Previous Page Next Page 
నిశ్శబ్దసంగీతం పేజి 10

 

    జానకి తలుపు చెక్క మీద చేతిని అలాగే ఉంచి ఒరిగి నుంచుని ఏమిటన్నట్లు చూసింది.
    "మంచికో చెడ్డకో పెళ్ళి జరిగిపోయింది . ఇప్పుడింక .....మనం ఈ బంధం నుండి విడిపించుకావాలన్నా విదిపించుకోలేం . అందుకని .....' ఎంత మాములుగా పలకాలన్నా అతని కంఠం కంపించింది.
    జానకి కిలకిల నవ్వింది. బిత్తరపోయి చూశాడు మాధవ.
    జానకి నవ్వు ఆపింది.
    "నేను ముందే చెప్పాను. ఈ బంధం మిమ్మల్ని ఏవిధంగానూ కట్టి పడెయ్యదని, ఈ బంధానికి మీరు విలువ ఇయ్యక్కర్లెదని . పడుకోండి" జానకి గంభీరంగానే అన్నా, ఆమె స్వరంలో నవ్వులు చిందులాడాయి.
    దెబ్బతిన్నవాడిలా దీనంగా చూశాడు మాధవ. జానకి తలుపులు మూసేసింది.
    విసుగ్గా మంచం మీద కూలబడ్డాడు . ఇదేమిటి? తనేందుకిలా అయిపోతున్నాడు? తను సరళను ప్రేమించాడే! మొన్నటివరకూ తన ఆలోచనలనన్నింటినీ సరళే ఆక్రమించుకుందే! ఈ మధ్య అసలు సరళ గుర్తే రాలేదేమిటి? బలవంతాన మనసులోకి సరళను తెచ్చుకోవాలని ప్రయత్నించాడు. కాని ఎప్పుడూ సరళ కరిగిపోయి జానకిగా రూపొందిందో ! అతనికి తెలియకుండానే జానకిని గూర్చి కలలు కంటూ నిద్రలోకి జారిపోయాడు. దెబ్బతిన్నట్లుగా చూసిన తన చూపులు జానకి హృదయాన్ని చీల్చాయని, ఆమె కళ్ళ మీదకు నిద్ర రానేలేదనీ అతనికి తెలియదు.


                                                   *    *    *

    జానకి తలవంచుకుని దీనంగా చూస్తూ ఎక్కడికో నడిచి పోతోంది ఒంటరిగా. కళ్ళల్లో నీటి బిందువులు మిలమిలలాడుతున్నా పెదవులు బిగాపెట్టుకుని ఆపుకుంటుంది. ఆ కన్నీరు తుడిచి ఆమెను ఒదార్చాలనే తపనతో తను వెనక పరుగెత్తుతున్నాడు. ఎంత ప్రయత్నించినా ఆమెను అందుకోలేక పోతున్నాడు 'జానకీ! " అని పిలుస్తున్నాడు ఎలుగెత్తి. కాని ఆ శబ్దం కంఠందాటి రావడం లేదు. ఆ పిలుపుకు జానకి అందుకోలేదు ఎప్పటికి -- ఎంతో సేపటికి జానకిని అందుకోగలిగాడు . భుజాలు పట్టుకుని తనవైపుకు తిప్పుకున్నాడు. ఒక్క క్షణం విభ్రాంతితో చూసి వెక్కి వెక్కి ఏడుస్తూ తన కాళ్ళ దగ్గర కూలబడి పోయింది జానకి.
    చటుక్కున కళ్ళుతెరిచాడు మాధవ. ఏదో గాభరాగా గబగబా  గది దాటిపోతున్న జానకి కనిపించింది. ఒక్క క్షణం ఏమీ అర్ధం కాలేదు. కాళ్ళ దగ్గర కొంచెం వాడిపోయిన మల్లెపూలు పడి వున్నాయి. జానకి వచ్చి తన కాళ్ళ దగ్గర కూర్చుని వెళ్ళిందా? అందుకే తనకీ విచిత్రమైన కల వచ్చిందా? కలలు చాలా రకాలుగా వస్తాయి. కొన్ని కొన్ని కలలు మనం అతి బలవంతాన అణచిన కోరికలకు వచ్చిన రెక్కలు. మరికొన్ని మనస్సులో వ్యక్తావ్యక్తగా ఉన్న ఏ అనుభూతికో మానః ఫలకం పై స్పష్టమైన రూపకల్పన. ఈ రెండు రకాల కలలూ పూర్తీ సుషుప్తవ్యవస్థలోనే వస్తాయి. మరో రకం కలలు అర్ధనుషుప్తవ్యవస్థలో వస్తాయి. ప్రత్యక్షంగా జరుగుతున్నది సబ్ కాన్షస్ అందుకోగలుగుతుంది. కాని పూర్తీ జాగ్రదావస్థలో మాత్రమే పనిచేసే మనసు దానిని అందుకోలేదు. ప్రత్యేక్షంగా జరుగుతున్నది ఆధారంగా మన భావనకూడా కొంత అల్లుకుని కలగా భ్రమ కలగజేస్తుంది. ఇప్పుడు తనకు వచ్చిన కల అలాంటిదా? జానకి వచ్చి తన పాదాల దగ్గిర కూచోగానే తన సబ్ కాన్షస్ జాగృతమయింది. అందుకే అలాంటి కల వచ్చింది.
    కాళ్ళ దగ్గర పడి వున్న మల్లెల్ని తీసుకుని చెక్కిలి కానించుకున్నాడు మాధవ.
    మాధవ ముఖం కడుక్కోగానే కాఫీ కప్పు అందించింది జానకి.
    కప్పు అందుకుంటూ జానకి ముఖంలోకి పరిశీలనగా చూశాడు. గంభీరంగా ఉన్న జానకి పెదవులపై చిరునవ్వు రేఖలు వ్యాపించాయి. చెక్కిళ్ళు ఎర్రబడగా క్రింది పెదవిని పంటి మధ్యకు లాక్కుంటూ ముఖం పక్కకు తిప్పుకుంది. ఆ లజ్జాభివ్యక్తీకరణ మాధవను ముగ్ధుణ్ణి చేసింది. వచ్చే చిరునవ్వును అణచివున్న ఆ బిగించిన పెదవులను తన్మయుడై చూస్తూ నిలుచుండిపోయాడు.    
    తడబడే అడుగులతో అక్కడి నుండి కదిలిపోయింది జానకి.
    జానకి ఫలహారం అందిస్తూ జానకే భోజనం వడ్డిస్తూ ....ఆ రోజంతా చాలా హాయిగా గడిచిపోయింది మాధవకి. ఆ ఉదయం జానకి తన కాళ్ళ దగ్గర కూచుందని అనుమానం కలిగిన తరువాత తన చూపుల కందిన ఆమె చెక్కిళ్ళ లోని రాగ రేఖల్ని స్పష్టంగా చూశాక జానకి హృదయంలో తనకు స్థానముందని అర్ధమయిపోయింది మాధవకి. ఇక ఆ రాత్రిని వ్యర్ధం చెయ్యకూడదని గట్టిగా నిశ్చయించుకున్నాడు. మంచినీళ్ళు బల్లమీద పెట్టి, పాలగ్లాసు స్టూలు మీద ఉంచి లైబ్రరీ గదిలోకి వెళ్ళబోయింది జానకి.
    "జానకీ" కంపిత స్వరంతో పిలిచాడు.
    జానకి ఆగింది. అక్కడే నిలబడి "ఏమిటి?" అంది.
    "ఇలారా"
    "చెప్పండి!"
    "నువ్వా గదిలో పడుకోవద్దు"
    "మరి ఎక్కడ పడుకొను?"
    "ఇక్కడ....." తన ప్రక్క నున్న మంచం చూపించాడు.
    జానకి ముఖం గంభీరమైపోయింది. అతి గంభీరంగా ఉన్న ఆ ముఖాన్ని చూసినప్పుడే మాధవకు మాటలు కరువవుతాయి. తనకున్న చాలా బలవత్తరమైన ఏదో అద్భుత శక్తి ముందు నిలిచినట్టు అనుభూతి కలుగుతుంది. జానకితో లాలనగా గాని, అధికారికంగాగాని మాట్లాడగలిగే ధ్వని మూగబోతోంది. అతని లోలోపలి ఏదో సున్నిత భావన ఆ గంభీర్యం ముందు తలవంచి పరాజయాన్ని అంగీకరించేస్తుంది.
    "ఊహు! నేనక్కడ పడుకోవడం బాగుండదు" శాంతంగా అంది జానకి.
    అతి శాంతంగా ఉన్న ఆ స్వరంలో అంత వాడి ఎక్కడ నుండి వచ్చిందో అర్ధం కాలేదు మాధవకు. అయినా శక్తి నంతా కూడదీసుకుంటూ "ఎందుకు బాగుండదూ ? మనం భార్యాభర్తలం" అన్నాడు.
    జానకి నవ్వింది. "నిజంగా?" ఆశ్చర్యంగా అడిగింది.
    మాధవ తల వాలిపోయింది.
    "నన్ను క్షమించు జానకీ! నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను" బాధగా అన్నాడు.
    "ఇందులో మీరు క్షమాపణ కోరవలసింది ఏముందీ? నేనే క్షమాపణ కోరుకోవాలి. మీ కోరికను మన్నించలేకపోయినందుకు...."
    "అంటే నువ్వు"
    "అర్ధం చేసుకోండి. మీరెప్పుడు కావాలంటే అప్పుడు విడాకులిస్తానని మీకు చేసిన వాగ్దానం నిలబెట్టుకోగలిగే శక్తి నాకుండాలి . మన మధ్య ఈ బంధం ఏర్పడితే నాలో ఆ శక్తి సన్నగిల్లిపోవచ్చు."
    "ఏం మాట్లాడుతున్నావు జానకీ! ఇంక విడాకుల ప్రమేయం ఏముందీ? అసలా అవసరం ఎలా వస్తుంది?"
    "ఏమో! ఎవరు చెప్పగలరు? మొదట మీకు నన్ను పెళ్ళి చేసుకోవటం ఇష్టం లేదు. నా ప్రార్ధన అంగీకరించారు. ఇంకా పెళ్ళయి వారమయినా కాలేదు. ప్రేమించానంటున్నారు. పైవారానికి ఏమంటారో? ఎలా ఉంటుందో?"
    మాధవ దిమ్మెరపోయాడు. కళ్ళు వెడల్పు చేసుకుని జానకి ముఖంలోకి చూడటం తప్ప ఏం మాట్లాడలేకపోయాడు.
    ఆ చూపులకు కదిలిపోయింది జానకి.
    "నేను మీ దాసిని. మీరు కోరిననాడు తప్పక విడాకులివ్వగలను. మీరు కొంచెం స్థిమితంగా ఆలోచించుకుని నిర్ణయించుకొండి. త్వరపడకండి" పక్క గదిలోకి వెళ్ళిపోయి తలుపులు బిగించుకుంది జానకి.
    మాధవ మంచం మీద ఒరిగిపోయాడు. తనకు జానకి కావాలి , కావాలి - తన శరీరమూ, మనసూ ఆమె కోసం పరితపించిపోతున్నాయి. ఈ ఘోష ఆమె కేలా వినిపిస్తుంది? ఆనాడు తాను స్పష్టంగా ప్రకటించిన అసమ్మతిని చెరిపి వెయ్యగలిగే మార్గమేముంది? అంత స్పష్టంగా తిరస్కరించి, ఆమె ప్రార్ధన మీద వివాహం చేసుకొని అంతలో అనురాగం ప్రకటిస్తున్న తనను జానకి చంచల మనస్కుడనుకోవడంలో ఆశ్చర్యమేముంది?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS