ఎంత అణుచుకున్న ఆ కళ్ళల్లో కన్నీళ్ళు ఆగవు. ఎన్నెన్నో చెప్పాలనుకుని ఏదీ చెప్పలేక తలదించుకుంటుంది.
ఆ కన్నీళ్ళ ముందు తను నిలవలేడు.
వెళ్ళి ఆ కళ్ళు తుడుస్తాడు. 'బాధపడ'కని ఓదారుస్తాడు. మంచయినా చెడ్డయినా ఒక బంధానికి కట్టుబడ్డాక దాన్ని తెంచుకోనని వాగ్దానం చేస్తాడు. దగ్గరకు తీసుకుని బుజ్జగిస్తాడు. తన బుజ్జగింపుతో జానకి కళ్ళల్లో మళ్ళీ ఆనాడు కనిపించిన మెరుపులు కనిపిస్తాయి.
"ఏమిటాలోచిస్తున్నారు? నేను మాటకు కట్టుబడి ఉంటానో , ఉండనో అనా?"
ఉలిక్కిపడ్డాడు మాధవ. వెనక జానకి నమ్రతతో నుంచుని వుంది. తెల్లనిచీర జడలో మల్లెలు, మంగళసూత్రాల గొలుసుతో పాటు ఒకే ఒక ముత్యాల గొలుసు. చాలా అందంగా ఉంది. కాని ఆ ముఖంలో కొత్త పెళ్లి కూతురి కుండవలసిన సిగ్గూ, సంకోచమూ కనిపించటం లేదు. ధైర్యంగా మాధవ ముఖంలోకి చూస్తూ నుంచుంది. జానకి స్వభావం తనకు తెలిసిన దాన్ని బట్టి జానకి ఇలా ప్రవర్తిస్తుందని మాధవ అనుకోలేదు.
అప్రయత్నంగా రెండడుగులు జానకి వైపు పడ్డాయి మాధవకు.
"ఇదిగో!" ఒక చిన్న కాగితం మడత మాధవ చేతిలో పెట్టింది జానకి.
ఒక్కక్షణం అయోమయంగా జానకి ముఖంలోకి చూసి ఆ కాగితం మడత విప్పాడు. "శ్రీ మాధవరావుగారికి , నాకూ భార్య భర్త సంబంధం ఏమీ లేదు. అయన ఎవరిని వివాహం చేసుకున్నా నాకు అభ్యంతరం ఏమీ ఉండదు - జానకి"
మాధవ ముఖం పాలిపోయింది. ఈ మార్పు గమనించిన జానకి లోలోపల ఆశ్చర్యపోయింది. స్థిరంగా మాధవ ముఖంలోకి చూస్తూ "ఇప్పుడింక నాలో అపనమ్మకం ఉండదుగా?" అంది. మాధవ కొన్ని క్షణాలు అలాగే జానకి ముఖంలోకి చూశాడు. సమాధానం చెప్పకుండా తర్వాత గిర్రున వెనక్కి తిరిగి ఆ కాగితం ముక్కలు ముక్కలుగా చేసి కిటికీ లోంచి అవతల పారేశాడు. జానకి తెల్లబోయి చూసింది. ఆ తర్వాత చిరునవ్వుతో "నాలో మీకింత నమ్మకం ఉన్నందుకు చాలా సంతోషం. మీ సంతోషానికి నేనెప్పుడూ అడ్డురాను. మీరు చూపించిన దయకు కృతజ్ఞురాలినయి ఉంటాను" అంది.
జంబుకానా క్రింద పరుచుకుని దిండు వేసుకున్న జానకిని చూస్తూ "క్రింద పడుకుంటావా?" అన్నాడు నీరస స్వరంతో మాధవ.
"నాకలవాటే! ఇంక మీరు పడుకోండి" అతి మాములుగా అంది జానకి.
మాధవ పడుకున్నాడు కాని, ఎంత ప్రయత్నించినా నిద్ర మాత్రం రాలేదు. అతని శరీరంలోని ప్రత్యణువు తనకు కొంచెం దూరంలో పడుకున్న జానకిని అతి గాడంగా కోరసాగింది.
తప్పేముంది! ఇంతకూ ఆమె తన భార్య.
"తప్పులేదు " అనుకోవడంతో అతని కోరికలు మరింత సెగలు రేపాయి.
చటుక్కున లేచి కూచుని జానకిని చూశాడు. కేవలం ఒక జంబుకానా మీద పడుకుని అప్పుడే నిద్రలోకి జారిపోతున్నది జానకి.
ఆమె అంత ప్రశాంతంగా నిద్రపోగలగడం నచ్చలేదు మాధవకి.
"తన భార్య తప్పులేదు" అని ఎంత గట్టిగా అనుకున్నా ఏదో శక్తి అతనికి అడుగు ముందుకు పడనివ్వడం లేదు.
మహా ప్రజ్ఞాశాలి అయిన శిల్పి మలచిన అపూర్వ శిల్పంలా పడుకున్న జానకి అతడి ఆలోచనలన్నీంటిని ఆవరించుకొని కోటి గొంతులతో ఆహ్వానిస్తోంది. ఇంక నిగ్రహించుకోవటం అతని శక్యం కాలేదు. నెమ్మదిగా లేచాడు. జానకి ప్రక్కన కూర్చుని మృదువుగా చెక్కిలి మీద చెయ్యి వేశాడు. ఉలిక్కిపడి లేచింది జానకి. ఒక్కక్షణం వింతగా చూసింది. అంతలో సర్దుకుని ఎడంగా జరిగి కూచుంది. "ఏకాంతంలో ఒక ఆడదానితో ఉంటే సాధారణంగా ఏ మొగవాడికైనా పాశవిక ఉద్రేకం చెలరేగుతుంది. కాని, నేను మీరలాంటి వ్యక్తులు కారనుకున్నాను" నెమ్మదిగా అంది.
ప్రశాంతంగా , అతి శాంతంగానే అన్నా జానకి కంఠంలో ఏదో సన్నని వాడి ధ్వనించింది. అది మాధవ గుండెల్లో చుక్కున గుచ్చుకుంది. లజ్జతో తలదించుకుని గబగబ తన మంచం మీదకు వచ్చేశాడు. "నాది పాశవిక ఉద్రేకం కాదు. నేను నిజంగా నిన్ను......" చటుక్కున ఆగిపోయాడు మాధవ. తనది పాశవిక ఉద్రేకం కాదా? నిజంగా జానకిని ప్రేమిస్తున్నాడా?
తనకే సమాధానం తెలియని ఈ ప్రశ్నకు జానకి కేమని సమాధానం చెప్పగలడు?
దిళ్ళలో తలదాచేసుకున్నాడు మాధవ.
3
అలవాటుగా తన గదిలో అడుగుపెట్టిన మాధవ ఆ గదిని చూసి ఆశ్చర్యపోయాడు. అది తన గదేనా అని అనుమానం కూడా వచ్చింది. మాములుగా తను పడుకునే మంచం ఏమైపోయిందో! చక్కని దోమతెర అమర్చిన రెండు రోజ వుడ్ మంచాలు గాలి పరుపులతో పక్కపక్కల అమర్చి ఉన్నాయి. వాటి కెదురుగా నిలుటద్దం , ఒక పక్కగా టీపాయ్, దాని మీద ప్లవర్ వాజ్ లో పువ్వులు.
ఎప్పుడూ తపస్విలా ఉండే అత్తయ్యది ఎంతటి రసిక హృదయం ? ఈ మార్పులన్నీ ఎప్పుడు చేయించిందో?
పక్కపక్కల ఉన్న మంచాలను చూడగానే ఏదో హయితో పులకరించింది మాధవ హృదయం.
ఇప్పుడెం చేస్తుంది జానకి? తన పక్కనే పడుకుని ఉండగా నిగ్రహించుకోగలగటం తనకు సాధ్యమా? మొదట ఎవరో ప్రశాంత సుందర మూర్తిగా కనిపించిన జానకి, పెళ్ళి చూపులలో ఏదో అవ్యక్త సందేశం నిలుపుకున్న జానకి, ఆ చూపులతో కలిసిన తన చూపులలో పారవశ్యాన్ని గమనించగానే అపూర్వమైన మెరుపులు కళ్ళలో మెరిపించిన జానకి ఇప్పుడు తన చుట్టూ తాను కోట కట్టుకుని అందులో మహారాణిలా కూర్చుంది.
