"ఏమిటోరా, ఈ ఫిట్టింగు నాకు నచ్చలేదు. నిన్న వాడు. ఇవాళ వీడు. రేపు ఇంకెవడో. నేనంత చొరవ తీసుకోలేను. అంతగా కావలిస్తే నా వోటు చిరంజీవికే వేస్తాను. మీరు తిన్నగా సుమతి దగ్గిర కెళ్ళొచ్చేయండి. అంతేగాని, ఈ రొంపిలోకి నన్ను దింపకండి," అన్నాడు సత్యం నీళ్ళు నముల్తూ.
సీతాపతి కళ్ళెర్ర చేశాడు.
"మీ సుమతి మాకు బాబాయి కూతురుగాదురా, తిన్నగా వెళ్ళి పోయి అడిగేందుకు. ఆ పిల్ల నీకు బాబాయి కూతురు. నువ్వు రాకుండా మేమే వెళ్ళి మాటాడితే సుబ్బారావుగాడు గెలిచేది ఖాయం. ఆనక మన కులం వాళ్ళంతా తలలొంచుకు కాలేజీకి వెళ్ళాలి. అంచేత, ఒరేయ్ సత్యం - మనమంతా గోవిందా......గోవింద.....మాటాడవేఁ .....మన పతనం నీ కిష్టమేనా? ...... చూడరాచూడు.....ఇవాళ ఈ ఊరు ఏలుతుంది మనం- ఆఫ్టరాల్ కాలేజీలో మనకి చోటు లేదంటే మనం మనందరికీ నామోషీ.మనకులం వాళ్ళంతా కట్టగట్టుకుని సముద్రంలో మునిగి చావాలి. అలా చచ్చిపోదామా? అడుగో...... రవిగా డొస్తున్నాడు..... వాడు మన కులంవాడుకాడు. అయితేనేం పాపం, మనకే ప్రచారం చేస్తున్నాడు. వాడికున్న అభిమానం మన కులం వాడివి నీకుంటే...... ఇంత టైమ్ వేస్టయ్యేది కానేకాదు. సర్లే....కులం సంగతి యింక మాటాడకూడదు. రవి గాడువింటే ప్రమాదం. మన కార్రాగానే సుమతి వాళ్ళింటికి వెడదాం. యస్సను. అనరా సత్యం. అను."
"ఛీ.... వెధవ పంతం నువ్వూను! సరే, అల్లాగే వెడదాం," అన్నాడు సత్యం.
"థేంక్స్!" అనగలిగేడు - చివర్ని -చిరంజీవి.
మొహంనిండా ఆనందించేడు సీతాపతి.
అంతలో రవి వాళ్ళ ముగ్గుర్నీ చేరుకున్నాడు.
"ఏమండి, గురూగారూ! బాగా లేటైపోయేరు! మీరెళ్ళిన పని ఏమయినట్టు?" పరామర్శించేడు సీతాపతి.
"సక్సెస్. గ్రాండ్ సక్సెస్, మా పేటలో కుర్రాళ్ళు మనమాట వినకుండా ఎల్లా వుంటారు?" అన్నాడు రవి.
"అదీ అల్లా వుండాలి దక్షత. ఏరా చిరంజీవి! ఇంక కదులుదామా?" అన్నాడు సీతాపతి.
"నీ యిష్టం," అన్నాడు చిరంజీవి.
సీతాపతి మళ్ళా రవితో అన్నాడు.
"చూడండి గురూగారూ! మేమటు నుంచి సరుక్కు రావలసిన పనులు చాలా వున్నాయి. ఈ లోగా మీరు నక్కలపేట వెళ్ళి అక్కడ మనవాళ్ళ క్షేమాలు చూడండి. మళ్ళా మనమంతా ఒక గంటలో హోటల్ రత్నాలో కలుసుకుందాం. ఓ.కే?"
"ఓ.కే!" అన్నాడు రవి. ఆ తర్వాత అతను సైకిలెక్కి వెళ్ళిపోయేడు.
తిమ్మాపురం కాలేజీల్లో రవిలాటి కుర్రాళ్ళు చాలామంది వున్నారు. వాళ్ళంతా కేవలం సత్రకారులు. ఎదుటి మనుషులకు ఉపయోగపడే తోటి మనుషులు వాళ్ళు.
మధ్య తరగతి ఆసామికి కారెక్కాలనే కోరిక వుండటం మంచిదేగాని -కారు సొంతదారుడు పలుకరించి కారెక్కమంటాడేమోనని ఎదురు చూడటం అసహ్యం. అలాగే -కళాశాలకి చదువు నిమిత్తం వచ్చిన పేద విద్యార్ధులు గొప్ప విద్యార్ధుల మెప్పుకోసం యెదురు చూడటం తిమ్మాపురంలో ఎక్కువ. సీతాపతి, చిరంజీవుల్లాటి కుర్రాళ్ళు రవిని "ఏవండి గురూగారూ!" అని పలుకరించి అతన్ని గేలిచేస్తున్నారు.
"ఫలానా గొప్పవాడికి అతని కార్లో కూచుని వీధి వీధి తిరిగి ప్రచారంచేసి; అతను స్వయంగా అందిచ్చిన కాఫీ ఫలహారాలు ఆరగించి నేను ధన్యుడనైపోయాను తెలుసా?" అని రవిలాటి కుర్రాళ్ళు స్వజాతి కుర్రాళ్ళతో "గొప్ప" గా చెప్పుకోవడంతోటే సరిపోతోంది. అవతల రవిలాటి కుర్రాళ్ళు ఎంతగా మోసగింపబడుతున్నారో, ఏ విధంగా గొప్ప జాతికి ఉపయోగపడుతున్నారో ఆలోచించుకునేందుకు తీరుబడి గాని- మెదడుగాని లేవంటే లేవు.
"శుభమంటూ మనం ముగ్గురు మేవిట్రా? రవిగాడు కూడా వచ్చేవాడుగా!" అన్నాడు సత్యం అమాయికంగా.
"ఏడిసేవ్? పిల్లిని చంకనెట్టుకుని వెళ్ళమని చెప్పేవుకాదు. ఇప్పుడు మనం వెళ్ళేది మీ సుమతింటికి. ఇప్పుడా అమ్మాయిని మన వేపుకి తిప్పుకోవాలంటేకుల ప్రసక్తి చాలా అవసరం. రవిగాడిముందు ఆ ప్రసక్తి చాలా ప్రమాదం. ఇవన్నీ నీకు తెలిచ్చావవులేరా సత్తిగా. నువ్వు నోరెత్తకు. అదిగో కారొచ్చింది. పదండి," అన్నాడు సీతాపతి.
"సుబ్బారావుగాడిపట్ల ఈ సీతాపతికింత కోపమెందుకోగాని - నన్ను రక్షించేడు దేవుడు," అనుకుంటూ చిరంజీవి కారు (సీతాపతి వాళ్ళ మావది) వెనుక సీట్లో దర్జాగా కూచున్నాడు.
కారు సుమతి వాళ్ళింటివేపు కదిలింది.
* * *
"అప్పుడప్పుడూ వస్తూండమని చెప్పవే, సుమతీ!" అన్నది, పెద్దావిడ- సుమతి వాళ్ళమ్మ.
"విన్నారుగా, అమ్మ గూడా అడుగుతోంది. కనక మీరు తరుచూ వస్తూండాలి. తప్పదు," అన్నది సుమతి.
"అల్లాగే. వీలున్నప్పుడల్లా వొస్తుంటాను," అన్నాడు వరప్రసాదం.
"చూసేరా, మళ్ళా వీలున్నప్పుడంటున్నారు. అదేం కుదరదు. మీరు ప్రతి సాయంత్రపూఁ రావాలి," అన్నది సుమతి.
వరప్రసాదం ఏవీఁ మాటాడలేక పోయేడు. వెళ్ళిపోయేందుకు లేచి నించున్నాడు.
"ఉండండి; ఒక్కక్షణం, మనం మాటల్లోపడి మీ కివ్వాల్సిన ఎకనామిక్స్ నోట్సు మరిచేపోయాను. మీ నోట్సుతో పనైపోయింది లెండి. క్షణం కూచోండి. తీసుకొచ్చి యిస్తాను," అని సుమతి గదిలోకి వెళ్ళింది.
