ఆమె తన భార్య. ఆమె మీద తనకుసర్వధికారాలు ఉన్నాయి. ఆమె నెంతో గాడంగా ప్రేమిస్తున్నాడు. ఆమెను దగ్గరకు తీసుకుని తనలో కరిగించేసుకుంటే కాదనే అధికారం ఎవరికీ లేదు. కాని తన ముఖంలోకి స్థిరంగా చూసే జానకి చూపులతో చూపులు కలిసినప్పుడు తనకు ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు.
ఆ కళ్ళల్లో అ శక్తి ఎక్కడిది?
అతి అమాయకంగా కనిపించే జానకి ఆ శక్తి ఎలా సంపాదించగలిగింది?
ఆనాడు తనకి కనిపించిన మెరుపులు మళ్ళీ జానకి కళ్ళలో చూడగలిగితే !
మరుక్షణంలో జానకి ఏం మాట్లాడుతుందో కూడా లెక్కచెయ్యకుండా తన గుండెల్లోకి తీసుకోగలిగేవాడు కాని, జానకి కళ్ళల్లోని ప్రకాశంలో ఆనాటి మెరుపు కాదు కనిపిస్తున్నది.
ఏది దృడ నిశ్చయం. అంతులేని స్థిరత్వం. మళ్ళీ ఆ మెరుపుల్ని ఎలా చూడగలడు తను? అత్తవారింట్లో కుడికాలు మోపుతున్న జానకి హృదయం ఏదో అవ్యక్త ఉద్వేగంతో ఊగిపోయింది. మనసులో ఎన్నెన్నో స్వరాలు ఘోషపెట్టాయి. ఒక్క నిట్టుర్పుతో ఆ ఘోషనంతా అణిచేసి స్థిరంగా అడుగు లోపల పెట్టింది జానకి.
ఆప్యాయంగా తనకు దృష్టి తీస్తున్న కాత్యాయని సమక్షంలో జానకి కరిగిపోయింది.
జ్ఞానం వచ్చీ రాని దశలో తల్లి ఆప్యాయత ఏం రుచి చూసిందో అంతే! బుద్దేరిగిన తరువాత నిరాదరణ తప్ప అభిమానమనేది అనుభవానికి దూరమైంది.
కళ్ళనిండా మమకారం, నింపుకొన్న ఆ రాగమయిని అల్లెసుకుంది అర్తతప్త హృదయానికి జానకి. "నాకెవరు దృష్టి పెడతారు?"
లజ్జతో కూడిన చిరునవ్వుతో సిగ్ధస్వరంతో నెమ్మదిగా నవ్వింది.
"ఎవరి దృష్టిదాకానో ఎందుకు? నా దృష్టి చాలదూ ? ........పెళ్ళి పీటల నువ్వు కూచున్న క్షణం నుంచీ నీమీద నించి చూపు తిప్పుకోలేకుండా ఉన్నాను. నీది కేవలం సౌందర్యం కాదు జానకీ! ఒక్క అందానికి నేనెంత ముగ్ధురాలిని కాలేను. నీలో ఏదో మధుర్యముంది. అది నీ కళ్ళల్లో ప్రతిఫలిస్తుంది. అదే నన్నింత ఆకర్షించింది. నేనెప్పుడూ నీలాంటి కోడలు రావాలనే కోరుకునేదాన్ని. కాని, ఆ కోరిక తీరుతుందని ఎప్పుడూ అనుకోలేదు. అసలు దాన్ని గురించి ఆలోచించనేలేదు. మాధవ ఎవరిని భార్యగా గ్రహిస్తే ఆమెనే ఈ ఇంటి కోడలుగా స్వేకరించటానికి తయారుగా ఉన్నాను. అదృష్టవంతురాలిని . నా కోరికా, కర్తవ్యమూ కలిసిపోయాయి."
ప్రశాంతంగా నవ్వుతున్న కాత్యాయని కళ్ళల్లోకి ముగ్ధురాలై చూసింది జానకి. తన చేతిని మృదువైన ఆవిడ చేతులలో ఉంచింది. ఆప్యాయంగా జానకి చేతిని గ్రహించింది కాత్యాయని.
"ఈవిడ దగ్గర జీవించడం నేర్చుకోగలను. నిండుగా మనిషిలా బ్రతకగలను. నిజంగా అదృష్టవంతురాలిని. అపూర్వమైన చోటికి చేరుకున్నాను" తనలో తను అనుకుంది జానకి.
వంటమనిషికి సాయంగా వంటింట్లోకి ప్రవేశించి వడ్డన చేస్తోన్న జానకిని కాత్యాయని వారించలేదు. సంతృప్తిగా నిట్టూర్చింది.
రాత్రి భోజనం కాగానే కొంతసేపు ఆ ఊళ్ళోనే ఉన్న తన చిన్ననాటి స్నేహితులతో కబుర్లు చెప్పుకోవటం మాధవకలవాటు. ఆనాడు అతనికి బయటికి కదలాలనిపించలేదు.
కాని అత్తయ్య ఏమనుకుంటుందో అన్న ఆలోచన రాగానే ఏదో లజ్జ లాంటి భావం ఆవరించింది అతణ్ణి. మనసు వెనక్కు లాగుతున్నా చెప్పులు తొడుక్కొని బయటికి వెళ్ళిపోయాడు.
ఎప్పుడూ గంటలు గంటలు కబుర్లు చెప్పే మాధవ పదినిమిషాలు గడిచీ గడవకుండానే లేచి "వెళ్తాను" అనటంతో స్నేహితులు పకపక నవ్వారు.
"వెళ్ళు! వెళ్ళు ! మేం ఆశ్చర్యపోం'లే, అసలు వచ్చినందుకే ఆశ్చర్యపోతున్నాం."
రకరకాల వేళాకోళాలు చెలరేగాయి. వాటినన్నింటిని చిరునవ్వుతోనే ఎదుర్కొని ఇంటికి బయలుదేరాడు మాధవ.
జానకి ఏం చేస్తుటుంది? నిద్రపోతూ ఉంటుందా? నిద్రపోతుంటే దగ్గరగా కూర్చుని నెమ్మదిగా చెక్కిలి మీటుతాడు. ఉలిక్కిపడి కళ్ళు తెరుస్తుంది. ఆ తత్తరపాటు నుండి తేరుకునే లోపలే ఆమెను ......ఒకవేళ మెలకువగానే ఉంటే? మరీ మంచిది. తన మనసులో ప్రేమ అంతా చూపిస్తూ మాట్లాడతాడు. ఆమె కల్లల్లో నిశ్చలత్వాన్ని, కరిగించేసి ఆనాడు తాను చూసిన మెరుపుల్ని మళ్ళీ మొలకేత్తిస్తాడు. భర్తను తిరస్కరించే తీవ్ర స్వభావురాలు కాదు జానకి . ఒక్కనాటికి కాదు.
గదిలో అడుగు పెడుతూనే ఎదురుదెబ్బ తగిలినవడిలా ఆగిపోయాడు మాధవ.
జానకి తన గదిలో ఉన్న రెండు మంచాలలో ఏ ఒక్కదానిమీదా పడుకోలేదు.
మాధవ గదికానుకుని అతనికొక లైబ్రరీ గది ఉంది. అందులో చాలా పుస్తకాలు సేకరించాడు. ఆ గదిలో ఒక పాత నవారు మంచం మీద జంబుకానా పరుచుకుని పడుకొని ఏదో పుస్తకం చదువుకుంటూ వుంది.
ఒక రకంగా అడుగులు ఈడుస్తూ వచ్చాడు. అడుగుల సడికి లేచి కూర్చుని కూచుని చీర సర్దుకుంది జానకి.
ఏ భావమూ ప్రకటితం కాని జానకి ముఖంలోకి చూసేసరికి ఒళ్ళు రగులుకుపోయింది మాధవకు. ఏం పలకరించకుండా పడుకోమని పౌరుషం హెచ్చరించింది. కాని, మనస్సూ, శరీరాన్ని ఆవరించుకుని అతనికి ఊపిరాడనియ్యని బలమైన వాంఛ ఆ పౌరుషాన్ని నిలువనియ్యలేదు.
"అక్కడ పడుకున్నావెం?" మృదువుగా అడిగాడు.
జానకి ఇబ్బందిగా కొంచెం సేపు చేతి గోళ్ళ వంక చూసుకుని కంపిత స్వరంతో అంది.
"మీకు తెలుసు. పిన్నిగారి దగ్గర పడుకుంటే ఆవిడ బాధపడతారు. అందుకని. తరువాత ఎప్పటికో తెలుస్తుంది కాని......ఇవాళే......తలుపులు వేసేస్తాను . మీకేం చికాకు కలగనివ్వను."
జానకి దగ్గరగా వెళ్ళి టపటప లెంపలు వాయించేయాలన్నంత ఉక్రోషం వచ్చింది మాధవకు.
"మరి పడుకోకపోయావా?"
"మీకేమైనా కావాలేమోనని...."
"ఆహా! పతిభక్తి....." వెటకారంగా నవ్వాడు మాధవ. ఆ వెటకారం జానకిని గుచ్చుకుంది. అయినా గంభీరంగా సమాధానమిచ్చింది.
"పతిభక్తి కాదు. స్వామిభక్తి. నేనీ ఇంటికి దాసిని. ఆనాడు మీరు నా ప్రార్ధన మన్నించి ఈ దాసీ మెడలో మాంగల్యం బంధించినంత మాత్రాన ఒక గృహిణిగా అధికారాలు చెలాయించడానికి సిద్దపడను."
గతుక్కుమన్నాడు మాధవ. ఈ ఆరోపణకు చటుక్కున ఏ సమాధానమూ అతనికి దొరకలేదు.
"మంచినీళ్ళు అక్కడ పెట్టాను. ఏమైనా కావాలా?" కంఠంలో ఏ ఉద్వేగమూ ధ్వనించకుండా మాములుగా అంది జానకి.
మాధవ పెదాలపై చిరునవ్వు విరిసింది.
"ఇవాళే ఈ ఇంట్లో అడుగుపెట్టావు. అప్పుడే అన్నీ తెలిసినదానిలా మాట్లాడేస్తున్నావు?"
"మంచి సేవకులు తమ పనులు శీఘ్రంగానే అర్ధం చేసుకోగలరు"
మాధవ ముఖం మలినమయింది."
"అలా మాట్లాడకు జానకీ!"
"ఉన్న విషయం చెపుతున్నాను. అంతేగా!" జానకి నవ్వేసింది. లేచి మాధవ్ గదికీ , తన గదికీ మధ్య ఉన్న తలుపులు వెయ్యబోయింది.
"ఒక్కమాట"
ఆలస్యం చేస్తే ఆ తలుపులు మూసుకు పోతాయోమోనన్నట్లుగా గాభారాగా అన్నాడు మాధవ.
