Previous Page Next Page 
అరుణోదయం పేజి 9


    "దాని వలన లాభం?"    
    "నా తృప్తి!"
    "అసంతృప్తితో గడచిన రోజుల్లో వీడి పోయిన సంఘటనలను మననం చేసుకొని క్షమాపణ లను కోరుకోవటంలో తృప్తే గనుక మీరు పొందగలిగితే- మీరు కోరిన ప్రశ్నకు సమాధానం ఆలోచిస్తాను-, ఐతే నాకు కొద్ది టైం కావాల్సి వస్తుంది."
    "నా ప్రవర్తన క్షమార్హం కాదంటావా?" తెలియని ఆదుర్దాతో ముందుకు వంగి అడిగాడు. కంఠం బొంగురు పోయింది. ఆమె మాటలు అతడిని దెబ్బ తీసినయ్.
    అరుణ కళ్ళల్లో నీళ్ళు చిమ్మినయ్.
    అలా ప్రవర్తించే సమయంలో ఈ అవసరం వస్తుందనే అనుకున్నారా?" వోర చూపుతో రాజశేఖరాన్ని చూచింది. మసగ మసగ్గా కనబడ్డాడు.
    ఆమె ప్రశ్నలు అతడి శరీరాన్ని తూట్లు పొడుస్తున్నాయి.
    తడబడ్డాడు, "లేదు..లేదు!"
    మరి?"
    రాజశేఖరం మాట్లాడలేకపోయాడు.
    అరుణ తిరిగి అన్నది అసలు నామీద మీ రెందు కింత ద్వేషం?... మిమ్మల్ని హృదయంలో పెట్టుకు పూజిస్తున్న నన్ను ఎందుకు కాలితో తన్ని-అప్పుడప్పుడూ మొఖాన నీళ్ళు చల్లుతున్నారు? మీ ప్రవర్తన నా కవగతమే కావటంలేదు. నాకిది పరీక్షా?"
    "........................."    
    "ఉహూ.. ఈనాడు మిమ్మల్ని వదలదలుచుకోలేదు.. అంతేగాదు.. నాకు జీవితంలో శాంతి కావాలనుకుంటే నాలోని కొన్ని అనుమానాలను నివృత్తి చేసుకోక తప్పదు! ఆమె మాట చాలా స్వచ్చంగా వున్నది.
    అతడు బాధతోనూ, భయంతూనూ ఆమె ముఖంలోకి చూచాడు.
    "చెప్పండి!.. నేనంటే మీ కెందుకింత ద్వేషం.. ఉహూ.. కప్పదాట్లు వేయవద్దు.. నిజం చెప్పండి!" తల వూగిస్తూ అన్నది.
    ఆమె వెనక్కుపడి వున్న జడను ముందుకు లాక్కొని చివరలను వేలితో అటూ యిటూ కదిలించసాగింది.
    "నీ వంటే ద్వేషమని ఎవరన్నారు?" తలెత్తకుండానే అడిగాడు.
    "ఎవరైనా అన్నారా?.. మీ ప్రవర్తనే చెబుతోంది!"
    "లేదు అరుణా! లేదు.... నీ వంటే నాకు ద్వేషం లేదు... నిన్ను ద్వేషించవలసిన కారణం నాకులేదు! అన్నాడు త్వరత్వరగా రాజశేఖరం అబద్ధాల భవంతులను పేరుస్తూ!
    "మరి?"
    తటాకంలో అతి ప్రశాంతత ఏర్పడింది. గాలి వీయటం లేదు. అల కదలటం లేదు. పక్షులేమైనయ్యో తెలియటమే లేదు.. ఆ మధ్యాహ్నపు ఎండ- భయంకరమైన ఎండ - ఎక్కడా ఏ ప్రాణినీ కదలాడ నీయటం లేదు!
    "...నేనే ఉద్దేశ్యంతో ఇక్కడకు వచ్చానో, ఇలా ఎందుకు సంభవించిందో నాకు అర్ధమే కావటం లేదు... అరుంధతి పేపర్లో ప్రచురించిన ప్రకటన నా జీవన రథానికి అడ్డుపడింది.. నా తెలియని ఆలోచనల నడుమ భయపడుతూ, భయపడుతూ ఈ గృహంలో కాలుపెట్టాను.." ఏదో అతీతమైన శక్తి అతడిని ఆవహించింది. అతడిని ఏదో మత్తులాంటి తెర చుట్టి వేయగా అతడి నోటి నుండి మాటలు వెలువడసాగినాయి. జరిగిన సంగతి విని ఆచేతనుడయ్యాను. అందమైన అరుంధతి మొఖాన కుంకుమ లేకపోవటం సహించలేకపోయాను. ఆ స్థితిలోనే ఒకనాడు ఆమె నామీద కురిపించిన ద్వేషాన్ని మర్చిపోయాను... తిరిగి ఆమెను ప్రేమించ సాగాను. ఆమెను నా గుండెల్లో, నా హృదయంలో పొదివి పెట్టుకున్నాను. పూజించాను... కాని, ఈ పూజకు ఈ బాంధవ్యానికి నీవు అడ్డు నిలబడ్డట్లు వినిపించింది. పరిస్థితులు ఋజువు పరచసాగినయ్. నీ వంటే భయం కలిగింది. నీ మీద కోపం రగిలింది నీ మీద ద్వేషం నన్ను, నా నరనరాన్ని పట్టుకు పీడించసాగింది.. ఏం చేయాలి? నేనుగాదు అరుణా!.. నా పరిస్థితులలో? ఎవరున్నా ఇలాగే ప్రవర్తిస్తారు.. నిజం అరుణా నిజం.. నాలోనూ మానవత్వ మున్నది- నీ వంటే జాలి వున్నది-కాని, ఆ పరిస్థితుల నడుమ నిన్ను ఇరికించి వూహించుకున్నప్పుడు మాత్రం.." అతడు ఆవేశంలో వూగిపోతున్నాడు.
    అరుణ అతడి ఆవేశానికి కలవరపడ్డది.
    "మీరు పడుకోండి..!" అన్నది. లేచి నిలబడి మొఖం పక్కకు తిప్పుకొని కన్నీళ్లు తుడుచుకున్నది.
    పక్కగదిలోకి త్వరత్వరగా వెళ్ళబోతూ "పోనీ... నన్ను మీ నడుమ నుండి వెళ్ళిపొమ్మంటారా" అడిగింది.
    తూలి పడబోయింది.
    "నీ యిష్టం!"

                                    *    *    *

    "అరుణా!"
    సమాధానం రాలేదు.
    "అరుణా!"
    ఆ గృహంలో ఉదయాన ఎనిమిది గంటల సమయంలో- సూర్యుడు అప్పటికే తన తీవ్రతలో పరిసరాలను ముడుచుకున్నప్పుడు- రాజశేఖరం నిద్ర లేచిన తరువాత-మొట్టమొదటిసారిగా అతడి, కంఠం నుండి వెలువడిన మాటలు అవి!
    "అరుణా!"
    అరుణ పలకలేదు.
    గోపన్న వచ్చాడు.
    "అరుణ లేదా?.."
    రాత్రి అరుణ మాటలతో వెలిగించిన అనుమానం కళ్ళముందు నిజమయ్యేలా కనిపిస్తోంది!
    ఆతృతగా- తెలియని భయంతో గోపన్న మొఖంలోకి చూచాడు.
    "అరుణ లేదా?.. ఎక్కడకు వెళ్ళింది?"
    "వస్తున్నారు బాబు.. కాఫీ పెడుతున్నారు!"
    అతడికి తెలియకుండానే అతడు తేలిగ్గా శ్వాస పీల్చుకున్నాడు. తరువాత పది నిముషాలకు అరుణ బయటకు వచ్చింది. ఆమెను చూస్తూనే ఆశ్చర్యపోయాడు.
    తలారా స్నానం చేసి, జుట్టును వదులుగా జారవిడిచి చివర ముడి వేసుకున్నది.. పెట్టెలో నుండి తీసి కట్టుకున్న ఇస్త్రీ పట్టుచీరె ఆమె మొఖంలో తెలియని హుందాతనాన్ని పెంపొందించింది. నుదుట పెట్టుకున్న కుంకుమ విశాలమైన మొఖంలో వింత కాంతులను వెదజల్లు తోంది.
    ఆమె కళ్ళల్లోని కాంతి, పెదాల మీద చిరునవ్వు ఆ పరిసరాలలో చల్లని, తెల్లని వెన్నెలను కురిపిస్తోంది.    
    "నేను నిర్ణయానికి వచ్చేశాను!" అన్నది అరుణ.
    అతడు మొఖం కడుక్కొని, మొఖాన్ని తుడుచుకుంటున్న వాడల్లా, చేతిలోని తువ్వాలును అలాగే పట్టుకొని, "ఏమని?" ఆశ్చర్యంగా అడిగాడు.
    "నేను ఇక్కడి నుండి వెళ్ళిపోదామనుకుంటున్నాను!"
    అతడికి ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడారొ అర్ధం కాలేదు- మౌనాన్ని నెత్తిన రుద్దుకొని గుడ్లప్పగించి చూడసాగాడు.
    పక్కనేదో నీడ కదిలి క్షణంలో మాయ మయింది. ఇద్దరి గుండెల్లోనూ భయం గూడుకట్టుకుంటోంది. దీనికి పర్యవసానం ఏవిటి-
    అరుణకూ-    
    ఏవి చేయాలో పాలుపోక పోయినప్పటికి ఆ గృహంలో ఇక తను ఉండటం - అందునా రాజశేఖరం అంత స్పష్టంగా చెప్పిన తరువాత-ఎవరికీ శ్రేయస్కరం కాదు అనిపించింది.    
    మరి అక్కయ్య ఎందుకని ఇంకా అలాంటివూహల్లో వున్నది.
    అతడి ప్రవర్తన ఆమెకు అవగతం కాలేదా?
    లేక-?
    తెలిసీ-ఆమె అంగీకరించ లేకపోతోందా?
    ఆమె అంగీకరించని పక్షంలో-అతడు ఇంకా అలాంటి కోరికల కలల్లో ఎందుకుంటాడు?
    ఏఁవో?.. ఏమో?
    ..అదంతా తనకు తెలియని వల..అర్ధం గాని చిక్కు ప్రశ్న...
    ఈ భారతదేశంలో నాకు వుండటానికి కావాల్సిన జానెడు చోటు ఎక్కడా దొరకదంటారా"  తిరిగి వాళ్ళ నడుమ గంభీరత అల్లుకుంటున్నది.
    "అలా దొరకని పక్షంలో నేను జీవించి మాత్రం లాభమేం వున్నది"    
    "అరుణా!" అతడు ఆవేశపడ్డాడు. "నన్ను అర్ధం చేసుకోలేవా...నన్ను, నామాట లను అర్ధం చేసుకో అరుణా!...నా ప్రవర్తన అసహ్యంగా వున్నదా?.. ఆలోచించు అరుణా! జాలిగా ఆమె మొఖంలోకి చూచాడు.
    "నాకు అర్ధం గాకపోవట మేమిటి?" గంభీరంగా అన్నది. "మిమ్మల్ని పూర్తిగా అర్ధం చేసుకోగలిగాను.. చేసుకున్నాను గూడా.. ఇది నేను హృదయపూర్వకంగా చెబుతున్న మాటలు!" ఆమె వక్షం ఉవ్వెత్తున లేచింది.
    ఆమె కనురెప్పల చివర్లకు నీరు పొర్లింది.
    ఆమె ఏదో చెప్పబోయింది.
    అతడు అడ్డుపడదలుచుకోలేదు.
    "చెప్పు!" కాస్త వంగి అన్నాడు.
    "చివరిసారిగా.. ఉహూ.. మొట్టమొదటి సారిగా మీ వద్ద చనువు తీసుకొని నాలోని భావాల్ని, నా ఉద్దేశ్యాలని- మరొకరి, ముందుంచలేనివి- మీ ముందుంచుతున్నాను. నన్ను మీరు హృదయ పూర్వకంగా అర్ధం చేసుకుంటారనే ఆశిస్తాను!"    
    ఆమె ఒక్కక్షణం ఆగింది.
    అతడి ఆతృతతో గూడిన చూపులు ఆమె చెప్పబోతున్న మాటలకు ఒత్తాసు పలికినయ్.
    ఆమె తిరిగి గొంతు విప్పింది.
    "చాలా ఇరుకయిన పరిధి గీసుకొని ఆశలను కోరిక అను గగన కుసుమాలుగా భావించుకుంటూ జీవితాన్ని మా తల్లిదండ్రుల వద్ద గడిపాను. కాని, నన్ను ధనరూపేణానే గాకుండా, ఆత్మీయతలో గూడా బీదదాన్ని చేస్తూ భగవంతుడు నా తల్లి దండ్రులను నాకు దూరం చేశాడు.. నా జీవితం చీకటిలోను, భయం లోనూ చుట్టుకు పోయి వున్న క్షణాలలో- నాకు ఏం చేయాలో తెలియని పరిస్థితులలో-ఎలా జీవించాలో గూడా తెలియని పరిస్థితులలో-నెత్తిన ఎవరయితే ఈ కష్టాలను రుద్ధారో-వారే అక్కయ్య రూపంలో నా ఎదుట నిలబడి- తిరిగి నాకు మంచి జీవితాన్ని ప్రసాదించారు.
    దాన్తో నేను గడిచిన జీవితాన్ని, జీవితంలో చీకటిని మరిచిపోయి పెదాలకు నవ్వును రుద్దుకో ప్రయత్నించాను. కళ్ళకు వెలుగు పులుముకున్నాను. మొఖంలో ఆనందాన్ని చిందించుకున్నాను. నేను మరో ప్రపంచంలో కాలు పెట్టాను!
    అటువంటి నాకు-నా కళ్ళముందు ఓ వ్యక్తి నుంచి-'ఈయనే నీ భగవంతుడు!' అని అక్కయ్య ఓ శుభదినాన చెప్పింది.
    ఆనాడే ఆయన పాదాల వద్ద మోకరిల్లాను. ఆయనకు నా హృదయాన్ని అర్పించాను-కాదు, కాదు-నా సర్వస్వాన్ని అర్పించాను- ప్రతి క్షణం ఆయన రూపాన్ని కళ్ళ ముందుంచుకొని, ఆయనలో నా భావి జీవితపు వెలుగును, ఆనందాన్ని చూచుకుంటూ గడిపాను. ఆయనే నా జీవితం అనుకున్నాను-"
    ఆమె ఆవేశంలో ఒక్కక్షణమాగింది.
    రాజశేఖరము ఆవేశంతో ఊగిపోసాగాడు.
    "ఎవరా వ్యక్తి"
    అరుణ అరక్షణం గూడా వ్యర్ధం చేయకుండానే, "మీ కెందుకొచ్చిందా అనుమానం... ఆయన మీరే!" అన్నది.
    "అరుణా!"
    "అవును..మీరే!.. అక్కయ్య నా హృదయంలో వెలిగించిన దేవుడు మీరే! నా హృదయాన్ని, నన్ను ఆవరించి-నా సర్వస్వం అయినది మీరే... ఇక మరెవ్వరూ కాలేరు గూడా!"
    "అరుణా!"
    "మీరు ఆవేశపడవద్దు... వద్దు!"
    ఆమె తల విదిలించింది. "మీకు ఆవేశం కలిగించాలనేది నా ఉద్దేశ్యమే కాదు......తల అటూ యిటూ వూపింది. ఆమె కళ్ళు రెండూ కన్నీటి కుండలయినాయి.
    "..భగవంతుడు తిరిగి చిన్నచూపు చూచాడు. పరిస్థితులు చాచి మొఖాన కొట్టినయ్. నన్ను, నా మనస్సుని, నా హృదయాన్ని నా సర్వస్వాన్ని నలిపివేసినయ్. నన్ను పిప్పి పిప్పి చేసినయ్.. ఉహూ!. అవన్నీ ఎందుకు ఇప్పుడు!" ఆమె ఏడుపు ఆపుకోలేకపోయింది ఎక్కువచ్చింది. "నా కలలు కరిగిపోయినయి. నా మీద దురదృష్ట దేవత వల విసిరి బిగించి వేసింది....నేనేం చేయను?.. నేనేం చేయగలను?.."
    ఆమె ఏడుపు ఆపుకోవటానికి ప్రయత్నించలేదు.
    చటుక్కున రాజశేఖరం పాదాల వద్ద కూర్చున్నది.
    ఆమె రెండు చేతులూ అతడి ఒక్కకాని మీద వుంచి, కంట్లోని నీటిని, కనురెప్పలు మూసి బయటకు చిమ్మి, "మీపాదాల దగ్గర చోటు యివ్వమని అడిగే శక్తి నాకులేదు... నన్ను జీవితాంతం మీ గుండెల్లో పొదిలి పెట్టుకోని ఉంచుకోమని అడిగే హక్కూ నాకు లేదు... కాని నాదొక్కటే కోరిక- నా చివరి కోరిక - నా హృదయ తహతహతో మీ ముందుంచుతున్న కోరిక- మీరు నన్ను కోపగించ వద్దు..... అపార్దం చేసుకోవద్దు! అంతే.. సర్వం మరిచిపోండి.... నేను చేసిన తప్పులన్నీ క్షమించండి... నన్ను ఈ భారతదేశంలోని ఒక అభాగ్య స్త్రీగా మాత్రం గుర్తుంచుకోండి.... అదే నాకు శాంతి. అదే నా జీవితాశ!..' అన్నది. తల ఒరిగిపోతుండగా, ఈరోజే వెళ్ళిపోతున్నాను. మరెన్నడూ మన జీవితంలో కనబడనంత దూరం వెళ్ళిపోతున్నాను.... కాని, ఎక్కడున్నా నా హృదయం మీ వద్దే వుంటుంది, జీవితాంతం, మొట్టమొదటి సారిగా. నా అంతట నేనుగా నన్ను అర్పణ చేసుకున్న మీ మీదే...నా.." ఆమె నోట మాట పెగల్లేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS