Previous Page Next Page 
సంపెంగ పొదలు పేజి 7


                                         7
    ఆ తోటలో ఒక మూలగా పెద్ద తోట బావి ఉంది. హరి కుటుంబం ఆ తోటలో రకరకాల ఫల వృక్షాలనూ,  కొన్ని పువ్వుల మొక్కలనూ పెంచుతున్నారు. తోట బావి నుండి నీళ్ళు తోటంతా ప్రవహించడానికి ఒక మిషను ఉంది. తోటంతా సిమెంటు తో తయారు చేయబడిన తూములున్నాయి----- ఆ తూముల గుండానే నీళ్ళు మొక్క లన్నింటి కీ ప్రవహిస్తూ ఉంటాయి. పువ్వుల మొక్కల మధ్య భాగంతో ఒక విశాలమైన స్థలం ఉంది. అక్కడ ఒక పందిరి వేసారు. ఆ పందిరి క్రింద కొంచెం ఎత్తు తక్కువగా ఉన్న ఒక విశాల మైన అరుగు కట్టబడి ఉంది. ఎప్పుడైనా అక్కడికి వచ్చి కూర్చోడాని కని , హరే ఏర్పాటు చేశాడు. అలాగ -- అదిగాక, ఆ తోటలో ఒక పెంకు టిల్లు కూడా ఉంది. ఆ ఇంట్లో ఆ తోట చూసుకునే మాలి కుటుంబంతో సహా ఉంటున్నాడు. హరి, గిరి , దుర్గా, శంకర్, ఉమా బిలబిల్లాడుతూ తోటలోకి వచ్చారు. కూడా వచ్చిన పనివాడు, ఫలహారాల బుట్టలూ, ఫ్లాస్కు, పళ్ళు అన్నీ సిమెంటు అరుగు మీద ఒక వారకు సర్దాడు.
    గిరి చాలా హుషారుగా ఉన్నాడు. దుర్గ కూ హుషారుగానే ఉంది. శంకర్ ఎప్పటిలా నిర్లిప్తంగా ఉన్నాడు -- హరీ, ఉమా మాత్రం దిగులుగా ఉన్నారు. కానీ, వారి దిగుళ్ళ కు కారణాలు వేరు. దుర్గ గ్రామ ఫోన్ తీసి రికార్డు లు పెట్టడం ప్రారంభించింది. ఉమతో కలిసి తోటంతా చుట్టి రావాలని హరి కోరిక. ఒకసారి చిన్నగా ఉమ దగ్గిర ఆ విషయం కదిపి , ఉమ కస్సు మనడంతో ఆగిపోయాడు. ఈ విషయం పరధ్యానంగా ఉన్నట్లే గమనించాడు గిరి -- అతనికి శంకర్ విషయం దుర్గతో ప్రస్తావించాలని ఉంది. తన మాటలకు దుర్గ విలువ నిస్తుంది-- శంకర్ కు తన మాట వేదమే౧ అయినా, తను ఎవ్వరినీ నిర్భందించాలని అనుకోవటం లేదు. దుర్గా, శంకర్ లకు ఇద్దరికీ ఇష్టమయి , ఇద్దరూ భార్యాభర్తలయితే అది అందరికీ సంతోషకరమయిన సంగతి.
    చటుక్కున "దుర్గా! నీ రికార్డులు తరువాత ఒకసారి అలా తిరిగి వద్దాం వస్తావా?' అన్నాడు.
    దుర్గ వెంటనే తన అంగీకారం తెలిపింది. శంకర్ అంతకు ముందే ఆ తోట మాలితో ఆ తోట ఫలసాయం గురించీ, దాని వల్ల వచ్చే లాభ నష్టాల గురించీ మాట్లాడుతూ, దాని వివరాలు కనుక్కుంటూ అతని దగ్గర కూర్చున్నాడు.
    దుర్గతో కలిసి బయలుదేరుతూ . గిరి వెనక్కు తిరిగి హరి వంక చూసి కొంటెగా నవ్వి వెళ్ళాడు. హరి మనసులో గిరికి వెయ్యి దన్యవాదాలర్పించు కున్నాడు. అంతేకాదు అతనంత స్వతంత్రంగా దుర్గ ను తనతో రమ్మనటం, దుర్గ సంతోషంగా ఒప్పుకోవటం హరికి మొదటి సారిగా లీలగా ఏదో భావం స్పురించింది. ఆ భావన అతని కెంతో ఆనందాన్ని కూడా కలుగజేసింది.
    ఉమ మనసు కలుక్కుమంది -- అంతకంటే గిరి పోతూ, పోతూ నవ్విన నవ్వు ఆమెను మనసును మండించింది. ఆ నవ్వులో అర్ధం స్పష్టంగానే ఉంది. గిరి భావముల కది ప్రతిబింబం . అయ్యో! తనను హరి ప్రియురాలుగానే భావిస్తున్నాడు గిరి. ఎన్ని యుగాల కయినా , తానా తనిని ఒక దేవత లాగ అరదిస్తుందని అర్ధం చేసుకోగలడా?
    "ఎలాగైనా , గిరికి చొర వెక్కువ -- చూడు౧ నువ్వు నా దానివని ఇక్కడ అందరికీ తెలిసిందే గదా! అయినా నిన్ను నాతొ రమ్మని అడగలేక పోయాను. గిరి దుర్గను తీసుకు పోయాడు. కృత్రిమమైన చిరునవ్వుతో అన్నాడు హరి-- ఆ మాటలకు ఉమకు కడుపులో తిప్పినట్లయింది. ,ముఖం పక్కకు తిప్పుకు కూర్చుంది. "గిరి దుర్గను ప్రేమిస్తున్నాడని అనుమానంగా ఉంది ఉమా! గిరి నాకు బావ కావటం కంటే నే కోరుకునే దేముంటుంది" అన్నాడు. మళ్ళీ -- ఉమకు కంపర మెత్తుతుంది.
    "గిరి ఒక్క దుర్గ నే ఏం కర్మ. నిన్నూ, నన్నూ, శంకర్ నీ అందరినీ ప్రేమిస్తున్నాడు. అందుకే అందరికీ ఇన్ని తిప్పలు" అని కయ్యిమంది-- ఆమె విసుగు కు తెల్లబోయాడు హరి. ఆమె మాట లతనికి సరిగా అర్ధం కాలేదు. అయిన వివరంగా అడిగే టంత సాహసం మాత్రం కలుగలేదు. కొన్ని క్షణాలు మౌనంగా గడిచాయి -- నిశ్శబ్దాన్ని భరించలేక , హరి "మళ్ళీ ఎన్నాళ్ళ కు కలుస్తామో?" అన్నాడు.
    ఉమ దూరంగా విరబూసిన చామంతుల వంక చూస్తూ మౌనంగా కూర్చుంది.
    "గిరి పుణ్యమా అంటూ మన కేకాంతం లభించింది. అలా ముభావంగా ఉండకు ఉమా! ఏదైనా మాట్లాడు" ప్రాధేయపూర్వకంగా అడిగాడు హరి.
    ఉమ ముఖం చిట్లించి, "ఏకాంతం కావాలనుకుంటే శ్రమపడి ఇంతదూరం రావట మెందుకూ? నలుగురం కలిసి సరదాగా గడపటానికి వచ్చాం కాని పద! మనం కూడా వాళ్ళ దగ్గిరకు వెళ్దాం!" అంటూ సమాధానం కోసం ఎదురు చూడకుండానే నడవటం మొదలు పెట్టింది -- హరి గత్యంతరం లేక ఈసురో మంటూ , ఆమె ననుసరించాడు. ఆఖరి ప్రయత్నంగా "పాపం! దుర్గా, గిరీ , ఏ సన్నివేశం లో ఉంటారో? మనం వాళ్ళని డిస్టర్బ్ చెయ్యటం ..." అంటూ నసిగాడు.
    ఉమ అసహ్యంగా హరి వంక చూసి "ఏం మనుష్యులూ? అంతా మనలాగే అనుకుంటాం! మనచేత డిస్టర్బ్ చేయించబడే ఏ భయంకర సన్నివేశం లోనూ, వాళ్ళు ఉండరు. మరేం ఫర్వాలేదు." అంది. హరి మాట్లాడలేక పోయాడు. కానీ, తానన్న సామాన్యమైన మాటలకు, ఉమ ఎందుకింత అసహ్యించు కుంటుందో అతని అర్ధం కాలేదు.
    బత్తాయి చెట్ల మధ్య ఒత్తుగా మొలిచిన పచ్చ గాడి మీద కూర్చుని ఉన్నారు దుర్గా, గిరీలు -- ఎర్రగా కందిపోయిన ముఖంతో, భరించలేని సిగ్గుతో తల వంచుకుని, "ఫో ! గిరీ ......అంటూ ఏదో అనబోయిన దుర్గ, హరి ఉమలను చూసి చటుక్కున ఆగిపోయి, "అరే! మీరూ ఇక్కడకు వచ్చారే!' అంది. దుర్గ, సిగ్గూ, ఆమె ముఖంలో ని అరుణిమా ఉమ గుర్తించ లేదు. కానీ, అదే దృష్టి తో ఉన్న హరి, అది గమనించి తనలో తను నవ్వుకున్నాడు.
    "ఏం కష్టంగా ఉందా?' కొంటె నవ్వుతో అడిగాడు హరి. గిరి అందుకుని, "మాకేం కష్టం? మీరు, కష్టపడుతున్నారని గాని"-- అన్నాడు.
    "అందరి కష్ట సుఖాలు చూసుకునే దయామయులు మీరుండగా, ఎవరికి మాత్రం ఏ కష్టం?" ఎత్తి పొదుపుగా అంది ఉమ కూర్చుంటూ.
    "ఏం? నేను మీకేం కష్టం కలిగించానూ? చూడరా హరీ! మీ ఉమకు కొంచెమయినా కృతజ్ఞత లేదు" అన్నాడు గిరి.
    "ఇవాళ ఎందుకనో ఉమ మూడ్ లో లేదు"
    "ఆవేదనరా బాబూ! ఆవేదన!-- అంత మాత్రం అర్ధం చేసికోవెంరా" హరి, ఉమల వంక చూస్తూ పకపక నవ్వాడు గిరి. హరి తాను కూడా శృతి కలిపాడు-- దుర్గ ముఖం పక్కకు తిప్పుకుంది. ఉమ చికాకుగా ముఖం చిట్లించుకుంది.
    అంతలో తోటమాలితో మాట్లాడుతూ శంకర్ కూడా అటు వైపుకు వచ్చాడు. శంకర్ ను చూసి గిరి చప్పట్లు కొడుతూ "ఏమయ్యోయ్ అది శంకరా, భావనాశంకరా! ఈ లోకంలో బేరాలూ సారాలు, లాభనష్టాలు కాక తెలిసి కోవలసినవి, చూసుకో వలసినవి చాలా ఉన్నాయి -- ఇలారా!" అన్నాడు. శంకర్ కూడా వాళ్ళ మధ్యకు వచ్చి కూర్చుంటూ "నేనే ఇక్కడికి వద్దామని అనుకుంటున్నాను. నాకు ఆకలి వేస్తుంది.' అన్నాడు. గిరి నవ్వాడు. "ఏం మనిషివిరా! ఆకలి వేస్తేనే కాని, మేమంతా గుర్తు రాలేదన్న మాట! పద నాయనా! పద! తిందువు గాని." అంటూ లేచాడు. అతనితో పాటు అందరూ లేచారు. అందరూ పందిరి క్రిందకు చేరుకున్నారు. ఉమ అన్యమనస్కంగా ఒక వారకి కూర్చుంది. దుర్గే అందరికీ, ఆకులూ వేసి, ఫలహారాలు పెట్టసాగింది.
    "చూడు శంకరా! మా దుర్గ ఎంత పని మంతురాలో!" అన్నాడు గిరి నవ్వుతూ.
    శంకర్ పరధ్యానంగా "మరీ! కానీ! ఈ తోటలో చాలా భాగం పువ్వుల మొక్కలకు వృధా చేస్తున్నారు ఇక్కడేవైనా, కాయగూరలు, పండిస్తే బాగుండేది అన్నాడు.
    శంకర్ సమాధానానికి దుర్గ నవ్వుకుంది. గిరి శంకర్ భుజం తడ్తూ "నేను నీతో మాట్లాడింది ఆ విషయం కాదు నాయనా! సరేలే! ఫలహారం కానీయి." అన్నాడు.
    అందరూ, ఫలహారాలు , కాఫీల ముగించాక పేకాట ప్రారంభించారు. క్రమక్రమంగా చీకటి పడసాగింది. ఇక లేద్దామని లేచి నౌకరు ని కేకలేయ్యడానికి వెళ్ళాడు హరి. దుర్గ సామానులు సర్ధ సాగింది . శంకర్ బయట మొక్కలను పరీక్ష చెయ్యడం లో మునిగి పోయాడు. సందు చూసుకుని ఉమ గిరితో "వేడ్తున్నాను . ఉత్తరాలు వ్రాస్తే సమాధాన మిస్తారా?' అంది. ఈ ప్రశ్న కు గిరి ఆశ్చర్యపోయాడు. మనసులో ఉవ్వెత్తున లేచిన ఆనంద తరంగాలను నిర్దాక్షిణ్యంగా అణచి వేస్తూ అతి సాధారణంగా "నాకెవరు ఉత్తరాలు వ్రాసినా సమాధానం వ్రాస్తాను. కాకపోతే, కాస్త ముందు వెనుకా, అంతే!" అన్నాడు. అతని నిర్లప్తత ఉమకు కష్టం కలిగించింది. "మీ సమాధానం కోసం, ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటాను.' అంది ఊరుకోలేక.
    "ఎందుకూ, ఎదురు చూడటం? పోస్టు లో వేసింది, మీరు ఎదురు చూసినా, చూడకపోయినా వస్తుంది." అని అక్కడ ఉండకుండా "శంకర్" అంటూ బయటకు నడిచాడు.
    దుర్గ అక్కడకు కొంత దూరం లోనే, ఉండటం వలన ఉమా, గిరిలా సంభాషణ అంతా వింది. ఒక్కసారిగా దుర్గ కు ఉమ ఎం.బి.బి.యస్ లో చేరతాననడానికి , ఆమె ముభావానికీ హరి మీద ఆమె చీటికీ మాటికి విసుక్కోవటానికి గల కారణం అర్ధమయింది. ఆశ్చర్యంతో ఉమ దగ్గరగా వచ్చి కూర్చుంది. ఉమ కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి దుర్గ ఏమీ మాట్లాడకుండా, ఉమ కన్నీళ్లు తుడిచింది. సానుభూతితో ఉమ చేతిని తన చేతిలోకి తీసుకుని మృదువుగా నొక్కింది. ఉమ "దుర్గా" అంటూ ఏదో చెప్పబోయే లోగా, హరి, నౌకరు , గిరి, శంకర్ వచ్చారు. అందరూ తిరుగు ముఖం పట్టారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS