Previous Page Next Page 
గూడు చేరిన పక్షులు పేజి 10

 

                                           5
    అనుకోని విధంగా మరొక ఘోరమైన సంఘటన జరిగింది. రేఖాదేవి వాణి యింటికి వెళ్ళి వస్తూ ఉండగా ఒక లారీతో ఆమె వస్తూన్న కారు డీకొని పెద్ద యాక్సిడెంటు జరిగింది.డ్రైవరు ప్రమాదాన్ని గుర్తించి కారులో నుండి దూకడం వలన అతనికి మామూలు గాయాలు తగిలాయి. కాని రేఖాదేవికి మాత్రం చాలా ప్రమాదకరమైన గాయాలు తగిలి చాలా రక్తం కారిపోయింది. వెంటనే నేను, పెదబాబుగారు ఆమె గాయాలకు తగిన చికిత్స జరిపాము. ఈ విషయం సుధాకర్ గారికి కబురు చేశాము. ఆమెకు ప్రమాద పరిస్థితి దాటిపోలేదు. రక్తం బాగా కారిపోవడం వలన పరిస్థితి క్రమంగా దిగజారి పోవడ మారంభించింది. డా.సుధాకర్ వచ్చి రేఖా దేవిని చూసి వెంటనే వెళ్ళిపోయాడు. నాకు ఏమీ తోచలేదు. వేరే ఎవరికైనా ధైర్యం చెప్పాలంటే మొదట నా పేరే చెప్పుకోవాలి. కాని యిప్పుడు నా పరిస్థితి అయోమయంలో పడిపోయింది. కాళ్ళు చేతులు ఆడక వెంటనే వాణికి, రవికీ ఫోన్ చేసి విషయమంతా చెప్పాను. వారిద్దరూ వెంటనే బయలుదేరుతున్నామని చెప్పారు. హాస్పిటలు లో ఉన్న బ్లడ్ గ్రూప్స్ రేఖాదేవి బ్లడ్ తో కలవలేదు. వరుసగా నర్శింగ్ హోం స్టాపు బ్లడ్ ను పరీక్ష చేశాను. అదీ లాభం లేకపోయింది. డాక్టరు బాబుగారి పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. జనరల్ హాస్పిటల్ లో నాకు తెలిసిన డాక్టరు కు ఫోను చేసి బ్లడ్ బ్యాంకు లో మాకు పనికి వచ్చే గ్రూపు గల రక్తం ఉన్నదీ లేనిదీ తెలుసుకోవలసిందిగా చెప్పాను. చాలా అర్జంట ని చెప్పడం వల్ల అయిదు నిమిషాలలో సమాధానం వచ్చింది. ఆ గ్రూపు రక్తం లేదని. హతశుడినయ్యాను. ఆ విషయం తెలియగానే పెదబాబు గారు మెంటల్ షాక్ వల్ల స్పృహ కోల్పోయారు. ఒకరికి తోడుగా మరొకరు. ఇంతలో నాకు ఒక ఆలోచన తట్టింది. నా రక్తం పరీక్ష చేశాను. గ్రూపు కలిసి పోయింది. సంతోషంతో నర్స్ రాధను పిలిపించాను. బ్లడ్ ట్రాన్స్ ప్యూజన్ కు ఏర్పాట్లు చేయవలసిందిగా ఆమెకు చెప్పాను. ఇంతలో రవి, వాణి యిద్దరూ ఒకేసారి వచ్చారు. కొండంత ధైర్యం కలిగింది నాకు. చేయవలసినవన్నీ వివరంగా చెప్పి నేను బ్లడ్ యివ్వడాని కై బెడ్ పై పడుకున్నాను. రవి నా వద్ద ఉండి బ్లడ్ తీస్తున్నప్పుడు తీసుకోవలసిన జాగ్రత్త లు తీసుకుంటున్నాడు. వాణి పెదబాబుగారికి స్పృహ తెప్పించే ప్రయత్నంలో ఉంది.
    రవీ....! రేఖాదేవి పరిస్థితి ప్రమ్డంగా ఉంది. అవసరమున్నంత బ్లడ్ వెనుక ముందులు ఆలోచించకుండా తీసుకో....ఇది వారి ఉప్పు తిని పెరిగిన శరీరం. ఏమాత్రం ఆలోచించవద్దు. నీవు అలా చేయకపోతే నీ మిత్రునికి ద్రోహం చేసినవాడవౌతావ్..' ఈ విషయం రవికి నొక్కి చెప్పాను.
    'అలాగే!' నని రెండు, మూడు, నాలు పింట్లు రక్తాన్ని తీశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు.
    నాకు తెలివి వచ్చిన తర్వాత సంగతులు తెలుసుకొని హాయిగా ఊపిరి పీల్చాను. అమ్మాయి గారి ప్రమాద స్థితి దాటిపోయిన సంగతి తెలిసి హాయిగా నిట్టుర్చాను.... లేచి కూర్చో బోయాను. రేఖాదేవి పరిస్థితి ప్రమాద స్థితిని దాటిపోయిందని ఎవరో అనుకుంటూ ఉండగా వినిపించింది.
    'లేవకండి డాక్టర్! మీకు తెలివి రాగానే ఫోను చేయవలసింది గా చెప్పి అరగంట క్రితమే పెదబాబు గారు యింటికి వెళ్ళి పోయారు. మీరు ఒక రాత్రి ఒక పగలు స్పృహ కోల్పోయారు. మీకు కూడా రక్తం యిచ్చారు.'
    'దయచేసి మీరు ఏమీ మాట్లాడవద్దు. అమ్మాయి గారి ప్రమాద పరిస్థితి దాటిపోయింది కాని బెడ్ పై నుండి లేవలేని పరిస్థితిలో ఉన్నారు. పెదబాబుగారు ఈ రెండు రోజులూ యిక్కడే మకాం వేశారు. నిద్ర, ఆహారం లేని కారణంగా ఈ రెండు రోజులలోనే సగమయ్యారు. కళ్ళు గుంటలు పడిపోయాయి. అమ్మాయిగారు మాట్లాడడం ప్రారంభించిన తర్వాత కొద్దిగా కుదుట పడ్డారు. మీ పరిస్థితి కి బాధపడ్డారు. ముందు వారికి ఫోను చెయ్యాలి. ఆ తర్వాత తీరికగా మీ సందేహాలన్నింటినీ తీరుస్తాను.' అని లేచి పోబోతున్న రాధను ఆపుచేసి 'రాధా....! ఇంత రాత్రప్పుడు వారికి నిద్రాభంగం కలిగించవద్దు. రేపు ఉదయం వారు ఎలాగూ వస్తారు. నీరసంగా అని రాధను బెడ్ ప్రక్కగా ఉన్న స్టూలు పై కూర్చో వలసిందిగా సంజ్ఞ చేశాను.
    'రాధా..........'
    'మీరేమీ మాట్లాడకండి......మీ ప్రశ్నలు  నాకు తెలుసు... అన్నీ వివరంగా చెబుతాను. ఆరోజు సంఘటన గుర్తు కు వస్తే నాకూ కన్నీరు ఆగడం లేదు. పెదబాబు గారు.... మీరు స్పృహ కోల్పోయారు. నర్శింగ్ హోం లోని రోగులను కంటికి రెప్పలా అహర్నిశలూ కాపాడుతూ, మమ్ముల నందరినీ చిరునవ్వుతో మాట్లాడిస్తూ, రోగులకు ఎనమేని ధైర్య ప్రోత్సాహాలను ప్రసాదించే మీ ముగ్గురూ అలా బెడ్ ల పై పడి ఉండడం చూసి అందరమూ భయంతో వణికి పోయాము. రవిగారు మీ రక్తాన్ని అవసర మున్నంత తీసి మీకు గ్లూకోసు యివ్వడం ప్రారంభించి పల్సు రీడింగు చూడసాగారు. వాణి గారు పెదబాబు గారికి గ్లూకోసు తో బిట్వేల్వ్ యిచ్చారు. వెంటనే వారికీ స్పృహ వచ్చింది. పది నిముషాలలో తేరుకున్నారు. వారికి ఆనందం వల్ల  కళ్ళు   చెమ్మగిల్లాయి. అమ్మాయి గారికి బ్లడ్ యివ్వడం పెదబాబు గారికి తెలివిరాకముందే ప్రారంభించాము. వారు ఒక్కసారి అమ్మాయి గారిని చూసి మీ బెడ్ వద్దకు వచ్చారు. అమ్మాయి గారిని వాణి, మిమ్మలను రవి గార్లు శ్రద్ధతో చూస్తూ ఉండడం చూసి వారు ఎంతో పొంగిపోయారు. రవి నుద్దేశించి'మీరిద్దరూ కలిసి నాకు రెండు కళ్ళు ప్రసాదించారు.' అని అన్నారు.
    'ఇందులో మాదేమీ లేద్దండీ! ఈ ఘనతంతా ప్రసాదు కే చెందాలి. సమయానికి తన రక్తాన్ని పరీక్ష చేసుకొని ఆలస్యం జరుగకుండా అవసరమున్నంత రక్తాన్ని తీసుకోవలసిందిగా నాకు చెప్పి నిశ్చింతగా బెడ్ పై పడుకున్నాడు. అటువంటి వాళ్ళు వేయికి ఒకరుంటారా.........? నాకు అనుమానంగా ఉంది. ప్రసాదు కు కూడా రక్తం యివ్వాలి. ఇక మీరు జాగ్రత్తగా అన్ని విషయాలు చూసుకోండి. రేపు మళ్ళీ యిద్దరమూ వచ్చి వెడతాం' అని ఆ యిద్దరూ వెళ్ళిపోయారు.
    వారు వెళ్ళిపోయినా తర్వాత మీ ఇద్దరినీ జాగ్రత్తగా పరీక్ష చేసి ఏవో యింజక్షన్లు స్వయంగా వారే చేశారు. మీకు రక్తం యిచ్చారు. గంటకొకసారి మీ పల్సు , రేస్పిరేషను చెక్ చేస్తూ నోటు చేసుకున్నారు. ఆ విధంగా రాత్రంతా జాగరణ చేశారు. రెండవరోజు అమ్మాయి గారికి తెలివి వచ్చింది. నీరసంగా కళ్ళు తెరిచి అందర్నీ గుర్తు పట్టి ఒకటి రెండు మాటలు మాట్లాడి మళ్ళీ కళ్ళు మూసుకున్నారు. ఆ విధంగా వారి ప్రమాద పరిస్థితి దారిపోయింది. మళ్లీ గ్లూకోజు స్టాండు అమ్మాయి గారికి అమర్చాము. ఆ తర్వాత మీ యిద్దరినీ తమ గదికి ప్రక్కగా ఉన్న స్పెషల్ రూముల లోపలికి మార్పించారు . ఆ తర్వాత విశ్రాంతి గా ఒకటి రెండు గంటలు నిద్రపోయారు. ఆ పిమ్మట రవిగారు, వాణి గారు వచ్చి అంతా సవ్యంగా ఉన్నట్లు తెలుసుకొని పెదబాబు గారికి ధైర్యం చెబుతూ వెళ్ళిపోయాడు. సాయంత్రం నాలుగున్నర కు మిమ్ములను పరీక్ష చేసి దైర్యంగా నిట్టూర్చి తమ గదికి వచ్చి వేరే పనులు చూసుకోవడం ప్రారంభించారు. మీ వద్ద నన్ను, అమ్మాయి గారి వద్ద సీతమ్మను ఉంచారు. ఆ తర్వాత రాత్రి తొమ్మిది గంటలకు యింటికి వెళ్లి పోయారు. మీకు తెలివి రాగానే ఫోను చేయవలసిందని నన్ను ఒకటికి రెండు సార్లు హెచ్చరించి వెళ్ళారు. మరి! మీరేమో వద్దంటున్నారు. మీరిద్దరూ తేరుకున్నారు. నా మనసు కుదుటపడి హాయిగా ఉంది.'

                        
    కళ్ళు మూసుకొని అంతా విన్నాను. నాకు ఒక చిన్న సందేహం కలిగింది. 'రాధా డా. సుధాకర్ గారు మళ్ళీ రాలేదా? 'పోనీ పెదబాబు గారు వారికేమైనా ఫోను చేశారా....?'
    'లేదు. వారు రాలేదు. వీరు వారికి ఫోను చేయలేదు.'
    'మంచిది రాదా....! ఇక నీవు వెళ్ళి విశ్రాంతి తీసుకో....! నాకు నీరసం తప్ప వేరే బాధలేమీ లేవు .' కళ్ళు మూసుకొని పడుకొన్నాడు.
    'నాకు విశ్రాంతి గానే ఉంది. నేను మీ గది వదిలి వెళ్ళడానికి వీలులేదు. పెదబాబు  గారు ఈ విషయం నాకు నొక్కి చెప్పారు.'
    సమాధాన మిచ్చే వోపిక లేక అలాగే పడుకున్నాను. ఆవిధంగా పడుకొన్న నేను ఉదయం తొమ్మిది , తొమ్మిదిన్నర వరకు నిద్ర లేవలేదు. రాధ కుర్చీ లో కూర్చుని టేబుల్ పై తల ఆనించి నిద్రపోతూ ఉంది.
    'రాదా...! రాధా...!'
    ఉలికిపడి లేచింది రాధ...ఆవులిస్తూ ....వో...ఎంత పొద్దుపోయింది....? మీరు నిద్ర లేచింది ఎంత సేపైంది...? నన్ను లేపలేదేం?'
    'ఇప్పుడే లేచాను. నిద్రపోతూ కనుపించావ్! నీవు మాత్రం ఏం చేయగలవు? చూడు  నీ ముఖం ఎలా పాలిపోయిందో?'
    'నేనెలా ఉంటె ఏం డాక్టర్....? మీరిద్దరూ కులాసాగా ఉన్నారు. నాకంతే చాలు. శ్రమ....ప్రయాస నేనెప్పుడో మర్చిపోయాను. ఇక హాస్పిటల్ అంతా మళ్లీ కళకళలాడుతుంది. ఇప్పుడే ఐదు నిమిషాలలో నిత్య కృత్యాలు తీర్చుకొని వస్తాను' వెళ్ళిపోయింది రాధ. రాధ నిత్యకృత్యాలు తీర్చుకొని వచ్చింది. నాతొ ముఖం కడిగించి పొగలు గ్రక్కుతున్న కాఫీని కప్పు లో పోసి నాకు అందించింది. కాఫీ త్రాగాను. కొద్దిగా వోపిక వచ్చింది. బెడ్ పై ఏటవాలుగా అని రాధ అమర్చిన దిండ్ల పై పడుకున్నాను. పెదబాబు గారు సుమారు పది గంటలకు ఆస్పత్రి కి వచ్చారు. వచ్చీ రాగానే నా గది లోపలికి వచ్చారు. నేను స్పృహ కలిగి ఉండడం వారికి సంతోషాన్ని కలిగించింది.
    'బాబూ ప్రసాద్! నీకు స్పృహ ఎప్పుడు వచ్చింది...?'
    'రాత్రి సుమారు పదకొండు గంటలకు.'
    'అలాగా....! మరి...రాధ నాకు ఫోను చెయలేదెం....? నీకు తెలివి రాగానే ఫోను చేయవలసిందిగా చెప్పి వెళ్ళాను....ఏమమ్మా రాధా....ఎందుకు పోను చెయ్యలేదు?'
    'వద్దన్నారండీ...' కాఫీ కప్పులు సర్దుతూ అంది రాధ
    'అదేమిటి బాబూ....ఎందుకు వద్దన్నావ్? ఒకసారి వచ్చి చూసి వెళ్ళేవాడిని కద...!"
    'అప్పుడే వెళ్ళారని తెలిసి, విశ్రాంతి లేని మీకు శ్రమ కలిగించడం ఎందుకని వద్దన్నాను, అయినా నాకు కేవలం నీరసం తప్ప వేరే ఏ యిబ్బందులు లేవు.'
    'శ్రమేముంది బాబూ! నీవు చేసిన మేలులో యిది ఎన్నో వంతు? నా బిడ్డను రక్షించి , ఈ వయసులో నాకు శోకం తప్పించావు. అన్ని విషయాలూ నెమ్మదిగా మాట్లాడుకుందాం. నీవు మాత్రం ఎవరి తోనూ ఎక్కువగా మాట్లాడకు. రాధా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు చాలా బలహీనంగా ఉంటుంది. వారం రోజులు ఎంతో శ్రద్దగా చూడాలి. ఆ తర్వాత ఫర్వాలేదు. ప్రసాద్! నీకే అవసరమున్నా రాధతో చెప్పు. రాధను పూర్తిగా నీ పరిచర్యల నిమిత్తం కేటాయించాను.'


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS