ఇఁక ఈ స్వామిభక్తికి తలొంచక తప్పదనుకున్నారు ప్రభువు. స్వామికి ప్రత్యర్ధియై ప్రభువు పోటీపడితే - ఆ పోటీలో ప్రభువుకి తిలోదకాలర్పించే స్థితికి ఈ గుడ్డి ప్రజలు ఎదిగిపోయే ప్రమాదమెంతైనా వుందని గ్రహించి భయపడ్డారు శ్రీవారు. ఒక పక్క - ప్రజాభిమానాన్ని వొళ్ళో పోసుకుంటూన్న స్వాముల పిన వొళ్ళు మంటగూడా అధికమవుతోంది.
అందుచేత-
ప్రభువు టేస్టుకి ప్రజల్లొంగకపోతే, ప్రజల టేస్టుకి ప్రభువు దిగజారడమే ప్రథమ కర్తవ్యంగా భావించి -తప్పదన్నట్టు శ్రీవారు సైతము స్వాములను ఆహ్వానించడం ప్ర్రారంభించేరు. ఆహ్వానితుడైన స్వామి పక్కన శ్రీవారూ నిలబడి ప్రజాభిమానాన్ని ఒక్కస్వామే దొంగిలించకుండా జాగ్రత్త పడుతున్నారు.
ఎంత కష్ట మెంత కష్టం.....
-చాలా సేపటిగ్గాని నరసయ్య మేడమీదికి రాలేదు. నరసయ్య రావడం చూచి రామదాసు తమ ఆలోచనలకు బ్రేకు వేసి రాజకీయ వైకుంఠపాళీని తెరిచి పెట్టేరు.
3
కాలేజీలో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా జరుగుతూంది. తిమ్మాపురం తాలూకు ముఖ్యమైన సెంటర్లలో కాలేజీ కుర్రాళ్ళు గుంపులు చాలా హడావిడిగా కనుపిస్తున్నాయి.
చదువుమీద వాళ్ళకి అమితమైన శ్రద్దలేదు. ఈ ఎన్నికలూ, ఆర్భాటాల పట్ల వాళ్ళకి విపరీతమైన మోజు.
దాని కోరకంగా ఆ విద్యార్ధుల తల్లితండ్రులే కారణం.
అబ్బాయి ఎల్లా చదువుతున్నాడో కనుకోడంకంటే, అబ్బాయి ఏం చదువుతున్నాడనేది వాళ్ళక్కావాలి. ఏ డిగ్రీయో ముక్కు మూసుకు పాసైపోతే, చాలామందిలా గుమాస్తా అయిపోతే, వొచ్చే జీతంతో పాటుపైన "దొరికే" పాతికా పరకాతో నిక్షేపంగా కాలక్షేపం చేయవచ్చనే గాడిలో బతికే మనుషులు తిమ్మాపురంలో ఎక్కువ.
(ఏ ఉద్యోగమైనా సరే అదిచ్చే జీతం వాళ్ళకి అనవసరం. పైనే మాత్రం గిట్టుబాటవుద్దీ, అనే వివరమే కావాలి. ఈ వివరం ఎక్కువగా పెళ్ళి సమ్మంధాల్లో తప్పనిసరిగా చెప్పవలసి వస్తుంది.)
ఏతావాతా తేల్చిన సారాంశం-
కాలేజీలో చదివే కుర్రాళ్ళు ఎలాగోలా డిగ్రీ మిటకరిస్తే చాలనే ఉదాసీన భావం తిమ్మాపుర వాసుల్ని ఆసరించడం గమనించిన కుర్రజాతి, కళ్ళెం పుచ్చుకోడం నేర్చుకున్నారు.
తిమ్మాపురంలో చదివే కుర్రాళ్ళు, చదువుతోపాటు కొన్ని అదనమైన అలంకారాలు నేర్చుకుంటున్నారు.
తిమ్మాపురం సముద్ర తీరాన వుండటంచేత ఆ వూళ్ళో బీచ్ లాటిదుంది. సాయంత్రం - సముద్రతీరం అంటే కుర్రాళ్ళు వళ్ళు మరిచిపోతారు. ఏదో అత్యవసర కార్యాలుంటే మినహా - సాధారణంగా విద్యార్ధులంతా ప్రతి సాయంత్రం ఆ బీచ్ దగ్గిర గంటో గంటన్నరో గడపడం అలవాటు.
అక్కడ వాళ్ళు సముద్రంలో మునగరుగానీ ఆనంద సాగరంలో మాత్రం తప్పనిసరిగా మునిగి తేలుతుంటారు.
తిమ్మాపురంలోకి అప్పుడప్పుడు విదేశీయ ఓడలు (షిప్పులు) వస్తుంటాయి. ఆ ఓడల్లో దొంగ సరుకులు చాలా దొరుకుతాయి. తిమ్మాపురం వ్యాపారస్తులు ఆ సరుకులు కొని, విక్రయించడం నేర్చుకునే 'ప్రముఖు' లయ్యేరు!
ఓడలనుంచి దొంగతనంగా దిగుమతి చేసుకునే సరుకుల్లో బ్రాందీ, విస్కీలు ముఖ్యమైనవి. తిమ్మాపురంలో ఈ రెండూ విరివిగా లభిస్తాయి. అంత విరివిగానే అవి అక్కడ అమ్ముడవుతాయి.
ముఖ్యంగా విద్యార్ధుల కవి అమృత సమానం!
బీచ్ కి కొంచెం దూరంలో సరుగుడు చెట్ల సముదాయంలో విద్యార్ధులచేత ఆ సీసాలు టపటపా పేలి పోతుంటాయి.
ఈ సీసా దాసుల స్థావరాని క్కొంచెం దూరంలో భామినీ దాసుల స్థావరమూ వుంది, అక్కడ కాలేజీలో చదువుతూన్న కుర్రాళ్ళల్లో సగానికి సగం మంది ప్రేమికులుంటారు. (మిగతా సగంలో చాలామంది సీసాదారులే!) ప్రేమ చాలా పవిత్రమనే గ్లామరుకొద్దీ, దాని మూలకంగా వొంటిక్కలిగే థ్రిల్స్ కొద్దీ వాళ్ళలా ప్రేమికులై పోయేరు.
ఈ ప్రకారంగా తిమ్మాపురం కళాశాలలు 'కళానిలయాలై' విరాజిల్లుతున్నాయి.
అప్పుడప్పుడూ వెరైటీ నిమిత్తం - ఇదిగో ఈ ఎన్నికలు! ఇంకా చదువు మీద ప్రత్యేకించి శ్రద్ద ఎక్కడిది?
రంగుల మేడ సెంటర్లో సీతాపతి సత్యాన్ని దుమ్మెత్తి పోస్తున్నాడు.
"చెప్పుకొరేయ్ సత్యం! నువ్వాడి తొత్తువని తెలుసు. ఏం చూచిరా సుబ్బారావు గాడికి జైకొడుతున్నావ్? వాడు నిన్నేం ఉద్దరిస్తున్నాడని?"
"నువ్వేదో ఆవేశంగా మాటాడుతున్నావుగానీ, నన్ను వినిపించుకోవే?" అన్నాడు సత్యం.
"మరి నువ్వు సుబ్బారావుగాడి కారెందుకెక్కావ్? మీ సుమతి వాళ్ళింటికీ వాడి నెందుకు తీసుకెళ్ళేవ్!" ప్రశ్నించేడు సీతాపతి.
"నన్నేం చేయమంటావురా? చిరంజీవిగాడు నించున్నట్టు తెలీక మునుపే సుబ్బారావు నాదగ్గిర ప్రామిస్ తీసుకున్నాడు...... అయినా, ఒరేయ్ పతీ! నా కెవడైతేనేంరా?"
"నా కెవడైనేంరా?" అనేమాట సీతాపతి గుండెల్లో గుచ్చింది. తట్టుకోలేక అరిచేత సీతాపతి.
"నీ కెవడైతేనేమా? అదిట్రా నువ్వెనేమాట? సుబ్బారావు ఎవడో నీకు తెలీదా? వాడు మన జాతివాడా? మనకులంవాడా? సన్నాసీ చెప్పుకునేందుకు సిగ్గులేదురా నీకు? మనవాడు - ఇడుగో వీడు. చిరంజీవి. రైట్..... తెలిసో తెలికో నువ్విన్నాళ్ళూ సుబ్బారావు కారెక్కి, తిరిగేవు. ఇకిప్పుడు వొదిలేయ్. మనకారు పెట్రోల్ కి వెళ్ళింది. అయిదు నిమిషాల్లో వొస్తుంది. ఇప్పుడు మన కారెక్కుతిన్నగా మీ సుమతి దగ్గిరికి వెడదాం. ఆ అమ్మాయితో నువ్వే చెప్పు. సుబ్బారావుగాడి వొదిలేసి చిరంజీవికే ఆడపిల్లలంతా వోట్లిచ్చే ఏర్పాటుచేయమను. సుమతి మాట ఏ ఆడపిల్ల కాదంటుంది! ఓ. కే?"
