అతను అప్యాయంగా ఆమె చెయ్యి పట్టుకున్నాడు.
ఆ కళ్ళల్లో అదే ఆత్మీయత,అదే ఆప్యాయత ,అదే ఆరాధన! అంతవరకు ,అతని తల్లితండ్రుల ప్రవర్తనతో విసిగిపోయిన శ్వేత, అతని ప్రవర్తన చూచి మైమరిచిపోయింది.
"బావున్నావా సురేంద్రా!"
" ఊ.... నువ్వేమిటి అంతలా చిక్కిపోయావు"అన్నాడు.
"ఒరేయ్ సూరీ! మేమంతా ఉన్నామురా..." అతని పిన్ని వచ్చింది.
"మిమ్మల్ని యెవరు రమ్మన్నారు . పిన్నీ!" అన్నాడు, అలాగే శ్వేత నడుముచుట్టూ చేయివేసి ముందుకు మడిచాడు.
"సామాన్లు నేను తీసుకువస్తాను బాబూ!" వనమాలి తన ఉనికి తెలియజేయాలని, పలుకరించాడు.
"ఓ అంకుల్....."శ్వేతను వదిలి అతన్ని కౌగిలించుకున్నాడు.
"మీరు అందరిని పలుకరించండి"అన్నది శ్వేత.
అతను వెళ్ళి అందరిని పేరు పేరునా పలుకరించాడు.
అందరూ కార్లో కూర్చునేసరికి అరగంట పట్టింది . సురేంద్ర తల్లి తండ్రులు, శ్వేతత ఒక కార్లో కూర్చున్నారు.
"అమ్మా! ఈ ఆడంబరం యెప్పుడు మానేస్తావ్? నేను నిన్ను చూడాలని వస్తారు. లేనివారికి యెవరు వస్తారు"అన్నది.
"ఇక ఆ విషయము ప్రస్తావించకు మారే. మనుష్యులయితే చెప్పవచ్చు" అన్నాడు తండ్రి.
అతనికి శ్వేతతో ఒంటరిగా కబుర్లు చెప్పాలని ఉంది.
శ్వేత ఒడిలో విశ్రమించాలని ఉంది.
"అదేమిటి సురేంద్రా!ఉత్తరాలు రాయటం మానేస్తావ్!"
ఏ రోజుకారోజూ రాయాలని అనుకోవటం, సాయంత్రం అలసిరావటంతో పడి నిదురబోవటం, అంతేకాని మిమ్మిల్ని మరిచి పోయికాదు, మరువాలని కాదు" అన్నాడు.
"చాల్లే బడాయి! మరిచిపోతే ఇంతదూరం వస్తావా! ఎన్ని రోజులు మకాం!"అన్నది.
" ఫోర్ వీక్స్ " అన్నాడు.
అందరూ 'రత్నభవన్'ముందు దిగారు.భోజనాలు కాగానే వెళ్ళి పోయారు.
"ఇక మేం వస్తాం" వనమాలి లేచాడు.
" గుడ్ నైట్ అంకల్! శ్వేతా ఒక్కసారిలా వస్తావా! నీ కోసం చిన్న గిప్ట్" సురేంద్ర బెడ్ రూమ్ లో కి వెళ్ళాడు.
" రేపు చూడవచ్చులేరా"అన్నది తల్లి.
"అబ్బ! ఇంకా నీకంటికి చిన్న కుర్రాడిలా కనిపిస్తున్నానా అమ్మా?" అన్నాడు ఆమె మాట్లాడలేదు.
అతను ఆమె లోపలికి రాగానే, ఆమె ముఖం రెండు చేతుల మధ్య తీసుకుని, నుదురు, కిళ్ళు చుంబించి , పెదవులను అందుకోబోయాడు.
ఆమె చటుక్కున తప్పుకుంది.
" ఏయ్.... ఏమిటి?"
" ఇదేం అమెరికా కాదు....."
"అమెరికా కంటే ఇండియా చాలా అభివృద్ధి చెందిందీ విషయాలలో..."అన్నాడు. అది అతిశయోక్తి కాదు.
జవాబు చెప్పలేనట్టు నవ్వేసింది శ్వేత.
"నాకేం గిప్ట్ లేదా!" అతను నవ్వుతూ తన బుగ్గ చూపించాడు.
"ఛీ...." అన్నది, సిగ్గుల మొగ్గవుతూ.ఆమెకు వెంటనే సిద్దార్థ అడిగిన ఘట్టం గుర్తుకువచ్చింది.
అక్కడినుండి పారిపోయింది. ఆమెకు సురేంద్రను మోసగిస్తున్నానేమో అన్న భయం పిడించసాగింది.
ఇంటికి వచ్చి, పడకపై పడుకున్నా నిదురపట్టలేదు.అటు,ఇటు దొర్లింది.. తాను అతడిని ప్రయోజనానికి వాడుకున్నది . నిజంగా ప్రేమించిందా!
లేదు అన్న జవాబు రాలేదు. ఆమె చెక్కిట చేయి చేర్చి కూర్చున్నది. చెరోవైపు ఇద్దరు యువకులు లాగుతున్నారు.ఇద్దరూ తనకు కావలసిన వారే. ఇద్దరూ ఉదాత్తులే తనేం చేయాలి!
