Next Page 
మేఘమాల పేజి 1


                               మేఘమాల

                                              పి.ఎస్.నారాయణ

                       

    త్యాగరాజుకు పాటలు రావు. అంతే కాదు, పాట లన్నా పాటలు పాడేవాళ్ళన్నా అంత ఆసక్తీ లేదు! కాని ఆ రోజు ఆ 'అమోఘమైన పాటకచ్చేరీ' కి (మిత్రుడు నారాయణ మాటల్లోనూ) వెళ్ళాడు. అతడు వెళ్ళలేదు - నారాయణ లాక్కువెళ్ళాడు. చేయిపట్టుకు గుంజుకు వెళ్ళాడు. ముందు వరసల్లొకి తీసుకువెళ్ళి కూలేసి అప్పుడుగాని చేయి వదల్లేదు!
    పాటకచ్చేరి మొదలయింది-దాన్తోపాటు సర్వం మరచిన నారాయణ చేతులూ పటమూ, తల ఆడించటమూ మొదలయింది!
    త్యాగరాజుకు అతడి ప్రవర్తన చికాకు వేసింది. ఏదో ఇబ్బంది పడుతున్నట్లుగా మూలిగాడు. ముక్కాడు. అటూ యిటూ కదిలాడు. దగ్గాడు. కాళ్ళు నేలకేసి బాదుకున్నాడు.
    కాని నారాయణ కివేవీ పట్ట లేదు-అతడు మరో ప్రపంచంలో పడిపోయాడు!
    త్యాగరాజు భుజంమీద చేయి పడింది-దన్ని గట్టిగా నొక్కింది...
    త్యాగరాజు వెనక్కు తిరిగాడు.
    తన పక్కింటి చలపతి!
    విచిత్రంగా అతడి మొఖంలోకి చూచాడు!
    'బయటకు వస్తారా ఒక్కసారి!'
    ఏదో బంధిఖానానుండి బయటపడుతున్నట్లుగా, త్వరత్వరగా బయటకు నడిచాడు. స్వేచ్చ పొందబోతున్నట్లుగా సంతోషించాడు - నారాయణకు నామమాత్రంగా గూడా చెప్పలేదు-చెప్పినా విని పించుకోడని అతడికి తెలుసు!
    హాలుదాటి బయిటకు వచ్చారు ఇద్దరూ!
    అప్పటికే చీకటి చిక్కగా, నల్లగా ఆ ప్రదేశాన్నంతా అలుముకున్నది-ఏదో భయం మనిషిని ఆవరిస్తున్నట్లుగా వున్నది ఆ సమయం!
    చలపతి మళ్ళా త్యాగరాజు భుజంమీద చేయివేశాడు.
    అతడు ఏదో చెప్పాలని తాపత్రయ పడుతున్నాడు.
    'చెప్పండి!'
    నోరు తెరిచి చలపతి మాట్లాడ బోయాడు. ఒక్కక్షణం సంశయించాడు. 'పదండి .... ఇంటికి వెళ్దాం పదండి!' అన్నాడు. భుజంమీద చేయి తీసివేదాడు.
    త్యాగరాజు మారు మాట్లాడకుండా ముందుకు నడిచాడు.
    చలపతి అనుసరించాడు.
    'పోనీ రిక్షా ఎక్కుదామా.
    'ఎందుకు! నడుద్దాం......పావుగంటలో వెళ్తాం ఇంటికి!' త్యాగరాజు అతడి సలహాను విరిచేశాడు. కాని మరుక్షణంలోనే 'అర్జంటా?' నుదురు ముడివేసి అడిగాడు.
    'లేదు...లేదు!' అతడు తడబడ్డాడు. 'నడుద్దాం పట్టండి!'
    ఇద్దరూ మౌనంగా నడవసాగారు.
    చలపతి మనస్సులోది చెప్పటానికి బాధ పడుతున్నాడు.
    వాళ్ళు నడచిన దూరం ఎక్కువయింది.
    వాళ్ళయిళ్ళు దగ్గర పడినయి ఇల్లు చీకటిగా వుండటంచూచి ఆశ్చర్యపోయాడు త్యాగరాజు. అదే పైకి అనేశాడు గూడా: 'రాణి ఇంట్లో లేదల్లే వున్నది!'
    చలపతి అవకాశం చిక్కినట్లుగా, 'అదే నేను చెప్పబోతున్నాను!' అన్నాడు త్వర త్వరగా.    
    'అంటే?' తిరిగి త్యాగరాజు నుదురు ముడిపడింది.
    'మీరు రాణిని ఏదైనా వూరు పంపారా?'
    'లేదే?' అన్నాడు నోరుతెరుస్తూ.
    'అయితే నేననుమానిస్తున్నదే నిజమన్న మాట!'
    'ఏఁవైంది?' ఆత్రంగా ముందుకు వంగి అడిగాడు త్యాగరాజు.
    'రాణి వెళ్ళిపోయింది!'
    'అంటే-?!'
    'రాణి సుందర మూర్తితో వెళ్ళిపోయింది!' చలపతి త్యాగరాజు మొఖం లోకి చూస్తూ నంగి నంగిగా అన్నాడు ఊపిరి బిగపట్టుకున్నట్లు.
    త్యాగరాజుకు ఒక్కక్షణం ఏఁవీ అర్ధంకాలేదు అయోమయంగా చలపతి మొఖం లోకి చూచాడు.
    చలపతి మొఖం పక్కకు తిప్పుకున్నాడు.
    అలా తిప్పుకోవటంలో ఏదో ఎక్కడో మెరిసినట్లయింది!
    త్యాగరాజుకు అర్ధమయింది!
    అతడి ముఖం మరుక్షణంలోనే తెల్లగా పాలిపోయింది!
    
            *    *    *

    త్యాగరాజుకు తరువాత అరగంటవరకు నోటమాట పెగల్లేదు.
    జుట్టును చేతుల్లో ఇరికించుకొని నేలనుచూస్తూ చలపతికి ఎదురుగా కూర్చున్నాడు.
    తరువాత పావుగంటకు చలపతి లేచి నిల్చున్నాడు.
    త్యాగరాజు తలెత్తాడు.
    చలపతి అతడి బుజంమీద చిన్నగా తట్టి వెళ్ళిపోయాడు!
    త్యాగరాజు అతడు వెళుతున్నవైపే చూస్తూ కూర్చుండిపోయాడు.
    తరువాత లేచి నిలబడ్డాడు.
    వాకిటివైపుకు వచ్చి చలపతి దగ్గరగా వేసి వెళ్ళిన తలుపులకు లోపల ఘడియవేశాడు.
    గది తలుపు తీసుకొని వెళ్ళి చీకట్లో తడుముకుంటూ లైటు వేశాడు.
    బిక్కు బిక్కుమంటూ, భయంభయంగా టేబుల్ వైపుకు చూచాడు.
    అతడి కళ్ళకు-అతడు ఊహించి నట్లుగానే-రాణి వ్రాసిపెట్టిన కాగితం కనబడింది.
    అది తీసి చదువుకోసాగాడు.
    'అన్నయ్యా,
    ఒక్కోసారి నా కనిపిస్తుంటోంది - మనని ప్రేమించేవాళ్ళకు మనం న్యాయం చేకూర్చవేఁమోనని ...ఏఁవో...ఏది ఏఁవైనా నీకు అన్యయం చేయటానికే నా మనస్సు స్థిరనిశ్చయానికి వచ్చింది.....అవునన్నయ్యా! నేను నీకు అన్యాయం చేస్తున్నాను...ఇక, నీవు నలుగురిలో తలెత్తుకు తిరగటానికే భయపడి ఏ అఘాయిత్యం చేస్తావోనని భయంగా వున్నదన్నయ్యా!...కానీ ఈ 'పాపికి' అవన్నీ ఏఁవి లెక్క?...
    నేను వెళ్ళిపోతున్నానన్నయ్యా!
    సుందరమూర్తి కట్టినలోకంలో విహరిద్దామని....స్వర్గంలో తప్ప కనబడనటువంటి నీలాటివాడికి దూరమయి! నా మనస్సు చేతిలో చిక్కుకుపోయి పరాధీన అయిన నేను పూర్తిగా వోడిపోయాను...
    క్షమించగలవా అన్నయ్యా?
    ఉఁహూఁ.....వద్దు.....నా గురించిన ఏ ఆలోచనా పెట్టుకోవద్దు... నా కోసరం ఒక్క కన్నీటిబొట్టునైనా వెచ్చంచ వద్దు....నన్ను క్షమించవద్దు అన్నయ్యా!
                  క్రితం క్షణంవరకు
                నీ ప్రియాతి ప్రియమైన
                         చెల్లి
                         రాణి'.
    త్యాగరాజుకు అంతా అయోమయ మయింది.
    ఎందుకిలా జరిగింది?
    -ఎంత ఆలోచించినా ఆ ప్రశ్నకు సమాధానాన్ని కూడదీసుకోలేకపోతున్నాడు!    
    ఒక్కసారిగా-తన సర్వస్వం-తనకు దూరమయిపోగా-తను ఏకాకి అయిపోయినట్లుగా, తను
అన్నీ పోగొట్టుకున్నట్లుగా ఫీలయ్యాడు.
    అలాగే పడక కుర్చీలో పడుకున్నాడు.
    కళ్ళుమూసుకు పడుకున్నాడు.
    తరువాత-ఎప్పుడో నాలిక ఎండినట్లనిపిస్తే-లేచి, టేబుల్ మీద ఒంటిగంట చూపిస్తున్న గడియారాన్ని - ఆఫీసు గుడ్డలైనా మార్చుకోని తనని చూచుకొని-ఒక గ్లాసు మంచినీళ్ళు త్రాగి మళ్ళా కళ్ళు మూసుకు మంచంమీద పడుకున్నాడు.

            *    *    *

    ఇల్లంతా బిక్కు బిక్కుమంటోంది.
    గలగలా నవ్వుతూ, తనని నవ్వించే రాణి లేదు-ఇక తనకు సంతోషంలేదు...ఇక తనకు ఏఁవీ లేదు!
    శూన్యంలోకి చూస్తూ అలాగే పడుకున్నాడు.
    లేవ బుద్ధికాలేదు.
    ఏమీ చేయాలనిపించటంలేదు.
    గడియారం తొమ్మిదయిందని చెబుతుంది.
    ఒక్కసారి దాని వంక తల తిప్పి చూచి తల తిప్పుకున్నాడు.
    గుండె గుబులు గుబులు మంటోంది.
    ఎవరో గుండెను పిండేస్తున్న ట్లనిపిస్తోంది.
    రాణి లేకుండా తనెలా బ్రతకగలడు?
    పది సంవత్సరాలబట్టి తండ్రి లేడు. ఐదు సంవత్సరాలబట్టి తల్లిలేదు
    -ఈనాడు? ఉఁహూ.......
    తనకు ఎవరూ లేరు!
    -నీరసంతో కృంగిపోయాడు. కళ్ళుమూతలుపడ్డాయి. మొఖమంతా పీక్కుపోయింది...
    తనకీ బ్రతుకెందుకు?
    మరో గంట పట్టింది అతడు పక్క మీదనుండి లేచేటప్పటికి. లేచి ముఖం కడుక్కున్నాడు. నిన్నటి ఆఫీసు గుడ్డలు విప్పి వంకెన వున్న మరో జత వేసుకున్నాడు. రాణి ఇచ్చే అమృతంలాంటి కాఫీని, గుండెలు కలుక్కుమనగా ఒక్కసారి గుర్తుకు తెచ్చుకొని, బయటకు నడిచాడు -ఇంటికి తాళంవేసి!    
    గబ గబా హోటల్ కు నడచి-కషాయం లాంటి కాఫీని ఓ గుక్కెడు త్రాగి-కౌంటర్ దగ్గరకు వచ్చి ఫోనెత్తి-నెంబర్ డయిల్ చేసి, 'హలో' అన్నాడు-గొంతు నీరసంగా, జ్వరపడి ఆరోజే పత్యంతిన్న వాడి గొంతులా వున్నది.
    'హలోవ్ ... కెన్ - ఐ స్పీక్ టు రాజేశ్వరి?'
    ఓ నిముషం ముళ్ళమీద నిల్చున్నాడు. 'యస్.....రాజేశ్వరీ స్పీకింగ్!'
    'నేను త్యాగరాజును మాట్లాడుతోంది!'
    'చెప్పండి!'    
    'ఒక్కసారి యింటికి వస్తావా?....ఇవ్వాళ్టికి సెలవు పెట్టేయ్ రాజేశ్వరీ!' మరో మాటకు అవకాశం లేకుండా ఫోన్ పెట్టేశాడు.
        
            *    *    *

    ఎదురెదురుగ్గా ఒకళ్ళ మొఖంలోకి మరొకరు చూస్తూ కూర్చుండిపోయారు త్యాగరాజు, రాజేశ్వరీ!
    త్యాగరాజు కంటివెంట నీరు అతడి చొక్కాను చాతిమీదుగా తడిపివేస్తూ కారు తోంది.
    'బాధపడబోకండి!' రాజేశ్వరి ఓదార్పు కంఠంతో అన్నది.
    'దేన్ని చూసి మర్చిపొమ్మంటావ్....నేనీ బాధను మర్చిపోలేను రాజేశ్వరీ!.....నావల్లకాదు.... నాకాశక్తి లేదు!' అతడు తల అటూ యిటూ త్రిప్పాడు.
    తిరిగి నిశ్శబ్దం వాళ్ళిద్దరిమధ్యా నృత్యం చేసింది.
    అతడు తల ఊగిస్తూనే, 'నేను బ్రతకలేను రాజేశ్వరీ!...నాకీ జీవితం వద్దు!' అన్నాడు.
    రాజేశ్వరి నిట్టూర్పు విడిచింది.
    'మీకు బాధ వుండదని నేనను...కానీ దానికీ వో హద్దు వుంటుంది.....వో పరిధి వుంటుంది!'        'రాజేశ్వరీ!'
    'నిజం!... నేను చెప్పింది సావకాశంగా వినండి....రాణి మిమ్మల్ని మోసం చేసిందనీ, మీ మనస్సుతోనూ, జీవితంతోను ఆటలాడిందనీ మీరు భావించవచ్చు...అలా చేయటంలోనూ ఆమె ఎంత బాధ పడిందో మీరు ఊహించండి!....ఉహూఁ... ఒక్క క్షణం మనస్సు నిర్మలపరుచుకొని ఆలోచించండి!'
    అతడు పిడికిలి బిగించుకున్నాడు. నరాలు బిగపట్టుకున్నాడు. అతడి శరీరం చమటలు కక్కింది. అతడు సర్వం మరిచిపోయాడు.
    'తనకు ఏఁవీ లేదు...ఉహూఁ...తనకు ఏ ఆలోచనా వద్దు!'
    అతడు తల విదిలించాడు!

            *    *    *

    రాజేశ్వరి తల ఎత్తి త్యాగరాజు మొఖంలోకి సూటిగా చూస్తూ, 'మీ నిర్ణయం మార్చుకోలేరా?' అడిగింది.
    ఆమె కళ్ళను నీటి పొరలు క్రమ్మినయ్.
    'అలా మార్చుకోవటంలో నాకు మనశ్శాంతి లభిస్తుందని నేననుకోవటం లేదు!'
    -రాణి అతడిని ఒంటరివాడినిగా చేసి వెళ్ళిన మూడవనాటి రాత్రి త్యాగరాజు రాజేశ్వరుల నడుమ త్యాగరాజు గృహంలో నడుస్తున్న సంభాషణ అది!
    ఆమె ఒక్క క్షణం తటపటాయించింది. 'నేను ఒక్క ప్రశ్న అడుగుతాను సమాధానం చెబుతారా?' అన్నది. చాలా బరువుగా వచ్చినయి ఆ మాటలు.
    'అడుగు!'
    అతడి మాటలు పూర్తి అయ్యీ అవ్వకముందే, 'వద్దు! వద్దు!....నా దేవాలయాన్ని నన్ను అలాగే నిర్మించుకోనీయండి!' అన్నది. అలా అంటుంటే ఆమె కంఠం తడబడింది.
    'రాజేశ్వరీ!.....వద్దు.....సంశయం వద్దు ....తిరిగి మనం ఎన్నడు కలుసుకుంటామో లేమో? అడుగు రాజేశ్వరీ....నీ సందేహం తీర్చుకో!'
    ఆమె ఒక్క క్షణం సంశయించి బరువౌతున్న కళ్ళను రెప్పలతో మూసింది.
ఆమె హృదయం శోకంతో నిండి పోయింహాయ్. కృంగిపోయింది.
    ఆమె హృదయం శోకంతో నిండి పోయింది. కృంగిపోయింది.
    అతడి ముఖంలోకి బిక్కు బిక్కుమంటూ చూస్తూ, వో వ్యక్తి మీ హృదయం మీద తెలిసో తెలియకో దెబ్బ కొట్టి వెళ్ళింది.....అలాగే మీరూ మరొకరి మీద...... నత్తి నత్తిగా గొణగసాగింది.
    అతడు త్వర త్వరగా కల్పించుకుంటూ, 'తెలిసి నేనెన్నడూ అలాంటి పని చేయను రాజేశ్వరీ....నేను హృదయ పూర్వకంగా చెబుతున్న మాటలు యివి!' అతడు వంగి పక్కన కూర్చున్న రాజేశ్వరి మొఖంలోకి చూస్తూ దృఢంగా అన్నాడు.
    అప్రయత్నంగా రాజేశ్వరి చేతులు అతడి పాదాలమీద వాలినయి. 'నా కదే చాలు.....నా కదే తృప్తి.....అంతకంటే నేను కోరుకుండేదేఁవీ లేదు గూడా!' ఆమె ఆవేశంగా అన్నది.
    -మరు క్షణంలోనే ఆమె వెక్కి వెక్కి ఏడ్వసాగింది...
    త్యాగరాజు నిశ్చేష్టుడయ్యాడు!    
    
            *    *    *

    హైదరాబాద్ వెళ్ళే రైలు అంత రద్దీగా లేదు. బండి ప్లాట్ ఫారం మీద ఆగగానే త్యాగరాజు త్వరత్వరగా ఎక్కి సామాన్లు పెట్టుకునే చెక్కమీద బెడ్డింగ్ పరిచేశాడు.
    దానిమీద ఎక్కి పడుకొని కళ్ళు మూసుకున్నాడు.
    అప్రయత్నంగా కళ్ళవెంట నీరు జల జలా రాలింది.
    'ఏఁవిటీ ప్రయాణం? ఎక్కడికీ ప్రయాణం?' -ధ్యేయంలేని తన ముందు జీవితం గురించిన ఆలోచనలు అతడిని ఉక్కిరి బిక్కిరి చేయసాగినయ్.
    తరువాత రైలు - తన ఊరిని - ఇరవై సంవత్సరాలనుండి తనని కడుపులో దాచుకున్న తన ఊరిని వదిలి - చీకటిని చీల్చుకుంటూ తనకు తెలియని ప్రదేశంలోకి వెళ్ళిపోతున్నప్పుడు - కళ్ళముందు కన్నీళ్ళతో తనను సాగనంపిన రాజేశ్వరి నిలబడింది.
    మనిషి విచలితుడయ్యాడు.
    'మిష్టర్! ఇప్పుడు వెళ్ళిపోయిన ఊరు ఏదో చెప్పగలరా?'
    త్యాగరాజు- ఆలోచనల నడుమ ఉక్కిరి బిక్కిరి అవుతున్నత్యాగరాజు- ఉలిక్కిపడ్డాడు.
    ఆ తరువాత తేరుకొని సమాధానం చెప్పాడు - ఎదురుగ్గా బెర్తు మీద పడుకొని తనవంకే చూస్తూ అడిగిన తోటి ప్రయాణీకునికి!


Next Page 

WRITERS
PUBLICATIONS