అందువల్ల అలాంటి మనిషికి అంత ఎక్కువ డబ్బు వుండటం ప్రమాదం కానేకాదు. ఈ జాతి మనుషులు అరుదుగా భూమ్మీద అవతరిస్తుంటారు. ఆ మనిషి ఎదుటివాడికి అపకారం చేయక పోవడం వల్ల ఆ మనిషినే దెబ్బ తీసేడు దేవుడు.
శేషయ్యగారికి పెళ్ళయిన నాలుగేళ్ళలో ఇద్దరు మగపిల్లల్నిచ్చి కన్ను మూసింది ఆయన్ని కట్టుకున్న ఇల్లాలు. రెండో పెళ్ళి కొరకు చాలామంది పెద్దలు శేషయ్యగార్ని ఒత్తిడి చేసేరుగానీ, ఆయన మంచితనం అందుకు వప్పుకోలేదు.
శేషయ్యగారు కర్మ సిద్దాంతాన్ని బాగా నమ్మినమనిషి, ఏ జన్మలో చేసిన ఏ పాపమో ఈ జన్మకి కొట్టేసి తన భార్యని కడుపునా పెట్టుకుందని ఆయన పూర్తి విశ్వాసం కనీసం ఈ జన్మలోనైనా కొన్ని మంచిపనులు చేయాలని తలంపుకొచ్చేరు.
ఆయన చేసిన వందలాది మహోపకారాల్లో ఒకటి. ముఖ్యమైనది ఇక్కడ ముచ్చటించాలి.
వాళ్ళ ఊరికి దూరంగా -ఎక్కడో విసిరేసినట్టు - సముద్రపుటంచున - బెస్తవాడ అని పల్లె వుంది. అక్కడ రెండుమూడొందల గుమ్మాలున్నాయి. తగ్గట్టు జనాభా వుంది. సముద్రంలో దొరికే చేపలమీద ఆధారపడి వాళ్ళంతా బతుకుతున్నారు. వాళ్ళ చేపల వ్యాపారం చాలా బాగా సాగే అవకాశం రవాణా సౌకర్యాల్లేక పోగొట్టుకుంటున్నారు.
శేషయ్యగారి దృష్టి బెస్తవాడ మీద పడింది. అమాయకులూ, నిరుపేదలూ అయిన ఆ మనుషుల్ని ఉద్దరించాలనుకున్నాడు.
అప్పటికే కొన్ని మంచి వూళ్ళకి వారి బస్సులు లాభసాటిగా నడుస్తున్నాయి. బెస్తవాడకి బస్సు ఏర్పాటు చేసే మాటయితే - ఆ బస్సుకి కాలే పెట్రోలు ఖర్చు దండగవుతుందని ఒక లెక్క! పైపెచ్చు ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్నులూ వగైరాలు అదనపు ఖర్చు. అందువల్ల బస్సు యజమానులెవ్వరూ ఆ పక్క బస్సు ఏర్పాటు మాటెత్తలేదు.
ఆపని శేషయ్యగారు తలపెట్టారు. ఆత్మీయులు ఈ ప్రయతాన్ని హర్షించలేదు. దానధర్మాలు చేయవచ్చుగానీ, ముందూ వెనకలు ఆలోచించాలన్నారు. ఆ రూటు తెల్ల ఏనుగనీ, ఎంత హైవేజైనా హరించగలదనీ, నీ తర్వాత నీ పిల్లలిద్దరి సంగతేవిటని నిలబెట్టి సంజాయిషీ అడిగేరు. తలపెట్టిన మంచి పనులకు సంజాయిషీ లివ్వడం ఆయనకు అలవాటు లేదు. తత్ఫలితంగా, సన్నిహితుల అభీష్టానికి విరుద్ధంగా, బెస్తవాడకి బస్సురూటు ఏర్పాటు చేయించి, ఆ ప్రజలకి వీలుగా బస్సులు నడపడం ప్రారంభించేరు.
ఒక పక్క శేషయ్యగారు ఈ విధంగా సమాజోద్ధరణకి నడుం కట్టి తన బ్రతుకు అందుకే అంకితం చేసి సేవ చేస్తుంటే -ఆ ఇంట్లో తన పిల్లలిద్దరూ తండ్రికి పూర్తిగా దూరమై కలుపు మొక్కలు పెరిగినట్టు పెరుగుతున్నారు.
సంఘశ్రేయస్సు కొరకు అహోరాత్రుళ్ళు పనిచేసే తండ్రి పిల్లలిద్దర్నీ పూర్తిగా మరిచిపోయాడు. కన్నంత వరకే వాళ్ళకాయన తండ్రయ్యాడే గాని వాళ్ళని పెంచే బాధ్యతని విధవప్పగారికి వప్పగించేరు.
మనిషి బతకడానికి డబ్బే ప్రధానమని నమ్మిన ఆడది ఆ విధవప్పగారు. ఆ డబ్బు దేవుడెల్లాగో యిచ్చేసేడు, గనక పిల్లల కొచ్చిన ఇబ్బంది మరేం లేదని ఆ ఇద్దర్నీ గారాంగా. ముద్దుగా పెంచి పాడు చేసింది. చదువుకోసం పిల్లముండా వాళ్ళు కష్టాలేం పడగలరని. వాళ్ళకి చదువు రానీకుండా జాగ్రత్త పడింది. ఆరోగ్యకరమూ, పుష్టికరమైన తిండి పెట్టినవాళ్ళని మేసింది. అందువల్ల పొట్టకోసినా అక్షరం ముక్కలేని మొద్దబ్బాయిలై పోయేరు పిల్లలు!
చదువులో ఎంత మొద్దులైనా, లోక జ్ఞానం వగైరా విషయాల్లో చాకులై పోయారు. ఇక్కడ మాత్రం వాళ్ళ మేనత్తగారు తగు జాగ్రత్తలు తీసుకున్నారు.
శేషయ్యగారు బెస్తవాడకి బస్సు లేర్పాటుచేసిన సంవత్సరంలోనే పిల్లలిద్దరికీ పెళ్ళిళ్ళు గూడా చేసేసేరు.
ఆ తర్వాత శేషయ్యగారికి దేవుడు కబురంపేడు. "చేసిన సేవ చాలుగాని, చోటు మార్చి స్వర్గానికి వచ్చేయ్ నాయనా. నీకో స్వర్ణ సింహాసనం సిద్దంగా వుందీ ఆవటాని! శేషయ్యగారు మరణశయ్య నుండి కొడుకులిద్దర్నీ పిలిచేడు, ఆస్థి పంపకాలు దూరదృష్టితో చేసేడు. ఈ పంపకాల్లో కూడా సంఘసేవని మరిచిపోలేదాయన.
చాలా ఎక్కువ రొక్కం. ఎక్కువ స్థిరాస్థిలతో పాటు బెస్తవాడ బస్సురూటు భాగం అతి తక్కువ రొక్కం. కొంచెం భూవసతీలతో పాటు బంగారం లాంటి బస్సు రూట్లు మరో భాగం. ఇట్లా ఏర్పాటుచేసి చెరొక భాగం తీసుకోమన్నాడు కొడుకుల్ని. అయితే బెస్తవాడ బస్సు రూటుని మాత్రం ఏ పరిస్థితులోనూ అన్యాయం చేయరాదని ఆంక్ష పెట్టాడు.
పెద్దబ్బాయి, తన భార్య తరఫున వాళ్ళతో సంప్రదించి అతి తక్కువ రొక్కం కొంచెం భూవసతీ మరియూ బంగారం లాటి బస్సు రూట్లను తన భాగంగా ఇవ్వమని కోరేడు.
చిన్నబ్బాయ్ చిక్కుల్లో పడ్డాడు. ఎంత రొక్కం. ఎంత స్థిరాస్తీ వగైరాలు తనకొచ్చినా, ఆ బెస్తవాడ బస్సు రూటు ఆ రెండేళ్ళలో మొత్తాన్నీ తినేస్తుందని అతనికి బాగా తెలుసు. అయితేనేం జరగవలసిన పంపకాలు జరగనే జరిగిపోయాయి. పంపకాలు జరిగిన మూడో నాటికి తండ్రి స్వర్గానికి వెళ్ళిపోయేడు.
అక్కడ్నుంచి చిన్నబ్బాయికి కష్టాలెక్కువయ్యాయి. ప్రాణానికి సుఖం లేక పోయింది. 'మీ నాన్నా! మీ అన్నా నీకు అన్యాయం చేసేరు. నీ వెనక ఎన్ని లక్షలుంటే ఏం గాక -బెస్తవాడ బస్సు రూటు నిన్ను తినేసే మాట నిజం' అని అతని అంతరాత్మతోపాటు, ఆత్మీయుల పరామర్శలు గూడ అతన్ని కృంగదీస్తున్నాయి. ఈ కష్టాల్ని ఎట్లా దాటేసేయేలాఅని రేయింబవళ్ళు ఆలోచించేడు.
ఎట్టకేలకు అతనికొక ఆలోచన వచ్చింది.
ఒక శుభోదయాన ఆ ఊళ్ళో ఒక భక్తుడు ఊగిపోయేడు. కొండదేవుడుట..బెస్తవాడకి ఒక మైలవాతల పొదల్తో నిండిన దిబ్బమీద వెలుస్తున్నాట్ట!.... ప్రజలందర్నీ సిద్దంగా వుండమని హెచ్చరించేడు.
ఈ పూనకం ఊళ్ళో వాళ్ళకి అబ్బురమనిపించింది.
ఇదిజరిగిన మూడో నాటికి మరో వీధిలో మరో భక్తురాలి వంటిమీదికి కొండదేవుడు వచ్చేసి హంగామా చేసేడు. బెస్తవాడకి ఒకమైలు ఇవతల వగైరా వగైరాలే పూనకం ద్వారా తెలీజేసేడు. అదే రోజు మరో పేటలో మరో కుర్రాడు కూడా పూనేసేడు. అతనూ అదే చెప్పేడు.
వారం రోజులపాటు ఈడిటో పూనకాల్తో ఊరు ఊరంతా పూనకాల్తో అట్టుడికినట్టు వుడికిపోయింది. ఆ ఊరి పూనకాల వార్త పక్క వూళ్ళకి పాకింది. ఏ నోట విన్నా కొండదేవుడు - బెస్తవాడ!
రానురానూ ఆ దేవుడు ఎప్పుడు వెలిసేది కూడా పూనకాల్లో బయటపడింది. ఒక శ్రావణ శుక్రవారం నాడు ఫలాని ఇన్ని గంటలకు ఆ దిబ్బమీద వెలుస్తున్నట్టు ఖచ్చితంగా చెప్పేసేడు.
