Previous Page Next Page 
కాంతి రేఖలు పేజి 80


    "రండి...." అతని మాటలు  విననట్టే ఆహ్వానించాడు.

    జోస్ పరీక్షచేసి మందులు రాసిచ్చాడు. ఆపూటకు తను ఇచ్చాడు. రాధిక అతనికి కాఫీ ఇచ్చింది.

    "గాడ్ మే బ్లేస్ మై చైల్డ్-" అన్నాడాయన.

    "లోకంలో చిత్రంగా ఉండే కొన్ని విషయాలకు భాష్యం చెప్పలేము రావుగారూ! మధు, సిద్దార్థ ఇద్దరూ మీ కొడుకులే .భారతదేశంలో కనిపించిన వ్యత్యాసం కనిపిస్తోంది."

    "ఏమిటి మీరనేది?"

    "సిద్దార్థ క్రింది తరగతి ప్రజలకోసం పడేపాట్లు మీకు తెలియవా? మధు మాల, మాదిగ అంటూ రెండు తెగలవారిని ఏనాడు కలవనీయలేదు.అది ఈనాడు సిద్దార్థ సాధించాడు?"

    "వాడు ఆ కొంపల్లోకి పోతున్నాడా!"

    "అంత మాట అనకు రావూ! అతను చేస్తున్న సేవ మహోన్నత మయింది. శ్వేత నామకార్థం పెట్టిన వయోజన విద్యాకేంద్రాలు పుల్ స్వింగ్ నడుస్తున్నాయి."

    ఆయన మాట్లాడలేదు.   

    "ఒకనాడు ఆవేశంగా జంగయ్య మరణం స్వాభావికం కాదని, నాతో వాదించిననాడు, నేను ఆవేశం అనుకున్నాను. కాని అతనిలో అట్టడుగున ఉన్నవారికోసం, ఆవేదన, తపన ఉన్నాయి. అవే అతడిని రక్షిస్తున్నాయి."అన్నాడు.   

    రావ్ మరేం మాట్లాడలేదు. కళ్ళు మూసుకున్నాడు

    "మరి నేను వస్తాను. రాధికా! అవసరం అయితే కబురు చెయమ్మా"అని వెళ్ళిపోయాడు.

    యశోదమ్మకు ఈవిషయాలు సంతోషాన్ని కలుగజెయ్యలేదు ఆమె ఆవేదనతో కళ్ళు ఒత్తుకుంది.

    "ఇంత మంచి విషయాలు చెబితే ఏడుస్తావేం?" రాధిక అడిగింది.

    "మంచి విషయాలు చెప్పిన మహాత్ముడిని ఏంచేశారు? అందరినీ ప్రేమించమన్న క్రీస్తుని ఏం చేశారు? మంచిని గుర్తించే సహృదత మన జనానికి రాలేదు"అన్నది.   

    "మార్పు వస్తుందమ్మా! ఆ మార్పే రాకపోతే మధన్నయ్య ఆటలే సాగేవి."అన్నది రాధిక.

    "మధన్నయ్య మూలంగా మీ నాన్న ఆరోగ్యం దెబ్బతిన్నది. ఇప్పుడు ఆయనకేదయినా అయితే బ్రతకలేను రాధికా!" అన్నది.

    "నాన్న గారికేం కాదు. నువ్వు నిశ్చితంగా ఉండమ్మా!" అని ధైర్యం చెప్పింది.

    " యశోదా!యెవరో వచ్చారు చూడు."

    ఆమె బయటికి వెళ్ళి ఓ యువతిని ఓ ముసలమ్మను వెంటబెట్టుకుని వచ్చింది.

    "నువ్వు దర్జీ బీరప్ప తల్లివి కదూ"!

    "అవునమ్మా"పెద్దదొర ఉన్నాడా!"

    "యెవరూ!" లేచి కూర్చున్నాడు పురుషోత్తమరావు.

    "దొరా!నా మనుమరాల్ని మీరే కాపాడాలి."ఆ యువతిని ఆయన కాళ్ళమీద పడేసింది.ఆమె చంకన  చక్కని బిడ్డ ఉన్నాడు.

    "ఏమయింది"?"

    "నా మనుమరాలు చిట్టి బాబూ!మధుబాబు వస్తూ, పోతూ దాన్ని చూచాడు. తనకు భార్యవల్ల సుఖంలేదు, మళ్ళీ పెళ్ళి చేసుకుంటానన్నాడు. అది  మూగసన్నాసి. అతన్ని నమ్మి కాపురం చేసింది.ఈ పిల్లవాడు పుట్టాడు...."

    "నోరుముయ్యి!  ప్రతీవారికి  డబ్బున వార్ని చూస్తే చుట్టరికాలు గుర్తుకువస్తాయి."

    "లేదు దొరా! ఆ పిల్లవాడిని చూడండి...." పిల్లడిని దింపింది. అదేం దురదృష్టమోగాని మంచి రంగు, నలిగిన బట్టల్లో , అందంగా పొందికగా కనిపిస్తున్నాయి అవయవాలు.

    ఆమె కళ్ళెత్తి చూచింది. కళ్ళనిండుగా నీళ్ళున్నాయి.

    "నన్నేం చేయమంటావ్?"

    " ఏదో దారి చూపించండి బాబూ! నెలకు వందరూపాయలు ఇచ్చే వాడు. అయ్యమీదే కేసు నడుస్తోందని, అమ్మాయికి అతను చేయించిన దిద్దులు, పట్టాలు అమ్మి గడుపుకు వచ్చాను"ఏడ్చింది.

    పురుషోత్తమరావు అయోమయంగా చూచాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS