Previous Page Next Page 
గూడు చేరిన పక్షులు పేజి 8


                                       4
    ప్రసాదు:
    ఓ యుద్ధం భయంకరంగా సాగుతూ ఉంది- న్యాయా న్యాయాల మధ్య పోరాటం ...ఎంత కాలం సాగినా.... ఎంత భయంకర రణంగా పరిణమించినా గెలుపు న్యాయానిదే!
    అది లాహోర్ రంగం --
    అటు పాక్ సైనికులూ, ఇటు భారతీయ సైనికులు పట్టుదలతో పోరాడుతున్నారు. ప్రాణాలకు తృణప్రాయంగా ఎంచారు.
    హు ...ఫలితం ? కొందరు మరణించడం ...మరి కొందరు అవయవాల లోపాలతో అలమటించడం.....
    అయినప్పటికీ పోరు హోరాహోరి....
    గాయపడిన సైనికులు అవిరామంగా కొనిరాబడుతున్నారు--
    మా శాయశక్తులా వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాం --
    భారతమాత ముద్దు బిడ్డలు -- దేశ భక్తులు --
    వారిని తలుచుకున్నప్పుడు ..గర్వమూ... విచారమూ....
    ప్రాణాలను సైతం లెక్క చెయ్యకుండా పోరాడు తున్నందుకు గర్వం ....!
    జీవితాంతం అవయవాల లోపాలతో జీవించాలని తలచినప్పుడు -- విచారం.
    ఏ సైనికుని కైనా అవయవ లోపం లేకుండా చికిత్స జరిపినపుడు నాకు ఎంతో ఆనందం కలిగేది.
    ఆంగ్లేయులు మనను పాలించారు.... బానిసలుగా చూశారు...స్వాతంత్రయోధుల ధాటికి తట్టుకోలేక తుదకు మనకు స్వతంత్రులను చేశారు.
    అది వారి మంచితనమే నెమో....?    
    చిన్న సమస్యను సృష్టించారు----
    హిందువులు ------మహమ్మదీయులు -------
    దృష్టి లో ఉంచుకున్నారు--------
    అంతే........! రెండుగా చీల్చారు ------
    ఎప్పటికైనా రెండు మతాల మధ్య ద్వేషం కలగవచ్చని భావమా.......?    రెండు మతాలకు, దేశాలకు మధ్య?'
    'కాశ్మీరు.'
    అది ఒక చిక్కు సమస్యగా తయారైంది --
    మాదంటే మాదని కీచులాట..........
    ఆనాడు భారతదేశం లోని కొన్ని భూభాగాలు మావంటూ సలిపారు దాడి; ఆ చైనీయులు.
    ఈనాడు అందాలు చిందించే కాశ్మీరు మాదంటూ కయ్యానికి కాలు దువ్వుతున్నారు పాకిస్తానీయులు. పర్యవసానం .... అమాయక ప్రాణుల బలి....చిత్రహింస.
    భారతవీర సైనికులు ...మాతృదేశ హద్దుల రక్షణ కై కృషి.
    అబ్బ....! తలచుకుంటే నాకూ యుద్ద రంగానికి వెళ్లాలని పిస్తూ ఉంది.
    ఉహు....వెళ్ళడానికి వీలులేదు.... నేనొక డాక్టరు గా నా విధి నిర్వర్తించాలి ...... అంతే తప్పదు....
    ఆస్పత్రికి వెడతాను....డ్యూటీ సమయం సమీపిస్తూ ఉంది.
    ఇంతమంది గాయపడిన సైనికులలో రఘు తో పరిచయం ఎక్కువైంది నాకు -- కారణం? ఇరువురం ఒకే గడ్డన జన్మించడం ! రఘు.... ధైర్యంగా నిల్చి పోరాడాడు. ఫలితంగా అతని కుడి చేతిని మణికట్టు వరకు తీసివేయవలసి వచ్చింది---ఏ మాత్రం బాధపడడం లేదు అతను -- అవును -- ఆంధ్ర మాత వీరపుత్రుడు.
    ఈ పరిస్థితిలో అతను చేయగలిగే దేమిటి....?
    యుద్ధం చేయగలడా....? లేడు....మరి?
    దేశ రక్షణ కృషి లో యుద్ద మొకటే ప్రాధాన్యం కాదేమో? రచయితగా పరిచయంలో తెలుపు కున్నాడు. కొన్ని గేయాలు వినిపించాడు. సమయాను కూలంగా సమయోచితంగా ఉన్నాయవి--
    అతని రచనల ప్రభావం యువకుల నుత్తేజపరుస్తుంది -- మత్తు నొదిలిస్తుంది -- దేశ రాక్షనోన్ముఖులనుగా చేస్తుంది -- ఇంకేం కావాలి...?
    అతను నా వైపే చూస్తున్నాడు --
    'రఘూ...! ఏమిటా దీర్ఘాలోచన?'
    'ఏముంది? ఈ విపత్కర సమయంలో యింత త్వరగా నిస్సహాయుడ నౌతాననుకోలేదు. ఇప్పుడిక నా కర్తవ్యం....? మీతో వ్రాయించాను కదూ....ఆ ఉత్తరాలకు సమాధానాలివి. ఇంటి నుండి వచ్చాయి.  ఆత్మీయులకు దూరమైనా వారి నుండి వచ్చిన ఈ సానుభూతి నా మనసుకు ఎంతో శాంతిని, హాయిని కలిగిస్తూ ఉంది డాక్టర్! చదవండి....'
    'మీ ఆత్మీయులు వ్రాసిన ఉత్తరాలివి.... నన్ను.. చదవమంటున్నారా?'
    'ఫరవాలేదు ...చదవండి . మీరు కూడా నా ఆత్మీయులే! సంకోచపడకండి -- ఊ... అలా చూస్తున్నారేం? కానివ్వండి.'
    రెండు ఉత్తరాలూ చదివాను. మొదటి ఉత్తరం రఘుకు నిర్ణయించబడిన వధువు సరోజ వ్రాసినది.
    ప్రియమైన రఘూ...!
    మన పరిచయం విద్యార్ధి దశలో చిగిర్చింది....
    ఆ దశ పూర్త్తయే సరికి పుష్పించి, ఫలించింది,--
    పెద్దల ఆశీర్వాదం కూడా లభించింది -- ఎంతో అదృష్ట వంతురాలననుకున్నాను.
    కాని అనుకోని విధంగా విధి విధించింది వియోగం--
    ఐనా నిన్ను తలచని క్షణం లేదు నాకు --
    వియోగంతో అలమటిస్తున్న నా మది చల్లని కబురు తెలియడంతో పొంగిపోయింది సంతోషంతో --
    'కుడి చేతిని మణికట్టు వరకు తీసివేశారని, నన్ను మరిచిపోయి వేరేవారి నెవరి నైనా వివాహమాడవలసినదని ' కదూ వ్రాయించావు.
    ఆ విధంగా ఎలా వ్రాయించగలిగావు?
    నీ త్యాగం -- నీ ధైర్యం -- నీపై మునుపటి కన్న ప్రేమను యినుమదింపజేస్తున్నాయి-- నీకు కలిగిన అంగవైక్యానికి నా హృదయపూర్వక సానుభూతి ఎప్పుడూ వుంటుంది --
    ఎటువంటి సంకోచాలూ నా మనసులో లేవు.
    అనుమానించకు -- చిరునవ్వు తో వచ్చేయ్!

            


    ప్రత్యేక్షంగా ఈ విపత్కర పరిస్థితి నేడుర్కోలేకపోతున్నానని బాధపడుతున్నావు కదూ....? విచారించకు ...పరోక్షంగా తోచిన సాయం చేద్దువు గాని. నీవు కవివి....వ్రాయలేని పరిస్థితి కి చింతించకు. నేను వ్రాయగలను. ఎంతైనా చేయగలను. శలవ్....!
                                                                                                 ఉంటాను .
                                                                                                   ...........
                                                                                                  నీ సరోజ.
    రెండవ ఉత్తరం రఘు తండ్రి వ్రాశాడు.
    ఆప్యాయత సానుభూతి ఆ ఉత్తరం లో నిండి ఉన్నాయి.
    నా కన్న ఈ రఘు ఎంతో అదృష్ట వంతుడు... అవును....సందేహం లేదు.
    రఘుకు కన్న తల్లిదండ్రులు , అప్ప చెల్లెండ్రు , ప్రియురాలు అందరూ ఉన్నారు -- బాధలో ఉన్నప్పటికీ వారి సాంత్వన వచనాలతో నిండిన సానుభూతి లభిస్తు ఉంది- అంతకన్న అదృష్ట మింకేం కావాలి? మరి నాకు....? కన్న తల్లి అతి పిన్న వయసులో నన్నొదిలి వెళ్ళింది. తండ్రి ప్రపంచ జ్ఞానం తెలుస్తున్న రోజులలో నన్ను దూరం చేసుకున్నాడు. అందుకు ఎవరినీ నిందించలేను. అది నా దురదృష్టం కాదు. ఒక విధంగా అదృష్టమే. కాదనలేను.... కారణం....తల్లిదండ్రులను పోగొట్టుకున్న నేను డా. విశ్వం గారి చెంత చేరాను. రేఖాదేవి విశ్వం గారి ఏకైక పుత్రిక.... వారే నామర్గ దర్శకులు.... జీవిత సర్వస్వం .. వారి ఆదరణ, ఆప్యాయత, సహాయ సానుభూతులే నా ఈ ప్రస్తుత పరిస్థితికి నిదర్శనాలు....
    'డాక్టర్! ఏమాలోచిస్తున్నారు ?'
    'నీ అదృష్టాన్ని మనసులో అభినందిస్తున్నాను-- తల్లి, తండ్రి, అప్ప చెల్లెళ్ళు, ప్రేయసి , యిందరున్నారు నీకు. నీ ఆరోగ్యం కోసం-- క్షేమం కోసం -- అహర్నిశలూ అలమటిస్తూ ఉంటారు -- ఒక వ్యక్తికీ అంతకన్న వేరే భాగ్యమే ముంటుంది రఘూ?'
    'అదేమిటి డాక్టర్! మీకు ఎవ్వరూ లేరా?'
    'లేరు -- ఉన్నారు. తల్లి, తండ్రి తమ్ముడు అంతా ఉన్నారు నాకు. కాని వారికీ నేను లేను -- బాల్యం లో దూరమయ్యారు -- నాకు ఏమీ కాని డా. విశ్వం గారు వారి కుమార్తె శశిరేఖా దేవి ; వారే ఆ ఆత్మీయులు-- నాకు వారు -- వారికి నేను ఉన్నాము, నా సర్వస్వం వారే! తల్లి, తండ్రి ఆత్మబంధువులు.
    పై మాటలని, డ్యూటీ సమయం దాటుతూ ఉండడం వల్ల కలత పడిన మనసుతో క్వార్టర్స్ వైపు నడిచాను.

                            *    *    *    *
    విశ్రాంతి గా నా బెడ్ పై నడుము వాల్చాను. ఏవేవో ఆలోచనలు నా మనసును చిందర వందర చెయడ మారంభించాయి. రేఖాదేవి.... ఆ తలంపే నా జీవన జ్యోతి. ఎంత అందం? ఎంత ఆకర్షణ ? అంతటి ధనికులు...గర్వం ...ఆడంబరం మచ్చుకు కూడా కనుపించదు. ఈ దీనుని పై వారి కెంత ఆప్యాయత? ఆమెకు నేనంటే అమితమైన ప్రేమ, ఆదరణ . బహుశా యిది ఈ జన్మకు సంబంధించిన బంధం లా కనుపించడం లేదు. ఎన్ని జన్మల బంధమో? మళ్ళీ ఈ జన్మ లో కూడా మమ్ములనిద్దరినీ బంధించింది. ఆమెను చూడందే ఉండలేని స్థితికి వచ్చానంటే....? మానసికంగా నేనెంత దుర్బలుణయ్యానో? అది నా దోషమా ? కాదు ...రేఖాదేవి ఆకర్షణ ....! ఆ చిలిపితనం ...హుషారు...! డాక్టరు బాబు గారు ఆమెను పువ్వులలో పెట్టి పెంచుతున్నారు. కాలు క్రింద పెట్టనివ్వరు.... కదిలితే కంది పోతుందన్నట్లుగా పెంచారు. ఇప్పటికీ అలాగే చూస్తున్నారు.
    మొదట్లో శశిరేఖా దేవికి ఎంతో దూరంగా ఉండాలని ప్రయత్నించాను. అందుకు కారణాలు ఎన్నో...? అయినా నా ప్రయత్నాలు ఫలించలేదు. డాక్టరు బాబుగారి అభిప్రాయం తెలిసేంత వరకు ఆమెతో మాట్లాడుతున్నప్పుడల్లా గుండె దడపుడుతూ ఉండేది. కాని ఆమె మాత్రం జంకు గొంకు లేకుండా యిష్టం వచ్చినంత సేపు మాట్లాడుతూ ఉండేది. ఆరోజు గండి పేట వద్ద నా మనసులో ఉన్న సంకోచాన్ని వెల్లడి చేసినప్పుడు ఎంతగా అభినందించింది? ఆమెతో ఆ విషయాలు మాట్లాడిన తర్వాత బాబుగారి ఉద్దేశ్యం తెలుసుకునే అవకాశం ఎప్పుడు లభిస్తుందా అని నేను వేయి కనులతో ఎదురు చూశాను. వారు ఒక రోజు రేఖా దేవి వివాహవిషయాలను నాతోనే చర్చించడ మారంభించారు. నర్శింగ్ హోం నుండి తిరిగి వచ్చి నా గదిలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో సీతమ్మ వచ్చి 'చినబాబూ! అయ్యగారు పిలుస్తున్నారు. పైన తమ గదిలో ఉన్నారు.' అని చెప్పి వెళ్ళిపోయింది.
    ఆ వేళప్పుడు నన్నెందుకు పిలుస్తున్నారో నా కర్ధం కాలేదు. ఎప్పుడూ మధ్యాహ్న సమయంలో వారు నన్ను మాట్లాడించి ఎరుగరు. ఏమి మాట్లాడుతారో..? ఏ మడుగుతారో....? గుండెలు పీచుపీచు మననారంభించాయి. డాక్టరు బాబుగారితో నేనెప్పుడూ ఎక్కువగా మాట్లాడను. ఏ అవసర మొచ్చినా రేఖాదేవి ద్వారా తీర్చుకొనే వాడిని. ఒక్కసారి మాత్రం వారితో మాట్లాడి నా భవిష్యత్తును నిర్ణయించుకున్నాను. ఎమ్మెస్ లో క్లాసు వచ్చిన విషయం వారికి చెప్పి వారి పాదాలకు నమస్కరించబోయాను. నన్ను వారించి లేవదీసి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చోవలసిందిగా ఆదేశించారు.
    'బాబూ ప్రసాద్! అదృష్ట వంతుడిని... పట్టుదలతో చక్కని భవిష్యత్తును సాధించగలిగావ్? హృదయ పూర్వకంగా నిన్నభినంసిస్తున్నాను . మరి! ముందు సంగతేమాలోచించావ్?' నా వైపు ప్రేమతో చూస్తూ ప్రశ్నించారు.
    'మీ ఆదరాభిమానాలు లేనివాడు నా పట్టుదల ఎందుకు పనికి వచ్చేదంటారు? నా జీవితంలో మీరు తటస్థపడి బరువు బాధ్యతలు స్వీకరించక పొతే నా పరిస్థితి ఏమయ్యేదో? మీ రుణాన్ని ఎలా తీర్చుకోగలను? ఇక ముందు సంగతంటారా? మీరెలా చెబితే అలా ....! మీ కెదురు చెప్పను.'
    'ఇందులో నాదేముందయ్యా! నేనేం చేశానని? కష్టపడ్డావు . పై కొచ్చావు. నాకు వయసు పైన బడుతూ వుంది. నర్శింగ్ హోం పనిని నేను ఒంటరిగా చూసుకోలేను. నాకు అసిస్టెంటు గా పని చేస్తావా? జీతమెంత యివ్వ మంటావ్?'
    'బాబుగారూ! నాకు జీతమిచ్చి మీ నుండి వేరుచేస్తారా? అదెప్పటికీ సాధ్యపడదు. ఇలాగే మీ దగ్గర నా జీవితాంతం గడుపుతాను. దయచేసి యిక ముందెప్పుడూ యిటువంటి మాటలనకండి.'
    నా కళ్ళు చెమర్చాయి -- మాట పొరబోయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS