'నేను అన్ని అన్నా మీకు కోపం రాలేదా?....అరె! నిజం!....అయితే మీలో మనుష్యుల కుండవలసిన లక్షణాల్లో కొన్ని లేవన్నమాట!' ఫక్కున నవ్వింది-గీరగా నవ్వుతున్నట్లుగా అనిపించింది.
'శకుంతలా!' త్యాగరాజు కంఠం ఉరిమింది.
త్యాగరాజు అడుగు ముందుకు పడలేదు.
'ఇప్పుడెందుకు లేనిపోని మాటలన్నీ...ముందు భోజనం చేయండి-పదండి!' ఆమె ముందు నడుస్తూ త్యాగరాజును ఉద్దేశించి అన్నది.
'నాకు ఆకలి కావటం లేదు!' కోపం గొంతువరకూ నిండిపోగా, ఆ కంఠంలో నిష్ఠూరత బయటపడుతోంది.
'ఎందుకని?' అన్నది వెనుదిరిగి కళ్ళు పైకెత్తి.
'తెలియదు!' కసిగా అన్నాడు.
'నాకు తెలుసు-ముందు కాళ్ళు కడుక్కోండి!' ఒక్కక్షణం గూడా ఆగకుండా వంటయింట్లోకి వెళ్ళిపోయింది.
త్యాగరాజు ఆమె మాటలను తృణీకరిస్తూ అక్కడే మోడామీద కూర్చున్నాడు గుడ్డలు గూడా మార్చుకోకుండా!
ఐదునిముషాలు తరువాత తడి చేతుల్ని చీర చెంగుకు తుడుచుకుంటూ వచ్చి, 'అదేఁవిటి ఇంకా అలాగే కూర్చున్నారు?' అన్నది.
'నాకు ఆకలి కావటం లేదని చెప్పాగా?' అన్నాడు గంభీరంగా.
'ఆకలే గనుక లేకుండా వున్నట్లయితే ఈపాటికి గుడ్డలు మార్చుకొని మంచమెక్కి వుండేవారు -అవునా?'
తీక్షణంగా ఆమె మొఖంలోకి ఒకసారి చూచి మోడామీదనుంచి గుడ్డలు మార్చుకునేటందుకు ఉద్యుక్తుడయ్యాడు.
'శకుంతలా! నేనంటే నీ కెందుకింత కోపం?' చాలా బాధగా, దీనంగా ఆమె మొఖంలోకి చూస్తూ - గుండెలు చిక్కపట్టుకొని మరీ అడిగాడు.
'నాకు దేనికి మీమీద కోపం?- అందుకా, ప్రస్తుతం మమ్మల్ని, మా కష్టాల్ని నెత్తిన పెట్టుకు పూజిస్తున్న మనుష్యులాయే మీరు!'
-మనుష్యుల్ని రంపంపెట్టి కోయటం నీకు వేళ్ళమీద పని!'
'నాకా?'
'లేక!'
'మీకంటే గూడానా?'
'నేను అలా చేసిన ఒక్క విషయం చెప్పు'
'ఇంతకంటే కావాలా....ఉదయం పది గంటలకు అన్నం తిన్నాను .... తరువాత రెండు స్వీట్సుతిని వో గుక్కెడు కాఫీ త్రాగానేమో.....ఆకలి నరాల్ని-మనుష్యుల్ని రంపంపెట్టి కోస్తున్న బాధను మించిన బాధతో -తినేస్తోంది.....నా పుట్టినరోజు పండుగనాడు ఇంతకంటే మరేం చేయాలి?'
త్యాగరాజు మొఖం నల్లబడిపోయింది.
తడబడ్డాడు.
ఇంకొక్క క్షణంగూడా ఆలస్యం చేయకుండా ఆమెను వెతుక్కుంటున్నట్లుగా వంటయింట్లోకి వెళ్ళాడు.
అక్కడ దూరంగా గడపమీద కూర్చున్న శకుంతలని, తన కోసరం పెట్టిన కంచాన్నీ చూస్తూనే, 'మరి నీవూ పెట్టుకోలేక పోయినావా?' అన్నాడు జాలిగా.
ఆమెమీదికోపం జావలా కారిపోయింది.
'ముందు మీరు కానీయండి!' అన్నది చాలా చిన్నగా.
'కాదు....నీవూ కూర్చో....ఇద్దరం కలిసి భోంచేద్దాం!' రాగి రంగులో మెరుస్తూ జారిపోతున్న ఆమె జుట్టును చూస్తుంటే అతని గుండె మైనపుముద్దులా అవుతోంది.
అతడు పీటమీద కూర్చున్నాడు.
'మిమ్మల్ని తినమన్నానా ముందు!'
'ఉఁహూఁ...తినను...నీవు తినకుండా తినను....అంతేగాదు-జరిగిన ఆలశ్యానికి క్షమాపణలుగూడా కోరుకుంటున్నాను!
శకుంతల జాలిగా, బేలగా అతడి మొఖంలోకి ఒక్కక్షణమే చూసింది.
మరుక్షణంలోనే లేచి నిలబడుతూ, 'మీరు భోంచేయండి....నా భోజనం ఇందాకనే అయింది ... మీరు రారేమోనని అబద్ధమాడాను!' అన్నది తప్పుచేసిన దానిలా తలవంచుకొని.
త్యాగరాజుపీటను విసురుగా వెనక్కు తోస్తూ లేచి నిలబడ్డాడు.
'అన్నం తినకుండా లేస్తే నామీద ఒట్టే!' అన్నది గంభీరంగా శకుంతల.
'శకుంతలా!' కోపమంతా బాధగా మారింది.
ఏఁవి చేయటానికీ దిక్కు తోచనట్లుగా అన్నాన్ని కెలుకుతూ కూర్చున్నాడు.
రెండు ముద్దలు గూడా లోపలికి వెళ్ళలేదు.
ఎవరిమీద కోపం - తాళ్ళమధ్య కట్టివేయబడ్డ తనమీదే రుద్దు కుంటున్నట్లుగా బాధపడసాగాడు.
'ఇందాక మీకోసరం ఎవరో వచ్చారు!... ఓ అరగంట క్రితంవరకూ ఇక్కడే కూర్చున్నారు గూడా!....' అన్నది వో ఐదునిముషాల తరువాత.
'నా కోసరమా?..' అధాట్టుగా తలెత్తాడు నోట్లోవున్న నాలుగు మెతుకులు కొరబోయినయి.
'ఆయనే మిమ్మల్ని ఇంకా తలుచుకుంటుండాలి గూడా! ...అన్నది నవ్వి శకుంతల.
'ఎవరు వచ్చింది నాకోసరం!' తేరుకొని మంటబడుతున్న గొంతును సర్దుకుంటూ అడిగాడు.
'ఎవరో-జయరాంట!'
-కంచంలో చేతులు కడుక్కొని తన గదిలోకి వచ్చేశాడు త్యాగరాజు!
* * *
తొమ్మిదయినా మంచంమీద నుంచి లేపకపోవటంతో, శకుంతల మంచం దగ్గరిగా వచ్చి నిలబడి 'ఏఁవిటా మొద్దు నిద్ర....లేవండి....మీ లెక్కచూస్తే ఈరోజున ఉద్యోగంలో జేరేటట్టుగా వేరే!' అన్నది.
ఎంతసేపటిబట్టో మెళుకువలో వున్న వాడిలా ఆమెమాట వింటూనే దుప్పటి మొఖంమీదనుండి తీసి, నేనా ఉద్యోగంలో తేరటం లేదు...!' అన్నాడు.
'ఎందుకని?' నుదురు ముడివేసి అడిగింది శకుంతల.
'నాకిష్టం లేదు!'
'అదే-ఎందుకని అని అడుగుతున్నాను!'
'ఒక్కో ప్రశ్నకు ఎన్నో సమాధానాలు వుంటాయి.....అన్నీ నేను చెప్పలేక పోవచ్చు!-అంతేగాదు, దానికి సమాధానం నీవు అడిగినంత తేలికగూడా గాదు!'
'పోనీయండి....మీ యిష్టం!.....మీ యిష్టమొచ్చినట్లు చేసుకోండి....మధ్యలో నాదేంబోయింది!' అన్నది. అంటూనే వెనుదిరిగి వెళ్ళబోతూ ఆగి, మెడవెనక్కు తిప్పి సూటిగా త్యాగరాజు మొఖంలోకి చూస్తూ - నేనువెళ్ళి ఆ ఉద్యోగం కోసరం ప్రయత్నం చేయవచ్చా?' అన్నది కళ్ళు పెద్దవిచేసి.
'నాకు అంతగా యిష్టం లేదు!'
-ఆంక్ష లేఁవైనా విధించాలని చూస్తున్నారా నామీద కవ్విస్తూ అడిగింది.
'అలాంటి కోరిక నా కెన్నడూ లేదు!'
'అయితే నేను వెళతాను!'
'నీ యిష్టం!'
వెళ్ళిపోయింది శకుంతల.
త్యాగరాజుకు ఏంచేయాలో తోచలేదు.
వీలయినంత త్వరలో అక్కడనుండి బయటకు వెళ్ళిపోవాలనిపించింది.
-లేకపోతే ఏక్షణానైనా జయరాం రావచ్చు!
ఇక తరువాత అతడి బంధాలనుండి తను తప్పుకోనూ లేకపోవచ్చు!
మంచంమీదనుంచి లేచాడు.
మొఖం కడుక్కున్నాడు
స్నానం చేశాడు.
గుడ్డలేసుకొని, 'తలుపేసుకో శకుంతలా!' అన్నాడు.
'ఇంతకీ నేను చెప్పింది గుర్తున్నదా?' అడిగింది శకుంతల వెనగ్గా వచ్చి.
'ఏఁవిటది?' మెడ వెనక్కు తిప్పి వింతగా అడిగాడు.
'అదే....నా ఉద్యోగ విషయం'
'నేను అప్పుడే చెప్పానుగదా!' ముందుకు నడిచాడు.
'మీ నిర్ణయం మారదా?' గంభీరంగా అడిగింది.
'-అవసరం లేదు!' అతడు దృఢంగా అన్నాడు.
ముందుకు నడిచాడు.
మెట్లు దిగాడు.
కార్పొరేషన్ వాళ్ళకు సంబంధం లేనట్లుగావున్న చిన్న మురుక్కాలవ దాటాడు.
-ముందు చిన్నకారు ఆగింది.
అందులోంచి జయరాం తొంగి చూస్తూ, 'త్యాగరాజుగారూ!' అన్నాడు.
త్యాగరాజు ఉలిక్కిపడ్డాడు.
మొఖం తెల్లగా పాలిపోయింది.
దేని నుండయితే తప్పుకోవాలని ఆతురత పడుతున్నాడో, దానినుండి త్యాగరాజు తప్పుకోలేక పోయాడు.
అతడు - అతడు ఊహించినట్లుగానే-ఇనుప కటకటాల్లో యిరుక్కుపోయాడు.
-తను తప్పుకోలేక పోవచ్చు!
అయినా-చివరి ఆశగా - ముందుకు వచ్చి, 'మీ రెందుకు వచ్చారు ఇక్కడికి?' అన్నాడు కఠినంగా.
అతడు తేలిగ్గా తీసుకుంటున్నట్లుగా, 'అయితే మీరు ఈ రోజున ఉద్యోగంలో జేరటంలేదా?' ఏదో గుంభనంగా అడిగాడు, - సరియైన సమాధానంనుండి కప్పదాటు వేస్తున్నట్లుగా వున్నది అతడి కంఠం.
'మీరు నిజంగా నా ఉద్యోగ విషయమే కనుక్కోవటానికి వస్తే - నా సమాధానమూ రెడీగానే వున్నది!' చాలా సూటిగా అన్నాడు.
జయరాం తడబడ్డాడు.
'త్యాగరాజుగారూ! ముందు కారెక్కండి....తరువాత మాట్లాడుకుందాం!'
-ఆ నూతన కంఠం ఎవరిదా అని ఆత్రంగా కారు వెనకసీట్లోకి చూచాడు త్యాగరాజు!
అతడు సుందరమూర్తి!
అతడిని చూడగానే త్యాగరాజుకు తెలియని తేలికదనం ఆవరించింది.
తన చెల్లెల్ని జయరాం కారులో చూచి నప్పుడు -ఏర్పరచుకున్న భయంకరమైన ఊహలు- చిన్న చిన్నగా విడిపోగా-లీలగా ఓ క్షణం తృప్తిజెందాడు!
- తన చెల్లెలు తను ఊహించి నంత పతనావస్థలోకి దిగజారిపోలేదు!
అనాలోచితంగా ముందుసీట్లో జయరాం ప్రక్కగా కారు ఎక్కి కూర్చున్నాడు!
* * *
రాణి గదిలో మూలగా నిలబడి చీరె చెంగును నోట్లో కుక్కుకొని ఏడుస్తున్నది.
'ఈ విషయం నీకు ముందు తెలియదా? నీవు ఊహించలేదా?' అడిగాడు తీక్షణంగా త్యాగరాజు.
రాణి ఏడుస్తూనే వున్నది.
'ఎంహుకు అనవసరంగా ఏడుస్తావ్?...ఇది నీ వెన్నుకున్న జీవితం...దాని వలన కలిగే కష్టనష్టాలకు నీవు బాధపడటం గాని, ఏడ్వటంగాని చేయాల్సిన అవసరం లేదు.... ఇవన్నీ గూడా నీ వా నాడు నీ అన్నయ్యను మర్చి పోదామనుకున్న రోజునే ఆలోచించవల్సింది!'
'అన్నయ్యా!'
'ఇక నివ్వు నన్నలా పిలవ్వద్డు...నాకు చెల్లెలెవ్వరూ లేరు!' కఠినంగా అని బయటకు వచ్చేశాడు.
అలా వస్తున్న సమయంలో హృదయ విదారకంగా విలపిస్తున్న ఆ స్త్రీ కంఠం అతడి గుండెల్లో కొన్ని దినాలనుండి పేరుకుపోయి గడ్డ కట్టుకు పోయిన కోపాన్ని వీసమెత్తుగూడా కరిగించలేక పోయింది.
-అతడు ఆ తరువాత ఒక్కక్షణం గూడా ఆ పరిసరాల్లో ఉండటానికి ప్రయత్నించ లేదు.
వడివడిగా బయటకు వచ్చేశాడు.
సుందరమూర్తి దారికడ్డుగా నిలబడి అప్పుడే వెళ్ళిపోతున్నారా మీరు?' చాలా నెమ్మదిగా అడిగాడు.
'అంతేగాదు-ఇంకెన్నడూ ఈగడపలో కాలు పెట్టను గూడా!'
మరుక్షణంలోనే అతడు విసురుగా రోడ్డుమీదకు వచ్చేశాడు.
* * *
పది గంటలయింది.
త్యాగరాజు మనస్సంతా రాణిని చూడగానే మరింతగా కలుషితమయింది.
తన యింటినుంచి మరో వ్యక్తితో అతి హీనంగా లేచిపోయిన చెల్లెలు వున్న దనుకునే దానికంటే - అసలు లేదను కుంటేనే-తనకు తృప్తి అనుకున్నాడు!
'ఛీ! ఛీ! ఎలాంటి నైచ్యమైన పని చేస్తుంది-చదువుకొని!'
రాత్రిగూడా అర్ధాకాలితో లేచిన త్యాగరాజును కోపమూ, అసహ్యముతో బాటు ఆకలిగూడా తినివేయసాగింది.
ఎదురుగ్గా కనబడ్డ హోటల్లోకి వెళ్ళి వేడివేడి ఇడ్లీ తెప్పించుకు తిని, ఓ కప్పు కాఫీ త్రాగి బయటపడ్డాడు.
అప్పటికే ఎండ రాత్రి తెల్లవార్లూ గాలి కప్పుకున్న చల్లదనాన్ని మింగేసి కోరచూపులతో మనుష్యులను కొరికే స్తున్నది.
ఆ క్షణంలో ఆ వాతావరణం అతణ్ణి మరింత కుపితున్ని చేస్తోంది.
ఎటూ పోవటానికి తోచటం లేదు.
అర్ధంగాని ఆవేదన-చికాకు!
గమ్యం లేకుండా తిరిగితే-? ఎంతదూరమని తిరగ్గలడు? ఎక్కడికని వెళ్ళగలడు?
- ఎవరు తనని అర్ధం చేసుకుంటారు?-వోదారుస్తారు?
కళ్ళముందు రాజేశ్వరి నిలుచున్నది! తడబడ్డాడు.
ఈ రెండుమూడు రోజుల్లో అతడా రాజేశ్వరి దగ్గరలేచి లోపాన్ని బాగా ఫీలయ్యాడు.
రాజేశ్వరే ఎదురుగ్గా కూర్చొని వుంటే -తనని, తన మనస్సుని ఇలా అస్తవ్యస్తంగా తిరగనిచ్చేదా?
ఉఁహూఁ....
రాజేశ్వరికి ఇవాళ ఎలాగైనా ఉత్తరం వ్రాయాలి!
ఏఁవని?
ఉత్తరం రాయాలి.....రాయాలి - పదే పదే అనుకున్నాడు ....
చిక్కడిపల్లి రోడ్డుమీద లేని దుమ్మును లేపాలన్నట్లుగా జనం చిందులు తొక్కుతున్నారు. ఆఫీసులకు వెళ్ళవల్సినవాళ్ళు ఆర్టీసీ బస్సులమీద కోపాన్ని కక్కలేక మ్రింగుతూ, కృంగిపోయి నడుస్తున్నారు. తమ హక్కులను భుక్తం చేసుకొని ఠీవిగా నడుస్తున్న ఆడవాళ్లనీ-వాళ్ళ చేతుల్లోని టిఫెన్ బాక్సులనీ కోరగా చూస్తున్న నిరుద్యోగులు - బారతదేశం, అందులోని పవిత్ర నారీమణులు ఎంత పతనావస్థలో దిగజారి పోతున్నారు, భగవాన్!- అని విలపిస్తున్నట్లుగా, కళలుగా, నీరసంగా నడుస్తున్నారు.
'ఇదీ ప్రపంచం' అని చెప్పేందుకు ఉదాహరణ అన్నట్లుగా- హైద్రాబాద్ రోడ్లకు అలవాటుపడ్డ వో గళ్ళలుంగీ కట్టి, పాన్ బిగించిన రిక్షా వాలా-చిరిగిపోయి పేలికలు వేలాడుతున్న గుడ్డలతో, నల్లని శరీరానికి ఆచ్చాధన అన్నట్లుగా దుమ్మునీ, ధూళినీ మడ్డిగా మార్చుకొని ఒంటికి పులుముకున్న పుల్లలాంటి వో బక్కపిల్లవాడి నడుము నేలకానుకునేలా వంచి - మీదగా రిక్షాను లాగేశాడు!
