ఆ శుక్రవారం నాడు జనం తండోపతండాలుగా దిబ్బ దగ్గరకి వెళ్ళేరు. ఆశ్చర్యం! - దేవుడు వెలిసేడు. అందమైన ప్రతిమ రూపంలో హుందాగా వెలిసేడు.
అంతే!
అక్కడ్నుంచి ప్రారంభమయ్యింది అలజడి. గుడి కట్టేసేరు. భక్తులు వస్తున్నారు. మొక్కులు మొదలయ్యేయి. తరచూ, పూనకాలు వస్తున్నాయి తద్వారా. రోజు రోజుకీ కొండదేవుడి ప్రతిష్ట పెరిగి పెద్దదవుతోంది. జనం ఎక్కడెక్కడ్నుంచో వస్తున్నారు. దేవుడ్ని దర్శిస్తున్నారు. జనం కోసం టీకొట్లు వెలిసేయి. కొబ్బరికాయలూ, పూలూ, పూజాద్రవ్యాలూ వగైరాలు అమ్మే దుకాణాలు కూడా వెలిశాయి. భక్తులు ఒకటీ రెండు రోజులుండేందుకు వసతి గృహాలూ, ధర్మసత్రాలూ కూడా ఏర్పాటయ్యేయి. వీటిని నమ్ముకున్న జనం కాపురాలు పెట్టేసేరు. దానా దీనా అక్కడ ఒక చిన్న వూరే తయారయ్యింది.
అదిగో....
సరిగ్గా అప్పట్నుంచే చిన్నబ్బాయి దిగులు పూర్తిగా తొలగిపోయింది. కొండదేవుడి దయవల్ల బెస్తవాడకి బస్సులు నిండుగా వెడుతున్నాయి. రోజుకి రెండు మూడు ట్రిప్పులు ఎక్కువగా కూడా వేయవలసి వస్తోంది. చూస్తుండగానే తెల్ల ఏనుగులాంటి ఆ బస్సురూటు కామధేనువై పోయింది.
తమ్ముడి దశ చూసిన అన్నకి వళ్ళు మండిపోయింది. తన కళ్ళముందే - ఆ బెస్తవాడ రూతుతో నాశనమైపోతాడనుకున్న తమ్ముడు అదే రూటులో బంగారం తినడం అతను సహించలేకపోయాడు. అందులో ఆ రూటు మొత్తం తమ్ముడిదేనాయే! పోటీ లేదాయె!
తనని చూడటానికి వచ్చిన పెద్దబ్బాయితో అన్నాడు చిన్నబ్బాయ్,
"పెద్దోడా! అయ్య నాకు అన్యాయం చేసేడని మా ఆడంగులు ఏడ్చేరేగాని నేనేడవలేదు. ఎందుకంటావ్. అయ్య ప్రజలకింత అన్నం పెట్టేడు. అట్టాంటోడు నాకు పెట్టడా? అయ్య మనస్ఫూర్తిగా యిచ్చిన రూటుని నేనెందుకు కాదనాలని పుచ్చుకున్నాను. పైగా ఆ రాత్రే అయ్య నా కల్లో కనిపించి రేయ్ సిన్నోడా! మానవసేవే మాధవ సేవర సన్నాసీ! సేవచేయడం నీ వొంతు. నిన్ను కాపాడ్డం పైనోడొంతూ అన్నాడు. అయ్యే కొండదేవుడుగా ఎలిసేడు. నా కింత వన్నం పెడుతున్నాడు"
అంతా విన్న పెద్దబ్బాయి ఉబికిన కన్నీటితో వెళ్ళిపోయాడు.
* * *
"ఇన్నావా పంతులూ! ఇదీ కత! ఆ దేవుడెవడనుకుంటున్నావ్. మా అయ్య! కన్ను కన్నోడు!"
"అంటే చిన్నబ్బాయ్ తమరేనా సార్!"
"అవున్నేనే! మా వూర్లో పూనకాలేర్పాటు చేసి స్రావణ సుక్రువారం నాడు అక్కడ రాతిబొమ్మని నాటిందీనేనే! అన్నీ నేనే! నా బస్సురూటు బంగారంతో నిండాలని అంతపన్జేశాను. దాని మూలకంగా ఏవైంది? ఇప్పుడక్కడ పెద్దవూరు ఎలిసింది. ఎంతోమంది ప్రజలు, దేవుని పేరు మీద బతికేస్తున్నారు. ఆళ్ళతోపాటు నా దేవుడు బతుకుతున్నాడు. ఏం తప్పా? ఇదేమైనా లంజతనమా? మరొకటా! నేను బతకాలనుంటే ఏవైనా చేస్తాను. నీకుమల్లె ఉజ్జోగం చేయడానికి బామ్మ నాకు చదువు చెప్పించలేదు. మరేం చేసేది? ఎట్టాగో అట్టాగ బతకాలి. నేను బతికి పదిమందిని బతికించేనోయ్ పిచ్చోడా! వొదిలేయ్ ఇంత చేసి నేను పెద్దోడ్నవుతుంటే.. ఈ గవర్నమెంటోళ్ళకి నా సిరిమీద కన్నుబడి నా బస్సురూటుని జాతీయం చేసేరు. నా చేతిలో బంగారు ముద్దని గెద్దలాగా తన్నేసేరు. అట్టాంటప్పుడు నా గతేంటి? నేనెట్టా బతకాలి? మళ్ళా బతికేను. నా రూటు లాక్కుని నన్ను కుదేలు చేసేరు గనక ఇంకో తోవ ఎతుక్కున్నాను. ప్రజా సేవలో యిరుక్కున్నాను. రాజకీయాల్లో దిగేను. తప్పా! ప్రజాసేవ మాకలవాటే! మా అయ్య చేసేట్ట అయ్యకి మా వూళ్ళో గొప్ప పేరుంది. అయ్యలేడు గనక అయ్య పేరుమీద అయ్యాలాటోడ్నే పోయేను. అయ్య పేరు మీద రాజకీయంలో అడుగెట్టేను. నేను పలానోడి కొడుకుని నాకు మీ ఓటెయ్యండని అడిగేను. నోరెత్తలేదు నా ప్రజలు. ఏ పదవీ లేకుండానే కొండ దేవుడి పేరుతో ఊరుకట్టినోడ్ని పదవిలో ఉంటే దేశాన్నే కడతాను. ఈల్లేకపోతే కొడతాను. కట్టి కొడతాను. కొట్టి కడతాను. ఈడు దేనికైనా తగ్గోడు. తీసెయ్. మీ చదూకున్నోళ్ళకి అనుబవేంటి? ఆరూమూడు తొమ్మిదన్నంత వరకూ మీరూ కరెక్ట్! ఏడని నమ్మించే తెలివి మీ కేడది? కనక పంతులూ! జాగర్త! వొళ్ళు దగ్గిరుంచుకుని ప్రవర్తించు. నీ పవరేంటో తెలుసుకుని మసులు. పొద్దున్న మా వోళ్ళ ముందు మా దేవుడ్ని తిట్టావ్! ఏంటయ్యా ఇదని అడిగితే నీ మనసులో నన్ను తిట్టుకున్నావ్.... మాటాడకింక.. నీ మీంచొచ్చేగాలి వోసనచూసి సంగతేంటో తెలుసుకుంటా? నన్నుగానీ, నా దేవుడ్ని గానీ తక్కువ సేయమాకు. నా దేవుడి ముందు నవ్వుతా, ఏడుస్తా అనేకం చేస్తా - న నన్ను గిల్లేందుకు నీ కెంతదన్ను? నేనూ, నా దేవుడూ అంటే ఇక్కడోళ్ళు ప్రేణాలిస్తారు. అంతెందుకు? ఇయ్యాల నాకై నేనే ఎల్లి "రేయ్ సన్నాసులూ, ఆడు దేవుడు కాదురా. నే పాతిన రాయిరా అన్నా ఇనరు నా ప్రజలు. ఎందుకంటావ్ ఆళ్ళు ప్రజలు గనక నా లాటోడ్ని నమ్ముకున్నారు. నాకు ఓట్లేసేరు, ఒద్దొద్దన్నా ఇనరు. నువ్వెంతింక ఎల్లిపో... ఎల్లిపోయి నిద్రపో... తెల్లారేవొచ్చి లేపు.. ఎల్లు" అంటూ పవళించేడు పైడయ్య.
సుందరం లేచి నించుని పైడయ్య గారికి చేతులు రెండూ జోడించేడు. అప్పుడతనికి పైడయ్యగారు గీతలో కృష్ణ పరమాత్మలా శేషతల్పమ్మీద విష్ణుదేవునిలా గోచరించేరు. సుందరం హృదయంలో తన యజమాని పట్ల భక్తిభావం పొంగుకురాగా తడబడే అడుగులతో ఆ గది విడిచేడు.
* * *
