Previous Page
అరుణోదయం పేజి 10


    కళ్ళు తిరగసాగినయ్..
    రాజశేఖరమూ ఆవేశంతో ఆమె రెండు బుజాలు పట్టుకొని ఆమె మొఖం లోకిచూస్తూ ముందుకు వంగబోయాడు.
    ఎవరో నెట్టినట్లుగా తలుపు తెరుచుకున్నది.
    ఇద్దరూ ఉలిక్కిపడి తలెత్తి వాకిలి వైపుకు చూచారు.
    అరుంధతి!
    ఆమె వారిద్దరూ కూర్చొని వున్న దృశ్యం చూస్తూనే చటుక్కున మొఖం పక్కకు తిప్పుకున్నది-ఆమె కళ్ళు ఆనందంతో నవ్వినయ్!

                                  *    *    *

    "అయితే అరుంధతీ! నీ మనస్సు మార్చుకోలేవన్న మాట.. నా మాటకు విలువ యివ్వలేవన్న మాట.. ఇకసరే! నేనెందు కిక్కడ?.. నేను వెళ్ళిపోతాను!"
    "ఆవేశ పడబోకు బావా!.. ఆలోచించు...సావధానంగా ఆలోచించు.. మనస్ఫూర్తిగా ఆలోచించు బావా!" అరుంధతి అన్నది-తలెత్తకుండానే.
    ఆమె వూరినుండి- ఇక్కడ అర్ధంగాని పరిస్థితులను గోపన్న అర్ధహీనంగా వ్రాసి నప్పుడు- అనుకోకుండా ప్రయాణమయి వచ్చింది.
    ఆమె వచ్చినవాడు-రాత్రి భోజనాలయిన తరువాత అసలు విషయం అనుకున్నట్లుగానే ప్రసంగంలోకి వచ్చింది.
    రాజశేఖరం-ఆమె మనస్సు మార్చుకోకపోవటంతో- కోపంతో గయ్ న లేచాడు.
    అరుంధతి అనునయిస్తోంది.
    అరుణ ఏమి చేయటానికీ పాలుపోని పరిస్థితులలో గుండెను చిక్కపట్టుకొని భగవంతుని ప్రార్ధిస్తూ- వారిద్దరినడుమ ప్రేక్షకురాలిగా నిలబడిపోయింది.
    ఉండి ఉండి- రాజశేఖరం కోరచూపులు ఆమె మీద ప్రసరిస్తున్నాయి.
    "....ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయని నేను కలలో గూడా అనుకోలేదు. జరిగిందేదో జరిగిపోయింది.. ఇక నేను నిన్ను వివాహం చేసుకుంటాను అనేది కల్లోమాట.. అది ఎన్నడూ జరగని పని. దానిని గురించి నీవు ఏమాత్రమూ ఆలోచించాల్సిన అవసరం లేదు.."
    "అలాంటప్పుడు.. నా మాట వినలేని నీవు.. నీ మాట మాత్రం నేను వినాలని ఎలా అనుకుంటావ్?" ఆమె మాటను, మధ్యలోనే త్రుంచి వేస్తూ కోపంగా అన్నాడు. "నేను తెల్లవారుతూనే వెళ్ళిపోతున్నాను. ఇక ఒక్కక్షణం ఇక్కడ వుండలేను.. ఉండవల్సిన అవసరం లేదు!"
    "సరే నీ యిష్టం!" అరుంధతి విసురుగా లేచి నిలబడింది. "ఎవరు ఎవరికి చెప్ప గలరు?.. 'ఏది భావ్యమో, ఏది కాదో గూడా గ్రహించలేని స్థితిలో వున్నప్పుడు నేను తాపత్రయ పడీ ప్రయోజనమేవున్నది?" అంటూనే గిరుక్కున తిరిగి లోపలికి వెళ్ళబోయింది. "ఇంత వయస్సు వచ్చిన తరువాత-జ్ఞానహీనులవుతున్న వాళ్ళని ఒక్క ఆ పైన వున్న భగవంతుడే రక్షించ గలడు!"
    ఆమె అన్న చివరిమాటలు అని!
    రాజశేఖరం మాట్లాడలేదు.
    అరుణకు మాట పెగల్లేదు.
    
                                     *    *    *

    తెల్లవారింది.
    అప్పుడే జనం మేల్కొన్నా రన్నట్లుగా బిందెల చప్పుళ్ళు, పాలవాళ్ళ కేకలు వినబడుతున్నాయి.
    అరుణ లేచింది.                
    పక్క మంచం మీద అరుంధతి కనబడకపోవటంతో, తనకు ఆలస్యంగా మెళకువ వచ్చినందుకు పశ్చాత్తాప పడుతూ మంచం మీద నుండి లేచి ఇవతల గదిలోకి వచ్చింది.
    రాత్రి ఆమెకు నిద్రలేదు.. అరుంధతి అనుకోని రాక- ఆమెను మరింత అయోమయంలో పడవేసింది ఒకవిధంగా సంతోషించింది! ఏది ఏవైనా-రాత్రి ఆమెకు నిద్రలేదు!
    ఎక్కడా అరుంధతి అలికిడిలేదు.
    వంటయింటి వైపుకు వెళ్ళింది.
    ఆ తలుపు తెరవనయినా లేదు.
    రాజశేఖరం గదిలో వున్నదేమోనని అక్కడకు వచ్చింది.
    అక్కడా లేదు.
    అప్పటికే రాజశేఖరం ఏదో కాగితం చదువుతూ కూర్చొని వున్నాడు.
    అది అరుంధతి వ్రాసింది.
    అందులో ఇలా వున్నది.
    "బావా!
    కోరికలు గుర్రాలయితే మానవుడి చేతిలో కళ్ళాలు లేకపోవటం మహా విపత్తు సుమా! అందుకు నీవే నిదర్శనం.... ఒకనాటి నేను గూడా అనుకో!
    నిన్ను నేను నిందించటంలేదు బావా! నా ఖర్మకు విచారిస్తున్నాను. అరుణ దురదృష్టానికి జాలి చెందుతున్నాను...నీ మూర్కత్వానికి సిగ్గుపడుతున్నాను.
    ఏది ఏవైనాగాని- నా నిర్ణయం ఇదే- నేను ఈ రోజున మీ నుండి- ముఖ్యంగా నీ నుండి - ఏదో తెలియని ప్రదేశంలోకి వెళ్ళిపోతున్నాను.. బహుశ అది తిరిగిరాలేని ప్రదేశమేమో గూడా!
    అది నిజం! అరుణ నీది....దానిని కాదనగలశక్తి నీకేగాదు.. ఆ భగవంతుడికి గూడా లేదేమోనని పిస్తోంది నాకు!
    అంతేగాదు-నీవు ఈ విషయంలో పరాజితుడువవుతావనేది నిస్సందేహంగా - నా కోరిక గూడా!
    నేను తిరిగి ఈ గృహంలో కాలు పెట్టటమనేదే నీ కోరికయినట్లయితే-అది నీవు అరుణను వివాహం చేసుకున్న నాడే జరుగుతోంది! తప్పదు బావా.. తనని తానుగా అర్పించుకున్న స్త్రీకి అన్యాయం జరగటం మరొక స్త్రీ సహించలేదు. అరుణ-నీవు లేని అరుణ జీవించలేదనేది నేను తెలుసుకున్న నగ్నసత్యం- అది నీకు తెలిసి వుండవచ్చునుగాని నిన్ను విషపు పొరలు క్రమ్మివేసినయ్.
    సరే! ఇక - నే నెక్కడ వుండేది తెలుసు కోవట మంత కష్టం మరోటి నీకుండదు. నీవు అరుణను వివాహం చేసుకున్న మరుక్షణంలోనే ఆదుర్భేధ్యమైన రహస్యం పటాపంచలవుతుందనేది నిస్సందేహమే!
    అసలు- దీనికంతటికీ కారణం-నేను, -హృదయంలేని నేను-నీ జీవితం ఇలా అవ్వటానికి కారణం నేను- రాక్షసినైన నేను- ఈనాడు పాశ్చాత్తాపంతో కృంగి కృశించిపోతేనేం, నీ మీద జాలి కురిపిస్తే నేం ఆనాడు కావాలని నిన్ను దూరం చేసుకోవాలని-నిన్ను కుంటివాడిని చేసి (ఇప్పటి వరకు నీ కుంటికాలికి కారణం నేనని నీకు లీలగానైనా వూహ వచ్చి వుండకపొవచ్చు- నీ హృదయం నాకు తెలుసు బావా!) ఉహు..దేవుడు సరియైన శిక్షే నాకు విధించాడు బావా-దానిని ఎవరూ తప్పించలేరు..
    కాదనాకు బావా- నాయీ కోరికను కాలితో నలిపి వేయకు బావా - ఏమీ తెలియని అమాయిక అరుణను నీ మొండి పట్టుదలకు బలి యివ్వబోకు బావా -
    అలా అంటూ జరిగితే - నేను సహించ లేను, నేను భరించలేను, నేను జీవించలేను.
                -అరుంధతి."
    రాజశేఖరం చేతిలోని కాగితాన్ని పూర్తిగా చదివి అయోమయంగా తల ఎత్తటంతోనే అరుణ అడిగింది. "అక్కయ్య పొద్దున్నే ఎక్కడకు వెళ్ళింది"
    "వెళ్ళిపోయింది!"    
    "ఎక్కడికి"
    "ఏమో!"
    "అంటే-"
    ఏదో పగిలినట్లనిపించింది - కళ్ళ ముందు ఏదో భయం కరమైన వస్తువు పగిలి వెల్తురు విరజిమ్మినట్లని పించింది- ఆమెకు అర్ధమయింది!
    ప్రపంచమే గిర్రున తిరుగుతున్నట్లనిపించగా భయంతో, బాధతో బిగుసుకుపోయింది.
    వెలుగు కనుమరుగయింది. చీకటి నంత వ్యాప్తమయినట్లని పించింది. చిన్నగా ఒక్కొక్కటి గిర్రున తిరుగుతూ, నల్లబడిపోతూ, ఆకారాన్ని కోల్పోతూ - నల్లటి ముద్దలా మారిపోయింది.
    అరుణ కుప్పగా కూలిపోయింది.
    రాజశేఖరం సర్వం మరిచి దిక్కులు తోచక చూస్తున్న రాజశేఖరం - మ్రోతకు తల ఎత్తాడు.
    అరుణ-క్రిందపడి, గిలగిల లాడుతూ, వాళ్ళూ చేతులూ కొయ్యాలా బిగదీసుకుపోగా-విరుచుకుంటుంది.
    నోటిలో నుండి తెల్లని నురుగు, భయం కరంగా ఎదుటి మనిషిని నలిపివేస్తూ, కలిచివేస్తూ -స్మృతిహీన అయిన అరుణకు మరింత భయానక రూపాన్ని కలిగిస్తూ వెలువడుతుంది.
    రాజశేఖరానికి ఏం చేయాలో తోచలేదు. అయోమయమయింది.
    వణికిపోయాడు.
    అరుంధతి!    
    -ఆరు
    ఎవరు ... ఎవరు .. ఎవరు?
    ఉహూ....
    కొన్నిక్షణాలు కొన్ని యుగాలయినయి.
    లేచి నిలబడ్డాడు. శరీరమంతా చల్లబడుతోంది. కళ్ళ ముందు పరిచరాలు మసకమసకగా కనబడుతున్నాయి. భూమే గిరగిరా తిరుగుతున్న ట్లని పించింది.
    చేతిలోని కాగితాన్ని ఉండచుట్టి దూరంగా విసిరి వేశాడు.
    చేతిక్రిందకు కర్రను జేర్చుకొని వంట యింట్లోకి పరుగెత్తాడు.
    గ్లాసుతో నీళ్ళు తీసుకువచ్చాడు.
    అరుణ తల దగ్గరగా కూర్చున్నాడు.
    చిన్నగా మొఖాన నీళ్ళు చల్లసాగాడు.
    ఆమె రూపం-రేగిన జుట్టుతో, పాలిపోయిన చెక్కిళ్ళతో, విరిగిన పెదాలతో- జాలిగొలిపే ఆమె రూపాన్ని-మసకమసకగా కనబడుతున్న ఆమె మొఖాన్ని కన్నార్పకుండా చూస్తూ కూర్చుండిపోయాడు.
    అతడిలో ప్రళయం రేగింది. తుఫాను గాలులు ప్రారంభమయినయి- తిరిగి మరుక్షణంలోనే చప్పబడిపోయింది. నీరు కారిపోయాడు.
    ఏం చేయాలో తోచని పరిస్థితి!
    తరువాత కొన్నిక్షణాలకు- శూన్యంలోకి చూస్తూ కూర్చున్న అతడు కదిలాడు ఆమె తలను తన ఒళ్ళోకి జేర్చుకున్నాడు.
    వంగి ఆమె మొఖంలోకి చూస్తూ నీళ్ళు చల్లుతున్న అతడి మొఖంలో వింత మార్పు వచ్చింది. కళ్ళు కాంతితో వెలగసాగినయి. చేతులు దృఢంగా పని చేయసాగినయి. మనిషిని నీరసం వీడి పోయింది.
    ఇక ఈలాంటి పరిస్థితి నీ కెన్నడూ ఏర్పడదు అరుణా! అన్నంత బలంగా వున్నయి అతడి చేష్టలు.
    అతడికి అప్పుడే తెల్లవారినట్లనిపించింది!

 

                                            -:అయిపోయింది:-


 Previous Page

WRITERS
PUBLICATIONS