Previous Page Next Page 
ఆచరణ లో అభ్యుదయం పేజి 7


    ఒక్క ఆడపిల్ల కోపంగా చూస్తేనూ, ఏవగింపు తో చీత్కారం చేస్తేనూ అల్లరి కుర్రాళ్ళు అందరూ బుద్ది తెచ్చేసుకుంటారు అనుకోటం పొరపాటే......అదే జరిగింది కూడా.
    ఓ రోజు కళ్యాణి డస్కులో ప్రేమ లేఖ -- వ్రాసిన వాడి పేరూ వూరూ ఏమీ లేదు-- కాగితం తీసి చూసి చూడగానే కళ్యాణి కి పరిస్థితి అర్ధమయి పోయింది. కళ్ళల్లో గిర్రున నీళ్ళు తిరిగాయి -- దాన్ని వుండ చుట్టి చేతిలో పట్టుకుని మరుక్షణం లోనే క్లాసులోంచి బయటకు నడిచింది.
    తలవంచుకుని ఏదో వ్రాసుకుంటున్న పురుషోత్తం గారు ఎవరో వచ్చిన అలికిడి అయి తలఎత్తి చూశారు. కళ్యాణి ని ఆయనకి చూపించి, ఇంక తను వచ్చిన పని అయిపొయింది. అన్నట్లు వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు స్కూలు బంట్రోతు.
    వినయంగా బయటికి నమస్కారం చేసి తన పేరూ క్లాసూ అదీ చెప్పి , వుత్తరం అయన టేబిలు మీద పెట్టింది కళ్యాణి.
    'ఏమిటిది?' అంటూనే అది తెరిచి చదివారు. 'ప్చ్-- తుంటరి మూక-- వీళ్ళకీ చదువూ సంధ్యా ఏమీ అక్కర్లేదు-- కేవలం అల్లరి చెయ్యటానికే స్కూలుకి వస్తున్నారులా వుంది-- పేరు వ్రాయటానికి కూడా ధైర్యం లేకపోయింది కాబోలు-- ఉ...ఇలాంటి వాళ్ళు ఒక్కరుంటే చాలు, స్కూలు కంతటి కి చెడ్డ పేరు వచ్చేస్తుంది. ' అంటూ ఏకబిగిని ఆయనలో అయన అనుకుంటున్నట్లు గానూ, కళ్యాణి తో చెప్తున్నట్లు గానూ కూడా అని,
    'నేను కనుక్కుంటాను లేమ్మా-- నీకేం భయం లేదు. క్లాసులోకి వెళ్ళు. అన్నాడు వాత్సల్యం వుట్టి పడుతుండగా -- ఈ కళ్యాణి ఎవరో అయన వూహించుకో గలిగారు.
    మనస్సులోనే అయన పట్ల కృతజ్ఞత తెలుపుకుని, మరోసారి నమస్కారం పెట్టి తల వంచుకుని మెల్లిగా ఇవతలికి వచ్చేయ బోయింది. అంతలోనే మరేదో గుర్తు రావటం వల్ల చటుక్కున గడపలోనే ఆగిపోయి వెనక్కి తిరిగింది. అంతే-- 'ఆ అమ్మాయిలో అణువణువు అవమానంతో ఆవేదనతో దహించుకు పోయింది. 'ఇన్నాళ్ళూ బాధ్యత తెలియని విద్యార్ధుల చర్యాలనే నిరసిస్తూ వచ్చింది-- కాని, ఇవాళ -- ఒక బాధ్యత గల హోదాలో వున్న వ్యక్తీ ఆ విద్యార్దీ విద్యార్ధినుల వయస్సు గల బిడ్డల తండ్రి పురుషోత్తం గారి కళ్ళు నిర్లక్ష్యంగా , అవహేళన గా పూర్వకంగా నవ్వుతున్నాయి అయన పెదవుల మీద వక్తహాసం -- ఒక్క క్షణం కళ్యాణి స్తంభించి పోయినట్లే అయింది.
    వెళ్ళిపోతుంది అనుకున్న కళ్యాణి అలా హటాత్తుగా వెనక్కి తిరగటంతో తబ్బిబ్బు పడి చటుక్కున తన మొహంలో భావాలు మార్చుకోటానికి ప్రయత్నిస్తూ 'ఏమ్మా' అన్నారు పురుషోత్తం గారు-- అప్పటికప్పుడు గొంతు నిండా ఆదరం నింపుకోటానికి ప్రయత్నిస్తూ.
    'అబ్బే, ఏం లేదండి,' మనస్సు మండిపోతున్నా పైకి మర్యాదగానే సమాధానం చెప్పి మెల్లిగా బయటకు వచ్చేసింది-- గతంలో తనకు జరిగిన అవమానాలన్నింటినీ గురించి ఇంక ఆయనకు చెప్ప బుద్ది కాలేదు-- తనంటే మంచి అభిప్రాయం, ఆదరణ లేని వ్యక్తీ తో ఇంకొకరి గురించి ఫిర్యాదు చేసుకోవటం ఏమిటి అనిపించింది-- పురుషోత్తం గారి ప్రవర్తన తలుచుకుంటుంటే మాత్రం కళ్యాణి వంటి నిండా తేళ్ళూ, జేర్రులూ పాకుతున్నట్లుంది . 'హు-- నన్ను చూసి హేళనగా నవ్వుతున్నాడు -- గురివింద గింజ సామ్యం యిదే కాబోలు -- తనను గురించి నాకేమీ తెలియదనే అనుకుంటున్నారు కాబోలు' అనుకుంది కసిగా.
    కనకవల్లి ఇంటి ప్రక్కనే వుండే మోహనాంబ ఇంటికి పురుషోత్తం గారు రావటం పోవడం కళ్యాణి చాలాసార్లు చూసింది-- మేడ గదిలో కూర్చుని వుండే కళ్యాణి ని అయన చూడలేక పోయేవాడు గాని రోడ్డు మీద నడిచి వెళ్తుండే ఆయన్ని కిటికీ లోంచి కళ్యాణి స్పష్టం గానే చూడగలిగేది-- అయన నడవడి గురించి మంచి అభిప్రాయం లేకపోవటం చేతనే ఇన్నాళ్ళూ ఎంతమంది ఎన్ని విధాల ఏడిపిస్తున్నా ఆయనతో ఫిర్యాదు చేసుకో వాలనిపించ లేదు. కాని పరిస్థితి అంతకంతకు మితిమీరి పోతూండటం వల్లనూ, కొన్నాళ్ల క్రిందట మరో క్లాసులో ఒక అమ్మాయికి ఇలాంటి అవమానమే జరిగితే ఆయనకి తెలిసి గట్టి చర్య తీసుకోవటం వల్లా ఆయనతో చెప్తేనే బాగుంటుంది అనే నిశ్చయానికి వచ్చింది-- అంతేకాదు, వ్యక్తిగతంగా అయన ఎలాంటి వాడయినా కానీ, ఆయనలో ఎలాంటి బలహీనతల యినా వుండనీ , వో సంస్థకి అధికారి హోదాలో వున్నవాడు, అందులో పిల్లలకి చదువు సంధ్యలు వచ్చేలా చూడటమే కాదు వాళ్ళ నడవడి ప్రవర్తన తీర్చి దిద్దవలసిన బాధ్యత అయన మీద వుంది , అడక్షత కూడా ఆయనకి వుంది అనిపించటం చేతనే మరో ఆలోచనకి తావు ఇవ్వకుండా అయన సహాయాన్ని అర్ధించింది -- అయన ఇంత వెకిలిగా ఇలా బయటపడి పోతాడు అనే వూహ కూడా రాలేదు--' ఛ-- ఏం మనుష్యులు ? వీళ్ళ మధ్య మెసలుతూ నేనింక చదువెం చదువు కుంటాను .' అనుకుంది.
    'నువ్వంటే ఆయనకి ఎలాంటి అభిప్రాయం వుంటేనేం, ఆ విద్యార్ధుల మీద తగిన చర్య తీసుకుంటా నని హామీ ఇచ్చారుగా -- ఎలాగో రెండేళ్ళు కళ్ళు మూసుకుంటే ఈ స్కూలు చదువు అయిపోతుంది.' అంటూ మనస్సు మరో మూల నుంచి గొణిగింది.
    'ఉహు లాభం లేదు -- అభిమానం గౌరవం లేకపోతె మానె స్పష్టంగా కనిపిస్తున్న ఇంతటి నిరాదరణ నేను భరించలేను.' అనుకుంటూ క్లాసులో అడుగు పెట్టింది. పుస్తకాలు చేతిలోకి తీసుకుని ఇవతలకి వచ్చేయ బోతూంటే కళ్యాణి లో దుఃఖం ఒక్కసారి పెల్లుబికి వచ్చింది.
    'మీకు నేనేం అపకారం చేశానని కక్ష కట్టినట్లు నన్నిలా సాధిస్తున్నారు-- నిజమే-- నేను మీలా గౌరవనీయమైన కుటుంబంలో పుట్టలేదు-- అంతమాత్రం చేత మీతో కలిసి మెలిసి తిరిగే అర్హత కూడా నాకు లేదా -- మీ అందరి లాగే చదువు కోవాలనీ ఎన్నో డిగ్రీలు సంపాదించాలనీ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయ్యాలని ఎన్నో కోరికలతో ఈ స్కూల్లో అడుగు పెట్టాను-- నాకు ఇలా అడుగడుగునా ఆటంకాలు కల్పించి ఎందుకింత వేధిస్తున్నారు-- మీ ప్రవర్తనతో నా గుండెలు అవిసి పోతున్నాయనే సంగతి మీరు గ్రహించు కోలేరా.' అని ఒక్కసారి అందరినీ ఆడగలనే ఆవేశం పొంగి వచ్చింది-- కాని ఒక్క మాటయినా మాట్లాడకుందా -- వెళ్లి పోతున్నాను అని ఎవరికీ చెప్పనైనా చెప్పకుండా -- మాష్టారు క్లాసులోకి రాక ముందే తను బయట పడాలనే వుద్దేశ్యంతో గబగబ అడుగులు వేసుకుంటూ స్కూలు గేటు వేపు వెళ్ళిపోయింది. ఇంటి నుంచి వెళ్ళిన అరగంట కే మళ్లీ తిరిగి వచ్చిన కూతుర్ని చూసి వనజాక్షి కాస్త తెల్లబోయినా ఏమీ అడగలేదు.
    కళ్యాణి తిన్నగా తన గదిలోకి వెళ్లి పోయి పుస్తకాలు అలమారు లోకి గిరవాటు వేసి మంచం మీద పడుకుని ఏడుస్తుంటే ఆ ఏడుపు విని విస్తుపోతూ లోపలికి వచ్చింది. కూతురు ప్రక్కనే మంచం మీద కూర్చుని అనునయంగా వెన్ను నిమురుతూ 'ఎందుకెడు స్తున్నావు-- అసలేం జరిగింది -- పుస్తకం ఏదైనా మరిచి పోయావేమో తీసుకు వెళ్ళటానికి మళ్లీ వచ్చావను కున్నాను-- ఇదేమిటిది.' అంటూ బుజ్జగించి అడగటం మొదలు పెట్టింది.
    తల్లి అలా అడుగుతున్న కొద్దీ కళ్యాణి లో దుఃఖం మరీ పొంగుకు వచ్చింది. 'మీ అందరి మాటలు కాదని వెళ్లాను-- పరాభవం పొంది తిరిగి వచ్చాను-- నా జన్మ హేయమైనది. నా బ్రతుకు హేయమైనది. పదిమందీ లోకువగా వేలెత్తి చూపించ గలిగే అట బొమ్మని నేను.' అన్న ఊహలతో మరీ కుమిలి పోయింది. చివరికి కాస్సేపటి తరువాత తల్లి బ్రతిమాలగా బ్రతిమాలగా ఎలాగో దుఃఖాన్ని దిగమ్రింగి జరిగినదంతా చెప్పి
    'ఇంక నేనా స్కూలు మొహం చూడను' అంది కళ్యాణి.
    'పోనీలే, ఇప్పుడు నిన్ను చదువుకోమని ఎవరు బలవంతం పెట్టారు. హాయిగా ఇంట్లోనే ఉండు.' అంది వనజాక్షి.
    'ఉహు-- నేను కనీసం మెట్రిక్ అయినా ప్యాసు కావాలి. ప్రయివేటు గా చదివి పరీక్ష కి వెళ్తాను' అంది కళ్యాణి.    
    ఇంట్లో వాళ్ళందరూ 'సరే నీ యిష్టం' అనక తప్పలేదు కాని కళ్యాణి కి ప్రయివేటు చెప్పటానికి మాష్టరు దొరకటం మాత్రం గగన మయిపోయింది.
    ఆ యింటి గడప లో అడుగు పెట్టి ఆ అమ్మాయికి చదువు చెప్పటానికే తమ పరువూ మర్యాద గంగలో కలిసిపోతాయి అన్నట్లు భయపడి పోయారు చాలామంది -- తమకి స్వయంగా అభ్యంతరం లేకపోయినా నలుగురూ చెవులు కొరుక్కుంటారేమో అనే సంకోచంతో వెనక్కి తీశారు కొంతమంది . చివరికి ఎలాగో వో మేష్టరు దొరికాడు. కళ్యాణి మెట్రిక్ ప్యాసయింది.
    ఈలోగా ఇంట్లో అనేక రకాల గొడవలు. రోజూ ఏదో వో రాద్దాంతం -- అబ్బ-- అది ఒక నరకమే అనిపించింది కళ్యాణి కి-- ఆ నరకాన్నుండి బయట పడటానికి మాత్రం ఎన్ని గొడవలు జరిగాయని !
    'నా దారిన నన్ను బ్రతకనివ్వక పొతే ఎందులోనయినా పడి చచ్చిపోతాను .' అని కళ్యాణి ఆఖరి అస్త్రం ప్రయోగించటం తో వాళ్ళంతా కాస్త వెనక్కి తగ్గారు. కాని, ఆమె ఇల్లు విడిచి వచ్చేస్తుంటే,
    'నిన్ను ఎవడు పెళ్లి చేసుకుంటాడే -- నాలుగు అక్షరం ముక్కలు వంట పట్టించుకుని మాకే నీతులు బోధిస్తున్నట్లు మాట్లాడుతున్నావు కాని'.... అంది అమ్మమ్మ కనకవల్లి అక్కసు పట్టలేక.
    'ఫరవాలేదు వెళ్ళనీ-- ఒక్కసారి మోసపోతే అప్పుడు బుద్ది తెచ్చుకుని మళ్లీ ఇక్కడికే తిరిగి వస్తుంది.' అన్నాడు రాఘవులు.
    'నన్ను పెళ్లి చేసుకోటానికి ఎవ్వరూ ముందుకి రాకపోతే బ్రహ్మచారిణి గానే జీవితం అంతా గడిపేస్తాను-- ఈ ప్రపంచంలోని మనుష్యులనీ, వాళ్ళ తత్వాలనీ అర్ధం చేసుకోలేక ఎవ్వరి చేతనైనా మోసగించబడటం అనేది జరిగితే ఈ గుక్కెడు ప్రాణం తీసుకుంటానే కాని మళ్లీ మీ ఆశ్రయాన్ని మాత్రం కోరను.' అని బింకంగా ధైర్యంగా సమాధానం చెప్పి మరీ వచ్చేసింది.
    అసలు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి అనే విషయంలో చాలాసేపు ఏ నిర్ణయానికి రాలేకపోయింది. కాని చివరికి తన వాళ్ళకి సాధ్యమైనంత దూరంగా వుండటమే బాగుంటుందని పించి హైదరాబాదు కే టిక్కెట్టు తీసుకుని రైలు యెక్కి కూర్చుంది. 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS