Previous Page Next Page 
మరుపులో మెరుపులు పేజి 7

 

    "నన్నా....పెళ్ళా....." అంది కంగారుగా .
    "వూ....ఏం?"
    "......"
    "ఏమీ తెలియకుండా, ముక్కు మొగం తెలియని నిన్ను యింట్లో వుంచుకున్నానని అందరూ అనుకుంటుంటే యిద్దరికీ మంచిది కాదు. నాకు ఫరవాలేదనుకో. యింతకాలం ఎవర్నో మనసులో వుంచుకునే పెళ్ళి చేసుకోలేదని అందరూ అనుకుంటూనే వున్నారు." అన్నాడు నవ్వుతూ.
    వళ్ళు మండిపోయింది కుసుమకు. ఎలుకకు ప్రాణ సంకటం పిల్లి కి చెలగాటం అంటే యిదే కాబోలు, ఏమిటా హాస్యం. తనోపక్క భయంతో చస్తుంటే - తనకు పెళ్ళేమిటి?.... ఛ.... అసలు తనకు పెళ్ళేమిటి? ఎలా యితనికి చెప్పడం? ఏమని చెప్పడం.... ఎంత పనిచేసింది తను? ఏనాడో యీ ప్రదేశం వదిలి పోవాల్సింది. యిప్పుడే చస్తే వదిలి పెట్టదు."
    "భయంగా వుందా పెళ్ళంటే" అడిగాడు తలను సీటు కానించి ఆందోళన గా అటు, యిటు కదులుతున్న కుసుమను చూస్తూ.
    "నువ్వనుకున్నంత భయంకరంగా వుండక పోవచ్చు పోలీసు వాళ్ళ జైలు కంటే బాగుండదంటావా? ప్రయత్నించి చూడు. నీ ఆరోగ్యం బాగుపడ్డాక నీ కిష్టం లేకపోతె నీ స్వేచ్చకు నేను అడ్డు రాను. నిన్ను నా దగ్గర నుంచి పారిపోకుండా వుంచగలిగేది పెళ్లోక్కటే అని నా ఉద్దేశం...."
    "అలా ఎందుకనుకుంటున్నారు?.... అందులోనూ నాలాంటి అమ్మాయిని గురించి?"
    "ఏమో" అన్నట్లు భుజాలు కదిలించి...."నా కలా అనిపించింది. ఎన్ని సమస్యలున్నా నువ్వూ అందరి లాంటి అమ్మాయివే కదా?" అన్నాడు ఆమె వంక చూస్తూ.
    ప్రభాకర్ మనసులో కూడా కుసుమతో సమంగా ఆలోచనలు పరిగెత్తసాగాయి. తను చేయబోతున్న పని సమంజసమా కాదా అన్న ప్రశ్న బహుముఖాలతో మెదులుతూనే వుంది. ఆమె పాత చరిత్ర బయటపడితే తనకు ఏవిధంగానూ శ్రేయస్కరం కాదు.... అదో పెద్ద మచ్చలా నిలిచి పోతుంది. అందుకోసం, అమాయకంగా..... పాతికేళ్ళయినా లేని ఆమె జీవితం అర్ధం లేని భయాలకు, ఆపుకోలేని బలహీనతలకు అంకితమయిపోతుంటే తను చూడలేడు..... తన ప్రయత్నం తను చేస్తాడు.. ఫలితానికి ఎదురు చూడవలసిందే. ఊహకందేది కాదు...కాని ... ఏమాత్రం ఒకరికొకరు తెలుసుకోకుండా యీ పెళ్ళేమిటి?.....
    మౌనంగా వున్న అతని వంక నిశితంగా చూస్తూ "మీరు చేయబోతున్న పనిని మీ నాన్నగారు ఆమోదించరు." అంది. అతనేలగయినా యీ పెళ్ళి ఉద్దేశాన్ని మార్చుకుంటే చాలు అని.
    "నిజమే! ఆమోదించరు." అన్నాడు అతి నిదానంగా విస్మయంగా చూచింది." అతని వంక.   
    నిదానంగా వున్నా అతను కూడా సుదీర్ఘంగా ఏదో ఆలోచిస్తున్నాడని తెలుస్తూనే వుంది.
    "మొదట్లో ఒప్పుకోరు. ముఖ్యంగా మా స్థితి గతులకు సరితూగే వాళ్ళల్లోంచి ఎన్నుకోనందుకు తప్పకుండా అభ్యంతర పెడతారు.... కాని ఆయనకు కావాలసింది నా సుఖం. నేను పెళ్ళికి యిష్టపడ్డానంటే అయన దేనికయినా సమాధానపడతారు. ముఖ్యంగా నీ అందం చూశాక" అన్నాడు సావకాశంగా నవ్వుతూ.
    "దిగు" అంటూ కారాపాడు ఓ పెద్ద రెస్టారెంటు ముందు. లైట్ల వెలుగులో ఆమె ముఖం వంక చూచి జేబులోంచి రుమాలు తీసి అందిస్తూ "కళ్ళు తుడుచుకో" అన్నాడు.
    అతని వెనకే దిగి పక్కగా నడిచింది. లోపల రెస్టారెంటు యింకా సందడి గానే వుంది. ఒక్క సారి అటు యిటూ పరికించి చూచింది కుసుమ. ఎవరో తెలిసిన వాళ్ళు ప్రభాకర్ ని విష్ చేస్తున్నారు. ఒక్క క్షణం తటపటాయించి , యింత కంటే మంచి సమయం దొరకదనుకుంది. "యిప్పుడే వస్తాను. మొహం కడుక్కుని వస్తాను." అని పక్కగా వున్న బాత్ రూమ్స్ వైపు వెళ్ళబోయింది.    
    ఎవరితోనో చిరునవ్వుతో విష్ చేస్తూనే కుసుమ చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. "నీ మొహం దివ్యంగా వుంది. .. అటు పద...." అన్నాడు. తను కనుమరుగయితే తనకు శాశ్వతంగా దూరమవడానికి ఒక్క క్షణం కూడా సందేహించదని అతనికి తెలుసు. కాని అంతలోనే ఒక విధమైన ఆశ్చర్యం పొడ చూపింది. ఏమిటి తను చేస్తున్నది.... జీవితంలో శాశ్వతమైన బంధం, యింత బలవంతం మీదనా?
    "ప్రభాకర్ ...." అంది మొట్టమొదటి సారిగా. అతి మెల్లిగా హోటల్ లోంచి తిరిగి వచ్చి కారులో కూర్చున్నాక. ఆ పిలుపు ఎందుకో అతనికి ఎంతో సంతోషం కలిగించింది. "ఏమిటి?" అన్నాడు ఆమె వైపు తిరగకుండానే?
    "ప్లీజ్....నన్ను వెళ్ళి పోనివ్వండి..... మీరు నిజంగానే నన్ను ప్రేమిస్తూ వుంటే .....దయచేసి నన్ను వెళ్ళి పోనివ్వండి...." అంది ప్రాధేయ పూర్వకంగా.
    ఆశ్చర్యంగా చూచాడు. "రాజకుమారిని పెళ్ళి చేసుకోవాలంటే రాక్షసుడి ని చంపాలన్నట్లు నువ్వు అడిగిన పనికి ఒప్పుకుని నా ప్రేమను రుజువు చేసుకోవలసిన అవసరం నాకు లేదు."
    "అది కాదు. దయచేసి నన్ను అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించండి.....నేను మీతో కలసి జీవించలేను... ప్లీజ్ నన్ను పోనీండి. అంత కంటే మరేమీ చెప్పలేను....నన్ను అర్ధం చేసుకుని వెళ్ళి పోనీండి.' అంది ముఖం దోసెట్లో దాచుకుంటూ.
    ఆమె వంక చూస్తూ అతని కను బొమలు ముడిపడ్డాయి. "యీమె కేందుకింత పట్టుదల? తన ఆరోగ్యం బాగు పరుచుకునేందుకు దొరికిన అవకాశాన్ని ఎందుకు సద్వినియోగపరచుకోలేదు. ఎందుకిలా తప్పించుకోవాలను కుంటుంది....? ఆమె వంక చూస్తూనే ఆలోచించ సాగాడు. అంతలోనే ఓ భావం మెరుపులా మెరిసింది. యీ రోజు చేసిన పని చిన్న పరుస్తోందా? తన దగ్గర బ్రతుకంత గుర్తుకు వచ్చి కలవరపెడుతుందని భయమా?"
    "కుసుమా! యివాళ జరిగిన పనిని గుర్తు చేసి, నేను నిన్ను చిన్న పరుస్తావని భయమా?" ... ఆగిపోయాడు.
    "చూడూ.....' ఆమె వైపు తిరిగి రెండు భుజాలు పట్టుకుని తనవైపు తిప్పుకుంటూ అన్నాడు. "అదే నీ భయం అయితే .....నేను నీకు వాగ్దానం చేస్తున్నాను....యీ విషయం మళ్ళీ మనిద్దరి మధ్య రాదని."
    "అది కాదు...."
    "కాని నువ్వు ఒక్క విషయం ప్రమాణం చెయ్యాలి. నీకు ఎప్పుడు డబ్బు కావాలనిపించినా నిస్సంకోచంగా నన్నడగాలి."
    ".........."
    కుసుమా! ఒక్క విషయం చెప్పు. నీకు నా మీద గౌరవమో....యిష్టమో.... నీకు ఏదీ లేదు... నిజం చెప్పు."
    "......."
    "ఆ భావాన్నీ ప్రేమగా మార్చుకోగలవనే నమ్మకం నాకుంది. యింక దీనికి అడ్డు చెప్పకు." భుజాల మీద వున్న చేతులు చుట్టూ వేసి దగ్గరగా లాక్కుంటూ అన్నాడు.
    అతని గుండెల మీద చేతులు వేసి దూరంగా తోస్తూ తలుపుకు దగ్గరగా జరిగింది.
    స్టీరింగ్ ముందుకు జరిగి కారు స్టార్టు చేస్తూ "అక్టోబర్  లో డార్జిలింగ్ చాలా బావుంటుందిట.రేపే రిజర్వు చేయిస్తాను. మనకోసం" అన్నాడు.
    మరో పది నిమిషాల్లో యింటి చుట్టూ చెట్లు, పార్టి కో లో పెద్ద లైటు, ఓ భవనం అనతగ్గ యింటి ముందు కారాపాడు. ఆ సాయంత్రం నుండి ఒకదాని తరువాత ఒకటి అతి వేగంగా జరిగిపోయిన సంఘటనలతో మొద్దు బారిపోయింది కుసుమ మనసు.
    ఒకసారి ఆశ్చర్యంగా బయటకు చూసి "ఎక్కడికి?" అంది.
    "దిగు లోపలికి వెడదాం. నువ్వు వుండబోయే ఇల్లు. మా నాన్న యింకా పడుకుని వుండరు." అన్నాడు చేతి వాచీ వంక చూసుకుంటూ.
    నిర్ఘాంత పోయి చూచింది ఆ యింటి వంక.
    "యింక ముందంతా ఆ యింట్లో తను.....అతనూ.... భగవంతుడా...." అనుకుంది భయంగా. యింకా అక్కడే నుంచుంటే .....పూర్తిగా పోతుందేమో మరి. అనుకుంటూ గబగబా అడుగులు వేసింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS