Previous Page Next Page 
అదివిష్ణు నవలు -2 పేజి 9

 

    "...." రావ్ సిగ్గు అభినయించేడు గర్వంగా.
    "కాలేజిలో నీలాటి చాకులాటి నటులున్నారని నాకు రాత్రే తెలిసిందోయ్ బాబూ! మీ ప్రిన్సిపాల్ తోనూ అదే అన్నాను. ఇదిగో .....ఈ నటన అనే జ్వరం నాకు పూర్తిగా ఎక్కిపోయింది గనక నేనేం చెప్పినా నువ్వు విని తీరవలసిందే. నటనకి అవధుల్లేవు. ఒక మంచి నటుడు చేస్తున్న కృషికి రాత్రింబగళ్ళని , ఎండా, వాన అన్నీ అదివారలనీ - ఇలాటి వేమీ అడ్డు రాకూడదు. నీలాటి కుర్రాళ్ళు ఒక్క పదిమంది చాలు - నా చేతికిందవుంటే ఆంధ్రదేశాన్నే గాదు ఈ దేశాన్నే ఒక్క పట్టుపట్టగలను. నటనలో ఒక కొత్త రికార్డు స్థాపించి పారేస్తాను. నీలాటి వాళ్ళకోసమే వెతుకుతున్నాను. మా వయసైపొయిందయ్యా బాబూ! మేము రిటైర్ కొత్త నీటికి జాగా యివ్వవలసిన తరుణమిది. కొత్తవాళ్ళందరికీ మేము నమ్మినమార్గం చూపించి మేము తప్పుకుంటే, అక్కడికి మా బాధ్యత తొలగినట్టు లెక్క ఏమంటావ్?" అన్నారాయన చాలా ఆవేశంగానూ, ఉత్సాహంగానూ.
    అయన ముందు రావ్ నాటకీయంగా జవాబు చెప్పేడు.
    "పెద్దవారు అనుభవజ్ఞులు. మీరేం చెప్పినా అది నాకు పాఠమే . మీరే చెప్పండి సార్, నేను తు.చ. తప్పకుండా పాటిస్తాను. ఇది చేయమని శాసించండి. అంతే చేసి పారేస్తాను."
    "నేనో ప్లాన్ వేసేవోయ్ రావ్!"
    "చెప్పండి సార్!"
    "నీ బోటివాళ్ళని కొందర్ని చేరదీసి - ఒక మంచి సబ్జెక్టు - మరో కన్యాశుల్కమే అనుకో -- గట్టి వాడిచేత రాయించి, దాన్ని మీ అందరిచేత ఈ ఆంద్రదేశమంతటా ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని వుంది. నాటకమంటే అల్లాటప్పా నాటకమనుకునేవు. సాంఘిక ప్రయోజనం పుష్కలంగా ఉన్నది. ఇవాళ్టి వాతావరణానికి చురక లాంటిదీను. ఆ నాటకంలో కూడా గిరీశంలాంటి జీనియస్సే వుంటాడు. మరో గీరీశం - బాగుందయ్యా , ఆ నాటకం పేరే 'మరో గిరీశం'ఈ మరో గిరీశంతో మీరూ నేను అందరం పదిమంది చేత భేషనిపించుకోవాలి. చరితర్దులమై పోవాలి. ఏ కళాకారుడు కోరుకున్నా యింతకంటే యింకేం కోరుకుంటాడు చెప్పు? మనకి డబ్బు వద్దు. రాజకీయాలు వద్దు. మనిషి మీద మనిషికి వచ్చే కోపమం ద్వేషం, ఈర్ష్య యివేమీ వద్దు. మనం కళాకారులం. కేవలం కళ కోసమే పుట్టిన వరప్రసాదులం గనక మనం ఈ అతిసామాన్య మానవులకి అతీతులం" అన్నారాయన.
    దీంతో రావ్ బాగా కదిలిపోయేడు . గిరీశం గారి ఉపన్యాసం పూలబాణలై రావ్ గుండెల్న హత్తుకున్నాయి. అతని నరాలకి ఉత్సాహం మందుని సూదులతో ఎక్కించేరాయన. రావ్ పులకించిపోయేడు. పూనకం పూనే మనిషి అయిపోయేడు అతని గుండెల్లోని ఆవేశం గొంతువరకూ చేరి ఆగిపోయింది. ఆ ఆవేశానికి తగ్గ మాటలు అతనికి దొరకలేదు.
    గిరీశం ఉపన్యాస బాణం ప్రేమ దృష్టినే రావ్ తాత్కాలికంగా కొట్టి పారేసింది. అప్పుడా క్షణంలో రావ్ కి ప్రేమ గుర్తుకురాలేదు. కోట్లాది సామాన్య మానవుల కష్టాల మీదా, వాళ్ళందరి సమస్యల మీదా, వాళ్ళ రోజువారి బతుకుల మీదా అతని మనసు లగ్నమైపోయింది.
    వీళ్ళందర్ని ఏదో విధంగా ఉద్దరించాలి.
    వీళ్ళందరి ముందరా నిజమనే అద్దాన్నుంచి, వాళ్ళ భమల్ని వాళ్ళకు చూపించి "బ్రదర్స్ ! మీ డర్టీ బతుకులు నేను నటిస్తాను చూచి, తెలుసుకునే సత్తావుంటే - మీ బతుకుల్ని మార్చుకునేందుకు ప్రయత్నించండి " అని సలహా లివ్వాలి. ఈ గిరీశంగారి నీడలో తనో విత్తనంగా ప్రారంభమై మహా వృక్షమై దేశాన్నంతా ఆవరించాలి. (లేకపోతే ఈ దేశం గతేంగాను?)
    గిరీశంగారు యింకా ఏదో చెబుతూనే ఉన్నారు. రావ్ తన్మయత్వంలో సోఫా మీద ఊగిపోతూనే వున్నాడు. ఒక మహా నటుడు , మరో కుర్రనటుణ్ణి మంత్రించే వేళ మళ్ళా పద్మ ప్రవేశించింది అక్కడికి.
    పద్మ ప్రవేశంతో రావ్ మత్తునించి బయట పడ్డాడు.
    "బాగుంది నాన్నా మీ ఉపన్యాసం " అన్నది పద్మ.
    గిరీశం నవ్వి ఊరుకున్నడు.
    రావ్ మళ్ళా ప్రేమలో బతికేడు.
    "ముందు యివి పుచ్చుకొండి . బాగా అలిసిపోయేరు. " అన్నది పద్మ రెండు ప్లేట్ల నిండా తీపిని నింపుకు వచ్చి వాళ్ళ ముందుంచుతూ.
    "తీసుకో అన్నారు" గిరీశం.
    రావ్ తీసుకున్నాడు.   
    "మా నాన్నగారి ప్రతాపం మీకు తెలీదులా వుంది. నిముషాల్లో మిమ్మల్ని చిత్తూ చేసి పారేసేరాయన" అన్నది పద్మ.
    "నో.....నాటేటాల్! వారి అభిప్రాయాలు నాకూ నచ్చేయి" అన్నాడు రావ్.
    "అద్గదీ ! బాగా చెప్పేవు. అయితే రావ్. నువ్వు నాకు మాటిచ్చి వెళ్ళు. ప్లాన్ తయారు చేసే బాధ్యత నాది."
    "అలాగేనండి నెందుకు సిద్దమే" అన్నాడు రావు.
    "అన్నట్లు నాన్నా! ఇప్పటి కెంతమందిని పోగు చేసేరు."
    రావు ఆ మాటకి బాధ పడ్డాడు. ఈ కళా ప్రపంచంలోకి సభ్యులుగా చేరండనే అభ్యర్ధనని చీప్ గా ఎంచే పద్మకి కళా హృదయం లేదు లేదనుకున్నాడు అయినా సరే, కళా హృదయం తనకుంది. ప్రేమించే హృదయం పద్మ కుంటే చాలు. ఇటు పవిత్రమైన కళాభిరుచితోపాటు , అటు విలువైన పద్మ ప్రేమంటేహృదయాన్ని పొంది జీవితంలో సుఖ పడవచ్చని అతననుకున్నాడు.
    ఆరోజు మొదలు అతను చాలా తడవలు గిరీశంగారి యింటికి వెళ్ళేడు. నాలుగైదుసార్లు వాళ్ళింట్లో భోజనమూ చేసేడు. అరుదుగా వాళ్ళతో సినిమాలో షాపింగులూ వైగారాలకు వెళ్ళేడు.
    కాని, ఏ ఒక్కరోజూ అతను పద్మని ప్రేమిస్తున్నట్టు పద్మకి చెప్పలేకపోయాడు. అటు పద్మ కూడా ఆ రకమైన సంభాషణ తనతో చేయానూ లేదు.
    రావుకి ఈ తహతహ భరింపరానిదిగా తయారయింది. దీనికేదో విరుగుడు అలోచించి పెట్టుకోవాలే గాని, ఇలా వారాలూ, నెలలూ వాయిదాలూ పడిపోతే ఈ ప్రేమ జీవితం దారుణంగా పరిణమించే అవకాశం ఎంతైనా ఉంటుందని అతను భయపడ్డాడు.
    ఒక ఆదివారం నాడు సుబ్బారావుకి కబురంపి తన గదికి పిలిపించుకు కున్నాడు. అతనితో తన నిర్ణయాన్ని చెప్పుకున్నాడు.
    "అవుతే , నువ్వు పద్మని ప్రేమించే మాట నిజమంటావ్?"
    "అవును నిజం"
    "ఆ అమ్మాయి ఆస్తి వగైరా"
    "నోర్మోయ్ ! ఆ కాడికి నేను వారాలు చేసుకుంటూ చదువుతున్నట్టు మాటాడతావెం? ఒరేయ్. నాకున్న స్టేటస్మిటో తెలుసా? మా నాన్న కౌన్సిలర్రా! రేపొచ్చే ఎన్నికల్లో అయన చైర్మన్ , ఎం.ఎల్. ఏ -- చివరికి మినిస్టరైనా నువ్వు ఆశ్చర్యపడక్కర్లేదు. ఇద్దరం అన్నదమ్ములం, రొక్కంగా నివ్వు, భూములు గానివ్వు ముప్పై వేల రూపాయలస్తి ఉంది. కొండంత పరపతి ఉంది. నీకిక్కడో విషయం =చెబుతాను విను. మా ఊళ్ళోనూ కాలేజీ ఉంది తెలుసా. నేను అక్కడ చదవడం లేదంటే కారణం ఏమిటో చెప్పు చూద్దాం? నాకు తెలుసురా బడుద్దాయ్. నీది కేవలం సోది బుర్ర. ఆ కాలేజి సెక్రటరీ మహాశయుడికి మా నాన్నగారికీ బద్దవైరం. పచ్చి గడ్డి వేస్తె భగ్గుమంటుంది. ఇలాటి పరిస్థితుల్లో ఆ సెక్రటరీ గారి కాలేజిలో నేను చదివితే -- మానాన్న తలకొట్టినంత  పనైపోగలదు. తెలిసిందా చైల్డ్! మాతో విరోధం ఉన్నవాళ్ళు కూడా ప్రముఖులే అలాటిది మాతో వియ్యమంటే వాళ్ళెంత అదృష్టవాంతులంటావ్."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS