.jpg)
" నువ్వు సమాజం స్థాపిస్తానన్నది చెడిపోయిన ఆడవాళ్ళకోసమా? ఆడవాళ్ళు చెడిపోయినా ఫరవా లేదంటున్నావా?"
ఆ కంఠంలో కరుకుదనానికి విలవిలలాడింది పావని మనసు. విఠల్ సహితం ఇలా మాట్లాడితే ఇంక తన కెవరున్నారు? ఏదో మాట్లాడబోయినా మాట గొంతు పెగిలి రాలేదు. కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
పావనిని అలా చూడగానే కరిగిపోయాడు విఠల్ .
"ఇవాళ క్లబ్ లో అందరూ నీ సమాజాన్ని గురించే మాట్లాడుకున్నారు. ఒకరిద్దరు "ఏమిటోయ్? నీ మిసెస్, ఆడవాళ్ళు చెడిపోయినా ఫరవాలేదని ప్రచారం చేస్తోందటగా?" అని హేళనగా నవ్వారు. నేను భరించలేకపోయాను."
విఠల్ కాస్త అనునయంగా మాట్లాడేసరికి పావనికాస్త కూడదీసుకోగలిగింది.
"మన సరళలాగ ఏ ఆడపిల్లా సమాజానికి బలి అయిపోగూడదని నేను సంకల్పించుకున్నాను. అంతే! చెడిపోవటం మంచిదని నే నేనాడూ అనలేదు. అలా అర్ధంచేసుకుంటే నేనేం చెయ్యగలను?"
"ఇలాంటి విషయాలను సమాజం ఏనాడూ సరిగా అర్ధంచేసుకోలేదు. అనవసరంగా అప్రతిష్టపాలవుతాము"
"ఒకమాట మనస్ఫూర్తిగా చెప్పండి. నేను చేస్తున్న పని చెడ్డదా?"
"కాదనుకో! కాని..."
"బాలు మీరు ఈ మాత్రం ఒప్పుకుంటే నేను అనుకున్నది సాధించగలను. ఎవరో అర్ధంచేసుకోలేదని మనం మంచి అనుకున్నది మార్చుకోవాలా?"
"అబ్బ! మన కెందుకొచ్చిన గోల ఇది? వదిలెయ్యరాదూ?"
"ఎవరు మటుకు వారే మన కెందుకొచ్చిన దనుకొంటూ ఉంటే ఇంక ఈ సమస్యలు పరిష్కరించే వారెవరు?"
విఠల్ సమాధానం చెప్పకుండా అటు తిరిగి పడుకున్నాడు పావని పలకరించబోయినా మాట్లాడలేదు. పెళ్ళయిన తరువాత మొదటిసారిగా విఠల్ కి దూరంగా పక్కపరుచుకుని పడుకుంది పావని ఆ రాత్రి పావని కన్నీళ్ళతో దిండు తడిసిపోయింది. కాని పావని సంకల్పంమాత్రం చెక్కుచెదరలేదు.
7
పావని, శిరీష ప్రాణస్నేహితులు. శిరీష చదువుకునే రోజుల్లోనే ఎవరినో పెళ్ళిచేసుకోవాలనుకుంది. కుదరలేదు. ఆ తరువాత అసలు పెళ్ళి ప్రస్తావన వదిలేసింది. యమ్. యల్.ఏ. అయింది. శిరీష పేరులో ఉన్న కోమలత్వం శిరీష శరీరంలో మాత్రమే ఉంది కాని మనసుకి లేదు. చూడటానికి ఎంత నాజూగ్గా సుమారంగా ఉంటుందో దానికి పూర్తిగా వ్యతిరేకమయిన వజ్రసంకల్పం శిరీషది. దేనికీ భయపడని గుండె నిబ్బరం...ఎవరినీ లక్ష్యపెట్టని మనోదార్ధ్యం.
తన సమస్య వివరిస్తూ శిరీషకు ఉత్తరం వ్రాసింది పావని... వెంటనే వచ్చేసింది శిరీష....పావని చాలా ఆనందించింది.
"రాజకీయాల్లోకి దిగావు. నేను రమ్మనగానే వస్తావో, రావో, అనుకున్నాను," అంది.
"మా పావని వంటింటి కుందేలనుకున్నాను, ఇన్నాళ్ళూ - ఈ మాత్రం నడుంకట్టి సంఘంలో కష్టసుఖాలు చూస్తానంటే చెయ్యికలపకుండా ఉంటానా? ఆప్యాయంగా అంది శిరీష.
"నిజంగా వంటింటి కుందేలునే శిరీషా! మా సరళ విషాదజీవితం నన్ను కట్టి కుదుపకపోతే, నేను ఏ విషయమూ ఆలోచించేదాన్ని కాదేమో"
సరళను తలచుకాగానే కన్నీళ్ళు పెట్టుకుంటోన్న పావనిని మరిపిస్తూ "సరేలే! మొత్తంమీద చాలా మంచిపని తలపెట్టావు. కానీ, దీన్నొక పెద్ద సంఘంగా రూపొందిస్తే బాగుంటుంది. మన సంఘంలో ఈనాటికీ చదువు కోవాలనే ఆశ వుండీ, చదువుకునే సదుపాయాలు లేని ఆడపిల్లలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడదీసి చదువుకునే అవకాశాలు కల్పిద్దాం! వెనుకబడిన కులాలని ప్రత్యేకించి చూడకుండా కుల మతాలతో నిమిత్తంలేకుండా చదువుకోవాలనే ఆశ ఉన్న బీద విద్యార్దినుల నందరినీ చేర్చుకుందాం. వాళ్ళతోపాటు దగాపడిన చెల్లెళ్ళకి ఆశ్రయం కల్పిద్దాం? కేవలం దగాపడిన వాళ్లేకాదు. ఏ విధమయిన సమస్యలున్నా మన సంఘంనుండి రక్షణ పొందవచ్చు .... ఇలాకాక కేవలం వంచితులే అంటే "చెడిపోయిన వాళ్ళ సమాజం" అని ఇతరుల చిన్నచూపు చూచే అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాము. అంతేకాదు. వాళ్ళను ప్రత్యేకించి "చెడిపోయిన వాళ్ళు" అని వేలెత్తి చూపినట్లు అవుతుంది. మనం అనుకున్న విధంగా అనేక విభాగాలతో కలుపుకుని సంఘంగా ఏర్పరచుకుంటే, సమాజం విధి వంచితులయిన స్త్రీలను సహజంగా స్వీకరించేలా చెయ్యాలనే మన ప్రయత్నం ప్రాధమికంగా మన దగ్గిరే ప్ర్రారంభమవుతుంది..." అంది శిరీష.
శిరీష అభిప్రాయాన్ని పావని మెచ్చుకుంది. శిరీష మొదటినుండీ ఏ విషయమైనా అన్ని కోణాలనుండీ ఆలోచించేది. తన ధ్యేయం నెరవేరటానికి సామూహికమైన అండదండలు చాలా అవసరం - ముఖ్యంగా శిరీషలాంటి వ్యక్తి తనకు బాసటగా నిలబడితే ఏదైనా సాధించగలరు. సంఘం ఏర్పడ్డాక దానికి గ్రేంట్స్ సేంక్షన్ అయ్యేలాగ ప్రయత్నిస్తానంది శిరీష...
"పురోగామి" సంఘానికి చదువుకుంటామంటూ చాలా మంది ఆడపిల్లలు వచ్చారు. చుట్టుపక్కల పల్లెలనుంచి వచ్చిన ఆడపిల్లలు నాలుగువందలమంది దాకా ఉన్నారు. అంతమందిని చూసి ఆశ్చర్యపోయింది పావని జాగ్రత్తగా పరిశీలించి, కులమతాలతో నిమిత్తంలేకుండా, తెలివితేటలుండీ, చదువుకొనే స్థోమతులేని విద్యార్ధినులను రెండువందలమందిని చేర్చుకుంది. విద్యార్ధినులు కాని వాళ్ళు వేరు వేరు సమస్యలున్నవాళ్ళు కూడా ఒక పాతికమంది వచ్చారు. శిరీషతో సంప్రదించి వాళ్ళను కూడా చేర్చుకుంది పావని....ఒక్కొక్కరి గాధ వింటోంటే స్త్రీ జీవితంలో ఎన్నెన్ని సమస్యలున్నాయో అర్ధంకాసాగింది పావనికి ... ఇంతవరకూ సాధించిన అభ్యుదయం ఏపాటిదనే నిరాశ కూడా అలముకుంది.
"నా భర్త చచ్చిపోయాడు. ఆయనకు నేనంటే చాలా ప్రేమ. ఆస్తి నా పేరనే రాసాడు. ఆ డబ్బుకోసం నా మరుదులిద్దరు కాచుకుని కూచున్నారు-భర్తపోయిన దుఃఖంలో ఉన్న నన్ను నా చిన్న మరిది బలవంతంగా పెళ్ళి చేసుకున్నాడు. అతడు నాకంటే చిన్నవాడు. మొదటినుంచీ నా బిడ్డలా చూసాను. ఈనాడు డబ్బుకోసం ఇంతటి నీచానికి తలపడ్డాడు. ఆ ఇంట్లో ఉండలేక పోయాను. సాహసించి వచ్చేసాను. నాకు తల్లీ, తండ్రీ లేరు. అన్నదమ్ముల కుటుంబాల్లో సర్దుకుని అణగి మణగి గతిలేనిదానిలా పడి ఉండటానికి నాకేం కర్మ కాలింది? ఒంటరిగా ఉంటే? "లేచి వచ్చిన మనిషి!" అని సంఘం పొడుచుకు తింటుందని భయం పెళ్ళికాకపోయినా ఫరవాలేదు మొగుడు చచ్చినా బాధలేదు. ఏదో ఒక మొగుడంటూ ఉండి ఆ బారినుండి బయట పడటానికి ఏ మార్గమూలేదు..." అంది పాతికేళ్ళు నిండని ఒక యువతి.
"మేడమ్! పిల్ వేసుకుంటే ఫరావాలేదన్నారు. నర్స్ నడిగాను. పిల్స్ ఇచ్చింది. ఫరవాలేదనుకున్నాను. కానీ, కానీ, వచ్చేసింది, అదే - ప్రెగ్నెన్సీ - భయమేసి మొదట్లో ఇంట్లో చెప్పలేదు. చెప్పకపోయినా తెలిసిపోతుందిగా! తెలిసిపోయింది - ఇంట్లోంచి పొమ్మన్నారు - ఇక్కడ ఉండనిస్తారా? నాకు చచ్చిపోవాలంటే చాలా భయం..."
కన్నీళ్ళతో బెదురు చూపులతో, అజ్ఞానంతో, మాట్లాడటం కూడా సరిగా రాని ఒక పదహారేళ్ళ హైస్కూల్ విద్యార్ధిని గోడు-ఫేమిలీ ప్లేనింగ్ పరిజ్ఞానం చివరికి ఇలా దారితీస్తోంది! సరిఅయిన విజ్ఞానం లేకపోవటంవల్ల కలిగే పరిణామాలివి! ఈ అమాయకులకు ఎవరు చెప్తారు? స్కూల్స్ లోకాని కాలేజెస్ లోకాని చెప్పరు. ఇంట్లో అసలు చెప్పరు. అన్నింటికంటే దారుణం ఈ పిల్లలు ప్రెగ్నెన్సీ రాకపోతే ఫరవాలేదనుకోవటం....అంతకుమించిన ప్రాధాన్యం ఈ ప్రణయ వ్యవహారాలకు ఇయ్యకపోవటం.
ఆ పిల్లలో చాచల్యం స్పష్టంగా కనిపిస్తోన్న మాట నిజమే! కానీ, చిన్నపిల్ల, మొదటే ఇంట్లో పెద్దవాళ్ళుకాని. స్కూల్స్ లో టీచర్లుకాని అదుపులోపెట్టి ఉంటే దారిలోకి రాకపోయేదా?
