పదేళ్ళు నిండిన తనను ఒళ్ళో కూర్చో పెట్టుకొని కథలు చెప్పేది. స్త్రీలో మాతృప్రేమ ప్రభావం ఎంతటిదో అర్ధం కాని తనూ, అన్నగారూ బిక్కమొహాలతో అమ్మ మొహంలో దేనికోసమో వెతికి వెతికి అలిసి పోయేవారు. కన్నతల్లి కన్ను మూస్తే, కన్నతండ్రి దేశాల వెంట పోతే ఆ స్థానాన్ని భర్తీ చేసి తండ్రిని మించిన తండ్రిగా తననూ, అన్నగారినీ ప్రాణానికి ప్రాణంగా పెంచిన ఈ తండ్రి ఎంతటి వాడు!
"నాన్న ఇవ్వమన్నారు." వైదేహి తల దించుకొనే ఉంది. చేతిలో ఒక ప్లేట్లో ఫలహారం, కప్పుతో టీ తీసుకువచ్చి గుమ్మంలో నిలబడింది.
హఠాత్తుగా మంచం మీద లేచి కూర్చున్నాడు రవి. సూటిగా వైదేహి కళ్ళలోకి చూశాడు. వైదేహి అమాయకంగా తల దించుకొంది.
"చూడండి, ప్లీజ్! నాన్న మీకు ఇవ్వమన్నారు."
"ఇంకేమీ అనలేదూ?" రవి మనసు కసితో నిండిపోయింది.
తెల్లబోయింది వైదేహి. "అంటే?"
"మిమ్మల్ని నా జోలికి రావద్దనీ, మీ తమ్ముడి సపోర్టుతో నన్ను రోజూ డిస్టర్బ్ చేయొద్దనీ....."
"మీ ఉద్దేశ్యం నాకు అర్ధం కావడంలేదు!" వైదేహి మొహం ఎర్రబడి పోయింది.
"అర్ధం అయేట్లు చెబుదామనే ప్రయత్నిస్తున్నాను. ప్లీజ్, నాకు మీరు కాఫీ ఫలహారాలు తేవద్దు. నా దారిన నన్ను పోనివ్వండి."
"మీ దారికి మేమేమీ అడ్డు రాలేదు. అయినా నాన్నకి బొత్తిగా తెలియదు. ఇలాంటి న్యూసెన్సు నా నెత్తిని రుద్దుతారు." విసురుగా చెప్పులు టకటక శబ్దం చేస్తూ వెళ్ళిపోయింది.
రవి పుస్తకాలు సర్ధి షెల్ఫులో వరసగా పేర్చాడు. పెన్ను తీసుకొని డైరీలో నాలుగు గీతలు గీశాడు.
* * *
ఆదివారం సాయంత్రం బీచ్ రోడ్ దాటి మైలా పూర్ వైపు పరిగెత్తించాడు టాక్సీని రాము. వచ్చి నప్పటినుంచీ జయ ఇంటికి రెండుసార్లు వెళ్ళాడు. కానీ, రెండు సార్లూ తాళం వేసి ఉంది.
టాక్సీ దిగి రాము స్థాణువైపోయాడు. ఇలా ఎన్నిసార్లు జయకు దూరమవలేదు! ఇదివరకు తాళం ఉన్న ఇంట్లో ఎవరో ప్రవేశించారు. వాళ్ళు అస లీ ఊళ్ళోనే లేరని తెలిసి హతాశుడైపోయాడు. యాంత్రికంగా మెడికల్ కాలేజీవైపు పరిగెత్తింది రాము టాక్సీ.
* * *
"ఎన్నైనా చెప్పు. ఈసారి ఎనాటమీలో ఫస్టు నువ్వే." విష్ణుప్రియ నవ్వింది.
రాము మౌనం వహించాడు.
"మాట్లాడవేం, బావా?" మెడ చుట్టూ స్టెతస్కోపు వేసుకొని రెండు చేతులతో ముందుకు లాక్కొని వంగి రాము చెవికి దగ్గరగా చేయి పెట్టి విసిగించడం ప్రారంభించింది.
రాము లేచి నిలబడ్డాడు. వేప చెట్టు నీడలో పుస్తకంలో మునిగిపోదామనుకొన్న అతని కోర్కె ఫలించలేదు. విష్ణు కదల్లేదు. లేచి కదిలి వెళ్ళబోతున్న రాము చేతిని తన చేతిలోకి చనువుగా తీసుకొని కూచోపెట్టింది.
సూటిగా చూశాడు రాము. "చూడు, విష్ణూ! నన్ను వేధించకు. నలుగురూ చూస్తే బాగుంటుందంటావా?"
విష్ణుప్రియ కళ్ళు మెరిశాయి. చిన్నగా నవ్వింది. "ఎవరూ చూడకపోతే బాగుంటుందన్నమాట!" మెల్లగా రాము భుజంమీద చేయి వేసింది.
రాము హృదయంలో కార్చిచ్చు ప్రారంభం అయింది. జరగరాని అపరాధానికి పట్టుబడిన నేరస్థుడిలా తల్లడిల్ల సాగాడు. మనసులో పూర్తిగా జయ రూపం ఆక్రమించుకొంది. జయ ఎక్కడుంది?
"బావా, ఆ మ్మేదో అన్నదని ఇంకా కోపగించు కొంటున్నావా? అమ్మ తరఫున నేను క్షమాపణ కోరు కుంటున్నాను. ప్లీజ్, బొత్తిగా మాటలు రానివాడిలా ఉంటే నాకేం బాగులేదు." విష్ణు కళ్ళలో నీలిమేఘాలు నృత్యం చేస్తున్నాయి.
తలఎత్తాడు రాము. "ఛ! అలాంటి వేం లేవు. కానీ, నువ్వు ఇలా ప్రవర్తించడం నాకు బాగులేదు." మాటలు పెంచనీయకుండా దూరంగా వెళ్ళిపోయాడు.
"హలో!" నవ్వాడు బలరామ్. వెనుతిరిగి చూసింది విష్ణు. మెరిసిపోయే కళ్ళతో అందంగా, ఠీవిగా ఉన్న బలరాం కూడా డాక్టరే. క్లాస్ మేట్ బలరామ్ క్లాసులోనే కాదు, అన్నిటిలోనూ ఫస్టే. "హలో!" విష్ చేసి తల దించుకొంది.
"రాము మీకు బంధువా?"
కళ్ళు రెపరెప లాడిస్తూ, "అవును" అంది అతి మెల్లగా. బలరామ్ కు దూరంగా వెళ్ళిపోవాలనుకొంది. కానీ, నిస్సహాయురాలిగా ఉండిపోయింది.
ప్రాక్టీసు మానేసి కాలుమీద కాలు వేసుకొని, దర్జాగా, తృప్తిగా కాలం గడుపుతున్నాడు వేణు గోపాల్. చూస్తూండగానే చిలిపి వేణు నిండుగా గంభీరంగా మారిపోయి ఆజానుబాహులైన కొడుకులకు తండ్రిని అనిపించుకొంటూ తనకు తానీ సాటి అనిపించు కొంటున్నాడు. రత్నాల వంటి కొడుకులకు తను తండ్రి. ఇటు మద్రాసులో, అటు కాకినాడలో తన పేరు ప్రతిష్టలు ఎవరికీ తెలియనివి? అటువంటి తనకు పిల్లల విషయంలో కూడా భగవంతుడు ఎంతో న్యాయం చేశాడు.
వేణుగోపాల్ వాలుకుర్చీలో కూర్చుని హాయిగా ఎన్నో రోజుల్ని భార్య పక్కన ఆనందంగా గడిపేస్తూ పిల్లల రాకకు ఎదురు చూస్తూండగానే సెలవులు ఇచ్చేశారు కాలేజీలకు.
సెలవులకు ఇంటికి వచ్చిన పిల్లలిద్దరినీ ఆపేక్షగా, ఆత్రుతగా, ఆశగా గుమ్మంలో నిలబెట్టి దిష్టి తీసింది భారతి.
ఏపుగా, ఠీవిగా వెడల్పాటి వక్షః స్థలంతో పెరిగిన పిల్లల్ని చూస్తూ అలా ఎంతోసేపు ఉండిపోయింది. లావుగా కొద్దిగా వార్ధక్యపు చ్చాయలతో నుదుట పెద్ద బొట్టుతో జీవితాన్ని పుటలు పుటలుగా చదివిన భారతి మొహంలో నిరాశా నిస్పృహలు ఈ ఆనందానికి పక్కనే నిటారుగా నిలబడి అద్దంలా కనిపిస్తున్నాయి.
"ఏమిటి, భారతీ, ఇద్దర్నీ అలాగే నిలబెట్టేశావు?" వెనకనుంచి ఎప్పుడు వచ్చాడో వేణుగోపాల్ నవ్వుతూ కొడుకుల భుజాలమీద చేతులు వేశాడు. లోపలికి దారి తీసింది భారతి.
భర్త పక్కనే ఇద్దరికీ భోజనాలు పెట్టి మరీ మరీ వద్దని వారిస్తున్నా వడ్డించసాగింది. "ఇక్కడా అక్కడా నీళ్ళు పడక చిక్కిపోయారు." భారతి హృదయానికి పిల్లలు అలా కనిపిస్తున్నారు.
నవ్వాడు వేణుగోపాల్, "అవునా!" అని పిల్లలవంక చూస్తూ.
"కాకినాడ ఎలా ఉందిరా, రవీ?" వేణు గోపాల్ చిన్నకొడుకువైపు చూశాడు.
"బాగానే ఉంది, నాన్నగారూ కాలం త్వరగా గడిచిపోతుంది."
"మద్రాసు మన ఊరేగా ఒకప్పుడు! కాలేజీ విశేషాలేమిట్రా, రామూ?"
రాము తండ్రివైపు చూశాడు. "కాలేజీ బాగానే ఉంది. అన్నట్లు, నాన్నగారూ, మన విష్ణు అక్కడే చదువుతూంది. నాకు జూనియర్."
వేణుగోపాల్ నొసటిరేఖలు ముడిపడిపోయాయి. "రాధ కూతురు కదూ?"
"అవును, నాన్నగారూ." రాము మెల్లగా అన్నాడు.
"బాంధవ్యం ఎలాటిదైనా ఫరవాలేదు, రామూ. అంతస్తులతో అనురాగానికి ముడిపెట్టకూడదు. అపాత్రులకు దానం చేయడం నాకు ఇష్టం ఉండదు. అహంకారానికి ప్రతినిధి అయిన రాధకి అది కూతురు. దూరం పోకు." మంచినీళ్ళ చెంబులో నీళ్ళన్నీ ఒకేసారి ఖాళీ అయిపోయాయి. పది పదిహేనేళ్ళ తాలూకు ప్రతీకారం అన్నాచెల్లెళ్ళ మధ్య ఇంకా రాజుకుంటూనే ఉంది.
భారతి కల్పించుకొంది. "మీ తోబుట్టువుల మధ్య ఎందుకు పట్టుదల? ఆవిడ తప్పు ఏమందనీ? అనామకుల్ని పెంచుకొంటే..."
"భారతీ!" వేణుగోపాల్ సహనం కోల్పోయాడు.
"నువ్వు నా గుండెలి చీల్చేస్తున్నావు. నన్ను రంపపుకోత కోస్తున్నావు. వాళ్ళు నా పిల్లలు కారూ? చెప్పండి మీ అమ్మకి." వేణుగోపాల్ మనసులో ఆరాటం ఏ ఒక్కరికీ అర్ధం కాదు.
ఆరడుగుల ఎత్తున ఉన్న వేణుగోపాల్ ఇదివరకు ఎంతో బలంగా ఉండేవాడు. పిల్లలు పెరిగి పెద్దవారు కాగానే ఉన్న బలమంతా క్షీణించిపోయింది. అతని వేదన నలుగురికి చెప్పుకోలేనిది. భార్యాభర్తల మధ్య ఏనాడూ కలతలు లేవు. అయినా ఇద్దరి హృదయాల్లో ఒకరికి తెలియని బాధ ఒకరిలో బయలుదేరి కార్చిచ్చులా దహించి వేస్తూంది.
రాము అన్నాడు: "చూడండి, నాన్నగారూ. మీరు ఆవేశ పడుతున్నారు. మేం మీ పిల్లలం కామని ఎవరన్నారు? విష్ణుమీద నా కసలు అటువంటి అభిప్రాయమే లేదు. నన్ను నమ్మండి."
వేణుగోపాల్ నిట్టూర్చి రవివైపు తిరిగి, "ఏరా, రవీ? నువ్వొ అల్లరివాడివి. నీమీదే నాకు బెంగ, నువ్వు ఆలోచించకుండా అప్పుడప్పుడు అవకతవక పనులు చేస్తూంటావు" అన్నాడు.
"లేదు, నాన్నగారూ" అన్నాడు రవి.
తృప్తిగా గాలి పీల్చుకొన్నాడు వేణుగోపాల్.
రామూ, రవీ నవ్వుతూంటే వేణుగోపాల్ హృదయం ఆనందంతో నిండిపోసాగింది. రాము నవ్వు భారతిలో అణువణువునా గిలిగింతలు పెట్టి పిచ్చిదాన్ని చేస్తూంది. ఇదివరకు మాదిరి భారతి ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడడు. కొడుకుల్ని దగ్గరకు పిలిచి ఏవో కొన్ని మాటలు మాట్లాడటం చేస్తూ ఉంటుంది. భారతి అంతర్గతమైన బాధ అర్ధం కాని రామూ, రవీ అయోమయవస్థలో కొట్టుకు పోతూంటారు.
* * *
ఇల్లంతా వెతికి వెతికి అలిసిపోయాడు రవి. తీరా పూజ గదిలో తల్లి ఆ విధంగా ఉండడం చూసి నిర్ఘాంతపోయాడు. తల్లిని తనవైపు తిప్పుకొని, "సాయంత్రం అయింది. అందరి ఇళ్ళలోనూ దీపాలు వెలిగాయి. ఎప్పుడూ లేనిది ఇవాళ ఇల్లంతా ఇలా చీకటిగా ఉంచావేమిటమ్మా?" అని ప్రశ్నించాడు.
చీకట్లో భారతి ఏడవడం కనిపించలేదు రవికి. చేతులు తడవడంతో అదిరిపడ్డాడు. తల్లికి దగ్గరగా జరిగి, "చెప్పమ్మా నీ బాధ ఏమిటి?" అన్నాడు. రవి కంఠంలో బాధ స్పష్టంగా వినిపిస్తూంది.
భారతి మౌనంగా పూజ గదిలో మిణుకు మిణుకు మనే దీపం వెలుగులో దేవుడి మందిరానికి ఆనుకొని కూర్చొని తనలో తనే వెక్కివెక్కి ఏడవసాగింది. రవి కదల్లేదు. ఇప్పుడు భారతి పక్కన ఉన్న వ్యక్తి పరిపూర్ణ వ్యక్తిత్వంతో కావలసిన విజ్ఞానంతో వెలిగిపోతున్న రవి మాత్రం కాదు. రాజ్యలక్ష్మి పోయిన రోజున మంచం పక్కన నిలబడి తల్లి కళ్ళలోకి అంతులేని ఆవేదనతో తొంగి చూసిన రవిబాబులాగే ఉన్నాడు.
"చెప్పమ్మా. నువ్వు ఏడవకు. నీకు ఏం లోటు చెప్పమ్మా. పోనీ, అన్నయ్యని అడుగు, నీక్కూడా పిల్లలు పుట్టే అవకాశం ఉందేమో!" అమాయికంగా అంటున్నాడు.
భారతి కళ్ళు ఎత్తలేదు. అలాగే ఏడుస్తూ ఉండిపోయింది. ఖంగారుగా ఒళ్లోకి తీసుకొన్నాడు రవి. "అమ్మా, నాన్నగారు ఏమైనా అన్నారా, అమ్మా? చెప్పు. నీకు ఇక్కడ బాగులేకపోతే మనం కాకినాడ వెళ్ళిపోదాం. అక్కడ నువ్వూ నేనూ ఉందాం."
భారతి మెల్లగా కళ్ళు తెరిచి చూసింది. ఒళ్ళో తల ఉంచుకొని తల్లివైపే ఆప్యాయంగా చూస్తున్నాడు. భారతికి ఏడుపు ఆగలేదు. కళ్ళు అలా కన్నీటిని కారుస్తూనే ఉన్నాయి.
"అమ్మ!" రవి పెదవులు అస్పష్టంగా అంటున్నాయి.
"నాయనా, రవీ!" అంది. అంతే. మళ్ళీ మామూలుగా ఏడుస్తూ ఉండిపోయింది. రవి మౌనం వహించి తల్లిని మంచంమీద పడుకోబెట్టి ఆలోచనలో పడిపోయాడు. రవికేం తెలుసు, భారతి అంతు తెలీని పెను తుఫానులో చిక్కుకున్నదని?
* * *
"చెప్పన్నయ్యా." కుతూహలంగా అడిగాడు రవి.
"ఏం లేదురా. విష్ణు ప్రవర్తనే నాకు అర్ధం కాదు. మాట్లాడకపోతే ఏడుస్తుంది. చనువిస్తే నెత్తిమీద కూర్చుంటుంది. నాకేం తోచడం లేదు. ఇలా ఒక ఆడది నా చుట్టూ తిరగడం నాకు బాగులేదురా." రాము మొహం విసుగుతో ముడుచుకుపోయింది.
