ఇంతలో స్నానం ముగించుకొని భద్రీ ప్రసాద్ భార్య సతీదేవి బయటికి వచ్చింది. బంగళాలో విరిసిన పువ్వుల్లాగా ఉన్న పిల్లల్ని చూడగానే ఆవిడ కన్నుల్లో ఆనందం నృత్యం చేసింది. "రండమ్మా, రండి. లోపలకు రండి కాఫీ తీసుకొందురుగాని" అని ఎంతో ప్రేమతో ఆహ్వానించింది. పిల్లలంతా బిలబిల్లాడుతూ లోపలికి ప్రవేశించారు. మేడమీద వారికి ఏర్పాటు చేశారు. మూడు బాత్ రూం లూ, రెండు పెద్ద హాళ్ళూ, మూడు పెద్ద గదులూ- చాలా చక్కగా ఉంది. ఇల్లుగలవాళ్ళ సంపదనంతా ప్రతిఫలింప జేస్తున్నది.
పారిజాతం, సత్యవతి పిల్లలతో సామాను నీటుగా సర్దించుతున్నారు. అనంతలక్ష్మి కళ్ళు మూసుకొని ఒక సోఫాలో పడుకొని ఉన్నది. మిగతా టీచర్లు బాత్ రూం లో దూరారు.'
హెడ్ మిస్ట్రెస్ మెప్పుకోలుగా- "ఎంతైనా, అవసరమొస్తే సత్యవతమ్మా, పారిజాతమ్మా మాత్రమే చక్కగా పని చేస్తారు. మిగతా వారు చూపుల గుర్రాలు మాత్రమే!" అని అంది. అనంతలక్ష్మి చెవుల్లో కరిగించిన సీసం పోసిన ట్లయింది.
"డిప్యూటీ కలెక్టర్ చెల్లెలూ! నీ స్నేహితురాలయినందుకు ఈ వేళ నా పుణ్యం పుచ్చింది!" అని మెల్లగా సత్యతో అంది పారిజాతం. విసుగ్గా కసరపోయిన సత్య పెదవులు నవ్వాయి.
"ఆఁ! ఏం కావాలమ్మా! దబ్బున స్నానాలు చెయ్యిడ పండి. హంపీ చూడాలి" అంటూ భద్రీ ప్రసాద్ వచ్చాడు. ఆయన వెనకాలే రామనాథం కూడా వచ్చాడు.
నెమ్మదిగా అంది పారిజాతం: "ఏం వద్దు. సూదీ, దారం తెస్తే నా నోరు కుట్టిడుస్తుంది సత్య!"
పకపక నవ్వింది సత్య. వాళ్ళిద్దరూ ఎందుకు నవ్వుతున్నారో తెలియక భద్రీప్రసాద్, రామనాథం తికమకపడ్డారు.
హెడ్ మిస్ట్రెస్ తెచ్చిపెట్టుకున్న నవ్వుతో, "వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు. బాగా పని చేస్తారు. ఎప్పుడూ అట్లా సరదాగా నవ్వుతూ ఉంటారు ఇదుగో, ఈమె పారిజాతం. మా ఫస్ట్ అసిస్టెంట్" అంటూ, అప్పుడే దగ్గరికి వచ్చిన మిగతా టీచర్లనుకూడా పరిచయం చేసింది. అయితే, సోఫాలో పడుకొని ఉన్న అనంతలక్ష్మిని పరిచయం చెయ్యడం మరిచింది.
భద్రీ ప్రసాద్-"ఆ అమ్మన్నెవరూ?" అని అడిగినప్పుడు, ఆమెను పరిచయం చెయ్యనందుకు నొచ్చుకొని, "ఆమె అనంతలక్ష్మి అని సెకండరీ గ్రేడ్ టీచర్. వాళ్ళది పెద్ద కుటుంబం. ఈమె కుటుంబం కోసం పెళ్ళికూడా మానుకొని చాలా శాక్రిఫైస్ చేస్తున్నది. చాలా మంచి పిల్ల!" అని సుదీర్ఘమైన పరిచయం చేసింది. అనంతలక్ష్మి మనసు చల్లబడింది.
ఒక్క క్షణం రామనాథం చూపులు అనంతలక్ష్మి వైపు తిరిగాయి కాని, మరుక్షణమే అప్రయత్నంగా పారిజాతంవైపు ప్రసరించినవి.
ఇంతలో సతీదేవి నౌకర్లతో కాఫీ, టిఫిన్లు పట్టించుకొని పైకి వచ్చారు. కూర్చున్న పిల్లలంతా సగౌరవంగా లేచారు. భద్రీ ప్రసాద్ భార్యకు హెడ్ మిస్ట్రెస్ నూ, మిగతావారినీ పరిచయం చేసి, "ఇదో, సతీ! మన అమ్మణ్ణి సత్యవతి. మన రామనాథం చెల్లెలు. ఆ అమ్మణ్ణి పేరు పారిజాతం. వాండ్లు బాగా స్నేహితులంట" అని అన్నాడు.
"ఏమమ్మా! నాన్నగారు బాగున్నారా? తీసుకొని రాకపోయినావా? ఒక్కరినీ ఉంచితే కష్టం గాదూ!" అని సత్యతో అని, పారిజాతం వైపు చూచి, రండమ్మా! ఫలహారం తీసుకుందురుగాని. మళ్ళీ ఆలస్యమైతే కష్టం" అని అంది. సోఫాలో పడుకొని ఉన్న అనంతలక్ష్మి ఒంటిమీద చేయి వేసి చూసి, వాత్సల్యంగా "లేవండమ్మా! టిఫిన్ తీసుకోండి. ప్రయాణం బడలికలాగా ఉంది. తగ్గిపోతుంది" అని అంది.
సత్య తలను ప్రేమగా నిమిరి, సతీదేవి- "నాన్న గారిని ఒంటరిగా ఎట్లా ఉంచావమ్మా? పాపం, పెద్ద వారు, ఏం ఇబ్బందిపడుతున్నారో! తీసుకువస్తే బాగుండేది!" అని అంది.
సత్య నవ్వి, "ఫరవాలేదండీ! పారిజాతం అమ్మా, నాన్నా నాకంటే బాగా చూసుకుంటారు. ఏం భయం లేదు" అని జవాబిచ్చింది.
వాత్సల్యం వెల్లివిరిసే చూపులతో సతీదేవి పారిజాతం వైపు చూచి, తరవాత "కానీయండమ్మా. ఫలహారం తినడం అయిపోతే హంపీ చూడడానికి బయలుదేరవచ్చు. మీ బాబాయిగారుకూడా మీతో వస్తారు" అని అంది.
భద్రీప్రసాద్ నోటిలో తెలుగు ఎంత ఖూనీ అయిందో, సతీదేవి మాటల్లో అంత ప్రాణం పోసుకున్నది! చక్కని తెలుగు!
కన్నార్పకుండా సతీదేవినే చూస్తూన్న హెడ్ మిస్ట్రెస్, "ఏమండీ! మీ ముఖంలో మా పారిజాతమ్మ పోలికలు బాగా ఉన్నాయండీ!" అని తమాషాగా అంది.
సతీదేవి నిదానించి పారిజాతంవైపు చూసింది. ఆమె ముఖంలో రంగులు మారుతున్నాయి. కళ్ళలో నీరు ఉబుకుతున్నది.
భద్రీ ప్రసాద్ సతీదేవి దగ్గరకు వచ్చి, "సతికి అమ్మన్నులంటే ఇష్టం. అందుకే మిమ్మల్ని ఇక్కడికి తెచ్చిడిసినాను" అని నవ్వాడు. కానీ, ఆయన ముఖ కవళికలలో కూడా ఏదో మార్పు వచ్చింది. ఇద్దరూ కిందికి దిగి వచ్చారు.
అంతవరకూ ప్రేక్షకుడుగా ఉన్న రామనాథం, సిగరెట్ వెలిగించి పొగ వదులుతూ, "సత్యా! త్వరగా తెమలండి. ఆలస్యమైతే మీకే కష్టం. నాకు ఆఫీసుకు వేళవుతున్నది. నే వెడతాను. భద్రీ ప్రసాద్ వెంట ఉండి అంతా చూపిస్తాడు. మరి నువ్వు ఎప్పుడు ఇంటికి వస్తావు? ఇప్పుడు నాతో రారాదూ! అర గంటలో తిరిగి రావచ్చు" అంటూ లేచాడు.
అందరినీ వదిలి తనొక్కదానివే రమ్మన్నందుకు మనస్సులో సత్య కష్టపడి, "ఇప్పుడు కాదులే, అన్నా! వీలు చూచుకొని వస్తాలే. అయినా, వదిన నీతోపాటు వచ్చి ఉండకూడదూ? అందరినీ చూసినట్లయ్యేది!" అని అంది.
ఏమీ జవాబివ్వకుండా సిగరెట్ తాగుతూ కిందికి దిగి వచ్చాడు రామనాథం. కొంతసేపటికి, "వస్తానండీ. వస్తానోయ్, కృష్ణా! సాయంత్రం నేనూ, లలితా ఇటు వస్తాములే" అంటున్న రామనాథం గొంతూ, మరి కాస్సేపటికి జీప్ స్టార్టయిన చప్పుడూ వినిపించాయి.
* * *

హంపీలో బలే సరదాగా పొద్దు పోతున్నది పిల్లలకు. భద్రీప్రసాద్ పిల్లలలో పిల్లాడై పోయాడు. ఆయన ఎక్కడుంటే అక్కడ పిల్లల పకపకలు వినిపిస్తున్నవి. అందరికీ వాళ్ళ నవ్వులు వినడానికి హాయిగా ఉన్నవి. పిల్ల లాయనతో తెలుగు మాట్లాడించి, మరీ నవ్వుతున్నారు.
పెద్ధలుకూడా వారి నవ్వుల్లో అడపా దడపా పాలు పంచుకొంటున్నాడు. ఈవేళ పిల్లలకు స్వేచ్చ! పండగ! భద్రీ ప్రసాద్ వెయ్యి కళ్ళతో వారి అవసరాలను గమనిస్తున్నాడు.
విరూపాక్ష దేవాలయము, కమల్ మహల్, ఏనుగుల శాల, రాతిరథం-ఒకటేమిటి, అన్నీ వివరంగా చూచుకొంటూ పోతున్నారు. ఆ శిథిల వైభవాన్ని చూచి ఆశ్చర్యపడుతున్నారు. కృష్ణ దేవరాయలు తులాభారం తూగిన చోట పారిజాతం సత్యవతితో - "ఈ తులలో మన మిద్దరం ఒక వైపు, హెడ్ మిస్ట్రెస్ గారి స్టాఫ్ ఆర్డర్లన్నీ ఒక వైపు వేస్తే మొగ్గు ఎటు ఉంటుందంటావు?" అని నెమ్మదిగా ప్రశ్నించి, "తెలిసి చెప్పకపోతే తల వెయ్యి చెక్క లవుమంది!" అని గట్టిగా అంది. పిల్లలు గొల్లున నవ్వారు. భద్రీ ప్రసాద్ నవ్వుతూ పారిజాతం వైపు చూచి ఏదో అడగబోయి మానుకొన్నాడు. సత్య, పారిజాతం ఇద్దరూ దీన్ని గమనించారు.
"మాట్లాడితే నేను వెక్కిరిస్తానని భయం కాబోలు!" నెమ్మదిగా అంది పారిజాతం.
"ఉండవచ్చు. నీ నోటికి భయపడని దెవరు?" సత్య జవాబు.
"అవునుగాని, సత్యా, పొద్దుట మీ సీమదొర అన్నయ్య 'కృష్ణా' అని పిలుస్తున్నాడు. ఎవరిని?" అని అడిగింది పారిజాతం.
రామనాథం వేషభాషల్లో కంచుకాగడా పెట్టి వెదికినా తెలుగుతనం కనుపించదు. దొరల్లాగా ముస్తాబై ఇంగ్లీషు తప్ప రెండోది రానట్లు నటించే ఆంగ్ల మానస పుత్రులను చూస్తే పారిజాతానికి మంట. మొదటి సారి చూడ్డంతోటే రామనాథం అంటే పారిజాతానికి ఒక విధమైన అయిష్టం ఏర్పడింది.
"అవును. నేనూ విన్నాను. ఎవరో మరి?" అని, "పారిజాతం! అనంతలక్ష్మి పొద్దున్న ఎందుకట్లా చేసిందంటావు? నా కెందుకోగాని ఈవేళ రేపట్లో ఏదో అశుభం జరుగుతుందని అనిపిస్తున్నది" అని అంది సత్య.
"ఎవరికి? మనకా? అనంతలక్ష్మికా?"
"చెప్పలేకుండా ఉన్నాను. నా కేదో భయంగా ఉంది. ఎంత త్వరగా ఇక్కడినుంచి బయటపడితే అంత మేలనిపిస్తున్నది!" పారిజాతం నవ్వి, "ఏమిటో ననుకొన్నాను, సత్యా! నీవూ ఇంతేనా? కానున్నది కాకమానదు. శుభాశుభాలు చెప్పి రావు కదా? ఏది జరిగినా ధైర్యంగా, శాంతంగా ఎదుర్కొంటే సరి. నిజం చెప్పాలంటే అనంతలక్ష్మి మనసు చంచలం. కంటికి నదురుగా ఉన్న ప్రతి మగాడి మీదికీ ఆ అమ్మాయి దృష్టి పోతుంది! దురదృష్టవశాత్తూ ఆ పిల్లకు అందంగానీ, డబ్బు గానీ ఇవ్వలేదా భగవంతుడు. అవేవన్నా ఉంటే, మగవాళ్ళామె చుట్టూ తిరగడానికి ఆస్కారం ఉండేది. ఏమీ లేవు కాబట్టి ఆవిడ వై పెవరూ చూడరు! అందుకనే అందరి దృష్టీ ఆకర్షించడానికి ఇలాంటి పిచ్చిపనులు చేస్తుంది. నలుగురూ తనను చూస్తే, తన చుట్టూ మూగితే, తనను గురించి ప్రశ్నిస్తే, శ్రద్ధ చూపితే అదో తృప్తి ఆ జీవికి! నిజానికి ఎవరైనా అంతేలే! అది మానవ నైజం!" అని ఉపన్యసించింది.
