గోపాలం భక్తి కథ
గోపాలం సి.ఎ. చదివిన కుర్రాడు. కుర్ర ఆడిటర్. ఆడిటింగ్ సంబంధించిన వర్క్ లో అతను చాకు, బాకు, కత్తి అన్నీను. గోపాలం సొంత ఊరు గుడివాడ.
హైదరాబాదులో ఉద్యోగం. అంచేత అతను హైదరాబాద్ అశోక్ నగర్ లో అందమైన రెండు గదులు పోర్షన్లో అద్దెకుంటున్నాడు. గోపాలం తల్లిదండ్రులు గుడివాడలోనే ఉంటున్నారు. వాళ్ళకు గోపాలం ఒక్కడే సంతానం. గోపాలం తండ్రిగారు గుడివాడలో లెక్కల మాస్టారుగా రిటైరయ్యేరు. ఆయన రిటైరైనా - విద్యార్ధులు మాత్రం ఆయన్ని విడిచి పెట్టడం లేదు.
ఆయనకు లెక్కల్లో మంచి పేరుండడం వల్ల ఆయన దగ్గర ట్యూషన్ కోసం విద్యార్ధులు బ్యాచిలవారీగా రోజంతా వస్తూనే వుంటారు. అయన కాగితమ్మీద చేసే లెక్కలు మాత్రమే కాదు-జీవితమ్మీద చేసే లెక్కలక్కూడా తిరుగుండదు. అన్ని లెక్కలకి కరెక్టు ఆన్సర్లే వస్తాయి. నూటికి నూరు మార్కులు ఖచ్చితంగా పడతాయి.
ఇక గోపాలం విషయానికొస్తే - దేవుడున్నాడో లేడో అతనికి తెలీదు. తెలుసుకోవలసిన అవసరం కూడా తనకి లేదని అందరికీ చెబుతాడు.
కలడు కలడనే వాడు కలడో లేడో అనే వెతుకులాటలో బతుకాట ప్రారంభిస్తే సరైన సమాధానం ఎట్లాగూ దొరకదు సరికదా- జీవితం అశాంతిమయమవుతుందని - గోపాలం చదువుకునే రోజుల్లోనే తెలుసుకున్నాడు.
అందువల్ల - 'దేవుడున్నాడు' అనే సూత్రాన్ని గోపాలం త్రికరణశుద్ధిగా నమ్మి బతుకుతున్నానంటాడు.
అందువల్ల - దేవుడున్నాడనే భయంతో, భక్తితో కేవలం మంచి పనులకు మాత్రమే అంకితమై వున్నానని కూడా ప్రకటిస్తాడు.
అంచేత - దేవుడనేవాడు నిజంగా వుండి వుంటే తనకోసం పుణ్యలోకంలో ఒక సీటు రిజర్వు చేసి వుంటాడని గోపాలం యొక్క నమ్మకం. దాంతోపాటు 'గోపాలం ఉత్తమ పౌరుడ'నే కీర్తి - భూలోకంలో తాను ఎక్కడుంటే అక్కడ వినపడుతోందని చెబుతాడు.
ఇంత మంచి వాతావరణంలో తాను బతుకుతున్నప్పుడు ఉన్నాడున్నాడను కుంటున్న ఆ దేవుడు లేక పోయినా సర్దుకుపోగలనంటాడు.
తన మాదిరి కాకుండా దేవుడనే వాడు లేడు లేడనే నమ్మకంతో బతికే మనిషికి బయభక్తులు బొత్తిగా వుండవంటాడు. అటువంటి మనిషికి పాపం పుణ్యం యొక్కనిర్వచనాలు పట్టించుకునే అవసరం కూడా వుండదంటాడు. తాను ఏమి చేసినా అడిగేవాడు లేడనే ధీమాతో ఏమైనా చేయగల 'చొరవ' ఆ మనిషికి సొంత మవుతుందని అప్పుడప్పుడు చెబుతుంటాడు.
అంచేత -
దేవుడు లేడు లేడని ప్రచారం చేసే మనిషి కనిపించినప్పుడు-ఆ మనిషి పట్ల జాలిపడుతుంటాడు గోపాలం.
లేడు లేడనుకున్న దేవుడు వుండి వుంటే - ఆ మనిషి గతేంగాను అని ఆందోళన కూడా పడుతుంటాడు.
ఈ నేపథ్యంలో - ఆదివారం ఉదయం గోపాలం సూర్యనమస్కారం పూర్తిచేసుకుని గదిలోకి వస్తుండగా తన మొబైల్ ఫోన్ రింగైంది. పార్ధసారథి చేస్తున్నాడు.
"హలో" అన్నాడు గోపాలం.
"నేనురా! పార్దుడ్ని మాటాడుతున్నాను!" అన్నాడు పార్ధసారథి తన దైన ధోరణిలో.
"తెలుసు, విషయం చెప్పు!" అన్నాడు గోపాలం.
"హైదరాబాదు వచ్చాను!"
"అవునా?" ఆనందంగా అన్నాడు గోపాలం.
"ఇప్పుడు ఇక్కడ్నించే మాట్లాడుతున్నాను!"
"విశాఖపట్నం నుంచి ఎప్పుడొచ్చావ్? ఎందుకొచ్చావ్?" అడిగాడు గోపాలం.
"వివరాలన్నీ అడగ్గానే టకటకా చెప్పడం పద్దతి కాదు. నాకు ఇష్టం లేదు కూడాను. అయినా ఫోన్లోకంటే నీతో డైరెక్టుగా మాటాడితేనే బాగుంటుంది. నాకు తృప్తిగానూ వుంటుంది. ఇంతకీ నీ పూజ పూర్తయిందా?" అడిగాడు పార్ధసారథి.
"ఊ... అయ్యింది!" అన్నాడు.
'మరింకే! ఎందుకాలస్యం? తక్షణం బయలుదేరి హోటల్ స్వాగత్ కి వచ్చేయ్. బ్రేకుఫాస్టు... లంచ్... ఇక్కడే నా గదిలోనే కానిచ్చేద్దాం... కానిచ్చేస్తూ మాటాడుకుందాం. ఓకె..?" అని సెల్ ఫోన్ ఆఫ్ చేశాడు పార్ధసారథి.
పార్ధుడనబడే ఈ పార్ధసారధి గోపాలానికి ప్రాణ మిత్రుడు. దేవుడు లేడనే మనిషి విశాఖపట్నంలో వ్యాపారం చేసుకుంటున్నాడు. ఆ వ్యాపారంలో అతను అతి కొద్దికాలంలోనే అధికంగానే ఆర్జించేడు. తన ఆర్జన గురించి ఎవరైనా మెచ్చుకుని-
అంతా దేవుడి దయ అని కామెంటు చేస్తే మొహం మాడ్చుకుంటాడు. "నో...నో...! మధ్యలో దేవుడు ఎవడండి? ఇదంతా 'స్వశక్తి' అని ఎంతో ధీమాగా, గర్వంగా చెబుతాడు.
దేవుడు లేడన్న మనిషికి - దేవుడి మీద భయభక్తులెందుకుంటాయి? కాకపోతే పార్ధసారథి తన సొంత అభిప్రాయాలు ఇతరులమీద రుద్దడు.
అంతేకాదు - స్నేహితులెవరైనా గుళ్ళూ, గోపురాలకు వెళుతున్నప్పుడు వాళ్ళతో పార్ధుడు కూడా వుంటాడు. అందర్నీ గుళ్ళోకి పంపించి తాను మాత్రం మండపమెక్కి కూచుంటాడు. అదేమిటని ఎవరైనా అడిగితే - ముసిముసిగా నవ్వుతూ 'అదంతే అంటాడు', అప్పుడప్పుడు 'అది మన రూలు' అని కూడా అంటాడు.
* * *
హోటల్ స్వాగత్ కి వచ్చేడు గోపాలం. రిసెప్షన్ లో పార్ధసారధి రూమ్ నెంబరు కనుక్కుని అతని గదిలోకి అడుగుపెట్టాడు. ఒక్కసారిగా గోపాలాన్ని చూసి ఆనందంగా అన్నాడు పార్ధసారధి.
"వెల్ కమ్ ఫ్రెండూ... వెల్ కమ్. ఆలస్యమైనా ఫర్లేదు. వచ్చేవ్ - అదే పదివేలు. చెడ్డ ఆకలిగా వుంది ఫ్రెండూ! నువ్వు రావడం - ఇంకో అయిదు నిమిషాలు లేటైతే అయ్ విల్ బి అవుట్! స్పృహ తప్పి పడిపోయేవాడ్ని!"
"అది సరే! బ్రేక్ ఫాస్ట్ కి ఆర్దరిచ్చేవా? ఇవ్వాలా?" పార్ధసారధిని అడిగేడు గోపాలం.
