Previous Page Next Page 
అదివిష్ణు నవలు -2 పేజి 10

 

    "సరి సరి అంటే ఏమిటి? నువ్వు అస్తీనీ, వాళ్ళ నాన్న కీర్తినీ ప్రేమించడం లేదని ఖచ్చితంగా చెప్పగలవు. రైట్ అయితే ఈ విషయం ఆమ్మయితో నువ్వే డైరెక్ట్ గా మాటాడానికేమైనా అభ్యంతరమా?"
    "అభ్యంతరం కాదు. భయం"
    "భయమా ? అదేం. వెనక యిటువంటి అనుభవాలేనైనా అఘోరించేయా?"
    ఈ మాటకి రావ్ మండిపడిపోయేడు.
    "నేనెంత చవకబారు ప్రేమికుడిననా నీ ఉద్దేశం. నీ నాలుక తెగ్గోస్తాను వెధవా! నాకేంరా . యువరాజుని నన్నెవరైనా నాకు తెలియకుండా ప్రేమించారేమో గానీ, నేను తెలిసి పద్మ నోక్కర్తినే ప్రేమిస్తున్నాను."
    "పోనీ పద్మతో చెప్పేందుకు భయమైతే , వాళ్ళ నాన్నగారితో చెప్పరాదూ?"
    "మా యిద్దరి మధ్యా కళా బంధుత్వం మినహాయించి మరే యితరమైన బంధుత్వాలు చోటు చేసుకోకూడదు. ఒకవేళ నువ్వన్నట్టే ఆయనతో నా ప్రేమ విషయం చెబితే పద్మనే అడగమంటాడు?"
    "అయితే యిప్పుడెం చేయాలంటావ్ ."
    "ఏడ్చినట్టే వుంది. నే నేనుకుంటే నిన్ను పిలవడమేందుకట నువ్వే ఏదైనా అలోచించి చెబితే సంతోషిస్తాను."
    "నా దగ్గరేం ఆలోచనలుంటాయి అంటివి గదా -- నాది సోది బుర్రని!"
    "ప్లీజ్.....ఆ మాట మరిచిపోరా బాబూ!"
    "సరే.....నే చెప్పే ప్లాన్ నీకు నచ్చుతుందో నచ్చదో...."
    "అది తరవాత విషయం. ముందు ఒకటి దానం చేయి."
    సుబ్బారావు సిగరెట్టు ముట్టించి పడక కుర్చీలో పడుకుని విలాసంగా కాళ్ళు ఊపుతూ చెప్పేడు.
    "ఒకడు ఒక పిల్లని ప్రేమించేడు."
    "మళ్ళా ఒకడెందుకు. నేనే ప్రేమించెను. పద్మని ప్రేమించాను. అంతేగాని కాలమూ - పని లాగా లెక్కల బుర్ర నుపయోగించకు."
    "అల్ రైట్  రావ్ గాడు పద్మని ప్రేమించేడు. ఆ ప్రేమని పద్మతో చెప్పడానికి భయంగా వుంది. మొత్తానికి ఈ ప్రేమ గొడవ పద్మకి తెలియాలి. ఎలాగో లాగ - రావ్ పద్మని ప్రేమిస్తున్నట్టు పద్మకి తెలియాలి. అవునా?"
     "అవునంతే కరెక్ట్!"
    "దార్లో పడింది బండి. "నన్నాపకురా రావ్. దీనికో చక్కటి మార్గముంది. ఫలానా రావ్ గాడు ఫలానా పద్మ ని ప్రేమించేడనే టాక్ ని సాక్షాత్తు నేనే కాలేజిలో అంటిస్తాను.  రెండో రోజుకది విజ్రుంభించి , కాలేజి గోడల మీద కెక్కి ఆ దరిమిలా ఈ వార్త తిన్నగా పద్మకి చేరి, అటు వాళ్ళ నాన్నగారికీ తెలిసి, మొత్తానికి ఈ విషయం అందరికీ -
    "స్టాపిట్ రాస్కెల్! నేను ప్రేమిస్తున్నట్టు పద్మ కొక్కర్తికే తెలియాలి అంతే. ఈ మాట బజారు కెక్కినట్లు తెలిస్తే నిన్ను చంపేస్తాను. ఒకవేళ ఆ పద్మ నన్ను ప్రేమించకపోతే - అసలెంత డేమేజ్ జరిగిపోతుందో ఊహించెవా? నిక్షేపం లాంటి ఆడపిల్ల బతుకుని నేను బజారులో పెట్టె మహాపాపిని కాదురా! పద్మ మీద ఈగ వాలినా సహించను."
    "పేచీగానే వుంది ఈ ప్రేమ వ్యవహారం. వుండు అయితే మరో ప్లాన్ చెబుతాను. వెరీ గుడ్ . ఇదెలా వుందో చెప్పు."
    "ఏదీ"
    "పద్మకి నీ ప్రేమ చెప్పడం భయమైతే ఉత్తరంలో రాయి!"
    "నేనెలా చస్తే కమిట్ కాను. అసలు నా పరిస్థితే నీకు సరిగ్గా అర్ధమై చావలేదు ట్రా? నేను పద్మని ప్రేమించిన మాట నిజమే గాని, పద్మ నన్ను ప్రేమించిందో లేదో తెలీదు గదా! ఈ స్థితిలో "నిన్ను ప్రేమిస్తున్నాను పద్మా!" అంటూ నాలుగు ముక్కలు రాసి తరవాత అది చదివి 'ఎంత పొరపాటు చేసావు రావ్' అని ఆ అమ్మాయి రాస్తే నేనెంత చులకనై పోతానో ఊహించేవా?"
    "పోనీ నేను రాస్తాను."
    "ఏమని , నువ్వు ప్రేమిస్తున్నావనా."
    "కాదురా బాబూ! నువ్వు ప్రేమిస్తున్నావనే!"
    "ఇదేమిటి"
    "అవునోయ్ . పద్మగారికి నమస్కారములు. మీతో కబురు చెప్పేందుకు మీ యింటికి వస్తున్న రావ్ మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టు తెలీదులా వుంది మీకు. ఒకసారి అతన్ని కదిపి చూడండి. ఇల్టు - మీ శ్రేయోభిలాషి."
    "అప్పుడేమవుతుందంటావ్?"
    "కదుపుతుంది."
    "నేనేం చేయాలి"
    "విషయం కదిలింది గనుక ప్రేమించానను."
    "అప్పుడు"
    "ఇంకా అప్పుడేమిట్రా  సన్నాసి. నిన్నా పిల్ల ప్రేమించినట్లయితే , అ విషయాన్ని చాలా వినయ విధేయతలతోనూ, సిగ్గుతోనూ అడుగుతుంది. కాని పక్షంలో ఏడుస్తూ అడుగుతుంది. ఆ రెస్పాన్స్ గమనించే నేర్పుండాలే గాని, నీ జవాబు నిక్షేపంగా దాచుకోవచ్చు."
    "ఏమిటోరా , నాకు కూడా ఈ ప్లాన్ బాగున్నట్టుంది."
    "అయితే నే నివాళ ఉత్తరం రాసి పోస్టు చేస్తాను."
    "కాని సుబ్బిగా! ఈ విషయం మనిద్దరిలోనే ఉండాలి. పద్మ నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా దిగుల్లేదు నాకు. నా మూలంగా , నా తెలివి తక్కువతనంగా ఆ అమ్మాయి అల్లరవడం ఇష్టం లేదు నాకు. వెళ్లిక, నీ పని నువ్వు చెయ్యి, నేను వాళ్ళింటికి ఎల్లుండే వెడతాను." అన్నాడు రావ్.
    సుబ్బారావు లేచి నుంచుని-
    "గుడ్ లక్ వస్తారా బాబూ! ఒక్క అయిదుంటే సర్దు. సినిమా కెళ్ళాలి. బెస్ట్ క్రైం పిక్చర్ ! హిజ్ కాక్ సినిమా -- జేమ్స్ స్టీవర్ట్ న్నాడు."
    "పాఠం చదవకు. డబ్బు తీసుకో. కాని -- బ్లాక్ మెయిలింగ్ చేస్తే నీ ప్రాణాలు దక్కవు. గో...."
    అయిదు రూపాయిలు పుచ్చుకుని సుబ్బారావు వెళ్ళిపోయాడు.


                                                      *    *    *

    ఆ ఎల్లుండి రావ్ గిరీశం గారి ఇంటికి ఆందోళనని వెంట బెట్టుకు వెళ్ళేడు. ఆ వేళకి గిరీశం గారు ఇంట్లో లేరు. ఆవరణలో పూలమొక్కల దగ్గిర ఫేము కుర్చీలో పద్మకూచుని ఉండటం రావ్ చూచి అటువేపు నడిచేడు.
    ఆమె చూపంతా గోడవారగా ఉన్న ఓ క్రోటను మీద ఉండిపోయింది. ఆటే చూస్తూ (బహుశా మనసు చెదిరి గాబోలు ఏమిటేమిటో ఆలోచిస్తున్నది.)
    రావు ఆమె దగ్గిర పడుతున్న కొద్ది భయం ఎక్కువై పోతుంది. ఏమాట చెబుతుందో? ఆ మాటని తనెలా ఎదుర్కోవాలో ఆలోచిస్తూ అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తున్నాడు.
    (చాలా ఇబ్బందిలో పడిపోయేన్నేను ప్రేమ మాట దేవుడెరుగు) నా పరువూ ప్రతిష్టా మొత్తం పద్మ చేతిలో ఉన్నాయి ఇప్పుడు. సుబ్బిగాడు ఉత్తరం రాయక పోయినా బాగుండిపోను. వాడు రాసేడు. చదివి వినిపించి నా కళ్ళ ముందే పోస్ట్ చేశాడు. అయిపొయింది ఏ మాత్రం జాగ్రత్త తీసుకున్నా ఈ ప్రమాదాన్ని వాయిదా వేయగలిగేవాడిని. ఇప్పుడేమనుకున్నా ఏం ప్రయోజనం? పరిస్థితి నా చేయి దాటి పోయింది. అయిపొయింది. ఇవాల్టితో ఈ ఇంటితో నా బుణం తీరిపోయింది. ఒక మహానటుడి ఆశీస్సులు ఈ డర్టీ లవ్ తో దూరమైపోయేట్టు వచ్చేసెను. ఇదేమిటి - పద్మకి నేను వచ్చినట్టు తెలిసి కూడా నావేపు చూడటం లేదేం? వెళ్ళిపోనా? గిర్రున వెనక్కి తిరిగి కాళ్ళకి బుద్ది చెప్పనా? ఏం చేయను దేవుడా? నేనేం చేసేది?)


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS