రాధిక వెళ్ళి చప్పున పట్టుకున్నది. 'నాన్నా' అన్నది ఆర్తిగా.
చాలా రోజుల తరువాత తండ్రి, కూతురు, ఒకరిని ఒకరు సూటిగా చూచుకున్నారు.
" రాధికా...." అస్పష్టంగా గొణికా రాయన.
ఆమె అతన్ని నడిపించుకుని ఇంట్లోకి తీసుకు వచ్చింది.
"ఏమయింది?" కంగారుగా యశోద పరిగెత్తుకు వచ్చింది.ఇద్దరూ కలిసి అతన్ని పడుకోబెట్టారు.
"అమ్మా ! పాలుతీసుకురా." అన్నది.
ఇద్దరూ కలిసి పసిపిల్లవాడికి పట్టినట్టు పాలు పట్టారు. అయిదు నిమిషాలకు తేరుకున్నాడు.
ఆయన పసిపిల్లడు ఏడ్చి నట్టు ఏడ్చాడు.
"అంతా అయిపోయింది!"
"ఏమయింది నాన్నా!"
" నీ మూలంగానే .... నీమూలంగానే....వెళ్ళు-నా కళ్ళముందు నుండి వెళ్ళి పో." ఆవేశంగా నెట్టాడు.
రాధిక భయంగా దూరం జరిగింది.
"డబ్బు మింగుతారు లయార్లు! నిజం చెప్పారు.మధు-అయ్యో!"
మధుమూర్తి కేసు హైకోర్టుకు అప్పీల్ చేస్తున్నాడు. అది తిప్పి కొట్టిందేమో అనుకున్నారుతల్లీ కూతుళ్ళు.
" నేను పైకి వెళ్తాను-" అతను లేచాడు.
"వద్దునాన్నా! మీరు చాలా బలహీనంగా ఉన్నారు" రాధిక వెళ్ళి అతన్ని పట్టుకుంది.
"నేనేం చేశాను నాన్నా! అన్నయ్య ఒక్కడే కొడుకు అనుకుంటున్నారా!నేనేం కానా.!"అన్నది ఆవేశంగా అతని భుజాలు పట్టికుదుపుతూ.
అతను రాధిక వంక చూచి ,ఒక్కసారిగా ఆమెను దగ్గరకు తీసుకుని హృదయానికి హత్తుకున్నాడు.
కళ్ళు లోతుకుపోయి , శవంలా ఉన్న కూతుర్ని చూస్తే అతని హృదయం కెలికినట్టయింది.
ఒకమనిషి ఏపని చేసినా స్వప్రయోజనం అయినా ఉంటుది. లేదా, ఇతరులకు ఉపయోగపడే పని అయినా చేస్తాడు.తను చేసిన పనివలన ఏం సాధించాడు.తను చేసిందానికి ఫలితంగా కొడుకు జైలులో ఉన్నాడు కూతురి జీవితం నాశనం అయింది.
"నన్ను- నన్ను క్షమించమ్మా." అన్నాడు.
"నాన్నా!"బావురుమన్నది. గడ్డకట్టుకుపోయిన అభిమానం, ఆప్యాయత కరిగి కన్నీరు అయింది.
"రాధికా!"అన్నాడు బొంగురు గొంతుతో.
"లేదమ్మా!నాన్న విశ్రాంతి తీసుకోనియ్యి."అన్నది యశోద.
రాధిక దూరం జరిగబోయింది.
"ఉండనియ్యి యశోదా-" అన్నాడు.
ఇద్దరికీ పళ్ళరసం ఇచ్చిందామె.
రాధిక లేచి తండ్రి సామాన్లు సర్దుతోంది.
"యశోదా! కాస్త అమృంతాజనం రాయి."అన్నాడు కాళ్ళు చూపుతూ.
" కాళ్ళు కొంకర్లు పోతున్నాయి."
ఆమె కాళ్ళకు అమృంతాంజనం రాసి, కావడం పెట్టింది.
"మనిషి తను సాధించలేనిది లేదనుకుంటాడు డబ్బుతో అన్నీ కొనలేము." అన్నాడు.
"ఏం జరిగిందండీ.!" అని అడగాలని ఉందిన కాని అతను వెటకారం చేస్తాడు. అది భరించే శక్తి లేదు.
"లాయరు అనవసరంగా పదిహేనువేలు ఖర్చు పెట్టించాడు.ఈ కేసు గెలవలేం అని చెప్పుకూడదూ."అన్నాడు.
"అలా చెబితే అతని మనుగడ దెబ్బతింటుంది. అదీకాక మనం మరో లాయర్ని వెతుక్కుంటాం."
"నిజమే-"అన్నాడు.
యశోద లేచి డాక్టరుకు కబురు పంపింది.అరగంటకల్లా డాక్టర్ జోస్ వచ్చాడు."
అతన్ని చూడగానే పురుషోత్తమరావు ముఖం మలినమయింది.
"రావుగారూ తానొకటి తలిస్తే -అన్న సామెత వినలేదా?"
