బాబుగారికి చెప్పలేకపోతున్నారు. బాబుగారిని త్వరపడి ఒక నిర్ణయానికి వచ్చే మనస్తత్వం కాదు. వోపిక పట్టడమే ప్రస్తుత కర్తవ్యం....! నే వస్తా బాబూ! పనంతా అలాగే ఉండి పోయింది --'
సీతమ్మ వెళ్ళిపోయింది. గుండె దిటవు పరచుకొని ఎంతో ప్రయత్నం మీద మాములుగా నవ్వుతూ పేలుతూ తిరగసాగాను.
వారం రోజులు గడిచి పోయాయి. ఒక రోజు నర్శింగ్ హోం లో అవుట్ పేషెంట్ల ను పంపించేసి మేల్ద్ వార్డు వైపు బయలుదేరాను. అంతలో నర్స్ రాధ వచ్చి రేఖాదేవి గారు పిలుస్తూ ఉన్నట్లు చెప్పింది. వారం రోజులుగా తప్పించుకు తిరుగుతున్న నేను, యిప్పుడు వెళ్లక తప్పలేదు. వెళ్ళి ఆమెకు ఎదురుగా కూర్చున్నాను. ఎప్పుడైనా ఏవైనా సలహాలు కావలసినప్పుడు ఆమె పిలవడం నేను వెళ్ళడం మామూలే! ఈ రోజు కూడా ఏమైనా తెలుసుకోవడానికి పిలిపించిందేమోనని ఊహించి 'ప్రత్యేకంగా చూడవలసిన కేసులు గాని, ఎక్స్ రే లు గాని ఉన్నాయా?' అని ప్రశ్నించాను.
'ప్రసాద్! నీకు చీమ కుట్టినట్లైనా లేనట్లుందే! హాయిగా , కులాసాగా నవ్వుతూ ప్రేలుతూ తిరుగుతూ ఉన్నావు. పైగా నా దగ్గర మాట మార్చడానికి ప్రయత్నిస్తున్నావు. అయినా మొదటి నుండి గమనిస్తూనే ఉన్నాను. ఎన్నిసార్లు నన్ను తప్పించుకోవాలని ప్రయత్నించావ్! ఇది నీకు న్యాయంగా ఉందంటావా?'
రేఖా దేవిమాటలు నన్ను నిర్ఘాంత పరచాయి. మెల్లిగా తేరుకొని 'అసలు విషయం తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. మీకు ఏదో సంబంధం వచ్చిందని తెలిసినరోజు నా పరిస్థితి ఆ భగవంతుడి కే తెలియాలి. రెండు రోజులు అసలు అన్నం సహించలేదు..... ఆ రెండు రాత్రులూ కంటి మీద కునుకు లేదు. ఈ వారం రోజుల నుండి మీకు దూరంగా ఉండాలని ఎంతగా ప్రయత్నిస్తూ నటిస్తూ ఉన్నానో ఆ భగవంతుడికే తెలియాలి. ధైర్యం చేసి మీ నాన్నగారిని ఆడగలేను. అసలు వారితో మాట్లాడాలంటేనే నాకు భయం. ఒకవేళ ధైర్యం చేసి మాట్లాడినా వారు అపార్ధం చేసుకుంటారేమోనన్న భయం. దీనికి తరుణోపాయం మీరే చూడాలి.'
'ప్రసాద్! నేను కూడా ఎంతో బాధపడుతున్నాను. నాన్నగారిని నొప్పించలేక పోతున్నాను. నన్ను ఎంత ఆప్యాయంగా పెంచారు? నీకు తెలియనిదేముందని? వారికి ఆ సంబంధం బాగా నచ్చింది నేను ఈ విషయంలో వారితో మాట్లాడాలని కూడా విరమించుకున్నాను. ఏం చేయాలో తోచడం లేదు. ఇంతకాలం కలిసి మెలిసి తిరిగాం ....చదువుకున్నాం ...ఒకరి సమస్యల నోకరం పంచుకున్నాం. కాని యిది మన యిద్దరి మీదకు ఒకేసారి వచ్చి పడిన చిక్కు సమస్య. నా కర్తవ్యమేమిటో బోధపడడం లేదు.... అంతా అయోమయంగా ఉంది. ఆ భగవంతుడి దయవల్ల ఈ సమస్య దానంతట అదే తీరిపోతే హాయిగా ఉంటుంది... కాని ఎలా తీరుతుంది. ఈరోజు పెళ్ళి చూపులకు వస్తారట! నన్నేం చేయమంటావు ప్రసాద్?
'........................'
'మాట్లాడవేం?'
కన్నీరు దాచుకోవాలని వ్యర్ధ ప్రయత్నం చేస్తూ గద్గకంఠం తో అంది రేఖాదేవి. నాకూ కన్నీరాగలేదు. మాట పెగిలి రాలేదు. ఆ స్టితిలో యిద్దరమూ కొన్ని క్షణాలు గడిపాము. ఎంత ఆలోచించినా పరిష్కార మార్గం కనుపించలేదు మాకు--
'అమ్మాయి గారూ! నేను చివరి మాటుగా చెబుతున్నాను.... నిండు హృదయం తో, నన్నర్ధం చేసుకోవాలి.... విధి వక్రించి మీరు నాకు దక్కని నాడు నా ప్రాణాలనైనా త్యజించడానికి సిద్దపడతానె గాని ఈ విషయాన్ని మాత్రం బాబుగారితో నేను మాట్లాడలేను. నిజంగా నేను దురదృష్టవంతుణ్ణి. నా వారందరూ నాకు దూరమైనా మిమ్ములను పొంది యింతకాలం మొండిగా బ్రతికాను. మీరే నాకు లేని నాడు నా ఈ జీవితమే వ్యర్ధం.... నేను మీ వాణ్ణి.... అంతకు మించి యిక మాట్లాడలేను... మన్నించండి.' ఎంతోకష్టం మీద ఆ చివరి మాటలు నా నోటి నుండి వెలువడ్డాయి-----
నన్ను ఆ పరిస్థితి లో చూసిన రేఖాదేవి నిలువునా కృంగి పోయింది ----
'ప్రసాద్! నీ పరిస్థితి నేనర్ధం చేసుకున్నాను. నీవు నా వాడివి కానినాడు నేను మాత్రం వేరే ఎవ్వరితో నో సుఖ పడగలనా? నీ అడుగు జాడల్లోనే నేనున్నూ... అయినా నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. సీతమ్మ తో సంప్రతించి నాన్నగారితో మాట్లాడమని చెబుతాను. ఒకవేళ నా ప్రయత్నాలు విఫలమౌతే మనమేం చేయాలి ప్రసాద్? ఈ పరిస్థితులు చూస్తూంటే పిచ్చి ఎక్కేటట్లు ఉంది . అలా జరిగినా బాగుండే దేమో.....? ఈ బాధలు ...బాధ్యతలు.... వోహ్! తల బ్రద్దలౌతూ ఉంది.....'
పై మాటలని కన్నీరు కార్చింది ఆమె.
అన్ని విధాల అదృష్ట వంతురాలైన రేఖాదేవి పై నా నీడ పడడంతో యిన్ని బాధలు, సమస్యలు వచ్చాయి. నేను వీరి కుటుంబంలో ప్రవేశించి ఉండకపోయినట్లయితే ఈ సమస్యలు, చిక్కులు ఆమెకు వచ్చేవేనా? ఆ విషయమే పైకి అనబోయాను కాని నా ఉద్దేశాన్ని గుర్తించి నానోటిని తన సున్నిత మైన వ్రేళ్ళతో మృదువుగా మూసింది. అంతలో బయట ఏదో అర్జంటు కేసు రావడంతో తప్పనిసరై ఆమె వద్ద శలవు తీసుకొని వెళ్ళిపోయాను.
ఆ తర్వాత ఒకరోజు పెళ్ళి చూపులు సవ్యంగా జరిగిపోయాయి. ఆ సంఘటన తర్వాత యిద్దరమూ పూర్తిగా దిగజారి పోయాము. రేఖాదేవిని మగపెళ్లి వారంతా నచ్చడం, తదితర ముఖ్య విషయాలు మాట్లాడుకోవడం గూడా జరిగిపోయింది. మంచి రోజు చూసి లగ్నం నిర్ణయం చేసుకోవాడానికి యిరువురూ నిర్ణయించు కున్నారు. బాబుగారితో మా విషయం మాట్లాడడానికి సీతమ్మ కు కూడా ధైర్యం చాలలేదట! మా ఆశలు అడుగంటి పోయాయి. మా ముఖాలలో కత్తి వాటుకు నెత్తురు చుక్క లేకుండా పోయింది. తుదకు ఆ భగవతుడి పైనే భారం వేశాము.
