Previous Page Next Page 
గుళ్ళో వెలిసిన దేవతలు పేజి 9


    "అతడు నన్ను ప్రేమించానన్నాడు నేనూ ప్రేమించాను, తీరానెలతప్పాక, నా అసహాయ పరిస్థితిని ఆధారంగా చేసుకుని యాభై వేలు ఇస్తే కాని పెళ్ళి చేసుకోనంటున్నాడు. అలాంటి వ్యక్తితో నా బ్రతుకు ముడేసుకోవాలని నాకు లేదు. ఒక్క తాళిబొట్టే నా బ్రతుక్కు పరమార్ధం కాదు. నేను భయపడుతున్నదీ, బాధపడుతున్నదీ, ఒకే ఒక విషయానికి... నా తొందరపాటుకి ఫలితం అభమూ శుభమూ తెలియని నా శిశువు అనుభవించవలసి వస్తుందేమోనని ...నన్ను మీరు పోషించక్కర్లేదు. చదువుకున్నాను, ఉద్యోగం చేసుకుంటాను. సమాజంలో నా శిశువు హీనపడకుండా ప్రతిఘటించడానికి మీ అండమాత్రమే కావాలి!"
    ఒక దీరారులి పశ్చాత్తాపం....
    ఇలాంటివే ఎన్నెన్నో గాధలు... సమాజం నడవటానికి డబ్బు కావాలి. శిరీష గ్రాంట్స్ వచ్చే ప్రయత్నం చేస్తానంది. కానీ, ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలు ఏవీ అంత త్వరగా పరిష్కారం కావు-
    తన ఆస్తి పదెకరాలుంది. అది సమాజంకోసం ఖర్చుపెట్టాలనుకుంది... ఈ అభిప్రాయాన్ని కుటుంబంలో ఎవరూ ఆమోదించలేదు.
    "నీ డబ్బు-నీ యిష్టం-" అన్నాడు విఠల్ పొడిగా...
    "నా డబ్బు అని ఎప్పుడైనా స్వతంత్రంగా వ్యవహరించానా?" నొచ్చుకుంటూ అంది పావని.
    "ఏవో సమాజాలంటూ సొంతఆస్తి ఇలా తగలేసుకోవటం మంచిది కాదనే నా అభిప్రాయం"
    "ఏదైనా సాధించాలని అనుకున్నప్పుడు అందులో సాధక బాధకాలను ఎదుర్కోక తప్పుతుందా?"
    "ఆ మాత్రం దానికి నన్నడగటం దేనికి? సాధించు!" చిరుబురులాడుతూ వెళ్ళిపోయాడు విఠల్.
    ఉసూరుమంది పావనికి... చదువుకున్నవాడు, విశాలభావాలున్నవాడు, తనను ప్రేమించేవాడు... విఠల్ ప్రవర్తనే ఇలా ఉన్నప్పుడు మిగిలినవాళ్ళు ఇంకెలా ఉంటారు?
    "ఏమిటేమిటీ? ఆస్తి అంతా ఆ మాయదారి సమాజానికి ఖర్చుపెడతావా? వీల్లేదు వీల్లేదంటే వీల్లేదు."
    ఖండితంగా అంది పద్మావతి..... ఆవిడంత ఖండితంగా అంటోంటే సమాన స్థాయిలో సమాధానం చెప్పక తప్పలేదు పావనికి.
    మా నాన్నగారి ఆస్తిలో కనీసం నాకు వచ్చిన ఈ భాగం అలా పద్మిని యోగం చెయ్యాలని నిశ్చయించుకున్నాను అత్తయ్యా అంది దృఢంగా.
    పావని ఇలా ఎదురునిలిచి సమాధానం చెప్పటం చూసి తెల్లబోయింది పద్మావతి. పట్టరాని కోపమూ వచ్చింది. అక్కడినుంచి లేచిపోయింది.
    కాలేజీలో ఉద్యోగం చేస్తున్నా సమాజం వ్యవహారాలు చూసుకొంటున్నా భర్త పనులన్నీ తానే స్వయంగా చూసుకునేది పావని...
    ఆ రోజు ఎప్పటిలా ఫలహారం తెచ్చి అందియ్యబోతే, తీసుకోలేదు విఠల్ ... పావని అభిమానం గాయపడింది. తనచేతి ఫలహారం కూడా అందుకోకూడ నంతటి అపరాధం చేసిందా తను రెండు నిముషాలు చూసి అక్కడి బల్లమీద పెట్టేసింది.... ఆ టిఫన్ తీసుకోనేలేదు విఠల్-ప్రత్యేకించి తల్లిని పిలిచి కాఫీ అడిగి త్రాగి వెళ్ళిపోయాడు.
    పావని మనసు అశాంతికి నిలయమయింది ఎప్పటిలా పనిలో సాయం చెయ్యబోతే. "నాకేం వద్దులే! వెళ్ళు!" అని కసిరింది పద్మావతి. పావని కాలేజీకి వెళ్ళబోయే ముందు పద్మావతి దగ్గిరుండి వడ్డించి, బలవంతపెట్టి ఎక్కువ తినిపించేది. ఆ రోజు అన్నం తినమని కూడా అనలేదు. పావని భోజనం చెయ్యకుండానే కాలేజీకి వెళ్ళిపోయింది. కాలేజీలో స్నేహితులు ఏదో పెట్టబోయినా తినాలనిపించలేదు. వడిలిపోయిన ముఖంతో ఇంటికివచ్చి మంచంమీద పడుకున్న పావనిని చూసి పద్మావతికి కళ్ళలో నీళ్ళు తిరిగాయి-
    "లే! లేచి అన్నానికి రా! నాకు ఆకలి మండిపోతూంది." అంది.
    "ఇంతవరకూ మీరూ తినలేదా?"
    "ఏం మాటలే!నువ్వు తిండి తినకుండా బయటికి పోతే, నేను కూచుని మెక్కుతా ననుకున్నావా?"
    పావని గబ గబ లేచి ఇద్దరికీ కంచాలు పెట్టింది. భోజనం చేస్తూ పద్మావతి 'పావనీ! నా మాట వినవే ! నీకేం తక్కువయింది? ఆ వెధవ సమాజం కోసం... ఎవరో చెడిపోయిన వాళ్ళకోసం పండులాంటి సంసారంలో కలతలు తెచ్చిపెట్టకు-" అంది దీనంగా...
    "ఎందరికో ఆశపెట్టి సమాజం ప్ర్రారంభించాను అత్తయ్యా! ఇప్పుడు దాన్ని ఎలా వదిలెయ్యగలను?"

                                 


    పద్మావతి కోపంగా తింటున్న కంచంలో చెయ్యికడుక్కుని వెళ్ళిపోయింది.
    పావనికి ఆ తరువాత అన్నం సహించలేదు. ఒకప్పుడు తను గట్టిగా తలుచుకుంటే సరళను ఆదుకోగలిగేది. కానీ, ఇలాంటి పరిస్థితులకు భయపడి సరళను బలిపెట్టింది. ఇప్పుడు మళ్ళీ అలా వెనక్కు తగ్గవలసిందేనా? వీల్లేదు. ఎంతైనా భరిస్తుంది. దేన్నైనా ఎదుర్కొంటుంది.
    
                                                8
    
    "పూర్వం వేశ్యావాటికలు ప్రత్యేకించి ఉండేవి. ఇప్పుడలా కాదు. ఏవేవో సంఘాల పేరిట సమాజంలో కలిసిపోయి కనిపిస్తున్నాయి. ఉదాహరణ మన కళ్ళముందే ఉంది" పురోగామి సంఘం...."
    హరికథల మధ్య పిట్టకథలో హాస్యంలా చెప్పేస్తోంది భాగీరదమ్మ.
    పావని ఏనాడూ భాగీరధమ్మ హరికథలు వినటానికి వెళ్ళదు. అయినా పావని ఏం మాట్లాడినా భాగీరధమ్మకు చేరేసే భక్తులూ ఉన్నారు. భాగీరధమ్మ ఏం మాట్లాడినా పావనికి తెలియపరిచే శ్రేయోభిలాషులూ ఉన్నారు.
    తమ సంఘాన్ని గురించి భాగీరధమ్మ ఇలా మాట్లాడుతోందని వినేసరికి పావనికి మండిపోయింది.
    భాగీరధమ్మను ముఖాముఖి ఎదుర్కొంది...
    "ఆడదానివయి ఉండి సాటి ఆడవాళ్ళను గురించి ఇలా మాట్లాడటానికి సిగ్గులేదూ? వాళ్ళు నీచులే అయితే ఇలా సంఘంగా సమావేశమయి సమాజాన్ని ఎదుర్కోవలసిన అవసరమే ఉండేదికాదు. నీచులనేకులు పెద్దమనిషి బురఖాలతో సమాజంలో దర్జాగా తిరుగుతూనే ఉన్నారు..." అనేసింది.
    పావని మాటలు సహించలేకపోయింది భాగీరధమ్మ.
    "చూసావా? ఎంతెంత మాటలంటోందో? అవన్నీ నన్నే! నన్నే నీచురాలినంటోంది..." అని ఉడికిపోయి తన భజన బృందాలన్నింటినీ ఉసికొల్పింది. ఆ భక్తులందరూ పావని మీదా, పురోగామి సంఘంమీదా చేయవలసినంత విషప్రచారం చేసారు.
    బాధపడుతూ ఈ విషయాలన్నీ శిరీషకు వ్రాసిన పావనికి ధైర్యం చెపుతూ శిరీష సమాధానం వ్రాసింది...
    "... ఒక్క భాగీరధమ్మకే బెదిరిపోతే నువ్వేం చెయ్యగలవు? ఈ సమాజం నిండా ఇలాంటి భాగీరధమ్మలు ఎందరో? ఒక మంచిని గ్రహించడానికి మార్పును అంగీకరించడానికీ సమాజం ఏనాడూ ముందుకురాదు కాని, ఉన్న దానికి చిలవలు పలవలు చేర్చి విషయాన్ని అస్తవ్యస్తం చేసి పరిహాసంగా నవ్వటానికి మాత్రం ఎప్పుడూ సిద్దంగానే ఉంటుంది... నువ్వు పోరాడవలసింది కరడుగట్టిన మూర్ఖత్వంతోనని మరిచిపోకు....ఆదిమవాసుల అజ్ఞానాన్ని కరిగించటమైనా తేలికవుతుంది కాని, ఈ అత్యాధునికుల తెలివి మీరిన మౌఢ్యం మాత్రం ఎవరూ తొలగించలేరు. ధైర్యంగా నిలబడు..."
    ఆ ఉత్తరం ఒకటికి పదిసార్లు చదువుకుని చెదిరిపోతున్న మనసును చిక్కబరచుకుంది పావని.
    అనుపమకు సంబంధం నిశ్చయమయింది... పద్మావతికి పావని సమాజం మీద ఎంత కోపంగా ఉన్నా, తలలో నాలుకలా తను కూడా ఉండే పావనిని కష్టపెట్టలేక పోతోంది.
    సాటి స్నేహితులు సమాజాన్ని గురించి అనే మాటలు విఠల్ సహించలేక పోతున్నాడు కానీ, పావని చేస్తున్నది తప్పని అనలేకపోతున్నాడు. ఈ సమాజపు గొడవలనుంచి పావనిని తప్పించాలని అతని కోరిక. కానీ, తన ఎదురుగా బేలగా నిలబడిన పావనిని కఠినంగా ఆజ్ఞాపించలేక పోతున్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS