Next Page 
వంశాంకురం పేజి 1

 

                                 వంశాంకురం
                                                                         -----మాది రెడ్డి సులోచన

 

                 


    ఆనాడు కార్తీక పౌర్ణిమ , శశాంకుడు తన షోడశ కళలతో దర్శన మిస్తున్నాడు. ఉల్లాసంగా ఆదిక్కే చూడసాగేడు ఆనందరావు. మధురమైన పాట వినిపించగానే అతని దృక్కులు క్రింది వైపు మరలాయి. ఇరవై ఏళ్ళ పడుచు చక్కని ముస్తాబు లో తులసి కోట దగ్గర పూజ చేస్తుంది. చిన్నచిన్న ప్రమిదలలో దీపాలు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. అయిల్లాలు పూజ ముగించి సాష్టాంగనమస్కారం చేసింది. ఏం కోరుకుంటుందో ఆమె వంకే చూస్తూ సిగరెట్టూ వెలిగించాడు.
    'చినబాబూ! అమ్మగారు భోజనానికి రమ్మంటున్నారు' పని కుర్రాడు పిలిచాడు.
    'సత్తీ! అరుణమ్మ నిదుర పోయిందా?' ఆత్రుతగా అడిగాడు.
    'నిదుర పోనట్టే వున్నారు బాబూ. చేతిలో పత్రిక వుంది" వాడు చెప్పి వెళ్ళిపోయాడు. రెండు దమ్ములు సిగరెట్టు లాగి, దాన్ని నలిపి కిందికి దిగాడు. పీటలు వాల్చి, వెండి కంచాలు పెట్టి వున్నాయి. తల్లి, తండ్రి ఇరువురూ తన రాకకై ఎదురు చూస్తున్నట్టు కనిపించింది.
    "నువ్వూ, నాన్నగారూ భోజనం చేయకూడదుట్రా అబ్బాయీ: పేరంటానికి వెళ్ళాక ఎంత తొందరగా వద్దామన్నా కుదరదు. ఎవరో ఒకరు ఏదో ఒకటి అడుగుతారు. "సరస్వతమ్మ కొడుకు దెస తిరిగి ప్రశ్నించింది.
    'తొమ్మిది దాటలేదుగా , నువ్వు వడ్డించనిదే బావుండదమ్మా."
    'నిజమేనే సరస్వతీ . ఈ ఇల్లే నిశ్శబ్దంగా వుంటుంది. నువ్వుంటే వీధిలోని సంగతులు చెబుతూ వడ్డిస్తావు. తిన్నది కాస్త వంటబడుతుంది." రంగారావు కూడా కొడుకు మాటల నామోదించాడు. ఆమె నిట్టూర్చింది. ఆమె ముఖము ముడుచుకోవటము చూచి ఆనంద్ తలవంచేశాడు.
    "అరుణ భోజనం చేసిందా సరస్వతీ?"
    "లేదండి. ఈ పూట విపరీతంగా కడుపు నొప్పి వచ్చింది. పాలు మాత్రం త్రాగింది. సత్తీ వెళ్ళి అరుణమ్మ దగ్గర కూర్చోరా" వాడు వెళ్ళిపోయాడు. ఆమె తండ్రీ , కొడుకులకు వడ్డించింది.
    అమ్మా! నువ్వూ రారాదూ" తన ప్రక్కన మరో పీట వాల్చాడు ఆనంద్.
    "కూర్చుంటాను. ఈ పూట పెద్ద డాక్టరమ్మ వచ్చింది. అరుణను పరీక్షించింది. గర్బకోశము పూర్తిగా పాడయిందిట. పిల్లలు కలిగే మాట అటుంచి , కొన్నాళ్ళు....కొన్నాళ్ళు ...." ఆమె చెప్పలేక పోయింది. సంసార సుఖానికి దూరంగా వుండమన్నారని కొడుకుతో ఎలా చెబుతుంది? ఆమె అసంపూర్తిగా వదిలిన వాక్యము పూర్తీ చేసుకునే తెలివితేటలూ లేనివాడెం కాదు ఆనందరావు. ఆమె కొడుకు వంక జాలిగా చూచింది. వివాహమైన నాలుగు సంవత్సరాల నుండి అతను సంసార సుఖానికి నోచుకోలేదు. ఒకరోజు బాగుంటే నాల్గురోజులు పడుకుంటుంది అరుణ.

 

            
    "అది యెప్పటి మాటేగా. ఇదంతా కర్మ. ఒక్క కొడుకున్నాడు. నల్గురు పిల్లలు పుడితే పిల్లా, పాపలతో కలకలలాడితే చూడాలను కున్నాను. ఆశలు అడియాసలు అయ్యాయి." నిట్టూర్చాడు రంగారావు.
    'జరిగిన దానికి చింతిస్తే ఏం లాభము? ఏదో మార్గం ఆలోచించాలి. ఈ నిశ్శబ్దాన్ని భరించలేను. మా అక్క కోడలికి నల్గురు మొగ పిల్లలు  ఈసారి మొగ పిల్లాడేనట. వెళ్ళి తీసుకురానా?' సరస్వతమ్మ అడిగింది.
    'పిచ్చిదానా తీగెకు కాయ బరువుటే/ యెంత మంది ఉన్నా మనకు పెంపుడు  ఇస్తాడా?' రంగారావు పేలవంగా నవ్వాడు.
    'పెంపుడా!" ఆశ్చర్యంగా చూచాడు ఆనందరావు.
    "మరెలా? మా కాలంలో అయితే హాయిగా రెండో పెళ్ళి చేసుకునేవారు. ఇప్పుడో దరిద్రపు చట్టం వచ్చిందాయే. ఉన్నదంతా యెవరి పరం చేద్దాం? ఇంట్లో మూగ మనుష్యుల్లా ఎన్నాళ్ళూ గడుపుదాము! మీకు వయసు మీరిన తరువాత ఆసరా కావద్దా? మా తనువులుండగానే ఏదో ఏర్పాటు చేసుకుంటే నిశ్చింతగా వుంటుందిరా" అన్నదామె.
    'చూద్దాము లేవే! తొందరపడి ఏ నిర్ణయానికీ రావద్దు. డాక్టర్లు దేవుళ్ళు కారు. మా మేనకోడలు చచ్చిపోతుంది. మందులే వద్దనుకుంటే బ్రతికి బట్టకట్టి నల్గురిబిడ్డలను కనలేదా?" రంగారావు కు ఆశ చావటం లేదు. యెంత మందిని పెంచుకున్నా తన రక్త సంబంధం కాదు కదా!
    'అమ్మా! పెరుగు లోకి పచ్చడి కావాలి!" అన్నాడు ఆనంద్ వారి దృష్టి మరో దిక్కు మరల్చాలని.
    'నీకు పచ్చడి అంటే గిట్టదుగా. అందుకే పెట్టలేడురా' లేచి గాజు గిన్నెలో ఉన్న పచ్చడి అతని ముందుంచింది.
    'నువ్వు చేసే పచ్చళ్ళు బావుంటాయమ్మా?"
    'బావుందిరా ఇప్పుడేదో క్రొత్తగా చేస్తున్నట్టు" నవ్వింది. అతడాశించినట్టు సంభాషణ మరోదారి పట్టింది. రంగారావు చేయి కడుక్కుని వెళ్ళి రేడియో దగ్గర కూర్చున్నాడు. సరస్వతమ్మ ఆకులు, వక్కలు, సున్నపు సీసా పళ్ళెం లో పెట్టుకుని వచ్చి, అతనికి దూరంగా తివాసీ పై కూర్చుంది. ఆనంద్ భార్య పడుకున్న గదిలోకి వెళ్ళాడు.
    గదిలో మందమైన కాంతి తో నీలము బల్బ్ వెలుగుతోంది. అరుణ కిటికీ వైపు తిరిగి పడుకుని బయటకు చూస్తోంది.
    "సత్తీ! వెళ్ళి అన్నము తిను" ఆనంద్ సత్తిని పంపాడు. అతని మాటల కామె ఇటు తిరిగింది. లేవాలని ప్రయత్నించింది.
    'ఫరవాలేదు . పడుకో" అతనే వెళ్లి ఆమె మంచం పై కూర్చున్నాడు.
    "భోజనము చేశారా?' యెంతో ఆర్ద్రంగా ఉందామె కంఠం. నేను అసహాయురాలిని అన్న ఆవేదనా పూర్వకమైన అర్దింపు ఆమె కళ్ళలో కనిపిస్తోంది.
    "భోజనము చెయ్యకపోతే అమ్మ ఊర్కుంటుందా? బయటికి ఏం చూస్తున్నావు? వెన్నెల ఉంది. నక్షత్రాలు కనిపించవు."
    "వెలుతురు లేని జీవితములో చీకటి ల్లోకే చూడక మరేం చెయ్యను?' ఆమె కళ్ళు నిండుకున్నాయి. అతను తన రుమాలు తో ఆమె కన్నీరు వత్తాడు.
    "దిగులుపడితే రోగాలు నయమవుతాయా అరుణా. ఈ డాక్టరు వల్ల కాకపొతే మరో డాక్టరు దగ్గర కెళ్దాము." అన్నాడు ఓదార్పుగా.
    'డాక్టర్, మందులు , అంటే భయము వేస్తుంది."
    'మద్రాసు లో సర్జరీ లో నిపుణులున్నారు, ఆపరేషను చేయిడ్డాము.'
    'వద్దు, వద్దండి. ఆ మాట అనకండి. ఆపరేషన్ చేస్తే జన్మ లో సంతానము పొందలేనుట. హాయిగా ఒక్క పాపయినా సరే పుట్టాక చచ్చి పోతాను. మాతృస్థానము యెంత ఉన్నత మైందో మీకు తెలియదు." ఆవేశంగా అన్నదే కాని ఆఖరి మాటలకు లజ్జితురాలయింది. అతనికి నవ్వు వచ్చింది, వెంటనే బాధ, జాలి కలిగాయి. స్త్రీకి మాతృత్వమంటే యెంత మమకారము. దాని ముందు తన ప్రాణాన్ని కూడా తృణప్రాయంగా చూస్తుంది. అరుణకు పిల్లల పై ఇంత కోర్కె ఉందని తెలియదు. ఆమెను గూర్చి అనుకుంటాడు గాని తనకు మాత్రం లేదూ? అందమైనపసిపాపలను చూడగానే లాలించాలని , హృదయానికి హత్తుకోవాలని వుంటుంది. అతను నిట్టూర్చాడు. విధి వక్రించింది. ఇంట్లో అందరి ఆనందము హరించి వేసింది.
    'ఏమండీ, నా కోర్కె అసంమంజసంగా ఉందా?"
    'లేదు, సహజంగా వుంది. లేనిపోని ఆలోచనలతో మనసు పాడు చేసుకోకు. నీకు తొందరగా నయమవుతుంది. నీకోర్కే ఫలిస్తుంది." అన్నాడు.
    'నన్ను ఒదార్చటానికంటారు గాని, మీకు మాత్రమూ తెలియదా?"
    "ఏం తెలుసు నీ ముఖము. సంతోషము సగము రోగాలకు నివారిణీ. నువ్వు సంతోషంగా వుండాలి."
    "ఎలా? ఏ ఆశతో సంతోషంగా వుండాలి? కోడలు వచ్చి కొండంత సంబరము తెస్తుందనుకున్న అత్త, మామలకు ఆశా భంగమే అయింది. మనసులో బాధగా వున్నా, కుమారునికి చేసుకున్న కర్మానికి , గౌరవముతో చూస్తున్నారు. నా సేవలు చేస్తున్నారు. అనుక్షణము కులదీపకుడు లేడే. అని పూర్వ జన్మ , కర్మలను తలపోసుకుంటారు." అతని వెన్ను లో బాకు దిగినట్టయింది. వారి కర్మ, కాదు . తన పొరపాటు , అతని ముఖాన నవ్వు మాయమయింది.
    'అరుణా, దీని కంతటకు కారణము నేనే.... నేనే అరుణా."
    "మీరెందుకు ఆవేశంగా అంత పెద్ద నింద నెత్తిన వేసుకుంటారు? పాపమంతా నాది. ఇటు జీవితమూ, అటు నా సంతోషము నాశనము చేశాను. ఆనాడే నాకు కడుపులో నొప్పని చెబితే కనీసము మీరయినా రక్షింపబడేవారు. ఆశకు పోయాను. అందరన్న మాటలు నమ్మాను. కాపురము చేసుకుంటే చక్కబడుతుందని ఆశించాను...."
    "పోనిద్దూ . గతము త్రావ్వుకోవడము దేనికి?"
    "ఎలా మరిచి పోతాను అన్నయ్య అనుభవముతో చెప్పిన మాటలు కాదన్నాము." ఆమె కంఠం రుద్దమయింది.
    'వాసా? వాసు ఏం చెప్పాడు?' ఆత్రంగా ప్రశ్నించాడు.
    "మీరు పెళ్ళి చూపులకు వచ్చి వెళ్ళాక , అమ్మ చాలా సంతోషంగా, అన్నయ్య చాలా గంబీరంగా తిరుగసాగారు. ఆరోజు కాలేజీ నుండి వచ్చేసరికి, అమ్మా, అన్నయ్య ఘర్షణ పడుతున్నారు. "దాని ఆరోగ్యం మొదట చూడాలి. లేకపోతె తనే కాక, తనను చేసుకున్న కర్మానికి అతను బాధపడాలి.' అతని మాటలను అమ్మ అపార్ధం చేసుకుంది. "ఎంత చేసినా నేను మారుటి తల్లినే. అది మారుటి చెల్లెలే నీకు ప్రేమ ఎలా ఉంటుంది?" అన్నయ్య బాధగా బయటికి వచ్చాడు. తరువాత నాకు చెప్పాడు. నిజంగా అప్పుడు నేను ఆలోచించ లేదండి."
    'జరగాల్సింది . ఎవరు ఆపినా ఆగదు అరుణా. అందుకు చింతించి లాభం లేదు. నీకు మాత్రం ఏం తెలుసు. ఇలా అవుతుందని."
    'మీ మంచి తనముతో నా మతి పోతుంది. అందరూ ఆవేదనను దిగమింగి నా ఎదుట అతి సహజంగా ఉంటారు. అదే నేను భరించలేను. మోసము చేశానని తిట్టండి. నిందించండి నాకు శాంతి లభిస్తుంది."


Next Page 

WRITERS
PUBLICATIONS