
మరో కొన్ని నెలలు గడిచాయి.
ఒకనాడు శేషగిరి ఇంటికి వెళ్లాను. "జయ లేదేమిటి?" అన్నాను అతను వంట చేసుకోడం చూసి.
శేషగిరి కన్నీరు వత్తుకున్నాడు. నేను ఆశ్చర్య పోయాను.
"లేదు. ఏదో వూరు వెళ్ళింది" అన్నాడు. నేను గడప మీద కూర్చున్నాను. శేషగిరి నిట్టూర్చి , "నువ్వు చెప్పింది వేదాక్షరాలను కోరా. ఆనాడు నీమాట కాదన్నాను. ప్రేమ, ప్రేమ అని గుడ్డి వాణ్ణి అయ్యాను. మేనమామ కూతుర్ని పెళ్లి చేసుకుని అమ్మని ఆనంద పరచిన వాణ్ణి కాదు. ఇటు నేను సుఖపడలేదు. నాకు జీవితం మీద ఆశ సన్నగిల్లుతోంది" అన్నాడు నాకు ఏమీ అర్ధం కాలేదు. "ఏమిటి? అసలు ఏం జరిగింది" అన్నాను. శేషగిరి టూకీగా చెప్పాడు.
నేను ఉలిక్కిపడ్డాను.
"ఛీ లేనిపోని అనుమానాలు పెట్టుకోక. జయ అలాటి మనిషి కాదు" అన్నాను. శేషగిరి నవ్వాడు. "నేను అలానే అనుకున్నాను. కానీ మన కళ్ళు మనవి మోసం చెయ్యవు గా!' అంటూ లేచి, పక్క గదిలోకి వెళ్లి కొన్ని ఫోటోలు తెచ్చి చూపించాడు. నా కళ్ళను నేనే నమ్మలేక పోయాను. జయ పక్కన శేషగిరి స్థానం లో ఎవరో ఉన్నారు. ఇంతవరకు ఎలా జరిగిందో నాకు బోధపడలేదు. "ఇవి చాలావరకు నడిచింది రాజూ. దాన్ని దానిష్టం వచ్చినట్టు తిరగనిచ్చాను. "నస్త్రీ స్వాతంత్యమర్హతి" అన్న పదం వ్యర్ధ పదం అని వాదించాను. కోరినంత డబ్బు ఇచ్చాను. కానీ దాని బుద్ది ఇలా పెడదారిన పడుతుందను కోలేదు. ఇది నలుగురికీ తెలిస్తే నేను ఎలా ముఖం ఎత్తుకుని తిరుగుతాను." అని కంట తడి పెట్టుకున్నాడు.
"పాపేది"అన్నాను.
"పనిమనిషి తీసుకు వెళ్ళింది" అన్నాడు.
కాఫీ కాచాడు. ఇద్దరం తాగాము. ముందు గదిలో వచ్చి కూర్చున్నాక మళ్ళీ ప్రారంభించాడు. "రాజూ! ఈ విషయం నీతో చెప్పాలని రెండు మూడు నెలల్నుంచీ ప్రయత్నిస్తున్నాను. ఇలాటి విషయాలు పరాయి వాళ్ళతో చెప్పడం అంటే ఒక మనిషి ఎంత మానసిక బాధకు గురి అవుతాడో ఆలోచించు. కానీ, ఏం చేస్తాం. బ్రతికుండగా అమ్మను పెట్టిన క్షోభ ఇలా నన్ను నాశనం చేయక మానుతుందా!" అన్నాడు. గోరంతలు కొండంత లుగా ఆలోచించడం శేషగిరికి ఒక అలవాటు. ఆరకంగా ఊహిస్తున్నాడెమో అనుకున్నాను. కానీ ఆ పరిస్థితుల్లో మనస్సు ఎంత బాధపడుతుందో వూహించడం నాలాటి వాడికేమీ కష్టం కాదు. రమని నేను ప్రేమించి పెళ్లి చేసుకుందామని వూహించినపుడు జయ విషయం లోనూ అలాగే అయినపుడు నేను పొందిన బాధ గుర్తుకు వచ్చింది.
ఆ రాత్రి పదకొండింటి వరకు శేషగిరి ఏవేవో వేదాంత ధోరణి లో కబుర్లు చెపుతూనే ఉన్నాడు. వాణ్ణి వోదార్చి , రూముకు చేరేసరికి పన్నెండయింది. ఆ తరవాత నెలరోజులు గడవక ముందే శేషగిరికి తిరుచునా పల్లి ట్రాన్స్ ఫర్ అయ్యింది. వెళ్ళేముందు నాతొ కాసేపు మాట్లాడాడు. మనిషిలో హుషారు పోయింది. వేదాంతి లా తయారయ్యాడు. "రాజూ, ఉత్తరం రాస్తే సమాధానం రాస్తావా? ఆపదలో ఆదుకునేవాడే స్నేహితుడు అంటారు. నాకేదైనా ఆపద వస్తే ఆదుకుంటాననే ధైర్యంతో వెళుతున్నాను." అన్నాడు.
"ఛ. ఏమిటా చాదస్తం" అన్నాను.
"వెళ్ళొస్తామండి" అంది జయ. శేషగిరి పాపను నా దగ్గర్నుంచి తీసుకుని "మావయ్య తో వెళ్ళొస్తామని చెప్పమ్మా" అన్నాడు. పాప కేరింతలు కొడుతూ చెయ్యి వూపింది. నా శరీరం పులకరించింది. కళ్ళు చమర్చాయి.
వాళ్ళు వెళ్ళిపోయారు.
* * * *
నా జీవితం మరీ పొడి అయిపొయింది. వారానికి ఒక్క ఉత్తర మైనా శేషగిరి రాసేవాడు. అంతా వేదాంతమే!! వీలున్నంత వరకు అతన్ని ఉత్సాహ పరుస్తూ రాసేవాడిని.
ఓ నాలుగు నెలలు గడిచాయి.
ఉన్నట్టుండి శేషగిరి వచ్చాడు. "నీతో ముఖ్యమయిన పనుండి వచ్చాను" అన్నాడు. వెంటనే ఆ పూట సెలవు పెట్టాను. ఇద్దరం కాఫీ తాగి రూముకు చేరాము. శేషగిరి మౌనంగా కన్నీరు కార్చి తుడుచుకున్నాడు. నేనతని కేసి చూశాను. అతని ప్రాణాలు కళ్ళల్లో ఉన్నాయి. మనిషి చిక్కి శవం లా అయిపోయాడు. మానసిక ఆరోగ్యం లేని వాడిని ఔషదాల్లో పాతేసినా వీసా మెత్తు ప్రయోజనం ఉండదు.
"అంతా అయిపొయింది రా రాజూ! నిన్న పొద్దున్న తో బుణాను బంధం తీరిపోయింది. నాతొ తనకి సౌఖ్యం లేదని చెప్పింది. పొరపాటు సరిదిద్దుకునే సమర్ధత, తెలివి తనకు ఉన్నాయంది. విడాకుల పత్రాలు తెచ్చింది. వాడూ వచ్చాడు. సంతకం పెట్టమంది. పెట్టేశాను. అన్నీ అయిపోయాయి." అన్నాడు వెక్కి వెక్కి చంటి పిల్లాడిలా ఏడుస్తూ.
"ఎంత పని చేశావ్" అన్నాను నేను.
"అంతకన్నా ఏం చెయ్యగలను? ఏం చెయ్యాలి? రాజూ! తల్లిని పెట్టిన క్షోభ కు నాకీ శిక్ష చాలదురా . చాలదు" అన్నాడు. కాస్సేపాగి "రాజూ! నువ్వు ఆజన్మాంతం వివాహం చేసుకోవద్దు. బ్రహ్మచారిగా ఉండిపో-- జీవితాన్ని మలినం చేసుకోక----నా మాట విను" అన్నాడు ఆవేశంతో.
"మరి పాపా సంగతి?" అన్నాను నేను.
శేషగిరి కన్నీరు తుడుచుకున్నాడు.
"ఆ ఒక్క వరం ఇచ్చింది. పాపను నాకు ఇచ్చింది." అని దీర్ఘంగా నిట్టూర్చి, 'అవున్లే -- స్వేచ్చ కోసం అది పోతుంటే మళ్ళీ ఈ ప్రతి బంధకం ఎందుకు? నేను అడగకపోతే పాపని ఏ అనాధ శరణాలయం లోనయినా అప్పగించేసి ఉందును" అన్నాడు.
"ఎంత పని జరిగింది" అన్నాను నేను. నా గీతే కాక, నాకు సన్నిహితులు , హితులు, బంధువులు, స్నేహితులు -- వాళ్ళందరి గీతలు కూడా ఇలా విషాదాంతం అవ్వాల్సిందేనా? ఏమిటీ శాపం!
మళ్ళీ శేషగిరి ప్రారంభించాడు.
"నేను నిన్నొక వరం కోరుకుందామని వచ్చాను" అన్నాడు.
"ఏమిటది" అన్నాను.
"నాకు జీవితాన్ని పరిహసించి ఎదురు నిలబడే శక్తి లేదు. నేను పిరికి వాణ్ణి . ఒకవేళ జరగ కూడనిది ఏదైనా జరిగితే పాపకి తండ్రి వి నువ్వే ---- నా పాపను పెంచి పెద్ద చేస్తానని మాటిస్తావా?" అన్నాడు. అతని కంఠం రుద్దమయ్యింది. నేను లేచి అతని భుజం మీద చేయి వేసి, "ఛీ, ఏమిట్రా అది? గోరంతలు కొండంత లుగా వూహించుకుని అలా ఆడదాని లా ఎడుస్తా వేమిటి? ఛీ.....ధైర్యంగా ఉండాలి. నన్ను చూడు, ఈ విశాల ప్రపంచం లో ఏకాకిని. అయినా రాయిలా తిరుగుతున్నాను. నన్ను చూసి ధైర్యం తెచ్చుకో" అన్నాను. శేషగిరి తల అడ్డంగా వూపి, '"అది సరి. ముందు నే నడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు పెంచలేక పొతే అనాధ శరణాలయం లో చేర్చు. అంతేకాదు. నేను అది, పాపకి తలి దండ్రు ల మైనట్టు తెలియకూడదు. పాప జీవితం మా మలినాలు తగులకుండా ఉండాలి. దాన్ని నీ కప్పగిస్తాను. ఈ బాధ్యత నువ్వు తీసుకోగలవా" అన్నాడు. నా రెండు చేతుల్లో తన ముఖం దాచుకుంటూ.
"అలాగే పాపని పెంచి పెద్ద చేస్తాను సరేనా" అన్నాను.
శేషగిరి కన్నీటిని తుడుచుకుని, "నాకాధైర్యం ఉంది రాజూ! నువ్వు దేముడివి. అందుకే ఈ వరానికి ఇక్కడ కొచ్చాను. ఇక నేను వెళ్తాను. పాప అక్కడ వోక్కర్తీ ఉంది" అన్నాడు.
"పోనీ రాత్రి ఉండిపో కూడదా" అంటే వినలేదు.
"రాజూ! నేను చెప్పినది మరిచి పోక. నా ఆశలన్నీ నీమీదే పెట్టుకున్నాను" అంటూ వెళ్లి పోయాడు.
ఆ రాత్రి మళ్ళీ నాకు కాళరాత్రయింది.
భగవంతుడు మనుష్యుల జీవితాలతో ఎందుకిలా ఆడుకుంటాడు? ఇందంతా పూర్వ జన్మ పాప మేనా? పూర్వ జన్మ లో చేసిన పాపం అనే వంకన ఎంత శిక్షయినా విధించడానికి భగవంతునికి హక్కు ఎవరిచ్చారు?
భగవంతుడునియంతా?
ఈ నియంతృత్వానికి హడ్డుల్లెవా?
వాడెవడో రాజు చదరంగం లో మనుష్యులను, ఏనుగులను, గుర్రాలను పెట్టి ఆడేవాడట. అవతల అవి చావవలసివస్తే నా బంటు చచ్చాడు. నా ఏనుగు చచ్చింది. అని వాటిని చంపేసేవాడుట. దేముడు కూడా అలా ఆడితే ఎలా? ఎన్ని ప్రాణాలు మలమల మాడిపోతున్నాయి? ఎందరు చావలేక బ్రతుకుతున్నారు?
ఇదంతా దేవుడికి ఎవరు నచ్చ చెప్తారు!
చెప్తే వింటాడా? అసలు చెప్పేదెవరు? ఈ రకం మాటలు దైవ దూషణ వల్ల ప్రయోజనం ఉండదని తెలుసు. అయినా ఆవేశం లో ఏవేవో వూహ గానాలు చేస్తూ పడుకున్నాను. తెల్లవారి ఎవరో తలుపు తట్టడంతో మెలకువ వచ్చింది. ఎదురుగా -- తలుపు తీసేసరికి పోలీసులు. నేను కొయ్యబారి పోయాను. ఏదో హాస్పిటల్లో శేషగిరి ఉరి పోసుకుని చనిపోయినట్టు చెప్పారు వాళ్ళు. నా పేర ఒక ఉత్తరం రాశాడట. వాళ్లిచ్చిన ఉత్తరం జేబులో పెట్టుకుని, వాళ్ళ వెనక పరిగెత్తాను. శేషగిరి శరీరం చూసేసరికి నాకు మైకం వచ్చినట్టయింది. అతని శరీరం చాలా భయంకారంగా తయారయ్యింది. కళ్ళల్లోంచి నెత్తురు వచ్చింది. నాలుక వికృతంగా బయటికి వచ్చింది. పోలీసు ఇనస్పెక్టరు ఇచ్చిన ఉత్తరాన్ని చదువు కున్నాను. పాప పెంపకం నాకు వప్పగించాడు. పాప పేర బ్యాంకు లో ఐదు వేల రూపాయ లున్నట్టు రాశాడు. తన ఆత్మహత్య కి తన అనారోగ్యమే కారణమని, ఎవరూ కారణం కాదనీ రాశాడు. కానీ నిజం నాకు, జయకు అతనికి తెలుసు.
లోకాన్ని మంచిగా నమ్మింప చూశాడు శేషగిరి.
ఆనాడే ఆ ఉత్తరం తీసుకుని తిన్నగా తిరుచునాపల్లి వెళ్లాను. జయ నన్ను చూసి కంట తడి పెట్టుకుంది. "వారు అత్మహత్య పాల్పడతారను కోలేదు. నిత్యం గృహ కల్లోలాలతో కాపరం చెయ్యడం కన్నా విడిపోవడమే మేలని అలా చేశాను. ఇలా జరుగుతుందని అనుకోలేదు. అయన దేవుడి లాంటి వారు. భగవంతుడ్ని అయితే పూజ చేస్తాం కానీ కేవలం భర్త అనేవాడు పూజ చేయించుకోడానికి కాదు కదా! సుఖం, అనురాగం, ఆప్యాయతా ఇవన్నీ ఒక స్త్రీ భర్త దగ్గర నుంచి కోరుకుంటుంది. అదీగాక, తన ఆశయాలు, కోరికలు నెరవేరాలను కుంటుంది. అవన్నీ తీర్చని భర్త కేవలం పూజా విగ్రహమయితే -- ఆ స్త్రీ నిగ్రహించుకొడం కష్టం. ప్రపంచం లో బంధించిన కొద్దీ చిలక్కి పారిపోవాలనే కోర్కె ఎక్కువవుతుందంటారు. నే నాయన్ని భర్తగా చూడాలని ఆశించాను. అయన దేముడిలా ప్రవర్తించే వారు. అందుకు ఇలా జరిగింది. కానీ ఇలా జరుగుతుందనుకోలేదు." అంది.
జయ చెప్పిందాంట్లో నిజం లేకపోలేదు.
"వారి కోర్కె ప్రకారమే పాపను మీరు తీసుకోండి. పాప నాలాంటి పాపి దగ్గరుంటే నా మాలిన్యాలు దానికి వస్తాయి. నాకంఠం లో ప్రాణం పోయేలోగా ఆ సర్వేశ్వరుడి దయ కలిగితే పాపని చూచి మరీ ప్రాణాలు వదుల్తాను." అంది, పాపను కడసారిగా ముద్దు పెట్టుకుని, హృదయానికి హత్తుకుంటూ, నా కళ్ళు చమర్చాయి.
నేను తీసుకుంటున్న బాధ్యత చాలా పెద్దది.
జయ పాపను చేతిలో పెట్టి, ముఖానికి పైట చెంగు వేసుకుని, వెక్కి వెక్కి ఏడ్చింది. పాపా నా మెడ చుట్టూ ఒక చెయ్యి వేసి రెండో చేత్తో నా కాలరు పట్టుకుంది. జయను వోదార్చి ఆరోజే మళ్ళీ వూరు చేరాను.
శేషగిరి లా నేను ఆత్మహత్య చేసుకోకుండా ఉండాలనే భగవంతుడు నాకు ఈ పాపను కాపలా పెట్టాడు. పాపను నా చేతుల మీదుగా పెంచాలి. గుణవంతు రాలిగా చెయ్యాలి. పాపకు తల్లినీ, తండ్రి నీ నేనే అవ్వాలి. ఆమెకు తన తల్లిదండ్రుల విషాద చరిత్ర తెలియ నివ్వకూడదు అని నిశ్చయించు కున్నాను.
