Previous Page Next Page 
కాంతి రేఖలు పేజి 82


    "బేబీ...."   

    "శ్వేతా అను డాడీ...."  అన్నదామె.

    "ఓ అయామ్ సారీ! సురేంద్ర వస్తున్నాడు."

    "యెప్పుడు డాడీ?"

    "ఈ రోజే! ఇప్పుడే మీ అంకుల్ ఫోన్ చేసాడు. కారు పంపుతాను కోడల్ని రడీగా ఉండమని...." నవ్వరాయన.

    సురేంద్ర తనకు ఎందుకు రాయలేదు.

    ఆమె ముఖం మాడ్చుకుంది.

    "నీకు రాయలేదని కోపమా! పోలీసు ఉద్యోగం వదిలెయ్యమని రాసాడట కదమ్మా!"

    "ఆయన చెప్పగానే ఒప్పుకుంటానా!"

    " ఆయన కాబోయే భర్తే తల్లీ." అన్నది ఆమె తల్లి.

    "భర్తే కాని యజమానికాడు. బావుందమ్మా! నేను అతన్ని ఫారిన్ వద్దంటాను మానేస్తాడా!"

    " వచ్చాక తేల్చుకోండి"

    వాళ్ళు నవ్వుతూ త్వరగా తయారు కమ్మని బలవతం చేసారు ఆమె బాత్ రూంలో దూరింది.

    "తొందరగా ముహూర్తం పెటించండి"

    "అన్నింటికి తొందరయితే యెలా! అబ్బాయికి యెలాంటి పెళ్ళి కావాలో"! అన్నాడు తండ్రి.

    ఈ దేశంలో ఈ జాడ్యం యెప్పుడు పోతుంది! ఎంత సేపటికి మగపెళ్ళివారి అభిప్రాయాలు గౌరవిస్తూ ,అడుగులకు, మడుగులు ఒత్తినట్టు చేస్తారు. ఎందుకో ఏమిటో!

    ముఖం కడుక్కుని వచ్చి, సన్న గళ్ళున్న వంగపండు రంగు పట్టుచీర తీసి కట్టుకుంది.

     "బేబీ! సురేంద్రకు మోడర్న్ డ్రస్సులు ఇష్టం."అన్నాడు వనమాలి.

    "యెటూ పెళ్ళి అయాక మీ మగవారిష్టప్రకారమే మేం బానిసలం అవుతాం. అంతవరకయినా స్వేచ్చగా ఉండనియ్యి."అన్నది.

    "భలే జోక్ వేసావ్ బేబీ...."

    "శ్వేత...."

    అతను భళ్ళున నవ్వాడు.

    వారి అలంకారం పూర్తికాక ముందే, పెద్ద, పాతివిదేశీ కారువచ్చి  ఇంటిముందు ఆగింది. హడావుడిగా , తల్లి తండ్రులతో వెళ్ళి కార్లో కూర్చుంది శ్వేత.   

    అయిదు సంవత్సరాల తరువాత వస్తున్నాడు సురేంద్ర. అతనిని యెలా పలుకరించాలో ఆమెకు అర్థం కాలేదు.

     యెంత చదివినా, ఎంత పెద్ద ఉద్యోగం చేసినా, ఈ ఆడతనం అనే సంకోచం అంటి పెట్టుకునే ఉంటుంది. అదెలా పోతుందో అర్థం కాలేదు.

    "ఏమ్మా!నీలో నువ్వే నవ్వుకుంటున్నావు."

    "ఏంలేదు...డాడీ...." ఈ డాడీ విపరీతమైన ప్రేమాభిమానాలు తనను  కట్టి వేసాయి. లేకపోతే హాయిగా సురేంద్రకో ఉత్తరం రాసి, సిద్దార్థ వివాహం చేసుకునేది."

    అతని వ్యక్తిత్వం యెంత విలక్షణమయినది! ఈ కాలంలో ప్రక్కవాడికోసం అంత ఆరాటపడే వ్యక్తులున్నారా!

    తన పరిచయం చెప్పినప్పుడు అతని ముఖంలో గిల, గిలలాడిన బాధ  ఇప్పటికీ సజీవంగా కళ్ళముందు కదులుతూనే  ఉంటుంది.

    అశాభంగం ఎంత భరించరానిదో పాపం!

    " ఏమిటమ్మా! కార్లో ఉండే ఆహ్వానిస్తావా!"అన్నాడు తండ్రి.   

    "సారీ డాడీ.... అయామ్ వెరి, వెరి సారీ...." గబ, గబ కారుదిగింది సురేంద్ర తల్లి తండ్రులతో పాటు, చాలామంది బంధువులు దిగారు ఏరే పోర్ట్ నిండా వాళ్ళే ఉన్నారు!

    " రామ్మా ఇంతాలస్యం  అయిందేం?" సురేంద్ర తల్లి చేయిపట్టి లాగింది.

    " నాకు డాడీ  ఇప్పుడే చెప్పారాంటీ!"

    " మాకు ఒంటిగంటకే టెలిగ్రామొచ్చిందే తల్లీ."అన్నది, ఆమె  చేయిపట్టి , లాక్కెళ్ళింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS