Previous Page Next Page 
అదివిష్ణు నవలు -2 పేజి 8

   
                                                            3

 

    గిరీశం గారి అసలు పేరు నారాయణస్వామి. నారాయణస్వామిగారు పేరొందిన క్రిమినల్ లాయరు. వయస్సు నలబై దాటి యాభైలో పడుతున్నా ఆ మనిషిలో ఉత్సాహం పరవళ్ళు తోక్కుతూనే వుంటుంది. అయన గొంతు పెద్దది. మైకు అవసరం లేకుండానే అయన తన వాగ్దాటితో వేలాది సభికుల్ని తృప్తిపరచగలరు.
    నాటకాలాడే మనుషులందరికీ నారాయణస్వామి గారు తెలుసు. ప్రత్యేకించి అయన గంభీరమైన గొంతు పట్ల నటులకీ ఆసక్తి మెండు. అయన కంఠంలో ఏ మహాత్యముందో గాని, కవి రాసిన వాక్యానికి మెరుగులు పెట్టి మాటాడటం ఆయనకే తెలుసు.
    కోర్టులోనూ నాటకీయంగా వాదించగలరనే పేరున్నది.
    కన్యాశుల్కం  నాటకాన్ని అయన కంఠతా పట్టేరు. గిరీశం పాత్రకి అయన అధారిటీ! అందుచేత ఆయన్నంతా గిరీశంగారని పిలవడం అలవాటైపోయింది.
    రావ్ ని సాక్షాత్తు గిరీశంగారి లాంటివారు మెచ్చుకుని టీకి రావలసిందిగా యింటికి ఆహ్వానించడంతో రావ్ వుబ్బితబ్బిబ్బై పోయాడు. ఆ మరుసటి సాయంత్రం కొరకు అతనెంతో కుతూహలంగా ఎదురు చూసేడు.
    కేవలం గిరీశం గారి అభినందనలతో అతనుబ్బిపోలేదు.
    ఇక్కడో తిరకాసున్నది. గిరీశం గారింట్లో రావ్ ప్రేమ ఉన్నది. రావ్ ప్రేమ పేరు పద్మ. పద్మ గిరీశంగారమ్మాయి. రావ్ కి క్లాసు మేటు.
    రావ్ కి పద్మ మీద అమితమైన గౌరవంతో పాటు భయమూ ఉన్నది.
    ఆరోజు సాయంత్రం నీటుగా ముస్తాభై గిరీశంగారింటికి రిక్షా మీద వెళ్ళేడు రావ్.
    సోఫాలు, ఫేన్లూ , ఫోను, రేడియో రిఫ్రిజిరేటరూ వగైరా ఖరీదైన హంగులతో అలరారుతున్న లక్ష్మి నివాసమది.
    రావ్ ఆ భవంతి దగ్గిర రిక్షా దిగి, గేటు తెరుచుకుని లోపలికి ప్రవేశించాడు.
    వరండాలో క్లయింట్ల మధ్య మహా మేధావిగా వెలిగిపోతున్న గిరీశంగార్ని రావ్ చూసేడు. చూచి, కొంచెం బెదిరాడు.
    కొత్త కేసేదో కూలంకషంగా చర్చిస్తున్న గిరీశం గారూ , క్లయింట్ ఎవరో హెచ్చరించిన మీదట రావ్ ని చూసేరు. వెంటనే యింత ఆనందాన్ని మోహంలో నింపుకుని లోపలికి చూస్తూ నౌకర్ని పిలిచేరు.
    "అప్పన్నా౧ బాబుగారు వచ్చేరు చూడు. వారిని మధ్య హల్లో కుర్చోబెడుదూ రావయ్యా రా. పదినిమిషాల్లో పని ముగించుకుని నేనూ వస్తాను రా." అన్నాడు.
    రావ్ ఆ హాలు ని చూపులతో  నింపేడు.
    అతనికి మొట్టమొదట కనిపించింది గిరీశంగారి రంగుల పెద్ద ఫోటో. అది వారి సన్మానం బాపతు ఫోటో. ఆ ఫోటోలో అయన హుందాగా ఉన్నారు. అయన మెడని అలంకరించిన పెద్ద దండ అయన వర్చస్సు ముందు వెలవెల పోతుంది. ఆ ఫోటోకి అటు యిటూ కొన్ని చిల్లర ఫోటోలున్నాయి. ఇన్నేళ్ళ అయన నాటకానుభావానికి కవి చక్కటి నిదర్శనాలుగా అక్కడ తగిలించబడి వున్నాయి. బీదగానూ, గొప్పగానూ , కుర్రతనం, వృద్దాప్యం, క్రూరత్వం, శాంత స్వభావం , తాగుబోతూ ,  జూడరీ, కత్తితోను , పిస్తోలు తోనూ ముసుగులోను, సూటులోనూ - అయన సాక్షాత్కారించేరు.
    అయన నట జీవితానికి రావ్ చేతులు జోడించాడు.
    అంతలో పక్క గదిలో నుండి ఎవరో నడిచి వచ్చే శబ్దం విని, ఆ ఆకారం నుండి వెలువడిన సుగంధాన్ని అనుభవించి వచ్చేదెవరో తెలుసుకున్నాడతను. వచ్చేది పద్మ.
    నిజంగా - పద్మే వచ్చిందక్కడికి. నిలువునా మెరిసిపోయే దంతపు బొమ్మలా ఉంది పద్మ. ఎవరో శిల్పి ఎన్నో ఏళ్ళ నిర్విరామకృషితో, పనితనంతో తయారుచేసిన మనోహరమైన శిల్పంలానూ, కనుపించిందతనికి. ఇంత గొప్ప లోగిల్లో బతుకుతున్న బంగారు పిచుకలానూ తోచినపుడు అతను భయపడ్డాడు.
    పద్మ రెండు చేతులు జోడించి "నమస్కారం" అన్నది సుతారంగా . రావ్ ఒక్క చేత్తోనే విష్ చేసి సోఫాలో సర్దుకుని కూర్చుని తల దించుకున్నాడు.
    ఎదురుగా ఉన్న మరో సోఫాలో పద్మ బంతిపూవు లాగా కూర్చున్నప్పుడు ముచ్చటపడ్డాడు రావు.
    "నాన్నగారు చెప్పేరు. రాత్రి మీ నాటకం చాలా బాగుందిట. ముఖ్యంగా మీ వేషం ఆయన్ని ముగ్ధుల్ని చేసిందిట."
    "థాంక్స్ అండీ"
    మీకు తెలియందేముంది. నాన్నగారు నటులే. స్వజాతి మనుషులంటే ఆయనకి వల్లమాలిన అభిమానం. ఇవాళ సాయంత్రం మీరోస్తున్నట్లు చెప్పెరాయన."
    "అవునండి వస్తానన్నాను."
    "మీ నాటకం చూచే భాగ్యం నాకు లేకపోయింది."
    "బలే.....అదేం మాటలేండి."
    "నిజమే అంటున్నాను. నాన్నగారూ అలాగే అన్నారు."
    "ఏమిటో అనేస్తున్నారు గాని, నేను మీరనుకున్నంత గొప్ప నటుణ్ణి కాను."
    "అదేమో నాకు తెలీదు. మీరు మంచి నటులని నాన్నగారు సర్టిఫికేటిచ్చేరు.
    నాన్నగారు ఎవరికి అంత సుళువుగా సర్టిఫికేట్ ఇవ్వరు.
    దాంతో రావ్ మరేమీ మాటాడలేకపోయేడు.
    "చదువెలా సాగుతుంది? బాగా చదువుతున్నారా?" పద్మ అడిగింది.
    ఈ అడగడంలో చురక అతను గమనించకపోలేదు.
    "ఫరవాలేదండి. బాగానే చదువుతున్నాను."
    "పరీక్షలు దగ్గిర పడ్డాయి."
    (ఇద రెండో చురక)
    "అవునండి . పరీక్షలు జ్ఞాపకమొస్తే నాకు దడగానే ఉందనుకోండి. బట్.....క్లాసు రాకపోయినా పాసవుతానులెండి."
    "ఈ బి.ఏ. పూర్తయింతర్వాత ఏం చేయాలనుకుంటున్నారు?"
    "ఇంకా చదువుతానండి. నాన్నగారూ చదమనే అంటారు. మేమిద్దరం అన్నదమ్ములం! అన్నయ్య అల్లరిగా తిరగడంతో వాడి చదువు మట్టికొట్టుకు పోయింది. మిగిలింది నేను గనుక, నేను తప్పనిసరిగా చదవవలసిందే."
    "మంచి మాటన్నారు. ఉండండి క్షణంలో వస్తాను" అని చెప్పి పద్మ వంటగదిలోకి వెళ్ళిపోయింది.
    పద్మ మాటతీరుకి రావ్ ఆశ్చర్యపోయేడు. ఎంత కట్టుదిట్టంగా మాటాడగలిగింది పిల్ల? ఒక్క అక్షరం కూడా వృధా చేయకుండా తూచి తూచి కాస్టీగా మాటాడింది. ఆ మాటల్లో అన్నీ పాయింట్లే. ఒక్కచోట కూడా ఉపన్యాస ధోరణి గాని, బోరు గాని చోటు చేసుకోలేదు. ఇలాంటి నిజమైన మనుషుల మీద రావ్ అభిమానం కంటే భయం జాస్తి.
    ఇలాటి మనుషులు తక్కువ మాట్లాడి ఎక్కువ చేస్తారు. వాళ్ళెం చేస్తారో దేవుడికి కూడా తెలీనివ్వరు. 'అయినా సరే పద్మని ప్రేమించాలి. పద్మ ప్రేమని పొందాలి" ఈ రెండు ముక్కలూ అతను ఎప్పటికీ మరచిపోలేడు.
    లాయరు గారి సభ పూర్తీ'కావడంతో , వచ్చిన జనం సెలవు పుచ్చుకోడం అంతా గమనించేడు రావ్. గిరీశంగారు తన దగ్గిరికి రావడం చూచి మరింత వినయంగా సోఫాలో సర్దుకుని కూర్చున్నాడు.
    గిరీశం కూర్చుంటూ అడిగేడు.
    "అమ్మాయి వచ్చిందా?"
    "రావ్ తల ఊపేడు.
    "వెరీ గుడ్. రాత్రి నీ వేషం చాలా బాగుందోయ్ కుర్రడా! పై కొస్తావ్ పో."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS