Previous Page Next Page 
క్షమార్పణ పేజి 7


                                  18
    తల్లిని కన్నులారా చూసి తిరిగి వచ్చినట్టనిపించింది ఎండుచేతో కమలాకరం కి.
    మనః కోలాహలం చాలావరకు అణగారడానికి అదొక కారణమైంది. భవిష్యత్తు మీద ఆశ ఉద్భవించింది. ప్రతి కర్తవ్యానికి మనసు ఉత్సుకత ప్రకటిస్తోంది.
    కన్నతల్లి ఒక దగ్గర ఎక్కడో క్షేమంగా వుంది అనే ఊహ -- ఊహ మాత్రమె -- ఎవరూ ఊహించలేనంత బలాన్ని యిచ్చింది. ఆ ఊహలో ఆ ఊహ నీడలో వున్న ఆశ కొత్త జీవం పోసింది కమలాకరం లో.
    ఎండుతున్న పచ్చని చెట్లు. చిగురిస్తున్న మోడులు కాలాన్ని నడవడానికి. పరిగెత్తించడానికి శతవిధాల సాయపడుతున్నాయి. నేటి అమావాస్య రేపటి పౌర్ణమి కి నేటి పౌర్ణమి మరోకనాటి అమావాస్య కి అని మానవుణ్ణి వూరిస్తూ పడదోస్తూ , ప్రకృతి గతంలోని గొప్పతనం దగగ్రికో. భవిష్యత్తు లోని వినాశానం వైపుకో సాగిపోతుంది తెలీనివ్వని నిశ్చలత్వం తో.
    చంద్రాన్ని కన్న తర్వాత ప్రతిమ ఆరోగ్యం సన్నగిల్లిందేమో, తరచుగా జ్వర పడుతుంది. ఆపైన ఒకటి రెండు సార్లు అబార్షన్ కావడంతో అలాటి జాగ్రత్త తీసుకున్నాడు కమలాకరం. కాని ప్రతిమ కి అయుష్హు పోయలేక పోయాడు. చంద్రానికి పద్దెనిమిదో ఏట ప్రతిమ ప్రపంచంలో ఆఖరి యాత్ర ముగించుకుంది.
    ప్రతిమ పోవడంతో జీవితం క్షణికం అనిపించింది. కమలాకరానికి ఈ మాత్రం జీవితం కోసమేనా తను పరుగులేత్తుకు వచ్చేశాడు? ఈ యమయాతనలు ఎక్కడనుభవిస్తే ఏమిటి , ప్రపంచమనే సముద్రంలో ప్రయాణిస్తున్న అన్నీ జీవన నావలూ ఒక్కటే. నిశ్చలంగా దిక్కు కేసిపోతూ , సుడిగుండాలు తప్పుకుని, తుఫాను గాలులకు చిక్కుకుంటూ -- పెనుగాలుల వాత పడకపోయినా, పర్వతాలకు డీ కొంటూ జీవస్మరణ సమస్య ల్లాటి మరణ పర్యంత మమతాను బంధాలతో కొట్టు మిట్టాడుతూ. మునిగ తేలుతూ కొసకి సుఖమైన అంతానో, దుఃఖ కర అంతాన్నో చూసే ఒడ్డు చేరుకునే జీవితాలు ఇవి. ఒడ్డు ఒకటే అయినా సజీవ మానవులు మళ్ళీ దాన్ని రెండు చేస్తారు. అదే స్వర్గ నరక బేధం.

                                     19
    నీలాకాశాన్ని నల్ల మబ్బులు ఒక్కటొక్కటిగా ఆక్రమించు కుంటున్నాయి. అకాల వర్షా గమనానికి అవని ఇచ్చగించడం లేదేమో -- నక్షత్రాలు తెగి పడుతున్నట్టు పెద్ద పెద్ద బిందువులు నేలరాలి నీటి బుడగలై మంచి జన్మ ఎత్తడానికి తమని తాము అంతం చేసుకుంటున్నాయి.
    గదిలో జ్వరంతో బాధపడుతూ మద్యమధ్య మెల్లగా మూలుగుతున్న కమలాకరం కి బయటి వాతావరణం మరికాస్త దిగులు గొలుపుతుంది.
    వుండి వుండి వురుముల ఆర్బాటం . కిటికీ వెనకాల నుండి "జివ్వు' న భయపెట్టే ఈదురు గాలి, భీభత్స ప్రకృతి లో అర్ధరాత్రి -- మరణ వేదనకి మరో చెంప లాటిది. అలాటి తరుణం లో మనిషి అస్వస్థుడై వుంటే మనః స్థితి ఎలా వుంటుందో ఒక్క రకంగా వర్ణించి తే పూర్తీ అవదు.
    తనేమౌతాడో నని భయమైంది కమలాకరానికి. చావు ఎప్పుడు ఏరకంగా వస్తుందో తెలీదు ఊహ తెలిసిన మనిషి మృత్యువు కేమంత దూరంగా వుండదు. దేవుడి గురించీ మృత్యువు గురించీ ఆలోచించని మనిషే ఉండదు.
    చెప్ప పెట్టకుండా చచ్చిపోతే చంద్రం ఏమైపోవాలి ?-- బ్యాంకు లో వున్న కొన్ని వేలు అతని ఒంటరితనాన్ని మాపగల ననుకోడం వెర్రితనం. కాగా చంద్రం పట్ల తాను నెరవేర్చవలసిన బాధ్యతలు వున్నాయి ఒకటి రెండు.
    ఈ సారికి నన్ను గట్టేక్కించు తండ్రీ?-- మిగిలిన బాధ్యత తీర్చుకొని నువ్వు కోరిన వెంటనే వచ్చేస్తాను...." అనుకున్నాడు మగతలో.
    కొంచెం దూరంలో ఆ గదిలోనే పడుకున్న చంద్రం మంచం మీంచి లేచి కూర్చున్నాడు.
    "నాన్నా! మూలుగుతున్నారేం? కాళ్ళు నొప్పులైతే పట్టమంటారా?" చంద్రం కంఠం లో భీతిల్లిన ధ్వనికే కమలాకరం సగం వేదన తగ్గింది.
    ఈలోగా -- దగ్గరికి వచ్చి చెయ్యి పట్టి చూచాడు చంద్రం. చెమటలు పడుతున్నట్టుందండీ: ఇందాక మాత్ర ఇచ్చిం తర్వాత ఆగి, మందు ఇవ్వడం మరిచి పోయాను." నొచ్చుకుని నడుం పట్టడాని కన్నట్లు పైన చెయ్యి వేశాడు.
    కమలాకరం వారిస్తూ "ఫర్వాలేదు కాని -- చూడు కాసిన్ని మంచి నీళ్ళు ఇలా యిచ్చి, వెళ్లి పడుకో -- అర్ధరాత్రు ళ్ళు ఇలా చీటికి మాటికీ మేలుకోకు మొన్న మొన్న నీకు రొంపా దగ్గూ......అని ఆగి చంద్రం తెచ్చిన మంచినీళ్ళు అందుకున్నాడు.
    తర్వాత మంచి నిద్ర పట్టింది కమలాకరా నికి. చంద్రం కూడా పడుకున్నాడు.

                                    20
    చంద్రం రిజల్ట్స్ వచ్చాయి. క్లాసు తెచ్చుకున్నాడు స్వసిద్దంగా బుద్ది మంతుడూ శ్రద్దాశువూ అయిన అతను.
    రెండు రోజుల క్రితంగా జ్వరం నయమై నీరసంగా మంచం మీద గడుపుతున్నా కమలాకరం కి వెయ్యింతల బలం వచ్చింది. పదేపదే పేపర్లో నంబరు చూసుకున్నాడు. తాను పాసై నప్పుడు కూడా ఇంత సంబర పడినట్లు గుర్తు లేదు, అప్పుడు అమ్మదే హడావిడంతా.

                                 
    ఒక్క క్షణం నీలి నీడ కదలాడింది ప్రసన్న వదనం మీదుగా.
    చంద్రం ఇరవై ఏళ్ళు నిండి నిండక ముందే డిగ్రీ పుచ్చు కొన్నంత వాడవడానికి కమలాకరం కృషి కొంత కారణం. చంద్రం తెలివి తేటలు కొంత కారణం పని కట్టుకుని ప్రవైటు చెప్పగల తీరికి వుండేది కాదు కమలాకరం కి. కాని చదివే విధానాన్ని గురించి కొడుక్కి అదే పనిగా చెప్తుండేవాడు. విసుగెత్తే సమయంలో ఎంత మాత్రం పుస్తకం ముట్టుకో వద్దనేవాడు. అదృష్టవశాత్తు చంద్రానికి పుస్తకం ముట్టు కున్నప్పుడల్లా విసుగెత్తేది కాదు.
    కమలాకరం ఇప్పుడిప్పుడే తన కలలు ఫలిస్తున్నాయా అనుకున్నాడు .
    చంద్రం కాయగూరల సంచితో లోపల అడుగు పెట్టేసరికి స్వాప్ని జగత్తు లోంచి ఇవతలికి వచ్చాడు కమలాకరం.
    "ఏవిటి తెచ్చావు?-- " అన్నాడు ఆరోజు చంద్రాన్ని చూస్తుంటే కలుగుతున్న ఆనందాన్ని బయట పదనివ్వని సీరియస్ నెస్ తో.
    'అరిటి కాయలూ నాకోసం అప్పడాలూనూ."
    'అబ్బబ్బ -- అరటి కాయతో చంపేస్తున్నావురా నన్ను?' అన్నాడు విసుగ్గా -- లోపల అన్నదీ అక్కరలేదన్నంత నిర్లక్ష్యంగా వున్నా.
    చంద్రం నవ్వుకున్నాడు. ఇవాళ కంపౌండర్నీ అడుగుతానుండండి !" అన్నాడు.
    వెళ్తూన్న చంద్రం తో "ఒరేయ్!-- పాసై క్లాసు తెచ్చుకున్న ఆనందంతో నా కూరని బొత్తిగా చప్పిడి చేసేసేవ్! అసలే నాలుక తెగిపోతోంది --' అన్నాడు కమలాకరం.
    "అసలు -- ఇవాళ మీరు రుచుల గురించి ఆలోచిస్తే కదా!"
    ఇద్దరి నవ్వులూ ఏకమయ్యాయి.
    మొన్న కమలాకరం పద్యం పుచ్చుకున్నది లగాయితు వంట చంద్రమే నిర్వహిస్తున్నాడు.
    తోటి వారంతా ఎక్స్ కర్షన్ ప్లాను వేస్తున్నా సమయానికి, తాను జ్వర పడడంతో ఆగిపోయాడు చంద్రం. తనలాగ ద్రోహి కాడు చంద్రం.
    తనను తాను నిందించుకోవడం లో తృప్తి అనుభవించడం అలవాటయింది.
    "ఆరోగ్యం ఎలా వుంది ?' అనే పరామర్శ తో వచ్చిన గుమస్తా నరహరి చంద్రం ఫస్టున పాసు కావడం గర్వకారణ మన్నాడు చంద్రాన్ని అభినందించి టీ పార్టీ ఎప్పుడయ్యా" అన్నాడు హాస్యానికి.
    పొగలో అవస్థ పడుతున్న చంద్రం ఏదో హోటలు పేరు చెప్పి "సరీగ్గా నాలుక్కి హాజరు కండి మహాశయా" అన్నాడు చనువుగా.
    నరహరి నవ్వుకుని కమలాకరం వున్న ద్వారం వైపు తిరిగి ! "ఇంకెన్నాళ్ళు అబ్బాయిని అవస్థ పెట్టి మీరు కూడా అవస్థ పడతారు చెప్పండి కమలాకరం గారూ! త్వరగా......అంటున్నాడు యింకా నవ్వుతూ.
    అతని హాస్యాన్ని పసికట్టేసిన చంద్రం, వాక్యాన్ని పూర్తీ చెయ్యనివ్వ కుండా 'ఆ, ఇంకెన్నాళ్ళు ? వచ్చే ఆదివారం నుంచి మళ్ళీ హోటల్ అనేశాడు.
    "మీ అబ్బాయి చాలా ఘటీకుడండీ!" అన్నాడు నరహరి చివరికి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS