క్షణమని చెప్పిన సుమతి పది నిమిషాలకుగాని రాలేదు, వొచ్చి పుస్తకమిచ్చి-
"చాలా థేంక్స్' అనకూడదు గానీ......చాలా బాగా ప్రిపేర్ చేసేరండి నోట్సుని. ఏవైనాకావల్సి వస్తే యిస్తుండండి. నాదేమో వట్టి మట్టిబుర్ర. పైగా - నోట్సులు రాసుకునేందుకు బద్దకం గూడాను," అన్నది సుమతి సిగ్గుపడుతూ -నిజం చెబుతూ.
వరప్రసాదం మెల్లిగా నవ్వుకున్నాడు. తర్వాత చేతులు జోడించి అన్నాడు.
"వొస్తాను. అమ్మగారికి చెప్పండి. వుంటాను."
వరప్రసాదం వెళ్ళిన వేపే చూస్తూ నుంచుంది సుమతి. సుమతి వాళ్ళమ్మ అన్నది. మెల్లిగా -
"బుద్ధిమంతుడు!"
సుమతి గిరుక్కున తల్లివేపు తిరిగింది.
ఆవిడ వరప్రసాదం గురించి యింకా మాటాడుతూనే వున్నది.
"ఎంత అందగాడో అంత బుద్దిమంతుడు. వినయం, వివేకం వున్నవాడు. ఏ తల్లి కన్నదోగాని ఆ తల్లి అదృష్టమే అదృష్టం......"
మధ్యలో కలుగజేసుకుంది సుమతి-
"అతనికి తల్లీ తండ్రీ లేరమ్మా!"
సుమతి వాళ్ళమ్మ ఆ మాటకి నొచ్చుకున్నట్టుంది. "అలాగా పాపం" అనిమాత్రం అనగలిగింది.
"వాళ్ళక్కగారే పెంచి పెద్దచేసేరుట. వాళ్ళక్కగారు యిక్కడికి దగ్గర్లోనే-ఏదో పల్లెటూరు- స్కూల్లో టీచరు. అతనికి అమ్మా, నాన్నా అన్నీ వాళ్ళక్కగారే. వాళ్ళక్కగారంటే ఇతనికి వల్లమాలిన ప్రేమ.....నెలకి రెండుమూడు తడవలు వెళ్ళి, వాళ్ళక్కయ్యని చూసి వస్తుంటారు." అన్నది సుమతి.
"ఏమైతేనేంగాని, ఈ కాలపు కుర్రాడుకాడు," అన్నది పెద్దావిడ.
* * *
సీతాపతి వాళ్ళకారు కెదురొచ్చేడు వరప్రసాదం.
చిరంజీవి కారాప మన్నాడు గానీ, సీతాపతి కాదు కూడదని కారాపలేదు.
కారు పోతూండగా సీతాపతి అన్నాడు.....
"వీడిగ్గూడా కారెందుకాపడం? వీడు మన రవిగాడి రూమ్మేటు. మనం ప్రత్యేకించి చెప్పక్కర్లే. అంతా రవిగాడే చూసుకుంటాడు."
"కాని వాడు మనల్ని కారులో చూసేడురా సీతాపతీ! వాడిని మనమూ చూశాము. చూసిగూడ వెళ్ళిపోతే ఏవఁనుకుంటాడు? ఇది మన పని, మనకై మనం వోటు అడగడంలోనూ మన తరపున రవి గాడు వోటు అడగడంలోనూ తేడాలేదూ? అన్నాడు," చిరంజీవి.
చిరంజీవి అమాయికత్వానికి సీతాపతి జాలిపడి, నవ్వుకున్నాడు. నవ్వి అన్నాడు.
"వెధవ పాలిటిక్స్! మీ నాన్న నీకేం నేర్పినట్టురామరి? మాఁవ దగ్గిర జేరు. పాఠాలు చెబుతాడు. ఒకటి చెబుతాను విను, ఎన్నికల్లో ప్రతి గాడిదకొడుకూ కాళ్ళు పట్టుకోవడం రూలే! వప్పుకుంటాను. కానీ, ఈ ప్రసాదం గాడు, "గాడిదకొడుకు" కాడు. వాడికి సాక్షాత్తు నువ్వు చెప్పినా, రవిగాడు చెప్పినా ఒక్కటే. ఆ తేడాలూ, ఫార్మాలిటీలు వీడి దగ్గిర పనిచెయ్యవు. వాడికాళ్ళు పట్టుకుంటే వోటిస్తాడనే గారంటీ ఏ మాత్రమూలేదు. వాడు ఎవడికైనా వోటివ్వాలని నిర్ణయం చేసుకున్నాడూ అంటే- అక్కడితో ఫుల్ స్టాఫ్. హరిరుద్రులొచ్చినా వాడి నిర్ణయం మారదు. కాళ్ళూ చేతులూ పనిచెయ్యవు. చెబితినే వాడు (గాడిద కొడుకు) కాడని.....అందుచేత, అయినా ఒరేయ్ జీవీ......నే నిందాక చెప్పినట్టు నువ్వు మాఁవ పండిపోయేడు."
వింటూన్న సత్యానికి ఉత్సాహం పొంగిపొర్లింది-
"చూస్తుండొరేయ్ జీవీ! మహా అయితే నువ్వు మన కాలేజీకి ప్రెసిడెంటవుతావేమోగాని, మన పతిగాడు దేశానికి మొగుడై పోగలడు. ఎంతెంత పోలిటిక్స్ రా బాబూ.....నీ నోట్లో పంచదార గొట్ట.....గొప్పగా చెప్పేవురా!" అన్నాడు సత్యం.
సీతాపతి తన ముసి ముసి నవ్వుల్నింకా ఆపలేదు. కాని, కారు సుమతి వాళ్ళింటిముందు ఆగిపోవడంతో -అప్పుడిక బాగుండదని ముద్రమార్చి మామూలు మనిషైపోయేడు సీతాపతి.
సుమతీ, సుమతీ వాళ్ళమ్మగారు ఎక్కడున్నారోగానీ. డోరు కర్టెను సర్దిన ఏర్పాటు స్పష్టంగా కనుపించింది.
ముందుగా సత్యం కారుదిగి, "పిన్నీ" అంటూ ఆ యింట్లోకి వెళ్ళేడు. మళ్ళా రెండు నిమిషాల్లో కారు దగ్గరికి తిరిగొచ్చి అన్నాడు-
"రండిరా! మా సిస్టరు యింట్లోనే వుంది. రండి!"
"కుడికాలు భూమ్మీదపెట్టరా జీవీ!" అన్నాడు సీతాపతి తను ఎడంకాలుతో దిగుతూ.
కారునుండి చిరంజీవి బరువుగా దిగేడు.
అంతా ఇంట్లోకి వెళ్ళి కూచున్నారు. అయిదు నిమిషాల్లో సుమతి గూడా తయారై వొచ్చి వాళ్ళతోపాటు కూచుంది.
సత్యం మాటలు ప్రారంభించేడు.
నీతో చెప్పేవే- సుబ్బారావుకి వోటివ్వమని- ఆ విషయం ఏం జేసేవ్? మీ ఫ్రండ్సందర్తో చెప్పేసేవా?"
"నువ్వుండలా సత్యం. నన్ను మాటాడనివ్వు," అని సర్దుక్కూర్చున్నాడు సీతాపతి.
చిరమ్జెవెఇ కళ్ళు రెండూ సుమతివేపు అప్పగించేడు. సుమతి వుడిగీ వుడిగీ మనుషుల్ని చూస్తోంది.
సీతాపతి చాలా కరెక్ట్ గా మాటాడేడు.
"చూడండి సుమతిగారూ, మన సత్యం తొందరపడి మీతో సుబ్బారావుకి ప్రచారం చేయవలసిందిగా చెప్పేడు. మన తరపునుంచి, మనవాడు అంటే మనకులస్థుడు, మన రామదాసుగారబ్బాయి, మన చిరంజీవి పోటీ చేస్తున్నాడు. ఈ విషయం తెలీక సత్యమేమో సుబ్బారావుని సపోర్టుచేశాడు. అఫ్ కోర్స్.....ఇప్పుడా అభిప్రాయం మార్చుకున్నాడనుకోండి. మీతో స్వయంగా మాటాడి-పరిస్థితులన్నీ వివరిద్దామని వచ్చేము. మీరు మా యందు దయవుంచి మీ వోటుతోపాటు మీ స్నేహితురాళ్ళందరి వోట్లూ మన చిరంజీవికే వేసే ఏర్పాటుచూడాలి. అఫ్ కోర్స్ - ఇటీజ్ యువర్ డ్యూటీ. ఏ మై కరెక్ట్?"
