"నేను వెంటనే పోలీసు స్టేషన్ కు వెళ్ళాలి"అని లేవబోయాడు.
"లేస్తే నా మీద ఒట్టే! యెంతరక్తం పోయిందో నీకు తెలియదు బాబూ," అన్నది ఆమెభుజాలు పట్టి కూర్చోబెట్టి.
"వాళ్ళు తప్పించుకోవటానికి వీల్లేదమ్మా."
"మరెలా బాబూ!"
"నేను వెంటనే వెళ్ళాలి"అన్నాడు.
"వాళ్ళు వెళ్ళారు. నీ ఆరోగ్యం బావుండలేదు" ఆమె ఆపుతుండగానే చిట్టి, పాలు తెచ్చింది.
సిద్దార్థ పాలు త్రాగాడు.
దూరాన కోళ్ళు కూయటం వినిపించింది.
వెంటనే చేద బావిలో నీళ్ళు తోడుతున్నట్టు, వావిమీదుండే గిలకశబ్దం అయింది.
"అమ్మా!....నీళ్ళు తోడటానికి వీల్లేదు."
"అయ్యో !ఏమి అవశబ్దం మాటలు బాబూ!"
" అపశబ్దం మాటలు కాదమ్మా! వెళ్ళండి.... నువ్వు , చిట్టి వెళ్ళి బావిలో నీళ్ళు త్రాగొద్దని చెప్పండి..." అని అరిచాడు.
అర్ధంకానట్టు చూచింది.
"అవునమ్మా!వెళ్ళండి. బావి నీళ్ళలో మందు కలిపారు" అన్నాడు అప్పుడు అర్థం అయింది వాళ్ళకు.
"చిట్టీ!నువ్విక్కడే వుండు. నేను చెబుతాను"అని పార్వతమ్మ బయటపడింది.
"అమ్మా! ఒక్కసారిని త్రాగనియ్యకు అవసరం అనుకుంటే ఖాదర్ గారిని పిలువు...." అన్నాడు నీరసంగా.
అతను ఇటు తిరిగాడు. చిట్టి కళ్ళనిండుగా నీళ్ళున్నాయి.
"పిచ్చిపిల్లా!ఏడ్పుఎందుకు!"
జవాబు గా తలకట్టు నిమిరింది.
"మరేం ఫరవాలేదు.అయిదురోజులలో తగ్గిపోతుంది"అన్నాడు.
రాంబాబు వచ్చాడు. తెల, తెలవారుతుండగా.
"భలే ఎత్తురా...." అతను కూర్చున్నాడు.
"నీళ్ళ బావి దగ్గర జాతరలా వుంది. అక్కడేదో మాంత్రిక శక్తి వున్నట్టు భయపడుతున్నారు."
"నీళ్ళు తోడటం లేదు కదా."
"ఉహు! ఇప్పుడే ఇళ్ళల్లో మిగిలిన నీటిని పరీక్షచేయించడం కోసం పరుగెత్తుతున్నారు" అన్నాడు రాంబాబు!
ఆ రోజు మధ్యహ్నం వరకు అంతా స్పష్టంగా తేలిపోయింది. సిద్దార్థ వుండే వీధిలో మంచినీటి బావిలో మందు కలిపారు. దాని ప్రభావమే వాంతులు, భేదులు. మాంత్రిక విద్య వున్నదని నమ్మించటం కోసం చేసిన ఎత్తుగడ అని తేలిపోయింది.
ప్రక్కనే వున్న వ్యవసాయపు మోటబావికి ఇంజన్ పెడితే అందరూ మంచినీళ్ళు తీసుకుపోయారు. హెల్త్ డిపార్ట్ మెంటు రిపోర్టు చేసారు. వాళ్ళు కలుషితమైన నీటిని పరిశుభ్రం చేయటానికి పూనుకున్నారు.
రెండు, మూడు రోజులవరకు ఆ నీటిని వాడకూడదని అదేశించారు.అందరూ ఆశ్చర్యపోయారు.
" వీళ్ళ అమ్మ కడుపులు కాలా! ఎంతగా నమ్మించారు"అనుకున్నారు.
ఆ రోజు పోలీసులు అర్జున్ కోసం ఎంత గాలించినా, అతనుగాని, అతని అనుచరులుగాని దొరకలేదు.
మర్నాడు కలెక్టరు వచ్చి ఊరి పెద్దలందరిని సమావేశపరిచారు.
" మీరు ఊరి పెద్దలు , మాకంటే మీకు మీ ఊరి సమస్యలు పరిశీలిచటం , పరిష్కరించటం తేలిక, మీ ఊరి సమస్యలు స్వార్థంతో , మానసికంగా ఎదుగుదల లేక మనుషులసు ఎన్నో అవకతవకలు , మంత్రాలు, తంత్రాలు అంటూంటారు. తార్కికంగా ఆలోచించండి. శాస్త్ర విజ్ఞానం ఇంత అభివృద్ధి చెందినా దయ్యాలు, భూతాలు అంటే యెలా..."
"నీ ళ్ళలో మందు కలుపుతుంటే పట్టుకున్నారు అలాగే చెయ్యవచ్చు కదా."
"ఏం చేసిండ్రంటారు!"
