Previous Page Next Page 
అరుణోదయం పేజి 8


    "ఎందుకు లేనిపోనివి కల్పించుకొని, మీరు బాధపడి నన్ను బాధపెడతారు?" అన్నది తీక్షణంగా కంఠం హెచ్చించి "అరుణా"నేను బాధపడితే పడుతున్నానేమోగాని, నిన్ను మాత్రం బాధపెట్టటం లేదు!" అతడూ తీక్షణంగానే అన్నాడు.
    "చేసేవన్నీ చేస్తూ.... ఈ అనవసరపు మాటలు దేనికి?"
    "ఏం చేశాను?" లేవబోతున్నట్లుగా ముందుకు వంగి అన్నాడు.
    "ఏం చేశారు మీకు తెలుసు, నాకు తెలుసు.... ఎందుకు నన్నిలా బాధపెడతారు? నేను మీకేం అపకారం చేశాను?... నన్ను ఇంతగా హింసించటం వలన మీరు పొందే ఆనందమేమిటి?" ఉక్కిరి బిక్కిరి అయ్యేలా అడగదల్చుకున్నవన్నీ అడిగివేసింది.
    గిరుక్కున వెనక్కు తిరిగి, లోపలకు పోబోయింది.    
    "అరుణా! రాజశేఖరం కంఠం ఆమె కాళ్ళకు బంధాలు వేసింది." ఆగు అరుణా!    
    తీక్షణంగా చూడసాగింది రాజశేఖరం మొఖంలోకి.
    "ఏఁవన్నావ్.... మళ్ళీ అను..... నా మూల కంగా నీవు...    
    "అవును, ముమ్మాటికీ నిజం!...మీరు నన్నూ, నా హృదయాన్ని చిత్రహింస చేస్తున్నారు.. గుండెల్ని రంపంతో కోసి, నెత్తురు విరజిమ్ముతున్నారు... నరనరాల్ని పట్టుకు బయటకు లాగి మెలిపెడుతున్నారు. నన్ను ఒక మనిషిగాను, మానవత్వమున్న స్త్రీగానూ అసలు గుర్తించటమే లేదు..ఏదో ఆగర్భ శత్రువులా.." తరువాత ఆమెకు నోటి వెంట మాట పెగల్లేదు. తడబడింది. కోపంతో ఒణికిపోయింది. తల విసురుగా విదిలించి పక్కగదిలోకి మెరుపులా మాయమయింది.
    రాజశేఖరానికి మొఖాన చాచికొట్టినట్లని పించింది. మనిషి ఉక్కిరి బిక్కిరి అయ్యాడు.
    మరుక్షణంలోనే ఆమె చెమటలు పట్టిన మొఖం కళ్ళ ముందు కదలగా, లేచి వడివడిగా అవతల గదిలోకి వెళ్ళబోయాడు.
    కాని ఏదో తెర- మత్తులాంటి తెర ముందు అడ్డుగా నిలబడింది. కాళ్ళను ఎవరో కట్టివేశారు. తల విదిలించి, కదలకుండా కూర్చొని "గోపన్నా" అని పిలిచాడు.
    తరవాత కొన్ని నిమిషాలకు వచ్చిన గోపన్నతో, "చిన్నమ్మగారు ఏం చేస్తున్నారో చూడు!" ఆతృతగా అన్నాడు.
    గోపన్న లోపలకు వెళ్ళిన వైపే చూస్తూ, తనూ లేపవల్సి వస్తుందన్నట్లుగా పట్టె మీద ముందుకు వంగి కూర్చున్నాడు.
    తిరిగి వచ్చిన గోపన్నను చూస్తూనే లేవబోయాడు.
    "వంటింట్లో స్టౌ వెలిగిస్తోంది!"
    అతడి మొఖం బిగుసుకుపోయింది!
    అరుణ భయాన్ని, కోపాన్ని జయించింది!

                                    *    *    *

    మూడురోజుల తరువాత-
    రాత్రి పదిగంటలప్పుడు-    
    గదిలో గుడ్డి దీపం వెలుగుతోంది.
    రాజశేఖరం సర్వం పరచి - అపస్మారక స్థితిలో అప్పటికి రెండురోజుల బట్టి పడుకొని వున్నాడు.
    డాక్టర్ సలహాతో - అరగంటకీ, గంటకీ- అతడు నోరు తెరిచి మూలుగుతున్న సమయంలో అరుణ చెంచాతో గ్లూకోజు నీళ్ళు పోసేది.
    ఆమెకీ ఈ రెండురోజుల బట్టి ఆహారం లేదు. నీళ్ళు లేవు. నిద్రలేదు. గోపన్న దూరంగా కళ్ళార్పకుండా చూస్తూ కూర్చొని వున్నాడు.
    ఈ పరిస్థితుల భయంతో కొట్టుకు లాడుతుంది అరుణ. రెండురోజుల క్రితమే అరుంధతికి ఉత్తరం వ్రాద్దామనుకుంటుండగా ఆమె వద్ద నుండే జాబు వచ్చింది. అందులో ఇలా వున్నది.
    "చెల్లీ!
    మా అత్తగారు మొన్నరాత్రి పన్నెండు గంటల సమయంలో, అనారోగ్యంతో కొన్ని దినాల బాధపడిన తరువాత కన్నుమూశారు. ఆ రోజు ఉదయం నుండి కాస్త తేలిగ్గా వుండటంతో మేం ఎంతో తృప్తిపడి తేలిగ్గా శ్వాస పీల్చుకున్నాం. కాని అనుకోకుండా ఆ రాత్రి ఆమె వెళ్ళిపోయింది.
    ఇక, నేను ఇక్కడ పనులన్నీ పూర్తయితే గాని రాలేను. సుమారుగా పది, పదిహేను రోజులు పట్టవచ్చు.
    మా బావ ఏవంటున్నాడు? నేను వచ్చే ముందు నీకు చెప్పినట్లుగా - అతడిని మలుచుకోవటం నీ చేతుల్లోని పని అరుణా! అంతేగాదు-పురుషుణ్ణి అత్యున్నత స్థానానికి తీసుకు వెళ్ళినా, అధః పాతాళానికి త్రొక్కి వేసినా- ఒక్క, స్త్రీయే చేయ గలదు.
    అతడు పిచ్చివాడు. అమాయకత్వం ఇంకా వీడలేదు. ఆ అమాయకత్వమే అతడిని పెంకివాడుగా గూడా చేస్తోంది. పిచ్చితనంతో గూడిన పెంకితనంతో ఏవేవో వాగవచ్చు - వాటిని నీ వేవీ లెక్కించవద్దు. అతడు నీవాడు నీ సొమ్మును నీ కింత జాగ్రత్తగా చూచుకుంటూవో, ఎంతగా భద్రపరుచుకుంటావో - అతడి విషయం లోనూ అలాగే ప్రవర్తించు!
    నీకు భగవంతుడు ఎల్లప్పుడూ అండదండగా నిలుస్తాడు. నీ జీవితం సుఖ వంతమవుతుంది.

                                                                                    ఇట్లు
                                                                       నీ శ్రేయస్సు కోరే నీ అక్క
                                                                                 అరుంధతి"    
    ఆమె ఉత్తరం చదివి క్షణంలో హేళనగా నవ్వుకున్నది.
    మరుక్షణంలోనే-
    ఆవేశంతో హృదయం ఎగిరెగిరి పడింది.    
    తన కిష్టంలేని వ్యక్తితో తన జీవితం ఎలా గడపగలదు.
    తనను రాజశేఖరం ఇష్టపడటం లేదని తెలిసే ఇంకా అరుంధతి ఆ ఉద్దేశ్యంలోనే ఎందుకున్నది.    
    దానివల్ల ఎవరికీ లాభం.
    ఉహూ...............
    ఇవన్నీ ఆలోచించవలసిన సమయం దాటిపోయింది ఎన్నడూ తన హృదయాన్ని అతడికి అర్పించివేసింది- ఇప్పుడు అక్కయ కోరినట్లుగా అతన్ని తనవైపు త్రిప్పు కోవటమే తన వాడిని చేసుకోవటమే- తన విధి! తన చేయవల్సిన పని!
    ఇక ఏ ఆలోచనా వద్దు!
    రాజశేఖరం మూలిగాడు. అటూ యిటూ. బాధగా కదిలాడు. అరుణ లేచి, గ్లూకోజు నీళ్లున్న గ్లాసు చేతిలో తీసుకున్నది. చెంచాతో నీళ్ళు నోట్లో పోయబోయింది.
    "ఆకలవుతుంది.. కాసిని కాఫీ ఇవ్వరాదూ!"
    అరుణ పక్కనున్న ప్లాస్కో మరుక్షణం లోనే చేతిలోకి తీసుకున్నది.
    గ్లాసులో పోసి, "లేచి కూర్చో లేరు..చెంచాతో పోస్తాను!" అన్నది.
    "నీ యిష్టం!" నూతిలో నుండి వచ్చి నట్లుగా వున్నాయి మాటలు. ఒకగుక్క కాఫీ త్రాగాడు. గొంతంతా ఎండి గరగర లాడుతోంది.
    "నీ కళ్ళు అంత ఎర్రగా వున్నయ్యేం!" అంత నీరసంలోనూ కళ్ళు చిట్లించి చూస్తూ అడిగాడు.
    అతడి ప్రశ్నకు ఆమె కళ్ళమ్మట నీళ్ళు గిర్రున తిరిగినయ్.
    "ఏడుస్తున్నావు గూడానా? ...ఏవైంది?.
    "నాకు భయమేస్తోంది!"    
    "నేను చచ్చిపోతాననా?" పేలవంగా నవ్వాడు.
    అతడి మాటలకు మరింత భయంతో ఆమె ముఖం బిగుసుకు పోయింది. నోట మ్మట మాట పెగలక అచేత నయింది.
    "పిచ్చిదానా!........... నేను చచ్చిపోతే నీకు దేనికి భయం!" మళ్ళా నవ్వటానికి ప్రయత్నించాడు.
    ఆమె కళ్ళల్లోకి జాలిగా చూచాడు.
    "ఛా! భయపడకు........ ఇది మొండి పిండంలే...... అంత త్వరగా చావదు!'
    అతడి మాటలకు మరింత భయపడింది.
    "జ్వర తీవ్రత వలన కాదుగదా..... ఈ పిచ్చి పిచ్చి మాటలు!"    
    గ్లాసు అక్కడే పెట్టి, మొఖం పక్కకు తిప్పుకొని, దుఃఖాన్ని దిగమ్రింగుకుంటూ, లేచి వెళ్ళ బోయింది.
    "ఆగు అరుణా!......... భోజనం చేశావా?" చాలా నెమ్మదిగా అడిగాడు.
    "లేదు!"        
    "ఏం?.."
    "రెండురోజుల బట్టి అమ్మగారు మంచి నీళ్ళయినా త్రాగడం లేదు బాబూ!" గోపన్న అన్నాడు.    
    తల పక్కకు వాల్చి, గోడ ప్రక్కగా కూర్చున్న గోపన్న మొఖంలోకి ఒక్కసారి జూచి, అరుణ మీదికి చూపు మరలుస్తూ, "ఏం అరుణా?.... ఎందుకని?" ఆతృతగా అడిగాడు.
    "రెండురోజుల బట్టి మీకు స్మారకమే లేదు!"
    "నిజంగానా?"
    "అవును!"
    ఒక్కక్షణం నిశ్శబ్దంగా శూన్యంలోకి చూసి, కృతజ్ఞతాపూరితకంఠంతో, నంగి నంగిగా, "కృతజ్ఞున్ని అరుణా!.. నీవు చేసిన సహాయానికి, నీవు చూపిన ఆదరానికి కృతజ్ఞుణ్ణి..ఎప్పుడో అప్పుడు నీ ఋణం తప్పక తీర్చుకుంటాను!" అన్నాడు.
    అక్కడ నిల్చోటం ఇష్టం లేనట్లుగా వెళ్ళిపోతూ, అరుంధతి వ్రాసిన ఉత్తరం గుర్తుకు రావటంతో వెనుతిరిగి, "అక్కయ్య ఉత్తరం వ్రాసింది.... అత్తగారు పోయారట... పది పదిహేను రోజుల్లో వస్తానన్నది!"
    "అరె పాపం!" నిట్టూర్పు విడిచాడు.
    "ఇదిగో... మీకూ ఒకటి వ్రాసింది!"    
    "చించి చదువు..."
    "మీరు చదవండి లే.." ఆమె గుండె దడదడ లాడింది-దానిలో ఏ వున్నదో?
    కవరు చించి, కాగితం మడతను మడత గానే వుంచి అతడి చేతికిచ్చింది.
    "బావా!
    అరుణ నీది.. ఆమెను సంతోషపెట్టినా, దుఃఖ పెట్టినా అనుభవించేది నీవే!
                -అరుంధతీ"
    రెండే రెండు వాక్యాలు.    
    అతడి కళ్ళు చికాకును వ్యక్తం చేశాయి.
    విసురుగా కాగితాన్ని నలిపి దూరంగా విసిరివేశాడు.
    "అరుంధతీ!" కసిగా అనుకున్నాడు.    
    అరుణ-అందులో ఏ వున్నదో క్షణంలో గ్రహించింది!    
    మొఖం పాలిపోగా, పక్కగదిలోకి పరుగెత్తుకు పోయింది!
    
                                                          *    *    *

    ఐదు రోజులయింది.
    రెండు రోజుల క్రితమే జ్వరం తగ్గటంతో పత్యం పెట్టమన్నాడు డాక్టర్.
    పదిగంటల కల్లా అన్నీ సిద్ధం చేసి అతడి గదిలోకి వచ్చింది అరుణ.
    కొద్దిరోజుల జ్వరానికే కళ్ళు గుంటలు పడి, మొఖమంతా పీక్కుపోయింది. గడ్డం పెరగటంతో మరింతగా నీరసించినట్లు కనబడుతున్నాడు రాజశేఖరం.
    జాలిగా అతడి మొఖంలోకి ఒక్కసారి చూచి కంచాన్ని స్టూలు మీద పెట్టి అన్నం వడ్డించింది.
    ఒక ముద్ద తిన్న తరువాత, "నోరు ఎలా వున్నది.. తిన బుద్ధి వేస్తున్నదా?" అడిగింది.
    "వూ.. అని మూలిగాడు. చిన్నగా తల గూడా ఊపాడు. కాని, కాస్త తినేటప్పటికే వెగటు వేసింది. ఆ కంచంలోనే చేయి కడిగేసుకొన్నాడు.
    "తిన్నది కాస్తే అయినా- నిద్ర మాత్రం పోగూడదు!" అరుణ అన్నది.
    "ప్రయత్నిస్తాను!"
    "ప్రయత్నించటం కాదు- పోవటానికి వీల్లేదు!" ఒత్తి పలికింది.
    "సరే!"
    "ఏవైనా పుస్తకాలు తెచ్చి ఇవ్వమంటారా?"
    "చదువలేకపోవచ్చు... కళ్ళు నెప్పులు పుడతయ్యేమో"    
    "నిజమే... పోనీయ్ నన్ను చదవమంటారా?" కంఠంలో సహజత్వం ఉట్టి పడింది.
    కాని- అదీ అతడిని అంతగా సంతృప్తి పరచలేకపోయింది.
    అరగంట చదివేటప్పటికే అతడికి విసుగు వేసింది. ఆవులింతలు పరామర్శించసాగినయ్.
    చికాకుతో, అసహనంతో అటూ యిటూ కదిలాడు. అరుణ పుస్తకం మూసివేసింది.
    "అరుంధతి ఎప్పుడు వస్తుంది?" ఉన్నట్లుండి రాజశేఖరం అడిగాడు.
    "ఏమో?"    
    "నీకు వ్రాసిన ఉత్తరంలో ఏమీ వ్రాయలేదా?"
    "అక్కడి పనులన్నీ పూర్తయిన తరువాత వస్తానని వ్రాసింది!"    
    "అంటే నాలుగురోజుల్లో రావచ్చు నన్నమాట!" నిట్టూర్పు విడిచాడు.
    కాని ఆ నిట్టూర్పు ఆమె గుండెల్లో బాకుగా పొడుచుకున్నదని అతడికి తెలియదు!
    అరుణ మొఖం పక్కకు తిప్పుకుంటూ, "మీకీ కష్టాలు నాలుగయిదు రోజుల్లో తీరుతయి లేండి!" అన్నది.
    "ఇవి కష్టాలో, సుఖాలో నాకయినా తెలియదుగాని-ఆమె రావటంలో నాకేదో తృప్తి వున్నది- అంతే!" అన్నాడు కళ్ళు సగం వాల్చి.
    తృప్తి అంటూ లేనప్పుడు- ప్రతిదీ కష్టంగానే తోస్తుంది-అది సహజం గూడా!- కాదంటారా?" ఆమె ఆ సంభాషణను అంతటితో త్రుంచి వేయదలుచుకోలేదు.
    "మళ్ళీ నన్ను ఆ గాడిలోకి లాగేస్తు న్నావ్!" అతడి నీరసమైన మొఖాలలో పేలవమైన నవ్వు కొట్టవచ్చినట్లుగా కనబడింది. "ఆ వలయం నుండి మనం దూరదూరంగా తిరుగుదాం... ఈ నాల్రోజులు!" అన్నాడు. ఒక్కక్షణ మాగి. పశ్చాత్తాప కంఠంతో. "అరుణ! మీ అక్కయ్య లేని ఈ కొద్ది రోజుల్లోనూ నీకు నా ప్రవర్తన వింత గాను కఠినంగాను తోచి వుండవచ్చు.. దానికి నన్ను క్షమించగలవా?" అన్నాడు- అది, ఇద్దరు మానవత్వమున్న మనుష్యుల నడుమ నడిచే సంభాషణ!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS