Previous Page Next Page 
కాంతి రేఖలు పేజి 88


    అతను చేతిలో తెచ్చిన పొట్లం విప్పి గబుక్కున బావిలో పోసాడు అంతే ఖాదర్ ఒక్క దూకు, దూకి   అతన్ని పట్టుకున్నాడు.

    వెంటనే ,జవాను , సిద్దార్థ అతని దగ్గరకు వెళ్ళారు. టార్చ్ అతని ముఖంపై పోకస్ చేసారు.   

    " ఏమిట్రా ....ఏమిటి బావిలో వేస్తావ్?"

    "అబ్బే ....ఏదో చెత్త...."

    " ఇంత ఖాళీస్థలం ఉండగా చెత్త బావిలో వేస్తావా?"

    "తెలియక..."

    "ఇతను అర్జున్ వాళ్ళ జీతగాడు..." అన్నాడు సిద్దార్థ.

    "ఇంకేం వీళ్ళపనే...." అన్నాడు ఖాదర్.

    " చెప్పరా.... చెప్పు ఏమిటి? ఏం పోసావ్ నీళ్ళలో !" అన్నాడు  జావాను అతను తనకు తెలియదంటే తెలియదని గోలపెట్టాడు.అతన్ని తీసుకుని అర్జున్ ఇంటికి వెళ్ళారు. మొదట, సిద్దార్థ, ఖాదర్ ఇద్దరూ  వెళ్ళారు.

    ముందు వరండాలో నే అర్జున్ , రాజేంద్ర .మరో నల్గురు కూర్చుని పేకాడు తున్నారు.

    "షో-" అంటూ రాజేంద్ర కార్జ్స్ క్రింద పెట్టాడు.

    "ఈ దెబ్బ తో ఆ సిద్దార్థగాడి పని షో కావాలిరా. మధుమూర్తి గాడే వీడిని డిస్కార్డ్ చేస్తాడంటే వాడే డిస్ కాగ్డ్ అయ్యాడు. పెద్ద మొనగాడిలా, వీడు , వీడి పోజులు."అన్నాడు అర్జున్.

     "నిన్ననే మరికాస్త మందు కలిపితే ఓ నాల్గు అయిదు పీనుగులు  లేస్తే వాడు,వాడి తలలోని జేజమ్మ నమ్మేవారు దయ్యాలన్నా, భూతాలన్నా."

    "ముక్కలు వంచు...."

    "మా వాడింకా రాలేదేం?" అని లేచారు.

    అక్కడ గోడచాటుకు నిలబడిన ఖాదర్, సిద్దార్థ ముందుకు వచ్చారు. వారిని చూస్తూనే అర్జున్ ముఖం వెల వెల, బోయింది.

    "నువ్వా! ఈ సమయంలో వచ్చావేం?"

    "మీరు వదిలిన దుష్టశక్తులు ఈ సమయాన్నే సంచరిస్తాయిగా. అందుకు" అంటుండగానే ,అతని జీతగాడిని తీసుకునివచ్చారు పోలీసులు.

    అర్జున్ ముఖం నల్లగా మాడిపోయింది.

    అతను  అకస్మాత్తుగా అక్కడున్న మొక్క జొన్న కంకులు, కర్ర ముక్కలు తీసుకుని ఒక్కసారి వీళ్ళను కొట్టటం ప్రారంభించారు. అనుకోని సంఘటనకు ఇవతలివారు తెల్లబోయారు.

    "అబ్బా...."అంటూ సిద్దార్థనేలకూలాడు . పెద్దరాయి వచ్చి, అతని  నుదురు ముద్దు పెట్టుకుంది.

    "ఖాదర్ గారూ... వాళ్ళు పారిపోతున్నారు..... పారిపోతున్నారు..." అంతవరకే గుర్తుంది సిద్దార్థకు.

     అతనికి మళ్ళీ తెలివి వచ్చేసరికి , బెడ్ లైటుతో తన గది కనిపించింది. లేవబోయాడు.తలంతా దిమ్ముగా, భారంగా వుంది. అతను పడుకునే గదంతా అతికష్టంమీద కలయజూచాడు. అతని కాళ్ళ దగ్గర చిట్టి నిదురబోతుంది. దూరంగా చాపపై పార్వతమ్మ  గాఢ నిదురలో ఉన్నది.

    "అమ్మా...." అన్నాడు నుదుటికి కట్టిన కట్టు తుడుముకుంటూ.

    "బాబూ..." పార్వతమ్మ ,చిట్టికూడా వచ్చారు దగ్గరకు.

    "ఎంత పెద్ద  గండం గడిచింది బాబూ!"

    "గండం గడిచిందా! లేదు.... ఖాదర్ గారేరమ్మా!"

    "ఆయన డాక్టరొచ్చి, "నీకేం ఫరవాలేదు" నగానే వెళ్ళిపోయాడురా" అన్నదామె. అతనికి ఆరాటంగా ఉంది.

    "యెక్కడికి వెళ్ళాడో చెప్పాడా!"

    "లేదు బాబూ లేదు...." అన్నదామె.

    అతను ఆవేశంగా  లేవబోయాడు. "అబ్బా" అంటూ తలపట్టుకున్నాడు.

    "ఏమయింది?" ఆమె వచ్చి, తలపడుతూ కూర్చుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS