Previous Page Next Page 
గుళ్ళో వెలిసిన దేవతలు పేజి 10


    అన్ని విషయాలూ మాట్లాడుకుని నిశ్చితార్దానికి ముహూర్తం నిర్ణయించుకోవటానికి అనుపమ అత్తవారి తరపువాళ్ళు వస్తున్నట్లు ఉత్తరం వచ్చింది...
    పావని వంచిన నడుము ఎత్తకుండా అత్తగారికి వంటలూ పిండి వంటలూ చెయ్యటంలో సహాయంచేసింది...
    "వదినా! ఏం చీర కట్టుకోమంటావ్?" అని సలహా అడిగే అనుపమకు నవ్వుకుంటూ చీర సెలక్ట్ చేసి పెట్టింది. ఇల్లంతా నీట్ గా సర్దింది. కుషన్ల కవర్లు మార్చింది. కోర్టునుంచి త్వరగా వచ్చిన విఠల్ పావనిని చూసి నవ్వుతూ "అంతా బాగానే ఉంది. నువ్వే పనిమనిషిలా ఉన్నావ్-త్వరగా తయారవు." అన్నాడు...
    "నేను పని మనిషినే  పని చేసే మనిషిని. నన్ను అలా అనుకుంటే నాకేం చిన్నతనం లేదు..." అని నవ్వుతూ సమాధానం చెప్పి త్వర త్వరగా ముఖం కడుక్కుని ఇస్త్రీ చీర కట్టుకుని తయారయింది.
    ఎదురుచూస్తున్న పెళ్ళివారు వచ్చారు. పావని హడావుడి పడుతూ ఫలహారాలు వాళ్ళముందు పెట్టింది. కానీ వాళ్ళు అవేమీ ముట్టుకోలేదు. వాళ్ళలో ఒక నడివయసు ఆవిడ మాట్లాడటం మొదలుపెట్టింది...
    "మేం మర్యాదలకీ, మన్ననలకీ రాలేదు. అసలు విషయం చెప్పకుండా పోవటం సబబు కాదని వచ్చాం మీ కుటుంబం ఆడది చెడిపోయినా ఫరవాలేదనే కుటుంబమని తెలిసింది. అలాంటి చెడిపోయిన వాళ్ళకోసం సమాజాలు కూడా స్థాపించి సంఘసేవ చేస్తున్నారుట! ఆ సంఘసేవలేవో మీరే చేసుకోండి. మాకంత విశాలభావాలు లేవు. ఏదో సంసార పక్షంగా బ్రతకాలనుకునే వాళ్ళం... ఏ మాటా చెప్పకపోవటం బాగుండదని వచ్చాం-మీరు మరొక సంబంధం చూసుకోండి..."
    వాళ్ళు వెళ్ళిపోయారు...
    "నా కర్మ!" అంటూ పద్మావతి కూలబడి ఏడవసాగింది.
    విఠల్ పావనిని తినేలా చూసి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. అనుపమ తన అలంకరణ తీసేసి ఒక పుస్తకం పట్టుకుని దాని చాటున ముఖం దాచుకుంది.
    పావని స్తంభించిపోయింది.
    ఆ రాత్రి చాలా పొద్దుపోయి ఇంటికి వచ్చాడు విఠల్. పావని వడ్డించిన భోజనాన్ని చేత్తో దూరంగా నెట్టి "భోజనం సంగతి తరువాత. ముందు నువ్విది చెప్పు. ఇప్పటికైనా, ఆ సమాజం, గిమాజం- ఎత్తి పారేస్తావా, లేదా?" అన్నాడు.
    పావని మాట్లాడలేదు.
    "మానవు కదూ!"
    "మీకు తెలుసు, ఎందుకు మానలేవో..."
    "అదంతా నాకు చెప్పకు. నువ్వు ఈ వ్యవహారాలన్నీ కట్టిపెట్టకపోతే నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు-"
    "...నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు..." తలగిర్రున తిరిగింది పావనికి...తరతరాలుగా వస్తోన్న పురుషాహంకారం? విఠల్ కూడా ఇంతేనా? ఒక మామూలు మొగవాడేనా? నా ఇంట్లో ఉండటానికి వీల్లేదని' భార్యను అదలించే భర్త మాత్రమేనా!
    అంతవరకూ జరిగినదానికి పావని తనూ కుమిలిపోతోంది. తనను తాను అపరాధిగా ఊహించుకొని మధనపడుతోంది. చెల్లెలి పెళ్ళి తప్పిపోయినందుకు బాధపడే విఠల్ ణు ఎలా అనునయించాలా అని లక్ష మార్గాలు ఆలోచిస్తోంది...కానీ, విఠల్ ఈ ధోరణి పావనికి బండతనాన్ని తెచ్చిపెట్టింది.
    "మనం కలిసి ఉంటున్నాం! అంతే! నేను మీ ఇంట్లో మీ పోషణలో ఉండటంలేదు..."
    నివ్వెరపోయాడు విఠల్. పావని ఇలా మాట్లాడగలదని ఊహించను కూడా లేదు అతను...
    "ఎంత అహంకారం? చదువుకున్న దనైవని కదూ!" పావని నవ్వింది...
    "ఆడది చదువుకోకుండా అజ్ఞానంలోనే ఉండి అయోమయంలో, అంధకారంలో బ్రతుకుతుంటేనే మీకు బాగుండేది కదూ!"
    "నోర్ముయ్! చదువుకున్నంత మాత్రాన ఇలా అందరూ నీలా వీధిన పడటం లేదు."
    "అవును ఈనాటికీ చదువుకుని కూడా అమ్మలక్కల స్థాయినుండి ఎదగని ఆడవాళ్ళే ఎక్కువమంది ఉన్నారు. తమకు కూడా ఒక వ్యక్తిత్వముందని అర్ధంచేసుకున్న నాబోటివాళ్ళు ఒకరిద్దరుకంటే ఎక్కువమంది ఉండరు..."
    "పావనీ! నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది?"
    "నాతోనే, మీరు ఇలా మాట్లాడుతున్నారు!"
    "ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నన్నే తిరస్కరించటానికి సిద్దపడుతున్నావా?"
    "ప్రేమించారు, మీ అడుగులకు మడుగులొత్తినంతవరకూ, మీ మాట జవదాటనంత వరకూ మీరు ఆడుకునే బొమ్మని ఆప్యాయంగా చూసుకున్నట్లు ప్రేమించారు... ఈనాడు మీరు అంగీకరించలేని ఒక అభిప్రాయం నాకుందని అనగానే నన్ను ఆత్జ్ఞాపించి, అదలించి, బెదిరించి మీ నీడగా మార్చుకోవాలని చూస్తున్నారు..."

                                        


    తెల్లబోయిన విఠల్ కొన్ని నిముషాలు మాట్లాడలేకపోయాడు. "ఓ! అయామ్ సారీ? పావనీ దేవిగారూ! నేను మీ అంత గొప్పవాణ్ణి కాను. అర్ధంపర్ధం లేని సిద్దాంతాలు పట్టుకుని నా బ్రతుకు నాశనం చేసుకునేటంత వెఱ్ఱి నాకు లేదు...మన దారులు కలవనప్పుడు మనం విడిపోవటమే మంచిదేమో!"
    విఠల్ పరిహాస ధోరణికి పావని మనసు గాయపడింది...
    "తప్పకుండా మంచిది మనం విడిపోవటం వల్లనే మీరు సుఖపడగలనని అనుకుంటే అలాగే విడిపోదాం?"
    "నా సుఖం సంగతి నేను ఆలోచించుకోవటంలేదు. పెద్ద కొడుకుగా కుటుంబం సుఖసౌఖ్యాల గురించి ఆలోచిస్తున్నాను..."
    "ఈ ఇంటికి కోడలిగా వచ్చిన నాటినుండీ ఈ ఇంటి సుఖశాంతులనే కోరుతూ అందుకే పాటుపడుతూ వచ్చాను. ఈనాడు మాత్రం మీ అందరి సౌఖ్యానికి అడ్డుగా ఎందుకు నిలుస్తాను? ఇప్పుడే వెళ్ళిపోతాను."
    అంత రాత్రివేళ అప్పటికప్పుడు తన సామాను సర్దుకోసాగింది పావని.
    ఒక్కమాట ఆగిపోమ్మని విఠల్ అంటే ఆగిపోవాలని ఉంది పావనికి...
    పావని తనను వదిలి వెళ్ళిపోతుందని నమ్మలేక పోతున్నాడు విఠల్...
    సమస్యలతో సతమతమయ్యే స్త్రీలకు ఆశ్రయంగా తాను స్థాపించిన 'పురోగామి' సంఘంలోకి తానే ఆశ్రితురాలిగా బయలుదేరింది పావని...
    ఒక్కరోజు విఠల్ కి దూరంగా సంఘంలో గడిపేసరికి జీవితమంతా మోడువారిపోయినట్లు అనిపించసాగింది పావనికి... ఎంతటి కలతలైనా సహించి స్త్రీలు తమ సంసారాలు ఎందుకు వదులుకోలేరో అర్ధంకాసాగింది...
    ఆ సంఘంలో చదువుకునే ఒక విద్యార్ధిని పావని దగ్గిరకొచ్చి "మేడమ్? మీ ఫేమిలీ అంతా ఏదో ఊరు వెళ్తున్నారు. స్టేషన్ లో చూసానని ఇప్పుడే సరోజ చెప్పింది-" అని చెప్పింది.
    పావని కళ్ళముందు అంధకారం అలముకున్నట్లయింది. కనిపించిన ఆటోలో కూర్చుని రైల్వేస్టేషన్ చేరుకుంది. రైలు ఫ్లాట్ ఫాంమీద ఉంది. కంపార్ట్ మెంట్ గేటుముందు నిలబడిన విఠల్ ను చూసి "ఏవండీ?" అని పిచ్చిదానిలా కేక పెట్టింది పావని చెయ్యి జాపుతూ...విఠల్ కూడా చెయ్యి జాపాడు. అంతలోనే రైలు కూత కూసి కదిలింది. రైలు వెనుక పరుగు పెట్టినా విఠల్ చేతిని అందుకోలేకపోయింది పావని.
    
                                               9
    
    పావని పైనా, పావని ప్ర్రారంభించిన ఉద్యమం పైనా పావని అత్తవారి కుటుంబాన్ని కెంత కోపం వచ్చిందో, అంతకు రెండురెట్లు మండిపడ్డారు పుట్టింటివారు.
    "అది అలా చచ్చింది. ఇది ఇలా చాస్తోంది..." అని పావనిని చచ్చిన వాళ్ళలోనే జమకట్టుకున్నాడు జగన్నాథం.
    "ఒక కూతురు కాకపోతే, మరో కూతురయినా సుఖపడుతుందనుకున్నాను. నా కర్మ! ఇద్దరి బ్రతుకులూ బండలయిపోయాయి." అని శోకాలు పెట్టింది సుందరమ్మ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS