చిట్టిరాజు పదిమందిని పోగుచేసాడు. "ఈయేళ నించి బానిసబతుకులుసరి. మీరంతా బయలు ప్రదేశంలో గాలిలో బతుకుతున్నారు. పిట్టకెంత స్వంతంత్రమోమీకూ అంతే. తోక జాడించుకుపోయేవాళ్ళం కాకూడదు. కొరివి మన తలకు తగిలించొద్దు. ఎదుటో డికి తగిలించి మనకు రావలసినది మనం సక్క బెట్టుకుందాం. మనం గులాములు కాము మన నొకడు చులకన చెయ్యడానికి! గోతులు చేద్దాం - గోరంతనీరు చేరినా తోడు కుందాం. కొండంతదోచి ఘనంగా బ్రతుకు దాం. ఈ వేళనుంచే మీలో నే నొకర్ని.. మీకు నాకూ బేదంలేదు. తప్పులు లేవు. తఖరాలు లేవు. గొడ్డు, గోదా గుంటలు చూసుకుంటారు. ఆడోళ్ళు యింట్లో వుండి వంటా పెంటా చూస్తారు. మనం మొగాళ్ళం. గడించి యిక్కడే యిల్లు నిలుపుకుందాం".
ఎగరడానికి, ముందు రెక్కలు విప్పిన పక్షుల్లా సంతోషంతో యీ మాటలు విని, లేచి చేతులు దులుపుకున్నారు. వీళ్ళు ఒక్కసారి అపాయంలో యెగిరినట్టు యెగిరి దిగిపోయారు. ఈ కట్టుబాట్లన్నీ లేకపోతే బాగుణ్ణుగానీ అవిలేకపోతే గుంపుకి అవుతుందా అన్న సంశయం కొందరిలో కలిగింది.
బోడమ్మ కొడుకును కీర్తిస్తోంది. బుట్ట. జోలీ అంతా మూల పడేసింది. నల్లమందు కలిపిన మత్తుమందులు, వశీకరణ మందులు అన్నీ పెట్టెలో దాచేసింది. పనిలేనమ్మ గుంపులో యింటింటికీ చేరి కొడుకు చేస్తున్న ఘనకార్యాలను యేకరువు పెడ్తోంది. "గోంగూర పచ్చడిలో చింత కాయ యేల యేస్తావు" అన్న మొగుడు మీద ఖస్సు మన్నది.
"నా కొడుకు రాచరికం. లచ్చిందేవికి పాలు పొంగిపోవా?"
"కష్ట సంపాదన-యిట్టభోజనం వంటి కెక్కుతాదని పెద్దలన్నారు కదే! దోస్తుంటే సూస్తూ వూరుకో..."
"నీ రోజుల్లో మా గడించి పోనావు. నివ్వు రెండు గుడ్లగూబ కళ్ళెట్టుకున్నావు - ఒక వస్తువేనా సరిగ్గా సూసినావా? నా కొడుకు రెండు రతనాల లాంటి కళ్ళతో రెండేసి వస్తువులు సూస్తున్నాడు."
"ఆడి రాచరికంలో అప్పుడే అప్పులు తీసేసినాడు. సెజయేమవుతున్నారు సూడు. ఈడి పెళ్ళం దాని మొగుడు దుక్కు, ఆడి పెళ్ళం దీని మొగుడు దుక్కుపళ్ళిక లిస్తున్నారు. ఊరూర గాలిలో తిరుగుతున్నట్లు వూరిబయట వుంటున్నామే. అందుకే యీ గాలిపడలకి దారాలుండాలే".
"పో...ఎప్పుడూ కాళ్ళకి బందాలే, ఈయేళ యింతకి నవ్వినోలు, లేవు మరి నవ్వుతారా? నీ కోకలు నా కొడుకు పీకినాడని అక్కసుతో అట్టుడికి పోతున్నావు. ఆడంగులికి యెంత హాయిగా వున్నాది. మొగోడు తెచ్చిపోస్తే తాగుతున్నాం. గుంపులో రొక్కం ఆడుతున్నది."
"కడసారంగా అడుగుతున్నాను. నాతో వత్తావా రావా?
"ఏం, తినడానికి రమ్మంటావు? రత్నం లాంటి కొడుక్కి వదలి రమ్మంటావా?"
"నివ్వున్నంతకాలం ఆడికి పెళ్ళాం అక్కర్లేదు - వంటసేసి పోస్తున్నావు కదా నివ్వాడికి వంచనేవు. పెళ్ళం వస్తే వంచుతాది."
"నాను రానుపో..." అన్నాది.
"అదేనా సివరి మాట?"
"సివరాలేదు మొదలూ లేదు - ఆ చుక్కులడగా నేనెందుకు - పో."
"నుయ్యి తవ్వుతున్నా ననుకుంటన్నావు. నివ్వు తవ్వుతున్న గోతిలో నీకు పడదు. ఏనాడో ఆ గోతిలో పడ్తావు" అంటూ వీరన్న వెళ్ళిపోయాడు.
వీరన్న యిప్పుడు మిగతా గుంపుల్లోకి తరచు పెద్దమనిషిగా వెళ్తున్నాడు. వస్తున్నాడు. తను యీ గుంపులో పలుకుబడి పోగొట్టుకున్నా మిగతా గుంపుల్లో తన పలుకుబడి హెచ్చుతోంది. పదుగురూ అక్కడ తన కొడుకు గురించి చెడ్డగా మాటాడుకుంటే ఖండించి కొడుకు గురించి గొప్పగా చెప్పుకుంటున్నాడు. వీరన్నకు కొడుకుతో మాటాడాలని వున్నా కొడుకే తండ్రి కనిపిస్తే ముఖం త్రిప్పేస్తున్నాడు.
ఒకనాడు యింకో గుంపు దగ్గర యేదో తగువుంటే బయలు దేరాడు వీరన్న. కొంత దూరం వెళ్ళాక అటునించి కబురు వచ్చింది వూర్లో వాళ్ళతో పశువులనించి తగువు రావటం వలన గుంపు కదలి పోతోందని, సరియైన బాగా కుదిరాక మళ్ళీ మనిషి ద్వారా కబురంపుతావని ఆ గుంపుపెద్ద కబురం పాడు. వీరన్న తిరుగ ఒక్కడే బయలుదేరాడు.
చీకటి రాత్రులు. బట్టతల పాగ సర్దుకుని చుట్టాడు. చేత బెత్తం వుంది. నల్లని ఆకాశంలో నక్షత్ర మండలం మిణుగురుల్లా మెరసిపోతోంది. నక్కల అరుపులు వినగానే కాప్ల పీ కెట్టాయ్. ఒక చోట గుడ్లగూబ మూలుగుతూ బెదిరించింది. గాలి వెర్రిగా వీస్తోంది. రాత్రి రోధిస్తోంది. తుపాకీ దెబ్బతిన్న కొంగల్లా ఒకోసారి వెలుగు తున్న వుల్కలాలు రాలిపోతున్నాయ్. గుడ గుడ ఆలోచనలవల్ల గుండె గడగడ శబ్దం చేస్తోంది.
గుంపు చేరుకునే సరికి పదిగంటల రాత్రయింది. అప్పటికే గుంపు అంతా ప్రశాంతంగా వుంది. తనను యెవరూ చూడలేదు. మెల్లగా తన పాక చేరుకుంటుంటే లోపల చిన్న వెలుతురు కనిపించింది. మరికాస్త ముందుకు వెళ్ళేసరికి కాస్త గుసగుసలు వినిపించాయి. ఆ మగాడి నోరు యెక్కడో విన్నట్లుంది. మెల్లగా సందులోనించి చూసాడు. చిట్టిరాజు చుక్కమ్మతో ప్రేమకలాపాలు సాగిస్తున్నాడు. కొడుక్కు తన రెండో పెళ్ళం వాడి తల్లితో సమానం - ఈ పశువుని కనికరించ కూడదు. కనికరిస్తే యీ లోకంలో నరాలు పడవు - పంటలు పండవు - భూకంపాలు వచ్చి సర్వం నాశనం అయిపోతాయి.
లిప్తలోనే తలుపుతట్టాడు. తను అలా నిల్చుండగానే చిట్టిరాజు రెండోప్రక్కనుంచి మాయమై పోయాడు. వీరన్న పరువు తక్కువని కేకవెయ్యలేదు. వాడు గుంపు బయటనించి పొలాలవేపు పరుగెత్తటం చూసాడు. వీరన్న వెంటపడ్డాడు. ఎంత పరుగెత్తినా కొడుకును చేరుకోలేకపోతున్నాడు. చిట్టిరాజు ఒక చెరుకుతోటలో దూరిపోయాడు. ఇటూ అటూ యెవరూ లేకపోవటం చూసి...
"నాయాళ - పాపిష్టియెదవ - నీ రక్తం తాగు తాను....రా.... పైకి..." అన్నాడు. ఇటూ అటూ తిరిగేస్తున్నాడు- మళ్ళీ కొడుకు పిల్లిలా బయటపడి పులిలా పరుగెత్తిపోతున్నాడు. రోడ్డు మీద పడ్డారు. రాళ్ళురువ్వినా ఒకటీ కొడుక్కి తగల్లేదు.
అలసి పోతున్నా కాళ్ళు రబ్బరు కాళ్ళలా కదలుతున్నాయ్. కొడుకు రైలురోడ్డు యెక్కాడు. ఇటు నించి ఒక లారీ వెళ్తోంది. రైలురోడ్డు దాటింది. వీరన్న రైలు రోడ్డు యెక్కాడు. ఇటూ అటూ చూసాడు. కొడుకెక్కడా కనపడలేదు. లారీ ఫర్ న వెళ్ళిపోతోంది.
పెద్ద నిట్టూర్పుతో రైలురోడ్డు ప్రక్కనే నిల్చున్నాడు. నడుం జారిపోయింది. నరాలన్నీ తెగిపోయాయ్. తలలో భరించరాని పోటు. గునపం పోటు తగిలిన గుండె - మనసు పట్టు తప్పింది. ఒక్కసారి వెలుతురు పడింది. చెవులు బ్రద్దలయ్యే రైలు శబ్దం. గూడ్సుబండి బరువుతో పరుగెత్తుక వస్తోంది. ఒకక్షణంలో అనుకున్నాడు.
"ఈ పాపం తల్చుకుని కుమిలిపోడానికేనా బతికుండాల? బతకడానికి ఆయువు పోసిన బగమంతుడు మాదొడ్డవాడు. కానీ మానం ఆ దొడ్డ వారి కన్నా గొప్పది."
రైలు వచ్చేస్తోంది. గబ గబ తలపాగ తీసి ప్రక్కనే వున్న పొదమీద కుదురుగా పెట్టాడు. రైలు వచ్చేసింది. చప్పున తల కమ్ముల మీద పెట్టేసాడు. మొండెం క్రిందకు జారి గిజ గిజ కొట్టుకుంది. తల మాత్రం పచ్చడైనా మీసాలు చెక్కు చెదరకుండా త్రిప్పే వున్నాయ్.

7
ఉదయం పందుల్ని మేతకు తీసికెళ్ళిన వాళ్ళలో ఒకడు గుంపులోనికి వార్త తీసుకువచ్చాడు. ఆసనాల వీరన్న రైలుక్రిందపడి చచ్చిపోయాడన్న వార్త గుంపంతా అల్లేసింది. మనుషులు గజగజ వణికిపోయారు. ఉప్పాల రాముడుకింద దొర్లి దొర్లి యేడుస్తున్నాడు. తన పాక నించి చిట్టిరాజు బయటకొచ్చి-
"పోపోరా - ఎవురిని చూసి అంటున్నావో -?"
"పోలీసోలు కాపలా వున్నారు... ఆ తలపాగ యీరన్న బాబు పే- ఆ ---- బంగారం మురుగులు, సెవులో నెరసుకాడలు.. అలకా కమ్మీ - అన్నీ ఆ బాబువే -"
చిట్టిరాజు గోలు గోలు మంటూ పరుగెత్తాడు. శవం పంచాయితీ అయి ఆత్మహత్య అని వీళ్ళకు దఖలు పడినప్పటికీ సొమ్మ తిరిగింది. బోడమ్మ దుఃఖం యింకా చల్లార లేదు. తలచి తలచి యేడుస్తోంది.
ఒకనాడు తను కూర్చుని తీర్పులు చెప్పిన మర్రిచెట్టు ప్రక్కనించే వీరన్న శవం కదిలింది. అలా చెట్టు క్రిందనించి వెళ్తున్నప్పుడు ఆకులు అల్లల్లాడినయ్. రెండు ఆకులు కూడా ఆ చెట్టు రాల్చింది. నాలుగు మర్రిపళ్ళు రాలి దొర్లి దొర్లి గోతుల్లోచేరాయి. ఒకనాడు యీ చెట్టుక్రింద కూర్చొనే యీ సుందర ప్రదేశం చూసుకుంటూ యిక్కడే కలకాలం స్థిరపడాలని కోరుకున్నాడు.
ఈ చుట్టుపట్ల జాగా, న్యాయంగా కొనుక్కొని కలకాలం గుంపంతా యిక్కడే వుండిపోవాలని కలలుగన్నాడు. అలాంటి సుందర ప్రదేశంలో యిప్పుడు వీరన్న స్థిరపడిపోయాడు....బూడిదగా. కొన్నాళ్ళకు ఈ బూడిద మట్టిలో కలిసి పోయి సొరవంతమై .... ఏదో ఒక రోజున ఆ బూడిదనుంచి బహుశః ఒక మొక్క మొలవవచ్చు. ఆ మొక్క పెరిగి పూలను విరబూయించి, కాయలూ పళ్ళూ కావలసిన వాళ్ళకిచ్చి - వీరన్న బ్రతికేటప్పుడు యెదుటి వాళ్ళ బాగు యెలా చూసాడో అప్పుడూ అలానే తాపత్రయ పడతాడేమో?
అంతరాత్రయినా బోడమ్మ మొగుడ్ని తలచి తలచి యేడుస్తోంది. వాడి పాకలో ఉప్పాలరాముడు. "నా యీరన్న బాబూ!...ఎన్ని కడుపులైనా నా కడుపనుకుని ఆదరించినావు. ఈ ఎండ్రకాయ లొచ్చి అటూ యిటూ బరబరా కదిలి ఒకదారిన పోకుండా సేసినారు తండ్రీ.
సెరుకు బండిమీద పోయిన మారాజు సేతులు కట్టేసి కర్రకోసం అరిసిన నందం అయ్యింది బాబూ....నీతిని పంపి. నిబద్ధిని పొడిసి .... సెరువులో కుప్పిగంతులేసి బురదనంతా పైకి తెచ్చి నారు బాబూ....ఈ కంపు సూడనేక ఆ మారాజు సచ్చినాడు..."
ఇలా యేడుస్తూంటే పాకచుట్టూ పదిమంది కాసి కేకలేస్తున్నారు. కోటమ్మా యేడుస్తూనే మొగుడ్ని వూరుకోమని చెప్తోంది. ఊరుకో మంటుంటే రాముడు మరింత గట్టిగా.
