మల్లెలు ఎర్రగులాబీలు
---యర్రం చంద్రశేఖరం
.jpg)
పగలంతా శ్రమపడిన భాస్కరుడు, తన దృష్టికి వచ్చిన అక్రమాలకు, అన్యాయాలకు, కోపం ప్రదర్శిస్తూ, శాసన సభలో ఎమ్. ఎల్. ఏ. ల అవకతవక ప్రశ్నలకు విసుగుపడే ముఖ్యమంత్రి మనస్తత్వంతో పడమటిదిక్కుకు పయనిస్తున్నాడు.
నీడలు క్రమంగా పొడుగౌతున్నాయి. లంచాలు తీసుకొని నగలు చేయించడంలేదనే నెపంతో, భర్తతో పోట్లాడుతూన్న తాలూకాఫీసు గుమాస్తా భార్య ముఖంలా పడమటిదిశ అరుణవర్ణంతో రాగరంజితమైంది. అమాయక రైతుల హృదయాలలాగా వాతావరణం ప్రశాంతంగా ఉంది.
రైతులు పగలంతా పడిన శ్రమను చల్లగాలికి మరిచి పోతూ పొలాలకు ఎరువులు తోలడం ఆనాటికి ముగించి, నుదుట పట్టిన స్వేదబిందువులను భుజాన ఉన్న కండువాలతో అద్దుకుంటూ, తొలి కోడి కూసినప్పటినుండీ ఎవరు ఎన్ని ఎకరాలకు ఎరువులు తోలించారో వివరంగా ఒకరితో మరొకరు చెప్పుకుంటూ, విశ్రాంతి తీసుకోవాలనే ఆదుర్దాతో పెద్దపెద్ద అంగలువేస్తూ గృహోన్ముఖులై వడివడిగా నడుస్తున్నారు.
.jpg)
.jpg)
పంచాయితీబోరు, ఆఫీసుముందు ఒక్కక్షణం ఆగి, లోపలికి తొంగి చూశాడు రంగయ్యతాత. లోపల ప్రశిడెంటు రామం కనుపించడంతో, అయాచితంగా పిప్పరమెంటు బిళ్ళ లభించిన పిల్లవాడిలా సంబరపడ్డాడు. అరవయ్యేళ్ళు దాటి పోవస్తున్నా, ముప్పయ్యేళ్ళుదాటని యువకునికన్న ఆరోగ్యంగా ఉంటాడు రంగయ్య తాత. సన్నగా, పొడుగ్గా సర్విచెట్టులా ఉండి, తెల్లగా నెరిసిన వెంట్రుకలతో, నల్లని శరీరచ్చాయతో విచిత్రంగా, కనుపిస్తాడు. అతని కీవయసులోనే వెంట్రుకలు తెల్లబడడంతో, అందరూ కొన్ని సంవత్సరాలుగా అతనిని 'రంగయ్యతాత' అని పిలవడం పరిపాటైంది. వేగంగా నడుస్తాడు. త్వరత్వరగా మాట్లాడుతాడు. అరవయ్యోపడి దాటబోతున్నా ఆవేశం తగ్గలేదు వ్యక్తిలో.
ఆఫీసుపనిలో నిమగ్నమైన రామాన్ని 'కదిలించాలా....వద్దా...' అని ఒక్కక్షణం ఆలోచించిన రంగయ్య తాత ఒకనిర్ణయానికి వచ్చినవాడిలా తల పంకించి 'రామం...! రామం!?' అని రెండుసార్లు పిలిచాడు.
మొదటిపిలుపు తనలోతాను గొణుక్కున్నట్లుగా ఉంది. రెండవ పిలుపు మొదటి దానికన్న కొద్ది మెరుగు. అయినా తదేకంగా ఏదో కంట్రాక్టు ఫైలును పరిశీలిస్తున్న ప్రశిడెంటు రామం చెవివరకు రంగయ్య తాత పిలుపు చేరలేదు. ఏమీతోచక నిలబడ్డాడు రంగయ్యతాత. రామంవద్ద రంగయ్య తాతకు అందరికన్న ఎక్కువే చనువుంది. అయినా పనిలో ఉన్నప్పుడు పలుకరిస్తే మాత్రం ఖస్సుమంటాడని తెలుసు. అందువల్ల ఎదురుచూస్తూ నిలుచున్నాడు.
'ఈ లెక్కలన్నీ సరీగా లేదని బిల్లు వాపసుచెయ్యి. నేను సైట్ తనఖీచేసిన తర్వాతగాని బిల్లు ప్యాసుకాదు. ఈ విషయం ఆ కంట్రాక్టరుతో నొక్కిచెప్పు. మరీ యింత అన్యాయమైతే ఎట్లా...? చేసేపనికి, వ్రాసేబిల్లుకూ ఏమాత్రం సంబంధం లేకపోతే ఎలా...?' ఫైలు ఆఫీసుగుమాస్తా చేతికిస్తూ, కంఠంలో అధికారాన్ని ధ్వనింపజేస్తూ, చిటపట లాడుతూ అన్నాడు ప్రసిడెంటు రామం.
గుమాస్తాతో మాట్లాడడం పూర్తయ్యాక ముందుకు చూసిన రామానికి రంగయ్య తాత కనుపించాడు.
'నీవా రంగయ్య తాతా...? ఎంతసేపైంది వచ్చి? నిల్చునే ఉన్నావేం? అలా కూర్చో....!' అని ఆశ్చర్యం ప్రకటిస్తూ కుర్చీ చూపించాడు రామం. రంగయ్య తాత కనుపించడంతో ఆ కంట్రాక్టరు పైన వచ్చిన విసుగు కోపం మాయమయ్యాయి అతని ముఖంలో.
'వచ్చికాసేపైంది నీవు పనిలో ఉన్నావు. పలకరించినా పలకలేదు. అందువల్ల నీపని పూర్తయేంతవరకు కాచుకున్నాను.' త్వర త్వరగా మాట్లాడడంతో భావంమాత్రం అర్ధం చేసుకున్నాడు రామం.
'సరే....! అలావెళ్ళి మాట్లాడుకుందాం పద' రామం ముందు దారితీశాడు. అనుసరించాడు రంగయ్య తాత.
దారిలో తమ పొలాలకు ఎరువులు తోలించి తిరిగి వస్తూన్న జీతగాళ్ళు కనిపించారు రామానికి. అతను కనుపించగానే బండ్లను ఆపి, బండ్ల తొట్లలోనుండి దిగి వినయంగా తలలు ఒంచుకొని 'దండాలు దొరా....!' అని ప్రక్కగా నిలబడ్డారు. వారికి వెనుకగా పెద్ద జీతగాడు హుందాగా నడిచి రావడం కనుపించింది. అతను దగ్గరకువచ్చి చినబాబూ...ఇంటికి వెళ్ళలా? మీ అత్తమ్మగోరు యిందాకే కబురు పెట్టారుగంద...?
'లేదు పుల్లయ్య మామా...! తీరిక లేక వెళ్ళలేదు. పొలం పనులు ఎంత వరకు వచ్చాయి...? ఎరువులు తోలడం యింకెంత కాలం పడుతుంది....?'
'ఇంకెంతకాలం అక్కర్లేదు. రెండు మూడు రోజులు చాలు. మరి...నేను యింటికెడుతూండాను. మీ అత్తమ్మ గోరికి ఏం చెప్పమంటారు....? నన్ను సూడగానే మీ యిసయం అడుగుతారు' దీర్ఘాలు తీస్తూ అన్నాడు పాలేరు పుల్లయ్య.
'అరగంటలో వస్తున్నానని చెప్పు. రంగయ్య తాత ఏదో పనుండి నాతో మాట్లాడడానికి వచ్చాడు. తాతను పంపించి యింటికి వస్తాను' అని రంగయ్య తాత తనవెంట వస్తూ ఉండగా తమ మామిడితోటవైపు నడిచారు.
అతనిని అనుసరిస్తూన్న రంగయ్య తాత ఆలోచనలలోపడి పరధ్యానంగా నడుస్తున్నాడు. 'నిజంగా లక్ష్మయ్యన్న అదృష్టవంతుడు. కొడుకులు లేకపోయినా వారిని మించి ఈ వయసులో ఆదుకుంటున్నాడు మేనల్లుడు. నేనున్నాను....నా కొడుకులూ ఉన్నారు. ఎందుకూ...? ఏడవనా...! ఒక్కరికీ లౌక్యం తెలియదు. పని, పాటూ మంచీ చెడూ తెలియవు. కోడళ్ళ చేతిలో కీలుబొమ్మలయ్యారు. ఇక చిన్నవాడిసంగతి సరేసరి!.... రామం.... వయసుకు మించిన తెలివితేటలు, ఊరిలో పెద్దరికం. అందరి మధ్య తలలో నాలికలా మసులుకుంటాడు. పేదవారిని ప్రేమతో ఆదరిస్తున్నాడు. వాళ్ళ కష్టాలలో పాలు పంచుకుంటున్నాడు. ఆ కారణంగా గ్రామంలో అందరికి ప్రేమ పాత్రుడయ్యాడు. అవును....! ఒకమనిషి మంచిపేరు తెచ్చుకోవాలంటే క్రిందితరగతి ప్రబలను మంచి చేసుకోవాలి. తద్వారా పైకిరావడం జరుగుతుంది. అలాగని ఊరిలో ఉన్న మోతుబరి రైతులు అతనిని నిర్లక్ష్యం చేస్తారని అనుకోవడానికి వీలు లేదు. వారివద్ద ఎలా మసులుకోవాలో అలా మసులుకుంటూ భూస్వామి, కార్మిక తగాదాలను సునాయాసంగా తెమిల్చేస్తాడు. ఇరుపక్షాలవారికీ నచ్చజెప్పి ఒప్పిస్తాడు. అతన్ని గురించి పొగడ్తలు ఎవరినోటవిన్నా మొట్టమొదటిసారిగా సంతోషపడే వాణ్ణి నేనే...!'
'ఏం తాతా.....? ఏమాలోచిస్తున్నావ్....! అలాకూర్చో....!'
ఆలోచనలనుండి తేరుకున్న రంగయ్య తాత పరిసరాలను పరికించాడు. ఆశ్చర్యపోయాడు. తనకు తెలియకుండానే మామిడి తోట చేరుకున్నట్లు గమనించాడు. 'అమ్మయ్య' అంటూ మంచంమీద కూర్చున్నాడు. ఆ మామిడితోటను చూడకుండా రామం ఒక్కరోజు కూడా ఉండలేడని రంగయ్య తాతకు తెలుసు. ఏదో ఒక సమయంలో ప్రతిరోజూ తోటకువచ్చి వెడుతూంటాడు.
'రామం....నా పరిస్థితి చూస్తున్నావు గదా....! నా కేది దారి? బుద్ధి తెలిసి నప్పటినుండీ చేస్తున్న వ్యావసాయపు పనులు అరవై ఏండ్లు దాటిపోవస్తున్నా నన్ను విడిపోవడంలేదు. ఆరోగ్యంగా ఉన్నంత వరకు ఫరవాలేదు. నేను మూలపడితే మా పొలాల గతేమిటి...? ఇప్పటికే పొలాలు సగం అమ్ముకొన్నాము. సుందరం చదువులకు బోలెడు ఖర్చవుతూ ఉంది. ఏం చేయాలో తోచడంలేదు. నీవేమైనా సలహా చెబుతావేమోనని వచ్చాను' ఒక్కొక్కమాటను సాగతీస్తూ అన్నాడు రంగయ్యతాత.
'అదేమిటి తాతా....! నీ పెద్దకుమారులిద్దరూ ఉన్నారుగా....! చిన్నవాడంటే పైచదువులకు వెళ్ళాడు....!'
నీవద్ద నాకు దాపరిక మేముంది.? ఐదు శిఖలున్నా ఫర్వాలేదు గాని మూడు కొప్పులు చేరాయంటే ముదనష్టమే అన్నట్లు మాయింట్లో పోరు విపరీతంగా వుంది. వేరు కుండలు పెట్టడానికి కోడళ్ళిద్దరు ప్రయత్నిస్తున్నారు. నేను మీ అమ్మమ్మా ఎంత ప్రయత్నించినా వేర్లు తప్పేలా కన్పించడం లేదు. పైగా ఊరందరికీ అధికారి ఆయన. ఆయనకు అధికారి ఆయన భార్య అన్నట్లు పెద్ద అబ్బాయి లిద్దరూ కోడళ్ళ చేతిలో కీలు బొమ్మలు, బయట ఎన్నో కబుర్లు చెబుతారు. ఇంటికి చేరేసరికి వీరి పిలకలను వారు అంది పుచ్చుకుంటారు. ఇలా ఉంది మాకుటుంబం పరిస్థితి. ఒకనాడు ఈ ఊరినంత గడగడలాడించిన నేను నా విషయంలో ఒకరు వేలుపెట్టి చూపించే పరిస్థితి వచ్చింది. పెద్దవారి యిద్దరి వరుస యిలా వుంది. చిన్నవాడు సుందరం చదువు మాననంటాడు. రేపు పెద్దవాళ్ళిద్దరూ వేర్లు పడితే ఈ వ్యవసాయం పనులన్నీ నేను ఒక్కన్నే చూడగలనా? ఆడపెత్తనం యింటికి చెరువు అన్నట్లు, కోడళ్ళ మాటలు వింటూ వ్యవసాయపు పనులు మానుకుంటున్నారు పెద్దవాళ్ళిద్దరూ. నీవే చూస్తున్నావుగా... ముప్పావలావంతు పని నేనే చేసుక పోతున్నాను. ఇలా ఎంత కాలం? నీమాట మీద ఈ ఊరిలోవారందరికీ గురి ఉంది. పెద్ద సన్నాసు లిద్దరికీ నచ్చ చెబుతూ- నీకు పుణ్యం వుంటుంది. మాయిల్లు నిలిపిన వాడవవుతావు. ఈ విషయమే నీతో చెబుతామని ఎంతో కాలంగా అనుకుంటూ ఉన్నాను. ఇప్పటికి వీలు చిక్కింది. తన మామూలు ధోరణిలో చెప్పుక పోయాడు తాత. అతని పరిస్థితి క్షుణ్ణంగా అర్ధం చేసుకున్నాడు రామం.
