Previous Page Next Page 
స్రీ పేజి 7

 

    పార్వతికి బ్రహ్మానందమైంది. మాల పూర్తయ్యేవరకూ పువ్వులు పేర్చి అందిస్తూ కూర్చుంది. చిక్కగా కట్టిన మాల ఓ జానెడు తెంచి మెత్తటి అరిటా కు లో చుట్టి ఇచ్చింది సావిత్రి. "నలప కుండా జాగ్రత్తగా తీసుకెళ్ళి ఇచ్చిరా! తొందరగా రా!"
    పార్వతి అప్పటికే రోడ్డు దాటేసింది.

                            *    *    *    *
    అరిటాకు పొట్లం అపురూపంగా పరికిణి లో చుట్టుకుని బెరుకు బెరుగ్గా చూస్తూ గేటు దాటి వీధి గుమ్మం ముందు మెట్ల దగ్గరికి వెళ్ళి నిలబడి పోయింది పార్వతి.
    బయట ఎవ్వరూ కనిపించలేదు. ఒక్కదానికీ లోపలికి వెళ్ళే సాహసం లేదు. అలాగే నిలబడింది ఆశగా లోపలికి చూస్తూ.
    వీధి గేటు ముందు జట్కా ఆగింది. చలపతి రావు దిగి లోపలికి వస్తూ మెట్ల దగ్గర తల వంచుకు నిలబడి వున్న పార్వతిని చూశాడు. "ఎవరమ్మా , పాపా నువ్వు? ఏం కావాలి ?"
    భయంతో బిగుసుకుపోతున్నా, ధైర్యం తెచ్చుకుని పరికిణి లో చుట్టి తెచ్చిన పొట్లం తీసి చూపిస్తూ తడబడుతూ చెప్పేసింది పార్వతి; "మా అమ్మ .....పువ్వులు.....పువ్వులు....రఘుబాబుకి.....ఉహూ! రఘుబాబు అమ్మగారికి....."
    నవ్వాడు చలపతి రావు. "వెళ్ళమ్మా ఇంట్లోకి. ఒరేయ్ , రఘూ! రఘూ!' అంటూ మెట్లేక్కుతూ కేకపెట్టాడు. వెనకాలే నడిచింది పార్వతి.
    పరిగెత్తుకు వచ్చిన రఘుబాబు పార్వతిని చూస్తూ ఆశ్చర్య పడ్డాడు.
    "ఈ పాప పువ్వులు తెచ్చిందిరా మీ అమ్మకి. లోపలికి తీసుకెళ్ళు అమ్మ దగ్గరికి."
    రఘుబాబు సంతోషంగా చూశాడు పార్వతి కేసి. తల దించేసుకుంది పార్వతి.
    "అమ్మా! అమ్మా! పార్వతి నీకు పువ్వులు తెచ్చిందే!" అంటూ సంబరంగా అరిచాడు రఘుబాబు.
    అన్నపూర్ణమ్మ నవ్వుతూ ఎదురు వచ్చింది.
    సిగ్గు సిగ్గుగా అరిటాకు పొట్లం అందించి నిలబడింది పార్వతి. అన్నపూర్ణమ్మ పొట్లం విప్పి సన్నజాజుల మాల చూసింది. విచ్చీ విచ్చకుండా పుష్టిగా ఉన్న ఆ మొగ్గలనూ, అందంగా ఆ మాల కట్టిన నేర్పునూ చూస్తుంటే ఆవిడ కెంతో ముచ్చటేసింది.
    "ఎక్కడివి పాపా ఈ పువ్వులు?"
    "మా దొడ్లోనే పూశాయండీ!"
    "ఎవరు కట్టారీ మాల?"
    "మా అమ్మే కట్టిందండి!"
    "అలాగా? మీ అమ్మగారు చాలా అందంగా కట్టారు. అయితే మరి నీకు ఉంచుకున్నావా పువ్వులు?"
    "నేనూ మా చెల్లీ రాత్రిళ్ళు పూలు పెట్టుకోమండి! మా అమ్మ ఒక్కత్తే పెట్టుకుంటుంది. మాకు పొద్దుటే జడలు వేసి పెడుతుంది.
    'అవును మరి, చిన్నపిల్లలు పగలే పువ్వులు పెట్టుకోవాలి."
    చలపతి రావు బట్టలు మార్చుకుని లోపలికి వచ్చాడు.
    "చూశారా , ఎంత చక్కటి పువ్వుల దండ తెచ్చిందో పాప?" మాల భర్తకు చూపించింది అన్నపూర్ణమ్మ.
    "ఎవరమ్మాయి, పూర్ణం , ఆ పాప?"
    "మన ఎదురింటి వాళ్ళ మ్మాయే, నాన్నగారూ! పేరు పార్వతి.' వివరాలు చెప్పేశాడు రఘుబాబు.
    "మీ నాన్నగారేం చేస్తుంటారమ్మా, పార్వతీ!"
    "మా బళ్ళోనే మేస్టారండీ!"
    "ఆహా! అలాగా? అయితే పూర్ణం ! మన రఘు కి మరెవరి నో వేదుక్కోటం దేనికి? ఈ మాస్టారినే అడిగి చూస్తె?" సాలోచనగా చూశాడు చలపతి రావు.
    "సరే! ఆలోచించుకుని అడుగుదాం లెండి. కంగారేముంది?' అంది అన్నపూర్ణమ్మ పార్వతి ఎదట ఆ ప్రసంగం ఎత్తటం ఇష్టం లేనట్టు.
    వాళ్ళు మాట్లాడుకున్న మాట లేమంత పార్వతికి అర్ధం కాలేదు. "నేను వెళ్తానండి!" అంది నెమ్మదిగా.
    "ఒక్క నిమిషం నిల్చో, అమ్మా, వేల్దువు గాని" అంటూ అన్నపూర్ణమ్మ ఓ అరడజను అరిటి పళ్ళు కాగితంలో చుట్టి తెచ్చింది. 'అప్పుడప్పుడు వస్తూ ఉండు , పాపా!"
    ఆ పొట్లం అందుకోకుండా సంశయంగా చూసింది పార్వతి. "వద్దండీ! మా అమ్మ.... కేక లేస్తుందేమో?"
    నవ్వింది అన్నపూర్ణమ్మ. పార్వతిని ఒప్పించి అరిటి పళ్ళిచ్చి , గేటు దాటించి వెనక్కు తిరిగి, "కుదురైన పిల్ల. చూస్తుంటే ముచ్చటేస్తోంది " అంటూ వచ్చింది.

                           *    *    *    *
    రఘుబాబు కు ప్రైవేటు మాస్టారుగా ఆ ఇంట అడుగు పెట్టిన పార్వతి తండ్రి -- రామనాధం మాష్టారు -- ఆనతి కాలంలోనే చలపతి రావుకు సన్నిహితులయ్యారు. మాస్టారి పట్ల చలపతి రావు వెల్లడించే అభిమానం చూస్తె అయన హృదయం లో అంతస్తుల భేదం అనే జాడ్యం లేనే లేదని పిస్తుంది.
    "ఈ సంవత్సరం నుంచీ రఘుపతి ని స్కూలు కే పంపించాలనుకొంటున్నాను, మాస్టారూ!" అన్నాడు చలపతి రావు ఓ రోజు.
    "నేనూ ఆ విషయమే మీకు చెప్పాలను కొన్నాను. నన్నపార్ధం చేసుకోకపోతే ఒక్క మాట, మన గారాబం పసివాళ్ళ భవిష్యత్తు ని పాడు చేసేది గా ఉండకూడదు , చలపతి రావు గారూ! చిన్నతనంలో లోకాన్ని తెలుసుకోనివ్వ కుండా పెంచితే పెద్ద వాళ్ళయినా వాళ్ళు ఏమంత ప్రయోజకులు కాలేరు."
    చలపతి రావు ఆవేదన వెల్లడిస్తూ అన్నాడు : "అయ్యో! గారాభం చెయ్యటం కాదండీ! మా దురదృష్టం కొద్దీ పరిస్థితి అలా వచ్చింది. ఏడవ ఏట జామచేట్టేఎక్కి ఆడుకుంటూ కొమ్మ విరిగి కింద పడ్డాడు. ఆ పడటం లో పైకి దెబ్బ తగిలినట్టు కనిపించక పోయినా బుర్రలో నరాలేవో దెబ్బతిన్నాయన్నారు డాక్టర్లు. వరసగా కొన్ని నెలలు కాయిలా పడిపోయాడు. మళ్ళీ తేరుకుని మనిషైనా, ఇక వాడిలో పూర్వపు చురుకుదనం,  తెలివి తేటలూ --- అన్నీ మాసిపోయాయి. కుర్రవాడే పూర్తిగా మారిపోయాడు. చదువన్నా, బడి అన్నా బొత్తిగా ఆసక్తి లేకుండా పోయింది. బలవంతం చేసి బడికి పంపించటం మంచిది కాదని కొన్నేళ్ళ నుంచీ ఇలా ఇంట్లోనే ప్రైవేటు చెప్పిస్తున్నాను. పది మంది పిల్లలతో చేరి ఆడుకోవటం కూడా వాడికే మంత ఇష్టం ఉండదు, మాస్టారూ!"
    అంతా విన్న రామనాధం మాష్టారు సానుభూతిగా అన్నారు: "పిల్లవాడి విషయం లో ఇలా జరగటం చాలా కష్టం సుమండీ! అదృష్టవశాత్తూ మనిషి మనిషి లాగైనా దక్కాడు. ఇకమీదట ఫర్వాలేదు. నెమ్మదిగా స్కూల్లో చేర్పిస్తే నేనూ జాగ్రత్తగా చూస్తూ ఉంటాను. క్రమంగా చదువు మీద ఆసక్తి అదే పుడుతుంది.
    'అదే నేనూ అనుకుంటున్నాను లెండి. ఇక్కడికి వచ్చాక వాడి విషయంలో చాలా మార్పు వచ్చిందనే అనుకోవాలి. మీ పార్వతీ, ఆ తాశీల్దారు గారమ్మాయి పద్మజా, మావాడూ తోటలో చేరి ఆటలు కూడా ప్రారంభించారు. నెమ్మదిగా వాడిలో మార్పు వస్తేనే చాలని....."
    "మీరేం బాధపడకండి చలపతి రావు గారూ! రఘుపతి చదువు సంధ్యలన్నీ నేను చూసుకుంటాను. జీవితంలో ఎన్నెన్నో కష్ట నిష్టూరాలు ఎదుర్కోవాలంటారు పెద్దలు.... మీకు తెలీదని కాదనుకోండి."
    అలా మరి కాస్సేపు సాగిందా సంభాషణ. నాలుగైదు రోజులకోసారైనా తీరిక చేసుకుని ఆ ఇద్దరు పెద్ద మనుషులూ పిచ్చా పాటీ చెప్పుకోకపోతే నిద్రపోలేని పరిస్థితికి వచ్చారు. స్నేహం అనటానికి వీల్లేని ఆ అనుబంధం యేవో చిత్ర మైన అనురాగాలను పెంచుతూ వచ్చింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS